Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 9-11

గిబియోనులు యెహోషువకు చేసిన మోసం

యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న రాజులందరూ ఈ సంగతులు విన్నారు. హిత్తీ, అమోరీ, కనానీ, పెరిజ్జీ, హివ్వీ, యెబూసీ ప్రజల రాజులు వీరు. వారు కొండ దేశాల్లోనూ, మైదాన దేశాల్లోనూ నివసించారు. మధ్యధరా సముద్ర తీరంలో లెబానోను వరకూ కూడ వారు నివసించారు. ఈ రాజులంతా ఏకమయ్యారు. యెహోషువ మీద, ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేయటానికి వారు పథకాలు వేసారు.

యెరికో, హాయి పట్టణాలను యెహోషువ జయించిన విధానాన్ని గూర్చి గిబియోను పట్టణ ప్రజలు విన్నారు. కనుక వారు ఇశ్రాయేలు ప్రజలను మోసం చేయాలని నిర్ణయించారు. వారి పథకం ఇలా ఉంది: పగిలిపోయి, చినిగిపోయిన పాత ద్రాక్షారసం తిత్తులను వారు పోగుచేసారు. వారి జంతువుల వీపుల మీద ఈ పాత ద్రాక్షారసపు తిత్తులను[a] వారు వేసారు. వారు చాల దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడాలని ఆ పాత తిత్తులను అలా జంతువుల మీద వేసారు. ఆ మనుష్యులు పాదాలకు పాత చెప్పులు తొడుక్కొన్నారు. వాళ్లు పాత బట్టలు వేసుకొన్నారు. ఎండిపోయి, విరిగిపోతున్న పాత రొట్టె కొంత వారు సంపాదించారు. అందుచేత ఆ మనుష్యులు చాలా దూరంనుండి ప్రయాణం చేసివచ్చినట్టు కనబడ్డారు. అప్పుడు వాళ్లు ఇశ్రాయేలీయుల బసకు వెళ్లారు. ఈ బస గిల్గాలు దగ్గర ఉంది.

ఆ మనుష్యులు యెహోషువ దగ్గరకు వెళ్లి, “మేము చాల దూరదేశం నుండి ప్రయాణం చేసి వచ్చాము. మేము మీతో శాంతి ఒడంబడిక చేసుకోవాలని కోరుతున్నాం” అని అతనితో చెప్పారు.

ఇశ్రాయేలు మనుష్యులు “ఒకవేళ మీరు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారేమో. ఒకవేళ మీరు మాకు దగ్గర్లోనే నివసిస్తున్నారేమో. మీరు ఎక్కడ్నుంచి వచ్చిందీ మేము తెలుసుకొనేంతవరకు మేము మీతో శాంతి ఒడంబడిక కుదుర్చుకోలేం” అని ఈ హివ్వీయుల వారితో చెప్పారు.

హివ్వీ మనుష్యులు యెహోషువతో “మేము నీ దాసులం” అన్నారు.

అయితే యెహోషువ, “మీరెవరు? మీరు ఎక్కడ్నుంచి వచ్చారు?” అని అడిగాడు.

అప్పుడు ఆ మనుష్యులు ఇలా జవాబిచ్చారు, “మేము నీ దాసులము. మేము చాలా దూరదేశం నుండి వచ్చాం. మీ యెహోవా దేవుని మహాశక్తిని గూర్చి మేము విన్నందుచేత మేము వచ్చాము. ఆయన చేసిన కార్యాలను గూర్చి మేము విన్నాము. ఈజిప్టులో ఆయన చేసిన వాటన్నింటిని గూర్చి మేము విన్నాం. 10 యొర్దాను నది తూర్పు దిశనున్న అమోరీ రాజులు ఇద్దర్ని ఆయన ఓడించినట్టు మేము విన్నాము. వాళ్లు అష్టారోతు దేశంలో హెష్బోను రాజైన సీహోను, బాషాను రాజైన ఓగు. 11 కనుక మా నాయకులు, ప్రజలు మాతో ఏమన్నారంటే, ‘మీ ప్రయాణానికి కావలనసినంత భోజనం మీతో తీసుకొని వెళ్లండి; వెళ్లి ఇశ్రాయేలు ప్రజల్ని కలువండి. మేము మీ సేవకులం, మాతో శాంతి ఒడంబడిక చేయండి అని వాళ్లతో చెప్పండి’ అన్నారు.

