Chronological
షిమ్యోను వంశం వారికి భూమి
19 అప్పుడు షిమ్యోను వంశంవారికి, ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ వారి భూములను యెహోషువ పంచిపెట్టాడు. వారికి లభించిన భూమి యూదాకు చెందిన ప్రాంతం లోపల ఉంది. 2 వారికి లభించిన భూమి యిది; బెయెర్‌షెబ (షెబ) మోలాదా, 3 హజర్‌షువలు, బాలా, ఎజెము, 4 ఎల్తోలదు, బెతూలు, హొర్మా 5 సిక్లగు, బెత్‌మార్కాబొదు, హజర్‌సుస 6 బెత్‌లబాయొతు మరియు షారుహను. ఇవి పదమూడు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము.
7 అయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను పట్టణాలు కూడా వారికి లభించాయి. ఇవి నాలుగు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. 8 బాలాత్ బెయెరు వరకు ప్రజలు నివసిస్తున్న అతి చిన్న ప్రాంతాలు కూడ అన్నీ వారికి లభించాయి. (ఇది నెగెవు ప్రాంతంలో ఉన్న రామా వంటిదే.) కనుక షిమ్యోనీ ప్రజల కుటుంబాలకు ఇవ్వబడిన భూములు అవి. ఒక్కో కుటుంబానికి ఈ భూములు లభించాయి. 9 షిమ్యోనీ ప్రజల భూమి యూదా భూభాగంలోనుండి తీసికోబడింది. యూదా వారికి అవసరమైన దానికంటె చాలా ఎక్కువ భూమి ఉంది. కనుక వారి భూమిలో షిమ్యోనీ ప్రజలకు కొంత భాగం లభించింది.
జెబూలూను వంశం వారికి లభించిన భూమి
10 తర్వాత భూమి లభించిన వంశం జెబూలూను. జెబూలూను వంశంలోని ప్రతి కుటుంబానికీ, వారికి వాగ్దానం చేయబడిన భూమి లభించింది. జెబూలూను సరిహద్దు శారీదు వరకు విస్తరించింది. 11 తర్వాత అది పశ్చిమాన మరాలా వరకు పోయి, దబ్బాషెతు ప్రాంతానికి సమీంపంగా సాగిపోయింది. తర్వాత ఆ సరిహద్దు యొక్నెయాము దగ్గర ప్రాంతానికి విస్తరించింది. 12 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. శారీదు నుండి అది కిస్లోత్ తాబోరు ప్రాంతానికి విస్తరించింది. తర్వాత ఆ సరిహద్దు దబెరాతు. యాఫియకు విస్తరించింది. 13 తర్వాత ఆ సరిహద్దు తూర్పున గాత్‌హెఫెరు, ఎత్‌కాసిను వరకు విస్తరించింది. ఆ సరిహద్దు రిమ్మోను వద్ద అంతమయింది. తర్వాత ఆ సరిహద్దు మళ్లుకొని నేయావరకు కొనసాగింది. 14 నేయావద్ద ఆ సరిహద్దు మరల మళ్లుకొని ఉత్తరానికి విస్తరించింది. ఆ సరిహద్దు హన్నాతొన్ వరకు విస్తరించి, ఇఫ్తాయెల్ లోయవరకు కొనసాగింది. 15 ఈ సరిహద్దు లోపల కట్టాత్, నహలాలు, షిమ్రోను, ఇదలా, బేత్లేహేము పట్టణాలు ఉన్నాయి. మొత్తం మీద పన్నెండు పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి.
16 కనుక జెబూలూనుకు లభించిన పట్టణాలు, ప్రాంతాలు ఇవి. జెబూలూను ప్రతి వంశానికీ ఈ భూమి లభించింది.
ఇశ్శాఖారు వంశం వారికి భూమి
17 నాలుగవ భాగం ఇశ్శాఖారు వంశంవారికి ఇవ్వబడింది. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ కొంత భూమి లభించింది. 18 ఆ కుటుంబాలకు వారికి ఇవ్వబడిన భూమి యిది; యెజ్రెయేలు, కెసుల్లోతు, షూనేము, 19 హపరాయిము, షియోను, అనాహరతు 20 రబ్బితు, కిష్యోను, ఎబెజు 21 రెమెతు, ఎన్‌గన్నిము, ఎన్‌హద్దా, బెత్‌పెసెసు.
