Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 3-4

బాషాను ప్రజలతో యుద్ధం

“మనం మళ్లుకొని బాషాను మార్గంలో వెళ్లాము. బాషాను రాజు ఓగు, అతని ప్రజలందరు ఎద్రేయి దగ్గర మనతో యుద్ధం చేయటానికి వచ్చారు. ‘ఓగును నేను మీకు అప్పగించాలని నిర్ణయించాను గనుక అతని గూర్బి భయపడవద్దు. అతని మనుష్యులందరిని, అతని దేశాన్ని నేను మీకు యిస్తాను. హెష్బోనులో ఏలుబడి చేసిన అమోరీ రాజు సీహోనుకు చేసినట్టే, అతన్ని కూడ మీరు ఓడిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు.

“కనుక బాషానురాజు ఓగును, అతని మనుష్యులందరిని మన యెహోవా దేవుడు మనకు అప్పగించాడు. అతని మనుష్యులు ఎవరూ మిగుల కుండా మనం అతన్ని ఓడించాము. తర్వాత అప్పట్లో ఓగుకు చెందిన పట్టణాలన్నింటినీ మనం స్వాధీనం చేసుకొన్నాము. ఓగు ప్రజల పట్టణాలు అన్నింటినీ, బాషానులో ఓగు రాజ్యమైన అర్గోబు ప్రాంతం అంతటిలో 60 పట్టణాలను మనం స్వాధీనం చేసుకొన్నాము. ఎత్తయిన గోడలు, బలమైన కడ్డీలుగల గేట్లతో ఈ పట్టణాలు చాలా బలమైనవి. మరియు గోడలులేని పట్టణాలు కూడా చాలా ఉన్నాయి. హెష్బోను రాజైన సీహోను పట్ణణాలకు మనం చేసినట్టే వీటినికూడా మనం నాశనం చేసాము. ప్రతి పట్టణాన్ని, వాటిలోని ప్రజలందరిని స్త్రీలు, పిల్లలను సహా మనం సమూలంగా నాశనం చేసాము. అయితే ఆ పట్టణాల్లోని పశువులన్నింటినీ, విలువైన వస్తువులను మనకోసం ఉంచుకొన్నాము.

“ఈ విధంగా, అమోరీ ప్రజల ఇద్దరు రాజుల వద్దనుండి దేశాన్ని మన స్వాధీనం చేసుకొన్నాం. ఈ దేశాలు యొర్దాను నదికి తూర్పు వైపున ఉన్నాయి. అర్నోను లోయనుండి హెర్మోను పర్వతంవరకు ఉంది ఈ దేశం. (హెర్మోను కొండను సీదోనీ ప్రజలు షిర్యోను అనీ, అమోరీలు శేనీరు అని పిలుస్తారు) 10 బాషాను అంతటిని సాలెకానుండి, ఎద్రేయివరకు, గిలాదు పీఠభూమిలోని పట్టణాలన్నింటినీ మనం మన స్వాధీనం చేసుకొన్నాం. సల్కా ఎద్రేయి బాషానులోని ఓగు రాజ్యంలో పట్టణాలు.”

11 (ఇంకా జీవించి ఉన్న కొద్దిమంది రెఫాయిము ప్రజల్లో బాషాను రాజు ఓగు ఒక్కడే. ఓగు మంచం ఇనుప మంచం. దాని పొడవు 13 అడుగులు, వెడల్పు 6 అడుగలు. అమ్మోనీ ప్రజలు నివసించే రబ్బా పట్టణంలో ఆ మంచం యింకా ఉంది.)

యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం

12 “ఆ సమయంలో ఈ దేశాన్ని మన స్వంతం చేసుకొన్నాము. అర్నోను లోయ ప్రక్కగా అరోయేరు దేశాన్ని, గిలాదు కొండ దేశంలో సగం, వాటి పట్టణాలతోసహా రూబేను వంశంవారికి, గాదు వంశంవారికి నేను ఇచ్చాను. 13 గిలాదులో మిగతా సగం, బాషాను అంతా మనష్షే వంశంవారిలో సగం మందికి నేను ఇచ్చాను.”