12 “మా రొట్టెలు చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు ఇది తాజాగా వేడిగా ఉండెను. అయితే ఇప్పుడు ఇవి ఎండిపోయి ఉన్నట్లు మీరు చూడగలరు. 13 మా ద్రాక్షారసం తిత్తులను చూడండి. మేము ఇల్లు విడిచినప్పుడు, అవి కొత్తవి, ద్రాక్షారసంతో నిండి ఉండినాయి. ఇప్పుడు అవి పాతబడిపోయి, పిగిలిపోతూ ఉండటం మీకు కనబడుతూనే ఉంది. మా బట్టలు, చెప్పులు చూడండి. మా దూర ప్రయాణంవల్ల మేము ధరించినవన్నీ దాదాపు పాడైపోవటం మీరు చూస్తూనే ఉన్నారు.”

14 ఈ మనుష్యులు చెప్పేది సత్యమో కాదో తెలుసుకోవాలి అనుకొన్నారు ఇశ్రాయేలు మనుష్యులు. కనుక వాళ్లు ఆ రొట్టెను రుచి చూసారు-కాని ఏమి చేయాలనే విషయం వారు యెహోవాను అడుగలేదు. 15 వాళ్లతో శాంతి ఒడంబడిక చేసుకొనేందుకు యెహోషువ ఒప్పుకున్నాడు. వాళ్లను బతక నిచ్చేందుకు అతడు అంగీకరించాడు. ఈ ఒడంబడికకు ఇశ్రాయేలు నాయకులు ఒప్పుకున్నారు.

16 మూడు రోజుల తర్వాత, ఆ మనుష్యులు వారి గుడారాలకు చాల దగ్గర్లో నివసిస్తున్నవారేనని ఇశ్రాయేలు ప్రజలు తెలుసుకొన్నారు. 17 కనుక వాళ్లు నివసిస్తున్న చోటుకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. మూడవ నాడు ఆ ప్రజలు నివసిస్తున్న గిబియోను, కెఫిరా, బెయెరోతు, కిర్యత్యారీము పట్టణాలకు ఇశ్రాయేలు ప్రజలు వెళ్లారు. 18 కానీ ఇశ్రాయేలు సైన్యం ఆ పట్టణాలమీద యుద్ధం చేయోలని ప్రయత్నించలేదు. వారు ఆ ప్రజలతో శాంతి ఒడంబడిక కుదుర్చుకొన్నారు. వారు ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట ఆ ప్రజలకు ప్రమాణం చేసారు.

ఆ ప్రమాణం చేసిన నాయకులను ప్రజలంతా నిందించారు. 19 అయితే నాయకులు జవాబు చెప్పారు: “మేము మా వాగ్దానం చేసాము. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుని ఎదుట మేము ప్రమాణం చేసాము. ఇప్పుడు మేము వాళ్లతో యుద్ధం చేయలేము. 20 మనము ఇలా చేయాలి. మనం వాళ్లను బతకనివ్వాలి. మనము వాళ్లకు హాని చేయకూడదు, లేదా మనం వారితో చేసిన ప్రమాణం ఉల్లంఘించిన కారణంగా యెహోవా కోపం మనమీద ఉంటుంది. 21 అందుచేత వాళ్లను బ్రతక నిద్దాం. అయితే వాళ్లు మనకు బానిసలుగా ఉంటారు. వాళ్లు మనకోసం కట్టెలు కొట్టి, మన ప్రజలందరి కోసం నీరు మోస్తారు.” అందుచేత ఆ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని ఆ నాయకులు ఉల్లంఘించలేదు.

22 యెహోషువ గిబియోను ప్రజలను పిలిచి, “మీరు ఎందుకు మాతో అబద్ధం చెప్పారు? మీ దేశం మా పాళెము పక్కనే ఉంది. కానీ మీరు చాలా దూర దేశంనుండి వచ్చినట్టు మాతో చెప్పారు. 23 ఇప్పుడు మీ ప్రజలకు చాల కష్టాలు ఎదురవుతాయి. మీ ప్రజలంతా బానిసలుగా ఉంటారు. దేవుని ఆలయం కోసం వాళ్లు కట్టెలు కొట్టాలి, నీరు మోయాలి” అని అతడు చెప్పాడు.

