Chronological
యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి
11 “అందుచేత మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. మీరు చేయాలని ఆయన మీతో చేప్పే విషయాలను మీరు చేయాలి. ఆయన చట్టాలకు, ఆజ్ఞలకు, నియమాలకు మీరు ఎల్లప్పుడూ విధేయులు కావాలి. 2 మీకు ప్రబోధం చేసేందుకు మీ దేవుడైన యెహోవా చేసిన గొప్ప కార్యాలన్నింటినీ నేడు జ్ఞాపకం చేసుకోండి. ఆ కార్యాలు జరగటం చూచింది, వాటిని అనుభవించింది మీరేగాని మీ పిల్లలు కాదు. యెహోవా ఎంత గొప్పవాడో మీరు చూసారు. ఆయన ఎంత బలంగలవాడో మీరు చూశారు. ఆయన చేసే శక్తివంతమైన కార్యాలు మీరు చూసారు. 3 ఆయన చేసిన అద్భుతాలను మీ పిల్లలు కాదు మీరు చూసారు. ఈజిప్టులో, ఈజిప్టు రాజైన ఫరోకు, ఆతని దేశం మొత్తానికి ఆయన చేసిన కార్యాలు మీరు చూశారు. ఈజిప్టు సైన్యానికి, వారి గుర్రాలకు, రథాలకు యెహోవా చేసిన వాటిని మీ పిల్లలు కాదు మీరే చూసారు. 4 వాళ్లు మిమ్మల్ని తరుముతూ ఉంటే, వాళ్లను యెహోవా ఎర్ర సముద్ర నీళ్లతో కప్పివేస్తూ ఉండటం మీరు చూసారు. యెహోవా వాళ్లను సర్వ నాశనం చేయటం మీరు చూసారు. 5 మీరు ఈ చోటికి వచ్చేంత వరకు అరణ్యంలో మీ దేవుడైన యెహోవా మీకోసం చేసిన వాటన్నింటిని చూసిన వారు మీరే మీ పిల్లలు కాదు. 6 రూబేను వంశానికి చెందిన ఎలీయాబు కుమారులు దాతాను, అబీరాములకు యెహోవా ఏమి చేసాడో మీరు చూసారు. భూమి నోరు తెరచినట్టుగా తెరచుకొని ఆ మనుష్యులను మ్రింగి వేయటం ఇశ్రాయేలు ప్రజలంతా చూసారు. అది వారి కుటుంబాలను, వారి గుడారాలను, వారికి ఉన్న ప్రతి పనిమనిషిని, ప్రతి జంతువును మింగి వేసింది. 7 యెహోవా చేసిన ఈ గొప్ప కార్యాలన్నింటినీ చూసినవాళ్లు మీరే, మీ పిల్లలు కాదు.
8 “కనుక ఈ వేళ నేను మీకు చెప్పే ప్రతి ఆజ్ఞకూ మీరు విధేయులు కావాలి. అప్పుడు మీరు బలంగా ఉంటారు. మీరు యొర్దాను నది దాటగలుగుతారు, మీరు ప్రవేశించ బోతున్న దేశాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. 9 మరియు ఆ దేశంలో మీ జీవితం సుదీర్గం అవుతుంది. మీ పూర్వీకులకు, వారి సంతతి వారికి ఇస్తానని యెహోవా వాగ్దానం చేసింది ఈ దేశమే. ఇది మంచివాటితో నిండిన దేశం.[a] 10 మీకు లభిస్తున్న ఈ దేశం మీరు వచ్చిన ఈజిప్టు దేశంలాంటిది కాదు. ఈజిప్టు దేశంలో మీరు విత్తనాలు చల్లి, మీ మొక్కలకు నీళ్లు పెట్టడానికి కాలువలనుండి నీళ్లుతోడేందుకు మీ పాదాలు ప్రయోగించారు. కూరగాయల తోటకు నీళ్లు పెట్టినట్టే మీ పొలాలకు మీరు నీళ్లు పెట్టారు. 11 అయితే త్వరలోనే మీకు లభిస్తున్న దేశం అలాంటిది కాదు. ఆ దేశములో కొండలు, లోయలు ఉన్నాయి. ఆకాశంనుండి కురిసే వర్షాల మూలంగా ఆ భూమికి నీరు లభిస్తుంది. 12 మీ దేవుడైన యెహోవా ఆ భూమి విషయం శ్రద్ధ కలిగి ఉన్నాడు. సంవత్సర ఆరంభంనుండి అంతంవరకు మీ దేవుడైన యెహోవా ఆ భూమిని కనిపెట్టుకొని ఉంటాడు.