(బాషాను ఓగు రాజ్యం. బాషానులో కొంత భాగం అర్గోబు అని పిలువబడింది. బాషాను ప్రాంతం రెఫాయిము దేశం అనికూడ పిలువబడింది). 14 గెషూరు, మయకాతీతు ప్రజల సరిహద్దువరకు గల మొత్తం అర్గోబు ప్రదేశం అంతా మనష్షే వంశీయుడైన యాయీరు పట్టుకొన్నాడు. ఈ ప్రాంతానికి యాయీరు తన స్వంత పేరు పెట్టుకొన్నాడు. హవ్వీత్‌యాయీరు అని పేరు పెట్టాడు. (నేటికీ ఆ ప్రాంతం బాషాను యాయీరు పట్టణాలు అని పిలువ బడుతుంది).

15 “గిలాదును నేను మాకీరుకు ఇచ్చాను. 16 మరియు రూబేను వంశానికి, గాదు వంశానికి గిలాదు వద్ద ప్రారంభం అవుతున్న దేశాన్ని నేను ఇచ్చాను. ఈ దేశం అర్నోను లోయనుండి యబ్బోకు నదివరకు ఉంది. (లోయ మధ్య భాగం ఒక సరిహద్దు. యబ్బోకు నది అమ్మోనీ ప్రజలకు సరిహద్దు) 17 పడమటి దిక్కున అరాబాలోని యొర్దాను నది వారి ప్రాంతానికి సరిహద్దు. ఈ ప్రాంతానికి ఉత్తరాన కిన్నెరెతు సరస్సు, దక్షిణాన అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) ఉన్నాయి. తూర్పున అది పిస్గా కొండచరియల క్రింద ఉంది.

18 “ఆ సమయంలో ఆ వంశాలకు నేను ఈ ఆజ్ఞయిచ్చాను: ‘మీరు నివసించడానికి యొర్దాను నదికి యివతలి ప్రక్క దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు యిచ్చాడు. అయితే యిప్పుడు మీ యుద్ధ వీరులు వారి ఆయుధాలు చేతపట్టి మిగతా ఇశ్రాయేలు వంశాలను నది దాటించాలి. 19 మీ భార్యలు, మీ చిన్నపిల్లలు, మీ పశువులు (మీకు పశువులు చాలా ఉన్నాయని నాకు తెలుసు) నేను మీకు యిచ్చిన ఈ పట్టణాల్లో యిక్కడ ఉండాలి. 20 అయితే మీ బంధువులైన ఇశ్రాయేలీయులకు యొర్దాను నదికి అవతల ప్రక్క యెహోవా యిస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకొనేంతవరకు మీరు వారికి సహాయం చేయాలి. ఇక్కడ మీకు శాంతి ఉన్నట్టుగానే అక్కడ వారికి యెహోవా శాంతి నిచ్చేంతవరకు వారికి సహాయం చేయండి. అప్పుడు నేను మీకు ఇచ్చిన ఈ దేశానికి మీరు తిరిగి రావచ్చును.’

21 “అప్పుడు యెహోషువతో నేను యిలా చెప్పాను: ‘మీ దేవుడైన యెహోవా ఈ ఇద్దరు రాజులకూ చేసిన వాటన్నింటినీ నీవు చూశావు. నీవు ప్రవేశించే రాజ్యాలన్నింటికీ యెహోవా అలాగే చేస్తాడు. 22 మీ దేవుడైన యెహోవా మీ పక్షంగా పోరాడుతాడు గనుక ఈ దేశాల రాజులకు నీవు భయపడవద్దు.’