24 గిబియోనీ ప్రజలు ఇలా జవాబు చెప్పారు: “మీరు మమ్మల్ని చంపేస్తారని భయంతో మేము మీకు అబద్ధం చెప్పాము. ఈ దేశం అంతా మీకు ఇచ్చేస్తానని దేవుడు తన సేవకుడు మోషేతో చెప్పినట్టు మేము విన్నాము. ఈ దేశంలో నివసిస్తున్న మనుష్యులందరినీ చంపివేయమనికూడా దేవుడు మీకు ఆజ్ఞాపించాడు. అందుకే మేము మీతో అబద్ధం చెప్పాము. 25 ఇప్పుడు మేము మీకు దాసులం మీకు సరియైనదిగా అనిపించిన ప్రకారం మీరు మాకు ఏమైనా చేయవచ్చు.”

26 కనుక గిబియోను ప్రజలు బానిసలు అయ్యారు. అయితే యెహోషువ వారి ప్రాణాలు రక్షించాడు. ఇశ్రాయేలు ప్రజలు వాళ్లను చంపకుండా చేసాడు యెహోషువ. 27 యెహోషువ గిబియోను ప్రజలను ఇశ్రాయేలు ప్రజలకు బానిసలుగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజలకోసం, యెహోవా బలిపీఠం ఎక్కడ ఉండాలని యెహోవా కోరితే అక్కడ దానికోసం వారు కట్టెలు నరికి, నీరు మోసారు. ఆ ప్రజలు నేటికీ బానిసలే.

సూర్యుడు కదలక నిలచిన రోజు

10 అప్పట్లో అదోనీసెదెకు యెరూషలేము రాజు. యెహోషువ హాయిని ఓడించి, దానిని సర్వ నాశనం చేసాడని ఈ రాజు విన్నాడు. యెరికోకు, దాని రాజుకుకూడా యెహోషువ అలానే చేసాడని ఆ రాజు తెలుసుకొన్నాడు. గిబియోను ప్రజలు ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొన్నారని, ఆ ప్రజలు యెరూషలేంకు సమీపంగానే నివసిస్తున్నారని కూడా ఆ రాజు తెలుసుకొన్నాడు. అందుచేత ఈ విషయాల మూలంగా అదోనీసెదెకు, అతని ప్రజలు చాలా భయపడ్డారు. హాయివలె గిబియోను చిన్న పట్టణం కాదు. ఏ రాజధాని పట్టణమైనా ఎంత పెద్దగా ఉంటుందో, గిబియోను అంత పెద్ద పట్టణం. మరియు ఆ పట్టణంలోని పురుషులంతా మంచి శూరులు. కనుక వారు భయపడ్డారు. యెరూషలేము రాజు అదోనీసెదెక్, హెబ్రోను రాజైన హోహంతో మాట్లాడాడు. యార్మూత్ రాజైన పిరాముతో, లాకీషు రాజు యాఫీయతో, ఎగ్లోన్ రాజైన దెబీరుతో కూడా అతడు మాట్లాడాడు. “మీరు నాతో కూడా గిబియోను మీద దాడి చేసేందుకు వచ్చి సహాయం చేయండి. యెహోషువతో, ఇశ్రాయేలు ప్రజలతో గిబియోను శాంతి ఒడంబడిక కుదుర్చు కొంది” అని యెరూషలేము రాజు వీళ్లను బ్రతిమిలాడాడు.

అందుచేత ఈ అయిదుగురు ఆమోరీ రాజులు వారి సైన్యాలను ఏకం చేసారు. (అయిదుగురు రాజులు ఎవరనగా, యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యార్మూత్ రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు) మరియు వారి సైన్యాలు గిబియోను మీదికి వెళ్లాయి. ఆ సైన్యాలు పట్టణాన్ని చుట్టు ముట్టడించి, దానిమీద పోరాటం మొదలు పెట్టాయి.

గిల్గాలులో తన పాళెములో ఉన్న యెహోషువ దగ్గరకు గిబియోను పట్టణం లోని ప్రజలు సందేశం పంపించారు. “మేము నీ సేవకులము. మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టకు. వచ్చి మాకు సహాయంచేయి. త్వరపడు. మమ్మల్ని రక్షించు. కొండ దేశంలోని అమోరీ రాజులంతా వారి సైన్యాలను ఏకంచేసారు. మామీద వాళ్లు యుద్ధం చేస్తున్నారు” ఇదీ ఆ సందేశం.