22 వారి దేశ సరిహద్దు తాబోరు, షహజును, బెత్‌షెమెషు అనే ప్రాంతాలను తాకుతుంది. ఆ సరిహద్దు యొర్దాను నది దగ్గర నిలిచిపోయింది. మొత్తం మీద 16 పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఉన్నాయి. 23 ఈ పట్టణాలు, పురాలు ఇశ్శాఖారు వంశానికి యివ్వబడిన దేశంలోని భాగం. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
ఆషేరు వంశంవారికి లభించిన భూమి
24 దేశంలోని ఐదవ భాగం ఆషేరు వంశం వారికి ఇవ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ భూమిలో కొంత లభించింది. 25 ఆ వంశానికి ఇవ్వబడిన దేశం ఇది; హెల్కతు, హాలి, బెతెను, అక్షాపు, 26 అలమ్మేలెకు, అమద్, మిషల్.
పడమటి సరిహద్దు కర్మెలు పర్వతం, షీహోరు లిబ్నాతు వరకు కొనసాగింది. 27 తర్వాత ఆ సరిహద్దు తూర్పుకు మళ్లింది. ఆ సరిహద్దు బెత్ దాగొనుకు విస్తరించింది. ఆ సరిహద్దు జెబూలూను, ఇఫెలు లోయలను తాకింది. తర్వాత ఆ సరిహద్దు బెత్‌ఎమెక్, నెయీఎల్‌కు ఉత్తరంగా కొనసాగింది. ఆ సరిహద్దు కాబూలుకు ఉత్తరంగా దాటిపోయింది. 28 తర్వాత అబ్దోను,[a] రెహోబు, హమ్మోను, కానా వరకు ఆ సరిహద్దు కొనసాగింది. మహాసీదోను ప్రాంతంవరకు ఆ సరిహద్దు కొనసాగింది. 29 తర్వాత ఆ సరిహద్దు తిరిగి దక్షిణంగా రామాకు విస్తరించింది. ఆ సరిహద్దు బలమైన తుయర పట్టణంవరకు కొనసాగింది. తర్వాత సరిహద్దు మళ్లుకొని హొసాకు పోయింది. సముద్రం దగ్గర అక్జీబు ప్రాంతంలో 30 ఉమ్మా, అఫెకు, రెహోబు దగ్గర సరిహద్దు అయిపోయింది.
మొత్తం మీద ఇరవై రెండు పట్టణాలు, వాటి పొలాలు మొత్తము. 31 ఆషేరు వంశానికి ఇవ్వబడిన దేశంలో ఈ పట్టణాలు, వాటి పొలాలు అన్నీ ఒక భాగం. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో ఒక భాగం లభించింది.
నఫ్తాలి వంశం వారికి లభించిన భూమి
32 నఫ్తాలి వంశం వారికి ఆరో భాగం భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతీ కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది. 33 వారి దేశ సరిహద్దు జయనన్నీములోని సింధూరవనము దగ్గర ప్రారంభమయింది. ఇది హెలెపు సమీపంలో ఉంది. తర్వాత ఆదామి, నెకెబు, యబ్నెయెలుగుండా ఆ సరిహద్దు కొనసాగింది. ఆ సరిహద్దు లక్కుం ప్రాంతం వరకు విస్తరించి, యొర్దాను నది దగ్గర ముగిసింది. 34 తర్వాత ఆ సరిహద్దు అస్నొతు తాబోరుగుండా పడమటికి వెళ్లింది. హుక్కొకు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. దక్షిణాన సరిహద్దు జెబూలూను ప్రాంతం వరకు వెళ్లింది. పశ్శిమాన ఆ సరిహద్దు ఆషేరు ప్రాంతం వరకు వెళ్లింది. తూర్పున యొర్దాను నది దగ్గర ఆ సరిహద్దు యూదా వరకు వెళ్లింది. 35 ఈ సరిహద్దుల లోపల కొన్ని బలమైన పట్టణాలు ఉన్నాయి. ఆ పట్టణాలు జిద్దీము, జేరు, హమ్మాతు, రక్కాతు, కిన్నెరతు 36 అదామా, రామా, హషొరు 37 కెదెషు, ఎద్రేయి, ఎన్‌హసోరు 38 ఇరోను, మిగ్దల్ ఎల్, హోరేం, బెత్‌అనాతు, బెత్‌షెమెషు. మొత్తం మీద పంతొమ్మిది, పట్టణాలు వాటి పొలాలు మొత్తము.
39 ఆ పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న పురాలు నఫ్తాలి వంశం వారికి యివ్వబడిన దేశంలో ఉన్నాయి. ఆ వంశంలో ప్రతి కుటుంబానికీ ఆ దేశంలో కొంత భాగం లభించింది.
