Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ద్వితీయోపదేశకాండము 8-10

యెహోవాను జ్ఞాపకం చేసుకోండి

“ఈ వేళ నేను మీకు యిచ్చే ఆజ్ఞలు అన్నింటినీ మీరు విని, విధేయులు కావాలి. అప్పుడు మీరు జీవిస్తారు. మీరు యింకా యింకా అనేకమందిగా పెరిగి పోతారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసిన దేశంలో మీరు ప్రవేశించి, జీవిస్తారు. ఈ 40 సంవత్సరాలు మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని అరణ్యంలో నడిపించిన ఈ ప్రయాణం మొత్తం మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. మిమ్మల్ని ఆయన దీనులుగా చేయాలి అనుకొన్నాడు. మీరు ఆయన ఆజ్ఞలకు విధేయులవుతున్నారో లేదో, మీ హృదయంలోని సంగతి ఆయన తెలుసుకోవాలి అనుకొన్నాడు. యెహోవా మిమ్మల్ని అణచి వేసి, ఆకలితో ఉండనిచ్చాడు. తర్వాత మీ పూర్వీకులు ఎన్నడూ చూడని, మీకు యింతకు ముందు తెలియని మన్నాతో[a] మిమ్మల్ని ఆయన పోషించాడు. యెహోవా ఎందుకు ఈ సంగతులు జరిగించాడు? ఎందుకంటే మనుష్యుల్ని ఆహరం మాత్రమే బ్రతికించదు అని మీరు తెలుసుకోవాలని ఆయన కోరాడు గనుక. మనుష్యులు యెహోవా నోటనుండి వచ్చే ప్రతి మాటవలన బద్రుకుతారు. గడచిన ఈ 40 సంవత్సరాల్లో మీ బట్టలు చినిగిపోలేదు. మరియు మీ పాదాలు వాచిపోకుండ యెహోవా మిమ్మల్ని కాపాడాడు. ఒక తండ్రి తన కుమారునికి ప్రబోధం చేసినట్టే. మీకు ప్రబోధంచేసి, మిమ్మును సరిదిద్దేందుకే మీ దేవుడైన యెహోవా ఈ సంగతులన్నీ జరిగించాడని మీరు తెలుసుకోవాలి.

“మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నింటికీ మీరు విధేయులు కావాలి. ఆయన మార్గాలలో నడుచుకొని, ఆయనను గౌరవించాలి. నదులు, నీటి మడుగులు ఉండి, కొండల్లో, లోయల్లో నీటి ఊటలు ప్రవహించే మంచి దేశంలోనికి మీ దేవుడైన యెహోవా మిమ్మును తీసుకొని వస్తున్నాడు. అది గోధుమ, యవలు, ద్రాక్షాతోటలు, అంజూరపు చెట్లు, దానిమ్మ చెట్లతో నిండిన దేశం. ఒలీవ నూనె, తేనెగల దేశం అది. అక్కడ మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు ఏమీ లేకుండా ఉండరు. ఆ దేశంలో మీరు ఆ కొండలు తవ్వి రాళ్లు, యినుము, రాగి తీయవచ్చును. 10 మీరు తినాలని ఆశించేవి అన్నీ మీకు దొరుకుతాయి. అప్పుడు మీకు ఆయన యిచ్చిన మంచి దేశం కోసం మీరు మీ దేవుడైన యెహోవాను స్తుతిస్తారు.