కనుక యెహోషువ తన సైన్యం అంతటితో గిల్గాలునుండి బయల్దేరాడు. యెహోషువ యొక్క మంచి శూరులంతా అతనితో ఉన్నారు. యెహోవా, “ఆ సైన్యాల విషయమై భయపడకు. నీవు వాళ్లను జయించేటట్టు నేను చేస్తాను. ఆ సైన్యాల్లో ఏదీ నిన్ను జయించజాలదు” అని యెహోషువతో చెప్పాడు.

యెహోషువ, అతని సైన్యం రాత్రంతా గిబియోనుకు ప్రయాణం చేసారు. (యెహోషువ వస్తున్నట్టు శత్రువుకు తెలియదు.) అందుచేత యెహోషువ వారిమీద దాడి చేసి వాళ్లకు ఆశ్చర్యం కలిగించాడు.

10 ఇశ్రాయేలీయులు దాడి చేసినప్పుడు అవతలి సైన్యాలను యెహోవా చాల గలిబిలి చేసాడు. కనుక ఇశ్రాయేలీయులు గొప్ప విజయంతో వారిని ఓడించారు. ఇశ్రాయేలీయులు గిబియోనునుండి వారిని తరిమివేసారు. బేత్‌హోరోను మార్గంవరకు ఇశ్రాయేలీయులు వారిని తరిమివేసారు. అజెకా, మక్కెదా వరకు ఇశ్రాయేలు సైన్యం ఆ మనుష్యుల్ని చంపారు. 11 ఇశ్రాయేలు సైన్యం వారి శత్రువుల్ని బెత్‌హోరోను నుండి అజెకావరకు దారి పొడవునా తరిమారు. వారు శత్రువును తరుముతూ ఉండగా, యెహోవా ఆకాశంనుండి పెద్ద వడగండ్లు కురిపించాడు. ఈ పెద్ద వడగండ్ల మూలంగా శత్రువులు అనేకమంది చనిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు ఖడ్గంతో చంపిన వారికంటె ఈ వడగండ్ల మూలంగానే చాల ఎక్కువమంది మరణించారు.

12 ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు అమోరీ ప్రజలను ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. మరియు ఆ రోజు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట నిలిచి యెహోవాతో ఇలా చెప్పాడు:

“ఓ సూర్యుడా, గిబియోనుకు పైగా ఆకాశంలో నిలిచి ఉండు,
    ఓ చంద్రుడా, అయ్యాలోను లోయలో నిలిచి ఉండు.”

13 కనుక సూర్యుడు కదలలేదు. ప్రజలు తమ శత్రువులను ఓడించేంతవరకు చంద్రుడు కూడ నిలిచిపోయాడు. ఇది యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆకాశం మధ్యలో సూర్యుడు స్తంభించిపోయాడు. ఒక రోజంతా అది కదల్లేదు. 14 ఆ రోజుకు ముందు ఎన్నడూ అలా జరుగలేదు. ఆ తర్వాత కూడ ఎన్నడూ మళ్లీ అలా జరుగలేదు. ఆ రోజు మనిషి మాట యెహోవా విన్నరోజు. నిజంగా ఇశ్రాయేలీయుల పక్షంగా యెహోవా యుద్ధం చేసాడు!

15 ఇది జరిగిన తర్వాత యెహోషువా, అతని సైన్యం తిరిగి గిల్గాలు దగ్గర గుడారాలకు వెళ్లిపోయారు. 16 యుద్ధ సమయంలో ఆ అయిదుగురు రాజులు పారిపోయారు. మక్కెదా సమీపంలో ఒక గుహలో వారు దాగుకొన్నారు. 17 అయితే ఆ అయిదుగురు రాజులు ఆ గుహలో దాగుకోవటం ఎవరో కనుక్కొన్నారు. యెహోషువకు ఈ విషయం తెలిసింది. 18 యెహోషువ ఇలా చెప్పాడు, “ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో మూసివేయండి. ఆ గుహకు కాపలాగా కొందరు మనుష్యుల్ని అక్కడ ఉంచండి. 19 కానీ మీరు అక్కడ ఉండొద్దు. శత్రువును తరుముతూనే ఉండండి. వెనుకనుండి వారిమీద మీ దాడి కొనసాగించండి. శత్రువుల్ని తిరిగి పట్టణాలకు క్షేమంగా వెళ్లనీయకండి. మీ యెహోవా దేవుడు వారిమీద మీకు విజయం ఇచ్చాడు.”