దాను వంశం వారికి లభించిన భూమి
40 తర్వాత దాను వంశానికి భూమి యివ్వబడింది. ఆ వంశంలోని ప్రతి కుటుంబానికి ఆ దేశంలో కొంత భూమి లభించింది. 41 వారికి ఇవ్వబడిన భూమి ఇది: జొర్యా, ఎష్తాయోలు, ఇర్‌షెమెషు 42 షయల్బీను, అయ్యాలోను, ఇత్లా, 43 ఎలోను, తిమ్నా, ఎక్రోను 44 ఎలైకే, గిబ్బెతాను, బాలాతా 45 యెహుదు బెనెబెరక్, గాత్ రిమ్మోను 46 మేయర్కోను రక్కోను, యొప్ప దగ్గర ప్రాంతం.
47 అయితే దాను ప్రజలు వారి దేశాన్ని స్వాధీనం చేసుకోవటంలో కష్టం వచ్చింది. అక్కడ బలమైన శత్రువులు ఉన్నారు, వారిని దాను ప్రజలు తేలికగా ఓడించలేకపోయారు. కనుక దాను ప్రజలు వెళ్లి లెషెము మీద యుద్ధం చేసారు. లెషెమును వారు ఓడించి, అక్కడ నివసించిన మనుష్యులను చంపివేసారు. కనుక దాను ప్రజలు లెషెము పట్టణంలో నివసించారు. దాని పేరును వారు దానుగా మార్చి వేసారు, ఎందుకంటే అది ఆ వంశం పితరుని పేరు. 48 దాను వంశానికి యివ్వబడిన దేశం ఈ పట్టణాలు, పురాలు మొత్తము. ప్రతీ కుటుంబానికీ ఈ దేశంలో భాగం లభించింది.
యెహోషువకు లభించిన భూమి
49 కనుక దేశాన్ని విభజించటం, వేర్వేరు వంశాలకు దానిని పంచి ఇవ్వటం నాయకులు ముగించారు. వారు ముగించిన తర్వాత, నూను కుమారుడైన యెహోషువకు గూడ కొంత భూమి ఇవ్వాలని ఇశ్రాయేలు ప్రజలంతా నిర్ణయించారు. ఇది అతనికి వాగ్దానం చేయబడిన భూమి. 50 అతనికి ఈ భూమి రావాలని యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక ఎఫ్రాయిము కొండ దేశంలోని తిమ్నాత్ సెరహు పురమును వారు యెహోషువకు ఇచ్చారు. ఈ పట్టణమే తనకు కావాలని యెహోషువ వారితో చెప్పాడు. కనుక యెహోషువ ఆ పట్టణాన్ని మరింత గట్టిగా కట్టి, అక్కడ నివసించాడు.
51 కనుక ఇశ్రాయేలీయుల వేర్వేరు వంశాలకు ఈ భూములన్నీ ఇవ్వబడ్డాయి. ఈ దేశాన్ని విభాగించేందుకు యాజకుడైన ఎలీయేజరు, నూను కుమారుడైన యెహోషువ, ఒక్కో వంశాల నాయకులు షిలోహు అనే స్థలంలో సమావేశం అయ్యారు. సన్నిధి గుడార ప్రవేశం దగ్గర యెహోవా సన్నిధిలో వారు సమావేశమయ్యారు. ఇప్పుడు దేశాన్ని విభాగించటం వారు ముగించారు.
ఆశ్రయ పురాలు
20 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు. 3 ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
4 “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు. 5 అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది. 6 ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
7 కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.) 8 యొర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
9 ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.
యాజకులకు, లేవీయులకు లభించిన పట్టణాలు
21 లేవీ వంశంపు ప్రధానులు యాజకుడైన ఎలియాజరుతో, నూను కుమారుడు యెహోషువతో, ఇశ్రాయేలీయుల ఇతర వంశాల ప్రధానులతో మాట్లాడేందుకు వెళ్లారు. 2 ఇది కనాను దేశంలోని షిలోహు పట్టణంలో సంభవించింది. “మోషేకు యెహోవా ఒక ఆజ్ఞ ఇచ్చాడు. మేము నివసించేందుకు మీరు మాకు పట్టణాలు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు. మా పశువులు మేత మేసేందుకు పొలాలుకూడ మీరు మాకు ఇవ్వాలని ఆయన ఆజ్ఞాపించాడు.” అని లేవీ ప్రధానులు వారితో చెప్పారు. 3 కనుక యెహోవా ఆజ్ఞకు ఇశ్రాయేలు ప్రజలు విధేయులయ్యారు. లేవీ ప్రజలకు వారు ఈ పట్టణాలు, ప్రాంతాలు ఇచ్చారు:
4 కహతు వంశంలో ఒక భాగం వారికి పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. యూదా, షిమ్యోను, బెన్యామీను వారికి చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి. (కహతు వంశం, లేవీ వంశంలో ఒక భాగం. లేవీ యాజకుడైన అహరోను సంతానము).
