Print Page Options
Previous Prev Day Next DayNext

Chronological

Read the Bible in the chronological order in which its stories and events occurred.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యెహోషువ 12-15

ఇశ్రాయేలీయులచే ఓడింపబడిన రాజులు

12 యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలు స్వాధీనం చేసుకొన్నారు. అర్నోను లోయనుండి హెర్మోను కొండవరకు, అరాబాకు తూర్పు ప్రాంతాన గల భూమి అంతా ఇప్పుడు వారిదే. ఈ భూమిని స్వాధీనం చేసుకొనేందుకు ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:

హెష్బోను పట్టణంలో నివసిస్తున్న అమోరీ ప్రజల రాజు సీహోను, అర్నోను లోయవద్ద అరోయేరు నుండి యబ్బోకు నదివరకుగల దేశం అంతా అతడు పాలించాడు. ఆ లోయ మధ్యనుండి అతడి దేశంమొదలవుతుంది. అమ్మోనీ ప్రజలకు, వారికి ఇది సరిహద్దు. గిలాదులోని సగం భూమిని సీహోను పాలించాడు. అరాబా తూర్పు ప్రాంతంలో కిన్నెరెతు సముద్రంనుండి అరాబా సముద్రం (ఉప్పు సముద్రం) వరకు అతడు పాలించాడు. బెత్ ఎషిమోతు నుండి దక్షిణాన పిస్గా కొండల వరకు అతడు పాలించాడు.

బాషాను రాజు ఓగు రెఫాయిము సంతతివాడు. అష్టారోతు, ఎద్రేయిలో ఓగు దేశాన్ని పాలించాడు. హెర్మోను కొండ, సలెకా, బాషాను ప్రాంతం అంతా ఓగు పాలించాడు. గెషూరు, మాక ప్రజలు నివసించిన చోట అతని దేశం సరిహద్దు. గిలాదులో సగం భూభాగాన్ని కూడ ఓగు పాలించాడు. హెష్బోను రాజు సీహోను భూమికి ఈ భూమి సరిహద్దు.

యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు ఈ రాజులందరినీ ఓడించారు. మరియు ఆ భూమిని రూబేను వంశం, గాదు వంశం మనష్షే వంశంలో సగం భాగానికి మోషే ఇచ్చాడు. ఈ భూమిని వారికి స్వంతంగా ఇచ్చేసాడు మోషే.

యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న దేశంలోని రాజులందరినీ కూడ ఇశ్రాయేలు ప్రజలు ఓడించారు. ఈ దేశంలో ప్రజలను యెహోషువ నడిపించాడు. ఈ దేశాన్ని యెహోషువ ప్రజలకు ఇచ్చి, పన్నెండు వంశాల వారికి దీనిని పంచిపెట్టాడు. ఇది వారికి ఇస్తానని దేవునిచే వాగ్దానం చేయబడిన దేశం లెబానోను లోయలోని బయెల్‌గాదుకు శేయీరు దగ్గర హాలాకు కొండకు మధ్య ఉంది ఈ భూమి. కొండ దేశం, పశ్చిమాన పడమటి కొండ దిగువ, అరాబా, పర్వతాలు, ఎడారి, నెగెవు దీనిలో ఉన్నాయి. హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసించిన దేశం ఇది. ఇశ్రాయేలు ప్రజలు ఓడించిన రాజుల జాబితా ఇది:

యెరికో రాజు.

బేతేలు దగ్గరనున్న హాయి రాజు.

10 యెరూషలేము రాజు.

హెబ్రోను రాజు.

11 యార్ముతు రాజు.

లాకీషు రాజు.

12 ఎగ్లోను రాజు.

గెజెరు రాజు.

13 దెబీరు రాజు.

గెదెరు రాజు.

14 హోర్మా రాజు.

అరాదు రాజు.

15 లిబ్నా రాజు.

అదుల్లాం రాజు.

16 మక్కెద రాజు.

బేతేలు రాజు.

17 తపువ రాజు.

హెపెరు రాజు.

18 అఫెకు రాజు.

లాషారోను రాజు.

19 మదోను రాజు.

హిజోరు రాజు.

20 షిమ్రోన్ మెరోన్ రాజు.