13 “‘మీ దేవుడైన యెహోవాను మీరు మీ నిండు హృదయంతో ప్రేమించాలని, మీ నిండు ఆత్మతో సేవించాలని, నేడు మీకు నేను ఇస్తున్న ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినాలి. మీరు అలా చేస్తే, అప్పుడు 14 సకాలంలో నేను మీ భూమికి వర్షం ఇస్తాను. తొలకరి వాన, కడవరి వాన నేను పంపిస్తాను. అప్పుడు మీరు ధాన్యం, మీ కొత్త ద్రాక్షారసం, మీ నూనె సమకూర్చుకోవచ్చును. 15 మీ పశువుల కోసం నేను మీ పొలాల్లో గడ్డి మొలిపిస్తాను. మీరు తినే ఆహారం సమృద్ధిగా ఉంటుంది.’
16 “అయితే జాగ్రత్తగా ఉండండి. మోసపోవద్దు. ఇతర దేవుళ్లను సేవించి, పూజించేందుకు తిరిగిపోవద్దు. 17 ఆ విధంగా మీరు చేస్తే యెహోవా మీమీద చాలా కోపగిస్తాడు. ఆకాశాలను ఆయన మూసి వేస్తాడు. అప్పుడు వర్షం కురవదు. భూమి మీద పంట పండదు. యెహోవా మీకు ఇస్తున్న మంచి దేశంలో మీరు త్వరగా నశిస్తారు.
18 “నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటిని మీ హృదయాల్లో భద్రంగా ఉంచుకోండి. మీకు జ్ఞాపకంచేసే సూచనలుగా ఈ ఆజ్ఞలను వ్రాసి మీ చేతులకు కట్టుకోండి, మీ నొసట బాసికంగా కట్టుకోండి. 19 ఈ ఆజ్ఞలను మీ పిల్లలకు నేర్పించండి. మీరు మీ యిండ్లలో కూర్చున్నప్పుడు, మీరు మార్గంలో నడిచేటప్పుడు, మీరు పండుకొన్నప్పుడు, మీరు లేచినప్పుడు, ఈ విషయాలను గూర్చి మాట్లాడండి. 20 మీ గృహాల ద్వారబంధాల మీద, గవునుల మీద ఈ ఆజ్ఞలు వ్రాయండి. 21 అప్పుడు యెహోవా మీ పూర్వీకులకు యిస్తానని వాగ్దానం చేసిన ఆ దేశంలో మీరూ మీ పిల్లలూ దీర్ఘకాలం జీవిస్తారు. భూమికి ప్తెగా ఆకాశాలు ఉన్నంతవరకు మీరు అక్కడ నివసిస్తారు.
22 “మీరు ఆచరించాలని నేను మీతో చెప్పిన ప్రతి ఆజ్ఞకూ విధేయులుగా ఉండేందుకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవాను ప్రేమించండి, ఆయన మార్గాలన్నింటినీ వెంబడించండి, ఆయనకు నమ్మకంగా ఉండండి. 23 అప్పుడు ఆ దేశంలోనికి వెళ్తారు. ఆ యితర రాజ్యాలన్నింటి జనాలనూ యెహోవా బయటకు వెళ్లగొడ్తాడు. మీకంటే ఎక్కువ బలంగల పెద్ద రాజ్యాలనుండి ఆ దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. 24 మీరు నడిచే భూమి అంతా మీదే అవుతుంది. మీ దేశం దక్షిణాన అరణ్యం మొదలుకొని ఉత్తరాన లెబానోను వరకు మొత్తం వ్యాపించి ఉంటుంది. తూర్పున యూఫ్రటీసు నదినుండి మొత్తం మధ్యధరా సముద్రంవరకు వ్యాపించి ఉంటుంది. 25 మీకు వ్యతిరేకంగా నిలువగల వాడు ఎవడూ ఉండడు. ఆ దేశంలో మీరు ఎక్కడికి వెళ్లినాసరే ప్రజలు మీకు భయపడేటట్టుగా మీ దేవుడైన యెహోవా చేస్తాడు. ఇంతకు ముందు యెహోవా మీకు వాగ్దానం చేసింది యిదే.
ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశీర్వాదములా లేక శాపములా
26 “ఈ వేళ నేను మిమ్మల్ని ఒక ఆశీర్వాదమో లేక ఒక శాపమో కోరుకోనిస్తున్నాను. 27 ఈ వేళ నేను మీతో చెప్పిన మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలకు మీరు లోబడితే మీకు ఆశీర్వాదం లభిస్తుంది. 28 మీరు మీ దేవుడైన యెహోవా మాట వినక, ఈ వేళ నేను మీకు ఆజ్ఞాపించిన మార్గంనుండి మీరు తొలగిపోయి, మీరు ఎరుగని ఇతర దేవుళ్లను అనుసరిస్తే మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను పాటించేందుకు మీరు నిరాకరిస్తే మీకు శాపం వస్తుంది.
29 “మీరు నివసించబోతున్న దేశానికి మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు మీరు గెరీజీము కొండమీదికి వెళ్లి, అక్కడనుండి ఆ ఆశీర్వాదాలు చదివి ప్రజలకు వినిపించాలి. అలాగే ఏబాలు కొండమీదికి కూడా మీరు వెళ్లి అక్కడనుండి శాపాలు చదివి ప్రజలకు వినిపించాలి. 30 అరాబాలో నివసించే కనానీ ప్రజల దేశంలో యొర్దాను నదికి ఆవలి ప్రక్క ఈ కొండలు ఉన్నాయి. ఈ కొండలు పశ్చిమాన గిల్గాలు పట్టణానికి దగ్గరగా మోరేలోని సింధూర వృక్షాలకు సమీపంగా ఉన్నాయి. 31 మీరు యొర్దాను నది దాటివెళ్తారు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న దేశాన్ని మీరు స్వాధీనం చేసుకొంటారు. ఈ దేశం మీది అవుతుంది. మీరు ఈ దేశంలో నివసించేటప్పుడు, 32 ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు, నియమాలు అన్నింటికీ జాగ్రత్తగా లోబడాలి.
దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం
12 “కొత్త దేశంలో మీరు మీ జీవితకాలమంతా పాటించేందుకు జాగ్రత్త పడాల్సిన ఆజ్ఞలు, నియమాలు ఉన్నాయి. మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశంలో మీరు జీవించినంత కాలమూ ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. 2 ఇప్పుడు అక్కడ నివసిస్తున్న రాజ్యాలనుండి దేశాన్ని మీరు స్వాధీనం చేసుకోండి. ఈ దేశాల ప్రజలు వారి దేవుళ్లను పూజించిన స్థలాలన్నింటినీ మీరు పూర్తిగా నాశనం చేయాలి. ఎత్తయిన పర్వతాలమీద, కొండలమీద, పచ్చని చెట్ల క్రింద ఈ స్థలాలు ఉన్నాయి. 3 వారి బలిపీఠాలను మీరు పడగొట్టాలి, వారి స్మారక శిలలను ముక్కలు ముక్కలుగా విరుగగొట్టాలి. వారి అషేరా స్తంభాలను కాల్చివేయాలి, వారి దేవుళ్ల విగ్రహాలను కూలగొట్టండి.