5 కహతు వంశంలోని మరో భాగం వారికి పది పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పది పట్టణాలు ఎఫ్రాయిము, దాను, మనష్షే అర్ధగోత్రం వారి ప్రాంతాల్లో ఉన్నాయి.
6 గెర్షోము వంశపు ప్రజలకు పదమూడు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఇశ్శాఖారు, ఆషేరు, నఫ్తాలి, బాషానులోని మనష్షే అర్ధ గోత్రం వారి ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
7 మెరారీ కుటుంబం వారికి పన్నెండు పట్టణాలు ఇవ్వబడ్డాయి. రూబేను, గాదు, జెబూలూనుకు చెందిన ప్రాంతాల్లో ఈ పట్టణాలు ఉన్నాయి.
8 కనుక ఈ పట్టణాలు, వీటి పరిసరాల్లోని పొలాలు లేవీ ప్రజలకు ఇశ్రాయేలు ప్రజలు ఇచ్చారు. మోషేకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞకు విధేయులుగా వారు ఇలా చేసారు.
9 యూదా, షిమ్యోనుకు చెందిన దేశంనుండి తీసుకొనబడిన పట్టణాల పేర్లు ఇవి. 10 మొదట నిర్ణయించబడిన పట్టణాలు కహత్ కుటుంబానికి ఇవ్వబడ్డాయి (లేవీ ప్రజలు). 11 కిర్యత్ అర్బ (హెబ్రోను), దాని పొలాలు అన్నీ వారు వారికి ఇచ్చారు. ఇది యూదా కొండ దేశంలో ఉంది. (అనాకు తండ్రి అర్బ). ఆ పట్టణం దగ్గర్లో వారి పశువులు మేసేందుకు పొలాలు కూడ వారికి లభించాయి. 12 అయితే కిర్యత్ అర్బ చుట్టు ఉన్న చిన్న పట్టణాలు, పొలాలు యెపున్నె కుమారుడైన కాలేబుకు చెందినవి. 13 కనుక హెబ్రోను పట్టణాన్ని వారు అహరోను సంతతివారికి ఇచ్చారు. హెబ్రోను ఆశ్రయ పట్టణం. అహరోను సంతతివారికి లిబ్నా 14 యత్తీరు, యష్టెమోయ 15 హోలోను, దెబీరు, 16 అయ్యిను, యుట్ట, బెత్‌షెమెషు పట్టణాలను కూడ వారు ఇచ్చారు. ఈ పట్టణాల చుట్టుపక్కల ఉన్న పొలాలు అన్నింటిని కూడ వారు వీరికి ఇచ్చారు. ఈ రెండు వంశాలకు ఇవ్వబడినవి తొమ్మిది పట్టణాలు.
17 బెన్యామీను సంతతివారికి చెందిన పట్టణాలను కూడా అహరోను సంతతివారికి ఇచ్చారు. ఆ పట్టణాలు గిబియోను, గెబ, 18 అనాతోతు, అల్మాను. ఈ నాలుగు పట్టణాలను, వాటి చుట్టూ ఉన్న పొలాలు అన్నింటినీ వారు వీరికి ఇచ్చారు. 19 కనుక యాజకులకు ఇవ్వబడిన పట్టణాలు ఇవి. ఈ యాజకులు అహరోను సంతానం వారు. మొత్తం మీద అవి పదమూడు పట్టణాలు మరియు వాటి పొలాలు.
20 కహతీ కుటుంబంలో ఇతర ప్రజలకు ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఈ పట్టణాలు ఎఫ్రాయిము వంశంనుండి తీసుకోబడ్డాయి. 21 ఎఫ్రాయిము కొండ ప్రదేశంనుండి షెకెము పట్టణం (షెకెము ఒక ఆశ్రయ పట్టణం) వారువారికి గెజెర్ 22 కిబ్సాయిము, బెత్‌హారాను కూడ ఇచ్చారు. మొత్తం మీద అవి నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
23 దాను వంశం వారు వారికి ఎత్తేకె, గిబ్బెతాను 24 అయ్యలోను, గాత్ రిమ్మోను ఇచ్చారు. మొత్తం మీద నాలుగు పట్టణాలు మరియు వాటి పొలాలు.