అక్షపు రాజు.

21 తానాకు రాజు.

మెగిద్దో రాజు.

22 కెదెషు రాజు.

కర్మెలులోని యొకెనం రాజు.

23 దోరు పర్వతంలో దోరు రాజు.

గిల్గాలులోని గోయిం రాజు.

24 తిర్సా రాజు.

మొత్తం రాజులు 31 (ముఫ్పై ఒకటి).

ఇంకా స్వాధీన పరచుకొనని భూమి

13 యెహోషువ చాల ముసలివాడైనప్పుడు యెహోవా అతనితో చెప్పాడు: “యెహోషువా, నీవు ముసలివాడవై పోయావు. కానీ నీవు స్వాధీనం చేసుకోవాల్సిన భూమి ఇంకా చాలా ఉంది. ఫిలిష్తీయుల దేశాన్ని, గెషూరు దేశాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. ఈజిప్టు దగ్గర షీహోరు నది[a] నుండి ఉత్తరాన ఎక్రోను సరిహద్దు వరకు గల ప్రాంతాన్ని నీవు ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అది కనానీ ప్రజలకు చెందినది. గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోనుల ఐదుగురు ఫిలిష్తీ నాయకులను ఇంకా నీవు జయించాలి. నీవు అవ్వీతీ ప్రజలను, కనాను దేశానికి దక్షిణాన ఉన్న వారిని కూడ నీవు ఓడించాలి. గెబాలీ ప్రజల ప్రాంతాన్ని నీవు ఇంకా ఓడించలేదు. హెర్మోను కొండ దిగువన బయెల్‌గాదుకు తూర్పున లిబోహ-మాత్ వరకు గల లెబానోను ప్రాంతం కూడ ఉంది.

“లెబానోనునుండి మిశ్రేఫోత్మాయిము వరకు గల కొండ దేశంలో సీదోను ప్రజలు నివసిస్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజల కోసం ఈ ప్రజలందరినీ నేను బయటకు వెళ్లగొట్టేస్తాను. ఇశ్రాయేలు ప్రజలకు నీవు భూమిని పంచి పెట్టేటప్పుడు ఈ భూమిని తప్పక జ్ఞాపకం ఉంచుకో. నేను నీకు చెప్పినట్టు ఇలానే చేయి. ఇప్పుడు తొమ్మిది వంశాలు, మనష్షే సగం వంశం వారికి ఈ భూమిని విభజించు.”

భూమిని పంచటం

మనష్షే వంశంలో మిగిలిన సగం మందికి ఇదివరకే నేను భూమి ఇచ్చాను. రూబేను వంశం వారికి, గాదు వంశం వారికి నేను ఇదివరకే భూమిని ఇచ్చాను. యొర్దాను నది తూర్పున యెహోవా సేవకుడు మోషే వారికి భూమిని ఇచ్చాడు. యొర్దాను నది తూర్పున మోషే వారికి ఇచ్చిన భూమి ఇదే: దీబోను వరకు గల మేదెబా మైదాన ప్రాంతం అంతా ఇందులో ఉంది. అర్నోను లోయదగ్గర అరోయేరు వద్ద ఈ భూమి మొదలవుతుంది, ఆ లోయ మధ్యలోగల పట్టణం వరకు ఆ భూమి విస్తరించి ఉంది. 10 అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన పట్టణాలన్నీ ఆ దేశంలో ఉన్నాయి. రాజు హెష్బోను పట్టణంలో ఉండి పాలించాడు. అమోరీ ప్రజలు నివసించిన ప్రాంతం వరకు ఈ దేశం విస్తరించింది. 11 గిలాదు పట్టణం కూడ ఆ దేశంలో ఉంది. గెషూరు, మాయకా ప్రజలు నివసించిన ప్రాంతంకూడ ఆ దేశంలో ఉంది. హెర్మోను పర్వతం అంతా, సల్కావరకు బాషాను అంతా ఆ దేశంలో ఉంది. 12 ఓగు రాజు రాజ్యమంతా ఆ దేశంలో ఉంది. ఓగు రాజు బాషానులో పాలించాడు. గతంలో అతడు అష్టారోతు, ఎద్రేయీలో పాలించాడు. ఓగు రెఫాయిము ప్రజలనుండి వచ్చినవాడు. గతంలో మోషే ఆ ప్రజలను ఓడించి, వారి దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు. 13 గెషూరు, మయకా ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు బలవంతంగా బయటకు వెళ్లగొట్టలేదు. నేటికీ ఆ ప్రజలు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తున్నారు.