మోషే కనానులో ప్రవేశించలేకపోవటం

23 “ఆ సమయంలో నేను యెహోవాను బ్రతిమలాడి, యిలా చెప్పాను, 24 ‘యెహోవా, నా ప్రభువా నేను నీ సేవకుడిని. నీవు చేసే ఆశ్చర్యకరమైన, శక్తివంతమైన విషయాలలో కొద్ది భాగం మాత్రమే నీవు నాకు చూపించావు అని నాకు తెలుసు. నీవు చేసిన శక్తివంతమైన మహత్కార్యాలను చేయగల దేవుడు ఆకాశంలో గాని భూమి మీదగాని లేడు. 25 యొర్దాను నదికి అవతల ప్రక్క ఉన్న ఆ మంచి దేశాన్ని, సౌందర్యవంతమైన ఆ కొండ దేశాన్ని, లెబానోనును చూడటానికి నన్ను అవతలకు దాటి వెళ్లనియ్యి అని నేను నీకు మనవి చేస్తున్నాను.’

26 “కానీ మీ మూలంగా యెహోవా నామీద కోపగించాడు. ఆయన నా మాట వినడానికి తిరస్కరించాడు. యెహోవా నాతో చెప్పాడు, ‘నీకు ఇది చాలు. ఈ విషయం నాతో యింకా చెప్పవద్దు. 27 పిస్గా కొండ శిఖరం మీదికి వెళ్లు. పడమర, ఉత్తరం, తూర్పు, దక్షిణం చూడు. నీవు నీ కళ్లతో చూడవచ్చు గాని నీవు మాత్రం ఎన్నటికీ యొర్దాను నది దాటి వెళ్లజాలవు. 28 నీవు తప్పక యెహోషువకు హెచ్చరికలు యివ్వాలి. అతణ్ణి ప్రోత్సహించి, బలపర్చు. ఎందుకంటే ప్రజలను యెహోషువ యొర్దాను నది దాటిస్తాడు. దేశాన్ని స్వాధీనం చేసుకొని దానిలో నివసించేందుకు యెహోషువ వారిని నడిపిస్తాడు. ఈ దేశాన్నే నీవు చూస్తావు.’

29 “అందుచేత మేము బేత్పెయోరు అవతలివైపు లోయలో నిలిచిపోయాము.

దేవుని ఆదేశాలు పాటించమని మోషే ప్రజలను హెచ్చరించటం

“ఇక, ఇశ్రాయేలీయులారా, నేను మీకు ప్రబోధించే చట్టాలు, ఆజ్ఞలు వినండి. వాటికి విధేయులవ్వండి. అప్పుడు మీరు బతికి, మీ పూర్వీకుల దేవుడైన యెహోనా మీకు ఇస్తున్న దేశంలో ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకోగలుగుతారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటికి మీరేమీ అదనంగా చేర్చకూడదు. అందులో నుంచి మీరేవీ తీసివేయకూడదు. నేను మీకు ఇచ్చిన మీ యెహోవా దేవుని ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి.

“బయల్ పెయోరు వద్ద యెహోవా చేసింది మీరు చూశారు. అక్కడ బయలును[a] వెంబడించిన వాళ్లందరిని మీ దేవుడైన యెహోవా నాశనం చేసాడు. అయితే మీ దేవుడైన యెహోవా వైపు నిలిచి ఉన్న మీరంతా ఈనాడు బతికి ఉన్నారు.

“చూడండి, నా దేవుడైన యెహోవా నాకు ఆజ్ఞాపించిన చట్టాలు, నియమాలు నేను మీకు ప్రబోధించాను. మీరు ఏ దేశంలోనైతే ప్రవేశించి, దానిని మీ స్వంతం చేసుకో బోతున్నారో ఆ దేశంలో మీరు ఈ చట్టాలకు విధేయులు కావాలని వాటిని నేను మీకు ప్రబోధించాను. ఈ ఆజ్ఞలకు జాగ్రత్తగా లోబడండి. మీకు జ్ఞానం, తెలివి ఉన్నట్టు యితర రాజ్యాల ప్రజలకు యిది తెలియజేస్తుంది. ఆ దేశాల ప్రజలు ఈ ఆజ్ఞలను విన్నప్పుడు ‘నిజంగా ఈ గొప్ప రాజ్య ప్రజలు (ఇశ్రాయేలీయులు) జ్ఞానులు, తెలివి గలవారు’ అని చెబుతారు.