4 “కానీ ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దేవుడైన యెహోవాను ఆరాధించకూడదు. 5 మీ దేవుడైన యెహోవా తన ఆలయం కోసం ఒక ప్రత్యేక స్థలం మీ వంశాలవారి మధ్య నిర్ణయిస్తాడు. యెహోవా తన నామాన్ని అక్కడుంచుతాడు. అది ఆయన ఆలయం. ఆయనను ఆరాధించడానికి ఆ స్థలానికి వెళ్లాలి 6 మీ దహనబలులు, మీ బలులు మీ పంట. మరియు జంతువులో దశమ భాగం[b] మీ ప్రత్యేక కానుకలు, యెహోవాకు మీరు వాగ్దానం చేసిన కానుకలు, మీ స్వేచ్ఛార్పణలు, మరియు మీ పశువుల మందలోను, గొర్రెల మందలోను మొట్టమొదటగా పుట్టిన జంతువులను అక్కడికి మీరు తీసుకొని రావాలి. 7 మీరూ, మీ కుటుంబాలూ ఆ చోట సమావేశమై అక్కడ అందరూ కలిసి భోజనం చేయాలి, మీ దేవుడైన యెహోవా అక్కడ మీతో ఉంటాడు. అక్కడ మీరు కష్టపడిన వాటి ఫలాలను భుజిస్తారు. దేవుడైన యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించి ఆ మంచివాటిని మీకు ఇచ్చాడని జ్ఞాపకం చేసుకొంటారు.
8 “ఆ సమయంలో మనం ఇంతవరకు ఆరాధిస్తున్న విధానాన్ని మీరు కొనసాగించకూడదు. ఇంతవరకు మనకు యిష్టం వచ్చిన ఏ పద్ధతిలోనైనా దేవుణ్ణి మనం ఆరాధించాం. 9 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న శాంతియుతమైన దేశంలో మనం యింకా ప్రవేశించలేదు గనుక. 10 ఆయితే మీరు యొర్దాను నది దాటి, మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న ఆ దేశంలో నివసిస్తారు. అక్కడ మీ శత్రువులు అందరినుండి యెహోవా మీకు విశ్రాంతి ఇస్తాడు. మరియు మీరు క్షేమంగా జీవిస్తారు. 11 అప్పుడు యెహోవా తనకు ప్రత్యేక స్థలంగా ఉండేందుకు ఒక స్థలం ఏర్పాటు చేసుకొంటాడు. మరియు నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ మీరు ఆ చోటికి తీసుకొని రావాలి. మీ దహన బలులు, మీ బలులు, మీ దశమ భాగాలు, మీ ప్రత్యేక కానుకలు, మీరు యెహోవాకు వాగ్దానం చేసిన కానుకలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదటగా పుట్టిన జంతువులు అన్నింటినీ మీరు తీసుకొని రావాలి. 12 మీ పిల్లలు, మీ పనిమనుషులు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు మీ మనుష్యులందరినీ వెంట తీసుకొని ఆ స్థలానికి రండి. (ఆ లేవీయులకు దేశంలో వారి స్వంత భాగం ఉండదు.) అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలిసి సంతోషంగా సమయం గడపండి. 13 మీకు కనబడిన ఏ స్థలంలో అంటే ఆ స్థలంలో మీ దహనబలులు అర్పించకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. 14 మీ వంశాలకు చెందిన ఒక ప్రాంతంలో యెహోవా తన ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకొంటాడు. దహన బలులు అర్పించటం, నేను మీతో చెప్పిన యితర పనులు అన్నీ అక్కడే చేయండి.
15 “మీరు నివసించే ఏ స్థలంలోనైనా ఎర్ర జింక, చిన్న దుప్పిలాంటి ఏ మంచి జంతువునైనా మీరు చంపి తినవచ్చును. మీరు కొరినంత మాంసం, మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చినంత మీరు తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా సరే ఈ మాంసం తినవచ్చును. 16 కాని రక్తంతో మాత్రం మీరు తినకూడదు. రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పోయాలి.