14 లేవీ వంశం ఒక్కటే భూమి ఏమీ లభించని కుటుంబం. దానికి బదులుగా, ఇశ్రాయేలీయుల యెహోవా దేవునికి దహన బలులుగా అర్పించబడిన జంతువులన్నీ లేవీ కుటుంబంవారు తీసుకుంటారు. అదే యెహోవా వారికి వాగ్దానం చేసింది.

15 రూబేను వంశంలో ప్రతి వంశంవారికీ మోషే కొంత భూమి ఇచ్చాడు. వారికి దొరికిన భూమి ఇది: 16 అర్నోను లోయదగ్గర అరోయేరునుండి మేదెబా పట్టణంవరకు గల భూమి. ఆ లోయ మధ్యలో ఉన్న పట్టణం, మైదానం మొత్తం ఇందులో ఉంది. 17 హెష్బోను వరకు ఉంది ఈ భూమి. మైదానంలోని పట్టణాలన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఆ పట్టణాలు దీబోను, బామోత్‌బయలు, బేత్‌బయల్మెయోను, 18 యహజ్, కెదెమోతు, మేఫాతు, 19 కిర్యతాయిము, సిబ్మా లోయలోని కొండమీది యెరెత్ షహిరు, 20 బెత్పెయోరు, పిస్గాకొండలు, బెత్ యెషిమోత్. 21 కనుక మైదానంలోని అన్ని పట్టణాలు, అమోరీ ప్రజల రాజు సీహోను పాలించిన ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. ఆ రాజు హెష్బోను పట్టణం దగ్గర పాలించాడు. అయితే అతణ్ణి, మిద్యాను ప్రజానాయకులను మోషే ఓడించాడు. ఆ నాయకులు ఎవి, రెకెము, సూర్, హోరు, రెబా. (ఈ నాయకులంతా సీహోనుతో చేయి కలిపి పోరాడారు) ఈ నాయకులంతా ఆ దేశంలోనే నివసించారు. 22 బెయోరువాడైన బిలామును ఇశ్రాయేలు ప్రజలు చంపారు. (బిలాము భవిష్యత్తును గూర్చి చెప్పేందుకు మంత్రాలు వేసేవాడు) ఆ పోరాటంలో ఇశ్రాయేలు ప్రజలు చాలమందిని చంపేసారు. 23 రూబేనుకు ఇచ్చిన భూమికి యొర్దాను నదీ తీరం సరిహద్దు. కనుక రూబేను వంశం వారికి ఇవ్వబడిన భూమిలో ఈ పట్టణాలు, పొలాలు అన్నీ చేర్చబడ్డాయి.

24 గాదు వంశం వారికి మోషే ఇచ్చిన భూమి ఇది. ప్రతి ఒక్క వంశానికీ ఈ భూమిని మోషే ఇచ్చాడు.

25 యాజెరు భూమి, గిలాదు పట్టణాలు అన్నీ రబ్బాతు దగ్గర అరోయేరు వరకూ గల అమ్మోనీ ప్రజల భూమిలో సగం మోషే వారికి ఇచ్చాడు. 26 హెష్బోను నుండి రామత్ మిస్పా, బెటోనీము వరకూ గల భూమి ఇందులో ఉంది. మహనయిము నుండి దెబీరువరకు గల ప్రాంతం అంతా ఈ భూమిలో ఉంది. 27 బేతారాము, బెత్‌నిమ్రా, సుక్కోతు, సఫోనులోయ ఈ భూమిలో ఉన్నవే. హెష్బోను రాజు సీహోను పాలించిన మిగిలిన భూమి అంతా ఇందులో ఉంది. ఇది యొర్దాను నదికి తూర్పున ఉన్న భూమి. కిన్నెరతు సముద్రం చివరివరకు ఈ భూమి విస్తరించి ఉంది. 28 ఈ భూమి అంతా గాదు వంశానికి మోషే ఇచ్చినది. ఈ జాబితాలో చేర్చబడిన పట్టణాలు అన్నీ ఈ భూమిలో ఉన్నాయి. ఒక్కోవంశానికి ఆ భూమిని మోషే ఇచ్చాడు.