“మనం దేవునికి మొర్రపెట్టినప్పుడు మన దేవుడైన యెహోవా మనకు సమీపంగా ఉన్నట్టు, మరి ఏ జాతికీ అంత సమీపంగా ఉండే ఏ దేవుడు లేడు. ఈనాడు నేను మీ ఎదుట ఉంచిన ప్రబోధాలంతటి మంచి ఆజ్ఞలు, నియమాలు కలిగి ఉండేందుకు ఏ జాతికూడ అంత గొప్పది కాదు. కానీ మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసిన సంగతులను మీరు బ్రతికి ఉన్నంతకాలం మరచి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ పిల్లలకు, మీ పిల్లలపిల్లలకు మీరు ఈ సంగతులను ప్రబోధించాలి. 10 హోరేబు కొండ దగ్గర మీరు మీ దోవుడైన యెహోవా యెదుట నిలిచిన రోజును జ్ఞాపకం చేసుకోండి. ‘నేను చెప్పే సంగతులు వినడానికి ప్రజలందరినీ సమావేశపర్చు. అప్పుడు భూమి మీద వారు జీవించినంతకాలం వారు గౌరవించటం నేర్చుకొంటారు. మరియు వారు ఈ సంగతులను వారి పిల్లలకు ప్రబోధిస్తారు’ అని యెహోవా నాతో చెప్పాడు. 11 మీరు దగ్గరకు వచ్చి కొండ దిగువ నిలబడ్డారు. ఆకాశంవరకు ఎగసిన అగ్నితో ఆ కొండ మండింది. దట్టమైన కారుమబ్బులు, కటిక చీకటి. 12 అప్పుడు అగ్నిలోనుండి యెహోవా మీతో మాట్లాడాడు. ఎవరో మాట్లాడుతున్న స్వరం మీరు విన్నారు కాని, ఏ ఆకారాన్నీ మీరు చూడలేదు. స్వరం మాత్రమే వినబడింది. 13 యెహోవా తన ఒడంబడికను మీతో చెప్పాడు. పది ఆజ్ఞలను ఆయన మీతో చెప్పి, వాటిని పాటించ మని మీకు ఆజ్ఞాపించాడు. ఆ ఒడంబడిక ఆజ్ఞలను ఆయన రెండు రాతి పలకలమీద రాసాడు. 14 ఆ సమయంలో నేను మీకు ఆజ్ఞలను, నియమాలను ప్రబోధించాలనికూడ యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. మీరు స్వాధీనం చేసుకొని, నివసించబోతున్న దేశంలో మీరు పాటించాల్సిన చట్టాలు ఇవి.