20 కనుక యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులను చంపేసారు. అయితే శత్రువులు కొందరు తప్పించుకొని, వారి పట్టణాలకు వెళ్లి దాగుకోగలిగారు. వీళ్లు చంపబడలేదు. 21 పోరాటం అయిపోయిన తర్వాత యెహోషువ మనుష్యులు మక్కెదా దగ్గర అతని దగ్గరకు తిరిగి వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలకు వ్యతిరేకంగా ఒక్కమాట పలికే ధైర్యంగలవాళ్లు ఆ దేశంలో ఒక్కరూ లేకపోయారు.

22 యెహోషువ ఇలా చెప్పాడు, “గుహను మూసిన బండలను తీసివేసి, ఆ అయిదుగురు రాజులను నా దగ్గరకు తీసుకొని రండి” అని. 23 కనుక యెహోషువ మనుష్యులు ఆ అయిదుగురు రాజులను గుహలోనుండి బయటకు తీసుకొని వచ్చారు. ఈ అయిదుగురు రాజులు యెరూషలేము రాజు, హెబ్రోను రాజు, యర్మూతు రాజు, లాకీషు రాజు, ఎగ్లోను రాజు. 24 కనుక ఆ ఐదుగురు రాజులను వారు యెహోషువ దగ్గరకు తీసుకొని వచ్చారు. యెహోషువ తన మనుష్యులందరినీ ఆ చోటికి పిలిచాడు. “ఇక్కడికి వచ్చి, ఈ రాజుల మెడలమీద మీ పాదాలు పెట్టండి” అని తన సైన్యాధికారులతో యెహోషువ చెప్పాడు. అందుచేత యెహుషువ సైన్యాధికారులు దగ్గరగా వచ్చారు. వారు ఆ రాజుల మెడలమీద తమ పాదాలు పెట్టారు.

25 అప్పుడు యెహోషువ: “బలంగా, ధైర్యంగా ఉండండి. భవిష్యత్తులో మీరు యుద్ధం చేసే శత్రువులందరికీ యెహోవా ఏమి చేస్తాడో నేను మీకు చూపిస్తాను” అన్నాడు తన మనుష్యులతో.

26 అప్పుడు యెహోషువ ఆ అయిదుగురు రాజులను చంపేసాడు. అతడు వారి శరీరాలను ఐదు చెట్లకు వేలాడదీసాడు. యెహోషువ వాళ్లను అలానే సాయంత్రంవరకు చెట్లకు వేలాడనిచ్చాడు. 27 సూర్యాస్తమయమప్పుడు ఆ శవాలను చెట్లనుండి దించమని యెహోషువ తన మనుష్యులతో చెప్పాడు. అప్పుడు వారు ఆ శవాలను, అంతకు ముందు వారు దాగుకొన్న గుహలోనే పడవేసారు. ఆ గుహ ద్వారాన్ని పెద్ద బండలతో వారు మూసివేసారు. నేటికీ ఆ శవాలు ఆ గుహలోనే ఉన్నాయి.

28 ఆ రోజు యెహోషువ మక్కెదాను జయించాడు. ఆ పట్టణంలోని రాజును, ప్రజలను యెహోషువ చంపేసాడు. మనుష్యులు ఎవ్వరూ ప్రాణాలతో విడిచి పెట్టబడలేదు. యెరికో రాజుకు చేసినట్టే మక్కెదా రాజుకు యెహోషువ చేసాడు.

దక్షిణ ప్రాంతాలను ఓడించటం

29 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ మక్కెదానుండి ప్రయాణం చేసారు. వారు లిబ్నా వెళ్లి ఆ పట్టణంపై దాడి చేసారు. 30 ఆ పట్టణాన్ని, దాని రాజును ఇశ్రాయేలు ప్రజలు ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. ఆ పట్టణంలో ఉన్న ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపివేసారు. మనుష్యులెవ్వరూ ప్రాణాలతో విడువబడలేదు. మరియు ప్రజలు యెరికో రాజుకు చేసినట్టే ఆ రాజుకుకూడ చేసారు.