17 “మీరు నివసించే స్థలాల్లో మీరు తినకూడనివి కొన్ని ఉన్నాయి. అవి ఏవనగా: దేవునికి చేందిన ధాన్యం, దేవునికి చెందిన మీ కొత్త ద్రాక్షారసం, నూనె భాగాలు, మీ పశువుల మందల్లో, గొర్రెల మందల్లో మొట్టమొదట పుట్టినవి, మీరు దేవునికి వాగ్దానం చేసిన ఏ కానుకగాని, ఏ స్వేచ్ఛార్పణలుగాని, లేక దేవునికి చెందిన ఏ కానుకలేగాని, 18 మీ దేవుడైన యెహోవా నిర్ణయించే ప్రత్యేక స్థలంలో, మీ దేవుడైన యెహోవా మీతో ఉన్న ఆ స్థలంలో మాత్రమే అర్పణలను మీరు తినాలి. మీరు అక్కడికి వెళ్లి, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ పని మనుష్యులందరు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులతో కలిసి మీరు భోజనం చేయాలి. అక్కడ మీ దేవుడైన యెహోవాతో కలసి సంతోషంగా సమయం గడపండి. మీరు కష్టపడి సంపాదించిన వాటితో ఆనందించండి. 19 మీరు ఎల్లప్పుడూ ఈ భోజనాలను లేవీయులతోకూడ పంచుకొనే విషయంలో ఖచ్చితంగా ఉండండి. మీరు మీ దేశంలో బతికినంతకాలం ఇలా చేయండి.
20-21 “మీ దేశాన్ని విస్తృతపరుస్తానని మీ దేవుడైన యెహోవా వాగ్దానం చేసాడు. ఆయన అలా చేసినప్పుడు, ఆయన తన ప్రత్యేక ఆలయంగా ఉండేందుకు ఏర్పరచుకొనే స్థలానికి మీ నివాసం చాలా దూరం కావచ్చు. అది చాలా దూరమై, మాంసం కోసం మీరు ఆకలిగా ఉంటే, అప్పుడు మీ దగ్గర ఉన్న ఏ మాంసమైనా తినవచ్చును. యెహోవా మీకు ఇచ్చిన పశువుల మందలోనుండిగాని, గొర్రెల మందలోనుండిగాని, ఏ జంతువునైనా చంపుకోవచ్చును. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం యిది చేయండి. మీరు నివసించే చోట మీకు యిష్టం వచ్చినప్పుడు ఈ మాంసం తినవచ్చును. 22 జింక, దుప్పి మాంసం తిన్నట్టుగానే మీరు ఈ మాంసం తినవచ్చును. పవిత్రంగా ఉన్నవాళ్లు, అపవిత్రంగా ఉన్నవాళ్లు ఎవరైనా యిలా చేయవచ్చును. 23 రక్తంతో మాత్రం తినకుండ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రాణం రక్తంలోనే ఉంటుంది. ఇంకా ప్రాణం ఉన్న మాంసం మీరు తినకూడదు. 24 రక్తంతో తినవద్దు, ఆ రక్తాన్ని మీరు నీళ్లలా నేలమీద పారబోయాలి. 25 సరైనది అని యెహోవా చెప్పిన ప్రతిదీ మీరు చేయాలి. అందుచేత రక్తంతో తినవద్దు. మీకు మీ సంతతివారికి మేలు కలుగుతుంది.
26 “మీరు ప్రతిష్ఠించిన వాటిని, మీ మొక్కు బడులను, మీ దేవుడైన యెహోవా నియమించే ప్రత్యేక స్థలానికి మీరు తీసుకొని వెళ్లాలి. 27 మీరు మీ దహన బలులను ఆ స్థలంలో అర్పించాలి. మీ దహనబలుల రక్తం, మాంసం మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. మీ యితర బలుల విషయంలో రక్తాన్ని మీ దేవుడైన యెహోవా బలిపీఠం మీద అర్పించండి. అప్పుడు ఆ మాంసం మీరు తినవచ్చును. 28 నేను మీకు ఇస్తున్న ఈ ఆజ్ఞలన్నింటికి జాగ్రత్తగా విధేయులు కావాలి. మంచివి, సరైనవి మీ దేవుడైన యెహోవాను ఆనందపర్చే పనులు మీరు చేసినప్పుడు మీకూ, మీ సంతతివారికి శాశ్వతంగా మేలు కలుగుతుంది.