యెహోవా చేసినదాన్ని మరచిపోకండి

11 “జాగ్రత్తగా ఉండండి మీ దేవుడైన యెహోవాను మరచిపోవద్దు. ఈ వేళ నేను మీకు ఇస్తున్న ఆజ్ఞలు. చట్టాలు, నియమాలు జాగ్రత్తగా పాటించండి. 12 మీరు తినేందుకు ఆహారం సమృద్ధిగా మీకు ఉంటుంది, మీరు మంచి యిళ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తారు. 13 మీ పశువులు, మందలు విస్తారంగా పెరుగుతాయి. మీకు మరింత ఎక్కువ వెండి బంగారం ఉంటుంది. మీకు విస్తారంగా వస్తుసామగ్రి ఉంటుంది. 14 అలా జరిగి నప్పుడు మీరు గర్వించకుండా జాగ్రత్తగా ఉండాలి. మీ దేవుడైన యెహోవాను మీరు మరచిపోకూడదు. మీరు బానిసలుగా ఉన్న ఈజిప్టు దేశంనుండి ఆయనే మిమ్మల్ని బయటికి తీసుకొని వచ్చాడు. 15 భయంకర మైన మహాగొప్ప అరణ్యంలో మిమ్మల్ని యెహోవా నడిపించాడు. ఆ అరణ్యంలో విషసర్పాలు, తేళ్లు ఉండినవి. నేల ఎండిపోయి, ఎక్కడా నీళ్లు లేవు. కానీ యెహోవా మీకు బండలో నుండి నీళ్లు ఇచ్చాడు. 16 మీ పూర్వీకులు ఎన్నడూ ఎరుగని మన్నాతో ఆయన మిమ్మల్ని అరణ్యంలో పోషించాడు. యెహోవా మిమ్మల్ని పరీక్షించాడు. ఎందుకంటే యెహోవా మిమ్మల్ని దీనులుగా చేయాలను కొన్నాడు. అంతంలో మీకు అంతా మంచి జరగాలని ఆయన కోరాడు. 17 ‘ఈ ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను’ అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు. 18 మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఐశ్వర్యం సంపాదించుకొనేందుకు శక్తిని యిచ్చేవాడు ఆయనే అని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవా ఎందుకు ఇలా చేస్తాడు? ఎందుకంటే మీ పూర్వీకులతో ఆయన చేసిన ఒడంబడికను ఈ వేళ ఆయన నిలబెట్టుకొంటున్నాడు గనుక.

19 “ఎన్నటికీ మీ దేవుడైన యెహోవాను మరువకండి. ఇతర దేవుళ్లను పూజించి సేవించేందుకు ఎన్నడూ వాటిని అనుసరించవద్దు. మీరు అలా గనుక చేస్తే, ఈ వేళే నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను; నిశ్చయంగా మీరు నాశనం చేయబడతారు. 20 దేశాలను మీరు నాశనం చేసేటట్టు యెహోవా చేసాడు. మీ ఎదుట దేశాలను యెహోవా నాశనం చేస్తున్నట్టుగానే మీరూ నాశనం చేయబడతారు. మీ దేవుడైన యెహోవాకు మీరు విధేయులు కాలేదు గనుక ఇలా జరుగుతుంది.

యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు

“ఇశ్రాయేలు ప్రజలారా, వినండి, ఈ వేళ మీరు యొర్దాను నది దాటుతారు. మీకంటె బలంగల ఆ గొప్ప రాజ్యాలను బయటకు వెళ్లగొట్టేందుకు మీరు ఆ దేశంలో ప్రవేశిస్తారు. వారి పట్టణాలు చాలా పెద్దవి, వాటి గోడలు ఆకాశమంత ఎత్తున్నాయి. అక్కడి ప్రజలు ఎత్తయిన వాళ్లు, బలం ఉన్నవాళ్లు. వారు అనాకీయ ప్రజలు. ఆ ప్రజలను గూర్చి మీకు తెలుసు. ‘అనాకీయ ప్రజల మీద ఎవడూ గెలవలేడు’ అని మన గూఢచారులు చెప్పటం మీరు విన్నారు. అయితే మీ దేవుడైన యెహోవా నాశనం చేసే అగ్నిలా మీకు ముందర ఆ నదిని దాటుతాడని మీరు ధైర్యంగా ఉండొచ్చు. ఆ దేశాలను యెహోవా నాశనం చేస్తాడు. వాళ్లు మీ ముందు పతనమయ్యేలా ఆయన చేస్తాడు. ఆ దేశస్తులను మీరు బయటకు వెళ్లగొట్టేస్తారు. త్వరగా మీరు వారిని నాశనం చేస్తారు. ఇలా జరుగుతుందని యెహోవా మీకు వాగ్దానం చేసాడు.