31 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ లిబ్నా విడిచి, లాకీషుకు ప్రయాణమయ్యారు. యెహోషువ, అతని సైన్యం లిబ్నా దగ్గర్లోనే ఉండి, ఆ పట్టణం మీద దాడి చేసారు. 32 ఇశ్రాయేలు ప్రజలు లాకీషు పట్టణాన్ని ఓడించేటట్టుగా యెహోవా చేసాడు. వారు ఆ పట్టణాన్ని రెండో రోజున ఓడించారు. ఆ పట్టణంలో ప్రతి వ్యక్తినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. లిబ్నాకు అతడు చేసిందికూడ ఇదే. 33 ఇదే సమయంలో గెజెరు రాజైన హోరాము, లాకీషుకు సహాయం చేసేందుకు వచ్చాడు. కానీ అతణ్ణి, అతని సైన్యాన్ని కూడ యెహోషువ ఓడించాడు. అక్కడ మనుష్యులు ఎవరూ బ్రతికి బయటపడలేదు.

34 అప్పుడు యెహోషువ, అతని ప్రజలందరూ లాకీషునుండి ఎగ్లోనుకు ప్రయాణ మయ్యారు. వారు ఎగ్లోను చుట్టు పక్కల బసచేసి దానిమీద దాడిచేసారు. 35 ఆ రోజు వారు ఆ పట్టణాన్ని పట్టుకొని, ఆ పట్టణంలో ప్రజలందరినీ చంపేసారు. వారు లాకీషుకు చేసిందికూడ ఇదే.

36 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ ఎగ్లోను నుండి హెబ్రోనుకు ప్రయాణమయ్యారు. అప్పుడు వారు హెబ్రోను మీద దాడి చేసారు. 37 ఆ పట్టణాన్ని, హెబ్రోను చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న ఊళ్లను వారు పట్టుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు ప్రజలు చంపేసారు. అక్కడ ఏ ఒక్కరినీ వారు బ్రతకనియ్యలేదు. వారు ఎగ్లోనుకు చేసింది కూడ ఇదే. వారు ఆ పట్టణాన్ని నాశనంచేసి, అందులోని ప్రజలందరినీ చంపివేసారు.

38 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరూ తిరిగి దెబీరుకు వెళ్లి, ఆ పట్టణం మీద దాడి చేసారు. 39 వారు ఆ పట్టణాన్ని, దాని రాజును, దెబీరు సమీపంలోవున్న చిన్న చిన్న పట్టణాలన్నింటినీ స్వాధీనం చేసుకొన్నారు. ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ వారు చంపేసారు. అక్కడ ఎవరినీ బ్రతకనియ్యలేదు. హెబ్రోనుకు, దాని రాజుకు చేసినట్టే, దెబీరుకు, దాని రాజుకు ఇశ్రాయేలు ప్రజలు చేసారు. లిబ్నాకు, దాని రాజుకు కూడ వారు ఇలానే చేసారు.

40 కనుక నెగెవు, కొండ ప్రాంతపు పట్టణాల రాజులందరినీ, పడమటి కొండ చరియలనూ, తూర్పు కొండ చరియలనూ, యెహోషువ ఓడించేసాడు. ఆ ప్రజలందరినీ చంపివేయుమని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యోహోషువతో చెప్పాడు. అందుచేత ఆ స్థలాల్లో ఎవ్వరినీ యెహోషువ ప్రాణాలతో విడిచిపెట్టలేదు.

41 కాదేషు బర్నేయనుండి గాజా వరకు గల పట్టణాలన్నింటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. గోషేను (ఈజిప్టు) దేశం నుండి గిబియోను వరకుగల పట్టణాలన్నింటినీ అతడు స్వాధీనం చేసుకొన్నాడు. 42 ఆ ప్రయాణంలో ఆ పట్టణాలన్నింటినీ, వాటి రాజులందరినీ యెహోషువ పట్టుకొన్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షంగా యుద్ధం చేసినందువల్ల యెహోషువ ఇలా చేయగలిగాడు. 43 అప్పుడు యెహోషువ, ఇశ్రాయేలు ప్రజలందరు గిల్గాలు లోని వారి గుడారాలకు తిరిగి వెళ్లారు.