29 “ఇతర రాజ్యాల ప్రాంతంలోనికి మీరు వెళ్లినప్పుడు ఆ రాజ్యాలను మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టి నాశనం చేస్తాడు. మీరు లోనికి వెళ్లి వారినుండి ఆ దేశం తీసుకొంటారు. వారి దేశంలో మీరు నివసిస్తారు. 30 అయితే అది జరిగిన తర్వాత జాగ్రత్తగా ఉండండి. ఆ రాజ్యాలవారు పూజించిన దేవుళ్లను గూర్చి తెలుసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవద్దు. వారు వారి దేవుళ్లను ఎలా పూజిస్తారో అది మీరు నేర్చుకొనేందుకు ప్రయత్నించవద్దు. వాళ్లు పూజించినట్టు పూజించాలనే ఆలోచన కూడా చేయవద్దు. 31 ఆ ప్రజలు వారి దేవుళ్లను పూజించిన పద్ధతిలో మీరు మీ దెవుడైన యెహోవాను ఆరాధించకూడదు. ఎందుకంటే వారు వారి పూజలో యెహోవాకు అసహ్యమైన చెడ్డపనులు అన్నీ చేస్తారు. చివరికి వారు వారి చిన్న బిడ్డలను కూడ వారి దేవుళ్లకు బలి అర్పణగా కాల్చివేస్తారు.
32 “నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం జాగ్రత్తగా చేయాలి. నేను మీకు చెప్పేవాటికి మరేమీ కలుపవద్దు, ఏమీ తీసివేయవద్దు.
ఇతర దేవుళ్లను సేవించవద్దు
13 “ఒక ప్రవక్త లేక కలల భావం చెప్పే ఒక వ్యక్తి మీ దగ్గరకు రావచ్చు. మీకు ఏదో ఒక సూచన లేక అద్భుతం చూపిస్తానని ఆతడు మీతో చెప్పవచ్చు. 2 మరియు ఆతడు మీకు చెప్పిన సూచన లేక అద్భుతం నెరవేరవచ్చు. అప్పుడు ఆతడు ఇతర దేవుళ్లను (మీరు ఎరుగని దేవుళ్లను) పూజించమని మీతో చెప్పవచ్చును. ‘మనం ఆ దేవుళ్లనే సేవిద్దాము’ అని అతడు మీతో అనవచ్చును. 3 ఆ మనిషి మాట వినవద్దు. ఎందుకంటె మీరు మీ దేవుణ్ణి మీ నిండు హృదయంతోను, మీ నిండు ఆత్మతోను ప్రేమిస్తున్నారో లేదో తెలుసుకొనేందుకు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. 4 మీరు మీ దేవుడైన యెహోవాను వెంబడించాలి. మీరు తప్పక ఆయనను గౌరవించాలి. యెహోవా ఆజ్ఞలకు విధేయులై, ఆయన మీతో చెప్పినట్టు చేయండి. యెహోవాను సేవించండి, ఎన్నటికీ ఆయనను విడువకండి. 5 అంతేకాదు కలలను గూర్చి చెప్పే ఆ ప్రవక్తను చంపివేయాలి. ఎందుకంటే మీ దేవుడైన యెహోవాకు లోబడటం మానివేయండి అని మీతో చెబుతున్నాడు గనుక. మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినవాడు యెహోవా. అక్కడి బానిస జీవితంనుండి ఆయనే మిమ్మల్ని రక్షించాడు. మీరు జీవించాలని మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన జీవితం నుండి మిమ్మల్ని తప్పించి వేయాలని ఆ వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు. అందుచేత మీ ప్రజలనుండి చెడుగును తీసివేసేందుకు మీరు ఆ వ్యక్తిని చంపివేయాలి.