15 “హోరేబు (సీనాయి) కొండమీద ఆగ్నిలో నుండి యెహోవా మీతో మాట్లాడిన రోజున భౌతిక మైన ఎలాంటి రూపంతోను మీరు ఆయనను చూడలేదు. దేవునికి ఆకారం లేదు. 16 కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రాణి రూపంలోనైనా ఒక ప్రతిమను లేక విగ్రహాన్ని చేసుకోవడం ద్వారా పాపంచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు. పురుషునివలె లేక స్త్రీవలె కనబడే విగ్రహాన్ని చేయవద్దు. 17 భూమిమీద జంతువులా కనబడే విగ్రహాన్నిగాని, ఆకాశంలో ఎగిరే పక్షిలాంటి విగ్రహంగాని చేయవద్దు. 18 నేలమీద ప్రాకే దేనివలెగాని, సముద్రపు చేపవలెగాని కనబడే ఏ విగ్రహం చేయవద్దు, 19 మరియు మీరు పైన ఆకాశంలోనికి చూచినప్పుడు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆకాశంలో మీకు కనిపించే వాటన్నింటిని చూచినప్పుడు జాగ్రత్తగా ఉండండి. వాటిని పూజించి, సేవించాలనే శోధన మీకు కలుగకుండా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ ప్రపంచంలో ఆ పనులు ఇతరులు చేస్తే చేసుకోనిచ్చాడు మీ దేవుడైన యెహోవా. 20 ఆయితే మీరు ఆయన ప్రజలు, యెహోవా మిమ్మును ఉజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చాడు. ఈజిప్టు ఇనుప కొలిమిలాంటిది. ఇప్పుడు మీరు ఉన్నట్టుగా, మిమ్మును ఆయన తన స్వంత ప్రజలుగా చేసేందుకు ఆయన మిమ్మును బయటకు తీసుకొని వచ్చాడు.

21 “మీ మూలంగా యెహోవా నా మీద కొపగించాడు. ఆయన ఒక ప్రత్యేక ప్రమాణం చేసాడు. నేను యొర్దాను నది దాటి అవతలికి వెళ్లకూడదు. మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఆ మంచి దేశంలోనికి నేను వెళ్లజాలనని ఆయన నాతో చెప్పాడు. 22 కనుక నేను యిక్కడ ఈ దేశంలోనే చావాలి. నేను యొర్దాను నది దాటి వెళ్లలేను. కానీ మీరు మాత్రం త్వరలోనే దాటి వెళ్లి, మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని స్వాధీనం చేసుకొంటారు. 23 మీ దేవుడైన యెహోవా మీతో చేసిన ఒడంబడికను మీరు మరచి పోకుండా ఆ కొత్త దేశంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేయకూడదని మీ యెహోవా దేవుడు మీతో చెప్పిన ఏ రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయకూడదు. 24 ఎందుకంటే మీ దేవుడైన యెహోవా తన ప్రజలు ఇతర దేవుళ్లను పూజించడం అసహ్యించుకొంటాడు. పైగా యెహోవా నాశనం చేసే అగ్నిలా ఉండగలడు.

25 “మీరు ఆ దేశంలో చాలాకాలం జీవించిన తర్వాత, మీకు పిల్లలు, పిల్లల పిల్లలు కలుగుతారు. మీరు ముసలి వాళ్లవుతారు. అప్పుడు మారిపొయి మీ జీవితాన్ని పాడు చేసుకొనవద్దు. దేని రూపంలోనూ ఒక విగ్రహాన్ని చేయవద్దు. అలాగు యెహోవాకు విరుద్ధరగా కీడు చేస్తే, అది ఆయనకు కోపం పుట్టిస్తుంది. 26 ఆ కీడు మీరు జరిగిస్తే, ఇలా జరుగుతుందని నేడు ఆకాశం భూమి మీమీద సాక్షులుగా ఉంటారు; త్వరలోనే మీరు ఆ దేశంలో ఉండకుండాపోతారు. ఆ దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు ఇప్పుడు మీరు యొర్దాను నది దాటుతున్నారు. కానీ అక్కడ మీరు ఎక్కువ కాలం జీవించరు. మీరు సర్వనాశనం అవుతారు. 27 దేశదేశాలకు యెహోవా మిమ్మల్ని చెదరగొడతాడు. యెహోవా మిమ్మల్ని పంపించే ఆ దేశాల్లో జీవించేందుకు మీరు కొద్దమంది మాత్రమే ఉంటారు. 28 మనుష్యులు చేసిన దేవుళ్లను చెక్కతో రాయితో చేయబడి, కానలేని, వినలేని, తినలేని, వాసన చూడలేని దేవుళ్లను అక్కడ మీరు సేవిస్తారు. 29 అయితే అక్కడ, ఆ ఇతర దేశాల్లో మీరు మీ దేవుడైన యెహోవా కోసం చూస్తారు. మీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో మీరు ఆయన కోసం చూస్తే, మీరు ఆయనను కనుగొంటారు. 30 మీరు కష్టంలో ఉన్నప్పుడు – ఆ సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు – మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు. 31 మీ దేవుడైన యెహోవా కృపగల దేవుడు ఆయన మిమ్మల్ని విడిచి పెట్టడు. ఆయన మిమ్మల్ని నాశనం చేయడు. మీ పూర్వీకులకు ఆయన వాగ్దానం చేసిన ఒడంబడికను ఆయన మరచిపోడు.