ఉత్తర ప్రాంతాలను వశపర్చుకొనటం

11 జరిగిన ఈ సంగతులు అన్నింటిని గూర్చి హాసోరు రాజు యాబిను విన్నాడు. అందుచేత అతడు అనేకమంది రాజుల సైన్యాలను సమకూర్చాలని నిర్ణయించాడు. మదోను రాజైన యోబాబు, షిమ్రోను రాజు, అక్షపు రాజు, ఉత్తరాన కొండదేశం, ఎడారి రాజులు ఇద్దరికి యాబిను సందేశం పంపించాడు. కిన్నెరెత్, నెగెవ్, పడమటి దిగువ కొండల రాజులకు యాబిను సందేశం పంపించాడు. పడమట నఫోత్‌దార్ రాజుకుగూడ యాబిను సందేశం పంపించాడు. యాబిను ఆ సందేశాన్ని తూర్పు, పడమరలలో ఉన్న కనానీ ప్రజల రాజులకు పంపించాడు. కొండ ప్రదేశాల్లో నివసిస్తున్న అమోరీ ప్రజలకు, హిత్తీ ప్రజలకు, పెరిజ్జీ ప్రజలకు, యెబూసీ ప్రజలకు పంపించాడు. మిస్పా ప్రాంతంలో హెర్మోను కొండ దిగువలో నివసిస్తున్న హివ్వీ ప్రజలకుగూడ అతడు ఆ సందేశం పంపించాడు. కనుక ఈ రాజులందరి సైన్యాలు కూడి వచ్చాయి. అక్కడ ఎంతోమంది శూరులు ఉన్నారు, ఎన్నో రథాలు, ఎన్నో గుర్రాలు ఉన్నాయి. అది అతి విస్తారమైన సైన్యం. సముద్ర తీరంలో ఇసుక రేణువులు ఎన్ని ఉంటాయో అంతమంది ఉన్నట్టున్నారు.

ఈ రాజులంతా మెరోము అనే చిన్న నది దగ్గర సమావేశ మయ్యారు. వారు తమ సైన్యాలను ఒకే చోట చేర్చారు. ఇశ్రాయేలీయుల మీద పోరాడేందుకు వారు ఏర్పాట్లు చేసారు.

అప్పుడు యెహోవా, “ఆ సైన్యాన్ని చూచి భయపడకు. రేపు ఈ వేళకు మీరు ఆ సైన్యాన్ని ఓడించేటట్టు నేను చేస్తాను. వాళ్లందరినీ మీరు చంపేస్తారు. మీరు వారి గుర్రాల కుడికాళ్ల నరాలను నరికివేసి, వారి రథాలను తగులబెట్టేస్తారు” అని యెహోషువతో చెప్పాడు.

యెహోషువ, అతని సర్వసైన్యం శత్రువును ఆశ్చర్యచకితులుగా చేసారు. మెరోము నది వద్ద వారు శత్రువుమీద దాడి చేసారు. ఇశ్రాయేలీయులు వారిని ఓడించేటట్టు చేసాడు యెహోవా. ఇశ్రాయేలీయులు వారిని ఓడించి, మహా సీదోను, మిస్రెపోత్మాయిము, తూర్పున మిస్పాలోయ వరకు వారిని తరిమివేసారు. శత్రువులలో ఒక్కరుకూడ బతకకుండా చచ్చేవరకు ఇశ్రాయేలు సైన్యం పోరాడింది. యెహోషువ ఏమి చేయాలని యెహోవా చెప్పాడో అతడు అలాగే చేసాడు-యెహోషువ వారి గుర్రాల కుడికాళ్ల నరాలను తెగగొట్టి, వారి రథాలను కాల్చివేసాడు.

10 అప్పుడు యెహోషువ వెనుకకు వెళ్లి హసోరు పట్టణాన్ని పట్టుకొన్నాడు. హసోరు రాజును యెహోషువ చంపివేసాడు. (ఇశ్రాయేలీయుల మీద యుద్ధంచేసిన రాజ్యాలన్నింటికీ హసోరు నాయకుడు.) 11 ఆ పట్టణంలో ప్రతి ఒక్కరినీ ఇశ్రాయేలు సైన్యం చంపేసింది. వారు ఆ ప్రజలందరినీ పూర్తిగా నాశనం చేసారు. ప్రాణంతో ఏదీ విడువబడలేదు. అప్పుడు వారు ఆ పట్టణాన్ని కాల్చివేసారు.