29 మనష్షే వంశంలో సగం మందికి మోషే ఇచ్చిన భూమి ఇదే. మనష్షే వంశంలోని సగం వంశాలు ఈ భూమిని తీసుకున్నాయి.

30 ఆ భూమి మహనయిము దగ్గర మొదలవుతుంది. బాషాను అంతా, బాషాను రాజు ఓగు పాలించిన దేశం అంతా, బాషానులోని యాయీరు పట్టణాలన్నీ ఆ భూమిలో ఉన్నాయి. (అవి మొత్తం 60 పట్టణాలు) 31 గిలాదులో సగం, అష్టారోతు, ఎద్రేయి కూడ ఆ భూమిలో ఉన్నాయి. (గిలాదు, అష్టారోతు, ఎద్రేయి ఓగు రాజు నివసించిన పట్టణాలు) ఈ భూమి అంతా మనష్షే కుమారుడు మాకీరు కుటుంబానికి ఇవ్వబడింది. ఆ కుమారులు అందరిలో సగం మందికి ఈ భూమి దొరికింది.

32 మోయాబు మైదానాల్లో ఈ వంశాలకు ఈ భూమి అంతటినీ మోషే ఇచ్చాడు. ఇది యెరికోకు తూర్పున యొర్దాను నది అవతల ఉంది. 33 అయితే లేవీ వంశం వారికి మోషే భూమి ఏమీ ఇవ్వలేదు. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుడు సాక్షాత్తు ఆయనే లేవీ వంశం వారి పరంగా ఉంటానని వాగ్దానం చేసాడు.

14 యాజకుడైన ఎలియాజరు, నూను కూమారుడైన యెహోషువ, ఇశ్రాయేలు వంశాలు అన్నింటీ నాయకులు కలిసి ప్రజలకు ఏ భూమి ఇవ్వాలి అనే విషయం నిర్ణయం చేసారు. ప్రజలు ఏ విధంగా వారి భూమిని నిర్ణయించుకోవాల్సిందీ చాలకాలం క్రితమే మోషేకు యెహోవా ఆజ్ఞాపించాడు. తొమ్మిదిన్నర వంశాల వారు ఎవరికి ఏ భూమి అనే విషయం నిర్ణయించేందుకు చీట్లు వేసారు. రెండున్నర వంశాల వారికి యొర్దాను నదికి తూర్పున వారి భూమి వారికి మోషే ఇదివరకే ఇచ్చాడు. అయితే మిగతా ప్రజల్లా లేవీ వంశానికి మాత్రం భూమి ఏమీ ఇవ్వబడలేడు. (పన్నెండు వంశాలకు వారి స్వంత భూమి ఇవ్వబడింది) యోసేపు కుమారులు మనష్షే, ఎఫ్రాయిము రెండు వంశాలుగా విభజించబడ్డారు. (మరియు ఒక్కో వంశానికి కొంత భూమి దొరికింది) కానీ లేవీ వంశపు ప్రజలకు భూమి ఏమీ ఇవ్వబడలేదు. వారు నివసించేందుకు కొన్ని పట్టణాలు మాత్రం ఇవ్వబడ్డాయి. (ఈ పట్టణాలు ప్రతి వంశంవారి భూమిలోనూ ఉన్నాయి.) వారి జంతువులకోసం వారికి పొలాలు కూడ ఇవ్వబడ్డాయి. ఇశ్రాయేలు వంశాలకు భూమిని ఇచ్చే విధానం మోషేకు యెహోవా చెప్పాడు. ఇశ్రాయేలు ప్రజలు యెహోవా ఆజ్ఞాపించినట్టే భూమిని పంచుకొన్నారు.