దేవుడు చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఆలోచించండి

32 “ఇంతకు పూర్వం యింత గొప్పది ఏమైనా జరిగిందా? ఎన్నడూ లేదు. గతాన్ని చూడండి, మీరు పుట్టక ముందు జరిగిన వాటన్నింటినీ గూర్చి ఆలోచించండి. భూమిమీద దేవుడు మనిషిని సృజించిన అనాది కాలానికి వెళ్లండి. ప్రపంచంలో ఎక్కడేగాని, ఎన్నడేగాని, జరిగిన వాటన్నింటినీ చూడండి. ఇంతటి గొప్ప విషయాన్ని గూర్చి ఎన్నడైనా ఎవరైనా విన్నారా? లేదు. 33 దేవుడు అగ్నిలోనుండి మీతో మాట్లాడగా మీరు వినికూడ యింకా బ్రతికే ఉన్నారు. అలా యింకెవరికైనా ఎన్నడైనా జరిగిందా? లేదు. 34 మరియు ఎప్పుడైనా, ఏ దేవుడైనా మరో దేశంలో నుండి తనకోసం ఒక ప్రజను తీసుకొనేందుకు ప్రయత్నించాడా? లేదు. కానీ మీ యెహోవా దేవుడు అద్భుత కార్యాలను చేయటం మీ మట్టుకు మీరే చూశారు. ఆయన తన శక్తిని, బలాన్ని మీకు చూపించాడు. ప్రజలను పరీక్షించిన కష్టాలను మీరు చూశారు. అద్భుతాలు మహాత్యాలు మీరు చూశారు. సంభవించిన యుద్ధాలు, భయంకర విషయాలు మీరు చూశారు. 35 ఆయనే దేవుడు అని మీరు తెలుసుకొనేందుకు ఈ సంగతులను యెహోవా మీకు చూపించాడు. ఆయనలాంటి దేవుడు ఇంకొకడు ఎవరూ లేరు. 36 యెహోవా మీకు ఒక పాఠం ప్రబోధించేందుకు పరలోకంనుండి ఆయన తన స్వరాన్ని మిమ్మల్ని విననిచ్చాడు. భూమి మీద ఆయన తన మహా అగ్నిని మిమ్మల్ని చూడనిచ్చి, దానిలోనుండి ఆయన మీతో మాట్లాడాడు.

37 “యెహోవా మీ వూర్వీకులను ప్రేమించాడు. అందుకే వారి సంతతివారైన మిమ్మల్ని ఆయన ఏర్పర చుకొన్నాడు. మరియు అందుకే ఆయన మిమ్మల్ని ఈజిప్టునుండి బయటకు రప్పించాడు. ఆయన మీతో ఉండి తన మహా శక్తితో మిమ్మల్ని బయటకు తీసుకొని వచ్చాడు. 38 మీరు ముందుకు సాగినప్పుడు, మీ ముందు బలమైన గొప్ప రాజులను యెహోవా బలవంతంగా వెళ్లగొట్టాడు. అయితే వారి దేశంలోనికి యెహోవా మిమ్మల్ని తీసుకొని వచ్చాడు. మీరు నివసించేందుకు వారి దేశాన్ని ఆయన మీకు యిచ్చాడు. పైగా నేటికీ ఈ దేశం యింకా మీదే.