12 ఈ పట్టణాలన్నింటినీ యెహోషువ పట్టుకొన్నాడు. వాటి రాజులందరినీ అతడు చంపివేసాడు. ఆ పట్టణాల్లో ఉన్న సమస్తాన్నీ పూర్తిగా యెహోషువ నాశనం చేసాడు. యెహోవా సేవకుడు మోషే ఆజ్ఞాపించినట్టే అతడు ఇలా చేసాడు. 13 కానీ వారి కొండలమీద కట్టబడిన పట్టణాలలోని ఒక్కటికూడ ఇశ్రాయేలు సైన్యం కాల్చివేయలేదు. వారు కాల్చివేసిన కొండ మీద పట్టణం హజోరు మాత్రమే. ఇది యెహోషువ కాల్చిన పట్టణం. 14 ఈ పట్టణాల్లో దొరికిన వాటన్నింటినీ ఇశ్రాయేలు ప్రజలు వారికోసమే ఉంచుకొన్నారు. ఆ పట్టణంలోని జంతువులన్నింటినీ వారే ఉంచుకొన్నారు. కానీ అక్కడ ప్రజలను అందరినీ చంపివేసారు. మనుష్యులు ఎవరినీ వారు బ్రతకనివ్వలేదు. 15 ఇలా చేయుమని చాలకాలం క్రితమే యెహోవా మోషేకు ఆజ్ఞాపించాడు. ఇలా చేయుమని మోషే యెహోషువకు ఆజ్ఞాపించియున్నాడు. కనుక యెహోషువ దేవునికి విధేయుడయ్యాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తాన్ని యెహోషువ జరిగించాడు.

16 కనుక ఈ దేశం అంతటిలో ఉన్న ప్రజలందరినీ యెహోషువ ఓడించాడు. కొండదేశం, నెగెవు ప్రాంతం, గోషెను ప్రాంతం అంతాను, పడమటి కొండల దిగువ ప్రాంతం, అరాబా ప్రాంతం, ఇశ్రాయేలు పర్వతాలు, వాటి దగ్గర్లో ఉన్న కొండలు అన్నింటిమీదా అతడు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. 17 శేయీరు దగ్గర హాలాకు కొండ నుండి హెర్మోను కొండ దిగువన లెబానోను లోయలో బయల్గాదు వరకు ఉన్న దేశం అంతా యెహోషువ స్వాధీనంలో ఉంది. ఆ దేశంలోని రాజులందరినీ యెహోషువ పట్టుకొని చంపివేసాడు. 18 యెహోషువ ఆ రాజులతో చాల సంవత్సారాలు యుద్ధం చేసాడు. 19 ఆ దేశం మొత్తంలో ఒక్క పట్టణం మాత్రమే ఇశ్రాయేలీయులతో శాంతి ఒడంబడిక చేసుకొంది. గిబియోనులో నివసిస్తున్న హివ్వీ ప్రజలే వారు. మిగతా పట్టణాలన్నీ యుద్ధంలో ఓడించబడ్డాయి. 20 ఆ ప్రజలు తాము చాలా బలంగల వాళ్లమని అనుకోవాలనే యెహోవా కోరాడు. అప్పుడే వారు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేస్తారు. ఈ విధంగా ఆయన వారిని నిర్దాక్షిణ్యంగా నాశనం చేయనిచ్చాడు. మోషే ఏమిచేయాలని యెహోవా ఆజ్ఞాపించాడో అలాగే ఆయన వారిని నాశనం చేయబడనిచ్చాడు.

21 హెబ్రోను, దెబీరు, అనాబు, యూదా ప్రాంతాల్లోను, కొండదేశంలోను అనాకీ ప్రజలు[b] నివసించారు. ఈ అనాకీ ప్రజలతో యెహోషువ యుద్ధం చేసాడు. ఆ ప్రజలందరినీ, వారి పట్టణాలను యెహోషువ పూర్తిగా నాశనం చేసాడు. 22 ఇశ్రాయేలు దేశంలో అనాకీ ప్రజలు ఎవ్వరూ ప్రాణంతో మిగుల లేదు. మిగిలిన అనాకీ ప్రజలు గాజా, గాతు, అష్డోదులలో నివసించారు. 23 ఇశ్రాయేలు దేశం అంతటినీ యెహోషువ స్వాధీనం చేసుకొన్నాడు. చాలా కాలం క్రిందట యెహోవా మోషేకు చెప్పింది ఇదే. యెహోవా వాగ్దానం చేసినందువల్ల ఆయన ఆ దేశాన్నీ ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. యెహోషువ ఆ దేశాన్ని ఇశ్రాయేలు వంశాలకు పంచిపెట్టాడు. అప్పుడు యుద్ధం ముగిసింది. చివరికి దేశంలో శాంతి నెలకొంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International