6 “మీతో సన్నిహితంగా ఉండేవారు ఎవరైనా, మీరు ఇతర దేవుళ్లను పూజించేందుకు రహస్యంగా మిమ్మల్ని ఒప్పించవచ్చు. నీ స్వంత సోదరుడు. నీ కుమారడు, నీ కుమార్తె, నీవు ప్రేమించే నీ భార్య, లేక నీ అతి సన్నిహిత మిత్రుడు కావచ్చు. ‘మనం పోయి యితర దేవుళ్లను పూజిద్దాము’ అని ఆ వ్యక్తి చెప్పవచ్చు. (ఈ దేవుళ్లను మీరు గాని, మీ పూర్వీకులు గాని ఎన్నడూ ఎరుగరు. 7 ఆ దేవుళ్లు మీకు దగ్గర్లో, దూరంలో, మీ చుట్టు పక్కల రాజ్యాల్లో ఉండే ప్రజల దేవుళ్లు.) 8 మీరు ఆ వ్యక్తితో సమ్మతించకూడదు. ఆతని మాట వినవద్దు. ఆతని మీద జాలిపడవద్దు, అతణ్ణి స్వేచ్ఛగా వెళ్ళిపోనివ్వవద్దు. ఆతణ్ణి కాపాడవద్దు. 9-10 కాని, మీరు అతణ్ణి చంపాల్సిందే. మీరు అతణ్ణి రాళ్లతో కొట్టి చంపెయ్యాలి. నీవే మొట్టమొదట రాళ్లు తీసుకొని అతని మీద విసరాలి. తర్వాత ప్రజలందరూ రాళ్లు విసిరి అతణ్ణి చంపాలి. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మీ దేవుడైన యెహోవాకు దూరం చేయాలని ప్రయత్నించాడు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి మిమ్మల్ని బయటకు రప్పించిన వాడు యెహోవాయే. 11 అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరు విని భయపడతారు. అంతేకాదు, వారు యిలాంటి చెడ్డపనులు ఇంకేమీ మీ మధ్య జరిగించరు.
12 “మీ దేవుడైన యెహోవా మీరు నివసించేందుకు పట్టణాలు మీకు ఇచ్చాడు. కొన్నిసార్లు ఈ పట్టణాల్లో ఒకదాన్ని గూర్చి మీరు ఏదైనా చెడువార్త వినవచ్చును. మీరు 13 మీ స్వంత దేశంలోనే దుర్మార్గులు కొందరు వారి పట్టణస్థులను చెడ్డపనులు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని వినవచ్చును. ‘మనం వెళ్లి యితర దేవుళ్లను సేవిద్దాము, అని వారు వారి పట్టణస్థులతో అనవచ్చును.’ (ఈ దేవుళ్లు యింతకు ముందు మీరు ఎన్నడూ ఎరుగని దేవుళ్లు.) 14 మీరు ఇలాంటి వార్త వింటే, అది సత్యమా అని తెలుసుకొనేందుకు మీరు చేయగలిగింది అంతా చేయాలి. అది వాస్తవమేనని మీకు తెలిస్తే-అలాంటి దారుణ విషయం నిజంగానే జరిగిందని మీకు ఋజువైతే 15 అప్పుడు మీరు ఆ పట్టణస్థులను శిక్షించాలి. వాళ్లందరినీ చంపివేయాలి. మరియు వారి పశువులన్నింటినీ చంపివేయండి. మీరు ఆ పట్టణాన్ని పూర్తిగా నాశనం చేయాలి. 16 అప్పుడు మీరు విలువైన వస్తువులన్నింటినీ పోగు చేసి పట్టణం మధ్యకు వాటిని తీసుకొని వెళ్లాలి. ఆ పట్టణాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని మీ దేవుడైన యెహోవాకు దహనబలిగా మీరు కాల్చివేయాలి. ఆ పట్టణం శాశ్వతంగా పాడు దిబ్బగా అవుతుంది. అది ఎన్నటికీ తిరిగి కట్టబడకూడదు. 17 ఆ పట్టణంలో ఉన్న సమస్తం నాశనం చేయబడేందుకు అది యెహోవాకు అప్పగించబడాలి. కనుక ఆ వస్తువుల్లో ఏదీ మీకోసం మీరు ఉంచుకోకూడదు. మీరు ఈ ఆజ్ఞను పాటిస్తే, అప్పుడు యెహోవా మీ మీద కోపం చాలిస్తాడు. యెహోవా మీకు దయను ప్రసాదిస్తాడు. ఆయనకు మీమీద జాలి ఉంటుంది. ఆయన మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ప్రకారం మీ రాజ్యాన్ని విస్తారంగా పెరుగనిస్తాడు. 18 మీరు మీ దేవుడైన యెహోవా మాట ఆలకించి, నేడు నేను మీకు యిస్తున్న ఆజ్ఞలకు విధేయులైతే యిలా జరుగుతుంది. మీ దేవుడైన యెహోవా సరైనవి అని చెప్పేవాటిని మీరు చేయాలి.
© 1997 Bible League International