39 “అందుచేత నేడు మీరు జ్ఞాపకం చేసుకొని, యెహోవా దేవుడని అంగీకరించాలి. పైన ఆకాశంలోను, క్రింద భూమి మీదను ఆయనే దేవుడు. ఇంక వేరే ఏ దేవుడూ లేడు. 40 మరియు ఈ వేళ నేను మీకు యిచ్చే ఆయన చట్టాలు, ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి. అప్పుడు మీకూ, మీ తర్వాత జీవించే పిల్లలకు అంతా శుభం అవుతుంది. శాశ్వతంగా మీ దేశంగా ఉండేందుకు మీ దేవుడైన యెహోవా మీకు యిస్తున్న ఈ దేశంలో మీరు దీర్ఘకాలం జీవిస్తారు.”

భద్రతా పట్టణాలను మోషే ఏర్పాటు చేయటం

41 అప్పుడు యొర్దాను నదికి తూర్పున మూడు పట్టణాలను మోషే ఏర్పాటు చేసాడు. 42 ప్రమాదవ శాత్తూ ఒక వ్యక్తి మరో వ్యక్తిని చంపేస్తే, ఆ వ్యక్తి ఈ మూడు పట్టణాల్లో ఒకదానికి పారిపోయి క్షేమంగా ఉండొచ్చు. అతడు చంపేసిన మనిషిని అతడు ద్వేషించలేదు, అతణ్ణి చంపాలని అనుకొలేదు అంటే, అతడు ఈ పట్టణాల్లో ఒకదానికి వెళ్లి, మరణ శిక్షలేకుండా ఉండవచ్చు. 43 మోషే ఏర్పాటు చేసిన ఈ మూడు పట్టణాలు ఏవంటేః రూబేను ప్రజలకోసం అరణ్యపు పీఠభూముల్లోని బేసెరు; గాదు ప్రజలకోసం గిలాదులోని రామోతు, మనష్షే ప్రజలకోసం బాషానులోని గోలాను.

మోషే ధర్మశాస్త్రానికి పీఠిక

44 ఇశ్రాయేలు ప్రజలకు దేవుని ధర్మశాస్త్రాన్ని మోషే యిచ్చాడు. 45 ఆ ప్రజలు ఈజిప్టునుండి బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రబోధాలు, ఆజ్ఞలు, నియమాలు మోషే వారికి యిచ్చాడు.

46 యొర్దాను నదికి తూర్పు వైపున వారు ఉన్నప్పుడు బేత్‌పయోరు అవతల లోయలో మోషే వారికి ఈ ఆజ్ఞలు యిచ్చాడు. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోను దేశంలో అప్పుడు వారు ఉన్నారు. (వారు ఉజిప్టునుండి బయటకు వచ్చినప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలూ సీహోనును ఓడించారు. 47 వారికోసం ఉంచుకొనేందుకు వారు సీహోను దేశాన్ని స్వాధీనం చేసుకొన్నారు. బాషాను రాజైన ఓగు దేశాన్ని కూడ వారు స్వాధీనం చేసుకొన్నారు. ఈ యిద్దరు అమోరీ రాజులు యొర్దాను నది తూర్పువైపున నివసించారు. 48 అర్నోను లోయను ఆనుకొనివున్న అరోయేరు పట్టణం నుండి, హెర్మోను కొండ అనబడిన సిరియోను[b] కొండవరకు ఉంది ఈ దేశం. 49 యొర్దాను నదికి తూర్పునవున్న యొర్దాను లోయ ప్రదేశం అంతా ఈ దేశంలోనే ఉంది. దక్షిణాన మృత సముద్రాన్ని, తూర్పున పిస్గా కొండ చరియను తాకుతుంది ఈ దేశం.)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International