“ఆ రాజ్యాల వాళ్లను మీనుండి మీ దేవుడైన యెహోవా బయటకు వెళ్లగొట్టిన తర్వాత ‘మా స్వంత నీతి జీవితాల మూలంగానే ఈ దేశంలో జీవించేందుకు యెహోవా మమ్మల్ని తీసుకొనివచ్చాడు’ అని మీలో మీరు అనుకోవద్దు. ఆ రాజ్యాలవాళ్లను మీనుండి యెహోవా వెళ్లగొట్టాడు, ఎందుకంటే వారు జీవించిన చెడు మార్గంవల్లనే. మీరు వాళ్ల దేశాన్ని స్వాధీనం చేసుకొనేందుకు అందులో ప్రవేశిస్తున్నారంటే మీరేదో మంచివాళ్లు, నీతిగా బతుకుతున్నారు అని కాదు. వాళ్లు చెడుమార్గాలలో జీవించడంవల్లనే మీ దేవుడైన యెహోవా వాళ్లను బయటకు వెళ్లగొడుతున్నాడు, మీరు లోనికి వెళ్తున్నారు. మరియు మీ పూర్వీకులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు యెహోవా చేసిన వాగ్దానం నెరవేరాలని ఆయన కోరుచున్నాడు. మీరు నివసించేందుకు ఆ మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు.

యెహోవా కోపాన్ని జ్ఞాపకం చేసుకోండి

“అరణ్యంలో మీరు మీ దేవుడైన యెహోవాకు కోపం పుట్టించారని మరచిపోవద్దు. మీరు ఈజిప్టు దేశంనుండి బయటకు వెళ్లిన రోజునుండి ఈ చోటికి వచ్చిన ఈ రోజువరకు మీరు యెహోవాకు లోబడుటకు నిరాకరించారు. ఇంకా హొరేబు కొండ దగ్గర కూడ మీరు యెహోవాకు కోపం పుట్టించారు. మిమ్మల్ని నాశనం చేయాల్సినంత కోపం వచ్చింది యెహోవకు. రాతి పలకలను స్వీకరించటానికి నేను కొండమీదికి వెళ్లినప్పుడు (యెహోవా మీతో చేసిన ఒడంబడిక పలకలు) 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను కొండమీదనే ఉన్నాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. 10 అప్పుడు ఆ రాతి పలకలను యెహోవా నాకు యిచ్చాడు. ఆ పలకలమీద యెహోవా తన వ్రేలితో వ్రాసాడు. మీరు ఆ కొండ దగ్గర సమావేశమై నప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పినవి అన్ని ఆయన రాసాడు.

11 “కనుక 40 పగళ్లు 40 రాత్రుళ్లు ఆయిపోగానే, ఒడంబడిక రాతి పలకలు రెండింటిని యెహోవా నాకు ఇచ్చాడు. 12 అప్పుడు ‘లేచి త్వరగా ఇక్కడనుండి క్రిందికి వెళ్లు. ఈజిప్టు నుండి నీవు బయటకు తీసుకొనివచ్చిన ప్రజలు వారిని వారే నాశనం చేసుకొన్నారు. నేను వారికి ఆజ్ఞాపించిన విషయాల నుండి త్వరగా వారు తిరిగిపోయారు. వారు బంగారం కరిగించి వారికోసం ఒక విగ్రహం చేసుకొన్నారు’ అని యెహోవా నాతో ఇలా చెప్పాడు.

13 “ఇంకా యెహోవా నాతో ఇలా చెప్పాడు: ‘ఈ ప్రజలను నేను గమనించాను. వాళ్లు చాలా మొండివాళ్లు. 14 వారి పేర్లనుకూడ ఎన్నటికీ ఎవ్వరూ జ్ఞాపకం చేసుకోకుండా నేను వాళ్లను పూర్తిగా నాశనం చేసేస్తాను. తరువాత ఇశ్రాయేలు ప్రజలుకంటె ఎక్కువ బలం గల యింకా గొప్ప ప్రజలను నీనుండి నేను కలుగ జేస్తాను.’