కాలేబు తన భూమిని పొందటం

ఒకరోజు యూదా వంశపు మనుష్యులు కొందరు గిల్గాలులో యెహోషువ దగ్గరకు వెళ్లారు. కెనెజీవాడైన యెపున్నె కుమారుడు కాలేబు వారిలో ఒకడు. కాలేబు యెహోషువతో చెప్పాడు, “కాదేషు బర్నేయలో యెహోవా చెప్పిన సంగతులు నీకు జ్ఞాపకమే. యెహోవా తన సేవకుడు[b] మోషేతో మాట్లాడుతూ నిన్ను, నన్ను గూర్చి చెప్పాడు. మనం వెళ్లబోతున్న దేశాన్ని చూచి రమ్మని యెహోవా సేవకుడు మోషే నన్ను పంపాడు. అప్పుడు నా వయస్సు 40 సంవత్సరాలు. నేను తిరిగి వచ్చినప్పుడు ఆ దేశాన్ని గూర్చిన నా అభిప్రాయం నేను మోషేతో చెప్పాను. అయితే నాతోబాటు వెళ్లిన ఇతర ప్రజలు భయపెట్టే విషయాలను వారితో చెప్పారు. కానీ నేను మాత్రం ఆ దేశాన్ని యెహోవా మన స్వాధీనం చేస్తాడని నిజంగా నమ్మాను. కనుక ఆ రోజున మోషే నాకు వాగ్దానం చేసాడు: ‘నీవు వెళ్లిన ఆ భూమి నీదే అవుతుంది. శాశ్వతంగా ఆ భూమి నీ పిల్లలకు స్వంతం అవుతుంది. నా దేవుడైన యెహోవాను నీవు నిజంగా విశ్వసించావు గనుక ఆ భూమిని నేను నీకు ఇస్తాను.’

10 “ఇదిగో చూడు, యెహోవా చేస్తానని చెప్పినట్టే, అప్పటినుండి 45 సంవత్సరాలు ఆయన నన్ను బతికించి ఉంచాడు. ఆ సమయంలో మనం అంతా అరణ్యంలో సంచారం చేసాము. ఇదిగో, ఇప్పుడు నా వయస్సు 85 సంవత్సరాలు. 11 మోషే నన్ను బయటకు పంపించిన నాడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడూ అంతే బలంగా ఉన్నాను. అప్పటిలాగే పోరాడేందుకు ఇప్పుడూ నేను సిద్ధంగా ఉన్నాను. 12 కనుక చాలకాలం క్రిందట యెహోవా నాకు వాగ్దానం చేసిన ఆ కొండ చరియను ఇప్పుడు నాకు ఇవ్వు. బలాఢ్యులైన అనాకీ ప్రజలు అక్కడ నివసించినట్టు అప్పట్లో నీవు విన్నావు. మరియు ఆ పట్టణాలు చాల పెద్దవి, మంచి కాపుదలలో ఉన్నవి. కానీ ఇప్పుడు, ఒకవేళ యెహోవా నాతో ఉన్నాడేమో, యెహోవా చెప్పినట్టు నేను ఆ భూమిని తీసుకుంటాను.”

13 యెపున్నె కుమారుడైన కాలేబును యెహోషువ ఆశీర్వదించాడు. యెహోషువ అతనికి హెబ్రోను పట్టణాన్ని స్వంతంగా ఇచ్చాడు. 14 ఇప్పటికీ ఆ హెబ్రోను పట్టణం కెనెజీవాడగు యెపున్నె కుమారుడు కాలేబుకు చెంది ఉంది. ఇశ్రాయేలీయుల యెహోవా దేవుణ్ణి అతడు నమ్ముకొని విధేయుడైనందువల్ల ఇప్పటికీ ఆ భూమి అతని ప్రజలకే చెంది ఉంది. 15 గతంలో ఆ పట్టణం కిర్యత్ అర్బ అని పిలువబడింది. అనాకీ ప్రజల్లోకెల్లా మహా గొప్పవాడైన అర్బ పేరు ఆ పట్టణానికి పెట్టబడింది.

ఆ తర్వాత దేశంలో శాంతి నెలకొంది.