25 మనష్షే వంశంలోని సగంమంది తానాను, గాత్ రిమ్మోను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న పొలాలు అన్నీ వారికి ఇవ్వబడ్డాయి.
26 కనుక దీనితో ఇంకా పది పట్టణాలు, వాటి చుట్టూ ఉన్న భూమి మొత్తం కహత్ కుటుంబం వారికి ఇవ్వబడ్డాయి.
27 లేవీ వంశంలోని గెర్షోను కుటుంబం వారికి ఈ పట్టణాలు ఇవ్వబడ్డాయి.
మనష్షే వంశంలోని సగంమంది బాషానులోని గొలానును వారికి ఇచ్చారు. (గొలాను ఆశ్రయ పట్టణం) మనష్షేకూడ బెష్టెరాను వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
28 ఇశ్శాఖారు వంశంవారు వారికి కిషియొను, దబెరాతు 29 యార్ముతు, ఎన్‌గన్నీము ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు, వాటిచుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారి పశువులకోసం ఇశ్శాఖారు వంశానికి ఇచ్చారు.
30 ఆషేరు వంశం వారు వారికి మిషాలు, అబ్దోను 31 హెల్కాతు, రెహబు ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాలు వాటి చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ వారు వారి పశువుల కోసం ఇచ్చారు.
32 నఫ్తాలి వంశంవారు గలలీయలోని కెదెషును వారికి ఇచ్చారు. (కెదెషు ఆశ్రయ పట్టణం). హమ్మోత్ దోరు, కర్తానుకూడ నఫ్తాలి వారికి ఇచ్చారు. ఈ రెండు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ గెర్షోను కుటుంబం వారికి ఇవ్వబడింది.
33 మొత్తం మీద గెర్షోను కుటుంబం వారికి పదమూడు పట్టణాలు, ఈ పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం పొలాలు లభించాయి.
34 మరో లేవీ కుటుంబం మెరారీ కుటుంబం. మెరారీ కుటుంబం వారికి ఇవ్వబడిన పట్టణాలు ఇవి: జెబూలూను వంశంవారు ఇచ్చినవి: యొకెనియము, కర్తా 35 దిమ్నా, నహలాలు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ ప్రజలకే ఇవ్వబడింది. 36 రూబేను వంశంవారు వారికి ఇచ్చినవి బెసెరు, యహసు 37 కెదెమోతు, మోఫాతు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమి కూడ మెరారీ కుటుంబానికే ఇవ్వబడింది. 38 గాదు వంశం వారు వారికి ఇచ్చినవి గిలాదులోని రామోత్. (గిలాదు ఒక ఆశ్రయ పట్టణం). వారు ఇంకా మహనయీము, 39 హెష్బోను, యాజెరు కూడ ఇచ్చారు. ఈ నాలుగు పట్టణాల చుట్టూ ఉన్న మొత్తం భూమిని కూడ గాదువారు వారికి ఇచ్చారు.
40 మొత్తం మీద మెరారీ వారికి ఇవ్వబడినవి పన్నెండు పట్టణాలు.
41 మొత్తం మీద లేవీ వంశానికి నలభై ఎనిమిది పట్టణాలు లభించాయి. ఈ పట్టణాలన్నీ ఇశ్రాయేలు ప్రజల స్వాధీనంలో ఉన్న దేశంలోనే ఉన్నాయి. 42 ఈ పట్టణాలు ప్రతిదాని చుట్టూ పశువులు బ్రతికేందుకు గాను భూమి, పొలాలు ఉన్నాయి.
43 కనుక ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చాడు. ఆయన వాగ్దానం చేసిన దేశం అంతటినీ ఆ ప్రజలకు ఆయన ఇచ్చాడు. ఆ ప్రజలు ఆ దేశాన్ని స్వతంత్రించుకొని అక్కడ నివసించారు. 44 మరియు వారి దేశానికి అన్నివైపులా ఆ ప్రజలు శాంతి కలిగి ఉండేటట్లు యెహోవా చేసాడు. చాలా కాలం క్రిందట వారి పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసింది ఇదే. వారి శత్రువులు ఎవరూ వారిని ఓడించలేదు. ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రతి శత్రువును ఓడించేటట్టు యెహోవా చేసాడు. 45 ఇశ్రాయేలు ప్రజలకు యెహోవా చేసిన ప్రతి వాగ్దానాన్నీ ఆయన నెరవేర్చాడు. నెరవేరని వాగ్దానాలంటూ ఏమీ లేవు. ప్రతి వాగ్దానం నిజమయింది.
© 1997 Bible League International