బంగారు దూడ

15 “అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి క్రిందికి వచ్చాను. ఆ కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి. 16 నేను చూసినప్పుడు కరిగించిన బంగారంతో మీరు మీకోసం ఒక దూడను చేసుకొని, మీ దేవుడైన యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేయటం గుర్తించాను. యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గం నుండి మీరు త్వరగా తిరిగిపోయారు. 17 అందుచేత నేను ఆ రెండు రాతి పలకలు తీసుకొని నేలకేసి కొట్టాను. అక్కడ మీ కళ్లముందు ఆ పలకలను నేను ముక్కలుగా విరుగగొట్టేసాను. 18 అప్పుడు నేను మొదటిసారిలాగ 40 పగళ్లు, 40 రాత్రుళ్లు యెహోవా యెదుట నేలమీద సాష్టాంగ పడ్డాను. నేను భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. మీరు అంత ఘోరంగా పాపం చేసారు గనుక నేను యిలా చేసాను. యెహోవా దృష్టికి అపవిత్రమైనది చేసి మీరు ఆయనకు కోపం పుట్టించారు. 19 యెహోవా భయంకర కోపానికి నేను భయపడి పోయాను. మిమ్మల్ని నాశనం చేసేటంత కోపం మీమీద ఆయనకు కలిగింది. కానీ మరోసారి యెహోవా నా మాట విన్నాడు. 20 అహరోనును నాశనం చేసివేయాలన్నంత కోపం వచ్చింది యెహోవాకు. కనుక ఆ సమయంలో అహరోను కోసం కూడా నేను ప్రార్థించాను. 21 మీరు చేసిన ఆ బంగారు దూడను నేను తీసుకొని దానిని అగ్నితో కాల్చివేసాను. నేను దాన్ని చిన్న ముక్కలుగా చేసాను. ఆ దూడ ముక్కలను ధూళిగా నేను చితకగొట్టాను. తర్వాత ఆ కొండనుండి ప్రవహించే నదిలో ఆ ధూళిని పారవేసాను.

ఇశ్రాయేలీయులను క్షమించమని మోషే దేవుణ్ణి అడగటం

22 “మరియు మీరు తబేరావద్ద, మస్సావద్ద, కిబ్రోత్ హత్తావాలో యెహోవాకు కోపం పుట్టించారు. 23 మీరు కాదేషు బర్నేయానుండి వెళ్లిపోండి అని యెహోవా చెప్పినప్పుడు మీరు విధేయులు కాలేదు. ‘మీరు వేళ్లి నేను మీకు యిచ్చిన దేశంలో నివసించండి’ అని ఆయన చెప్పాడు. కానీ మీరు మీ దేవుడైన యెహోవాకు విధేయులు కాలేదు. మీరు ఆయనను నమ్మలేదు. మీరు ఆయన ఆజ్ఞను వినలేదు. 24 నేను మిమ్మల్ని ఎరిగినప్పటినుండియు మీరు యెహోవాకు విధేయలయ్యేందుకు నిరాకరిస్తున్నారు.

25 “కనుక నేను యెహోవా ఎదుట 40 పగళ్లు 40 రాత్రుళ్లు సాష్టాంగపడ్డాను. ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేస్తానని యెహోవా చేప్పాడు గనుక. 26 నేను యెహోవాకు ప్రార్థన చేసాను. నేను ఇలా చెప్పాను, ‘యెహోవా దేవా, నీ ప్రజలను నాశనం చేయవద్దు. వాళ్లు నీకు చెందినవాళ్లు. నీవే నీ మహాబలం, శక్తి ప్రయోగించి వారిని విడుదల చేసి ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు. 27 నీ సేవకులు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు నీవు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకో. ఈ ప్రజలు ఎంత మొండివారో అది మరచిపో. వారి చెడు మార్గాలను గాని వారి పాపంగాని చూడకు. 28 నీ ప్రజలను నీవు శిక్షిస్తే “యెహోవా తన ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశంలోనికి ఆయన వారిని తీసుకొని వెళ్లలేకపోయాడు, ఆయన వాళ్లను ద్వేషించాడు, కనుక వాళ్లను చంపివేయడానికి అరణ్యంలోనికి తీసుకు వెళ్లాడు” అని ఈజిప్టువాళ్లు అంటారేమో. 29 ఆయితే యెహోవా, వాళ్లు నీ ప్రజలు, వాళ్లు నీకు చేందిన వాళ్లు. నీ మహాగొప్ప శక్తి, బలంతో నీవే వాళ్లను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చావు.’

కొత్త రాతి పలకలు

10 “ఆసమయంలో యెహోవా నాతో యిలా చెప్పాడు: ‘మొదటి పలకల్లాంటివే రెండు పలకలు రాతితో నీవు చెక్కాలి. అప్పుడు నీవు కొండ ఎక్కి నా దగ్గరకు రావాలి. అలాగే వీటి కోసం ఒక చెక్క పెట్టెకూడా చేయాలి. నీవు పగులగొట్టిన మొదటి పలకల మీద ఉన్న మాటలనే ఆ రాతి పలకలమీద నేను వ్రాస్తాను. అప్పుడు నీవు కొత్త పలకలను ఆ పెట్టెలో పెట్టాలి.’

“కనుక నేను తుమ్మ కర్రతో ఒక పెట్టె చేసాను. మొదటి రెండు పలకల్లాంటివే మరి రెండు పలకలు రాతినుండి నేను తొలిచాను. అప్పుడు నేను కొండ మీదికి వెళ్లాను. ఆ రెండు రాతి పలకలు నా చేతిలో ఉన్నాయి. అప్పుడు యెహోవా యింతకు ముందు ఆ పలకల మీద వ్రాసిన ఆ మాటలనే, అంటే ఆ కొండ దగ్గర మీరు సమావేశమైనప్పుడు అగ్నిలోనుండి ఆయన మీతో చెప్పిన ఆ పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసాడు. అప్పుడు యెహోవా ఆ రాతి పలకలను నాకు ఇచ్చాడు. నేను వెనక్కు తిరిగి, కొండ దిగి వచ్చేసాను. ఆ పలకలను నేను చేసిన పెట్టెలో ఉంచాను. వాటిని అందులో పెట్టుమని నాకు యెహోవా ఆజ్ఞాపించాడు. ఇప్పటికీ ఆ పలకలు ఆ పెట్టెలోనే ఉన్నాయి.”

(ఇశ్రాయేలు ప్రజలు యహకాను ప్రజల బావుల దగ్గరనుండి ప్రయాణం చేసి మోసేరుకు వచ్చారు. అక్కడ అహరోను చనిపోయి, పాతిపెట్టబడ్డాడు. అహరోను కుమారుడు ఎలీయాజరు అహరోను స్థానంలో యాజకుడయ్యాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మోసేరునుండి గుద్గోదకు వెళ్లారు. మరియు వారు గుద్గోదనుండి నదులుగల యొత్బాతా దేశం వెళ్లారు. ఆ సమయంలోనే యెహోవా తన ప్రత్యేక పని నిమిత్తం, లేవీ వంశాన్ని యితర వంశాలనుండి వేరు చేసాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను[b] మోయాల్సిన పని వారిది. యెహోవా ఆలయంలో యాజకులుగా కూడా వారు సహాయం చేసారు. మరియు యెహోవా నామమున ప్రజలను ఆశీర్వాదించాల్సిన పనికూడా వారికి ఉంది. ఈ ప్రత్యేక పని వారు నేటికీ చేస్తున్నారు. అందువల్లనే యితర వంశాలవలె లేవీ వంశం దేశంలో భాగం పొందలేదు. యెహోవాయే లేవీయులకు భాగం. మీ దేవుడైన యెహోవా వారికి వాగ్దానం చేసింది అదే.)

10 “మొదటిసారిలాగే, 40 పగళ్లు 40 రాత్రుళ్లు నేను ఆ కొండమీద ఉండిపోయాను. ఆ సమయంలో యెహోవా నా మాట కూడా విన్నాడు. యెహోవా మిమ్మల్ని నాశనం చేయకూడదని తీర్మానించాడు. 11 యెహోవా ‘వెళ్లి ప్రజలను వారి ప్రయాణంలో నడిపించు. వారు వెళ్లి, వారికి ఇస్తానని వారి పూర్వీకులకు నేను వాగ్దానం చేసిన దేశంలో నివసిస్తారు’” అని నాతో చెప్పాడు.

నిజంగా యెహోవా కోరేది

12 “ఇశ్రాయేలు ప్రజలారా ఇప్పుడు వినండి. మీరు చేయాలని మీ దేవుడైన యెహోవా కోరేది ఇదే: మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయన మీతో చెప్పినవన్నీ చేయండి. మీ నిండు హృదయంతో, మీ నిండు ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి, సేవించండి. 13 ఈ వేళ నేను మీకు చెబుతున్న యెహోవా చట్టాలను, ఆజ్ఞలను పాటించండి. ఈ చట్టాలు, ఆజ్ఞలు మీ మంచికోసమే.

14 “సర్వం మీ దేవుడైన యెహోవాకే చెందుతుంది. ఆకాశం, మహా ఎత్తయిన ఆకాశం సహా యెహోవాదే. భూమి, దానిమీద ఉన్న సమస్తం మీ దేవుడైన యెహోవాదే. 15 మీ పూర్వీకులను యెహోవా ఎంతో ప్రేమించాడు. వారి సంతతివారై మిమ్మల్ని ఆయన ప్రజలుగా ఉండేందుకు ఏర్పరచుకొనే అంతగా ఆయన వారిని ప్రేమించాడు. మరి ఏ ఇతర ప్రజలు కాకుండ మిమ్మల్నే ఆయన ఎన్నుకొన్నాడు. మీరు నేటికీ ఆయన ఏర్పరచుకొన్న ప్రజలే.

16 “మీరు మీ మొండి వైఖరి విడిచిపెట్టి, మీ హృదయాలను. యెహోవాకు ఇవ్వాలి. 17 ఎందుకంటే యెహోవా మీ దేవుడు గనుక. ఆయన దేవుళ్లకు దేవుడు. ప్రభువులకు ప్రభువు. ఆయనే మహా దేవుడు. ఆయన అద్భుతమైన మహా శక్తిగల పరాక్రమశాలి. యెహోవాకు ప్రతి మనిషీ సమానమే. ఆయన లంచం తీసుకోడు. 18 తల్లిదండ్రులు లేని పిల్లలకు ఆయన సహాయం చేస్తాడు. విధవలకు ఆయన సహాయం చేస్తాడు. మన దేశంలో ఉండే విధేశీయులను కూడా ఆయన ప్రేమిస్తాడు. ఆయన వారికి భోజనం, బట్టలు యిస్తాడు. 19 అందుచేత ఆ విదేశీయులను మీరుకూడా ప్రేమించాలి. ఎందుకంటే మీ మట్టుకు మీరే ఈజిప్టు దేశంలో విదేశీయులు గనుక.

20 “మీరు మీ దేవుడైన యెహోవాను గౌరవించి, ఆయనను మాత్రమే ఆరాధించాలి. ఎన్నడూ ఆయనను విడువవద్దు. మీరు ప్రమాణాలు చేసేటప్పుడు మీరు ఆయన పేరు మాత్రమే ఉపయోగించాలి. 21 మీరు స్తుతించవలసినది యెహోవాను మాత్రమే. ఆయన మీ దేవుడు. ఆయన మీకోసం అద్భుతమైన గొప్ప కార్యాలు చేసాడు. మీరు ఈ కార్యాలను మీ కళ్లారా చూసారు. 22 మీ పూర్వికులు ఈజిప్టులోనికి వెళ్లినప్పుడు వారు 70 మంది మాత్రమే. ఇప్పుడు మిమ్మల్ని ఎంతో మందిగా, ఆకాశ నక్షత్రాలు ఎన్నో అంతమందిగా మీ దేవుడైన యెహోవా చేసాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International