యూదా వంశీయులకు భూమి

15 యూదాకు ఇవ్వబడిన భూమి ఒక్కో కుటుంబానికి పంచబడింది. ఆ భూమి ఎదోము సరిహద్దు వరకు, దక్షిణాన తేమాను చివర సీను అరణ్యం వరకు ఉంది. యూదా భూమికి దక్షిణ సరిహద్దు, మృత సముద్రం దక్షిణ కొనలో మొదలవుతుంది. దాని సరిహద్దు దక్షిణాన తేలు కనుమ వరకు పోయి సీనువరకు కొనసాగింది. దక్షిణాన కాదేషు బర్నేయ వరకు సరిహద్దు విస్తరించింది. హెస్రోను దాటి అద్దారు వరకు సరిహద్దు విస్తరించింది. అద్దారునుండి సరిహద్దు మలుపు తిరిగి కర్క వరకు విస్తరించింది. అస్మోను, ఈజిప్టు ఏరు, మధ్యధరా సముద్రం వరకు సరిహద్దు విస్తరించింది. ఆ భూమి అంతా వారి దక్షిణ సరిహద్దు.

ఉప్పు సముద్రం నుండి, యొర్దాను నది సముద్రంలో పడే ప్రాంతం వరకు తూర్పు సరిహద్దు.

యొర్దాను నది ఉప్పు సముద్రంలో పడే ప్రాంతంలో ఉత్తర సరిహద్దు మొదలవుతుంది. ఉత్తర సరిహద్దు బేత్‌హోగ్లా వరకు విస్తరించి, ఉత్తరాన బేత్ అరాబావరకు కొనసాగింది. ఆ సరిహద్దు బోహను బండవరకు వ్యాపించింది. (రూబేను కుమారుడు బోహను) ఆ తర్వాత ఉత్తర సరిహద్దు ఆకోరు లోయలోనుండి దెబీరు వరకు కొనసాగింది. అక్కడ ఆ సరిహద్దు ఉత్తరానికి, తిరిగి గిల్గాలు వరకు వ్యాపించింది. అదుమ్మీము పర్వతాల మధ్యగా పోయే మార్గం మీద ఉంది గిల్గాలు. అది ఏటికి దక్షిణాన ఉంది. ఎన్‌షెమెషు నీళ్ల వరకు సరిహద్దు వ్యాపించింది. ఎన్‌రోగెలు దగ్గర సరిహద్దు నిలిచిపోయింది. తర్వాత యెబూసు పట్టణానికి దక్షిణాన ఉన్న బెన్‌హిన్నోము లోయగుండా ఆ సరిహద్దు కొనసాగింది. (ఆ యెబూసు పట్టణం పేరు యెరూషలేము) అక్కడ సరిహద్దు కొండ శిఖరం మీదుగా హిన్నోము లోయకు పశ్చిమంగా వెళ్లింది. ఇది రెఫాయిము లోయకు ఉత్తరపు అంచున ఉంది. అక్కడ నుండి ఆ సరిహద్దు నెప్తోయ నీళ్ల ఊటవరకు కొనసాగింది. తర్వాత ఆ సరిహద్దు ఎఫ్రోను కొండ సమీపంలో గల పట్టణాలకు పోయింది. ఆ స్థలంలో ఆ సరిహద్దు మళ్లుకొని బాలాకు పోయింది. (బాలా కిర్యత్ యారీం అనికూడ పిలువబడింది) 10 బాలావద్ద సరిహద్దు పశ్చిమంగా మళ్లుకొని శేయీరు కొండ దేశానికి పోయింది. ఆ సరిహద్దు యారీం కొండకు (కెసలోము అని కూడ పిలువబడింది) ఉత్తర దిశగా కొనసాగి బెత్‌షెమెషు వరకు కొనసాగింది. అక్కడ్నుండి ఆ సరిహద్దు తిమ్నాదాటిపోయింది. 11 అప్పుడు ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరాన ఉన్న కొండకు చేరింది. ఆ చోటనుండి ఆ సరిహద్దు షికెరానుకు మరలి బాలా కొండను దాటిపోయింది. ఆ సరిహద్దు యబ్నేలువరకు కొనసాగి మధ్యధరా సముద్రం దగ్గర ముగిసింది. 12 యూదా దేశానికి పశ్చిమ సరిహద్దు మధ్యధరా సముద్రం. కనుక యూదా దేశం ఈ నాలుగు సరిహద్దుల లోపల ఉంది. యూదా కుటుంబాలు ఈ దేశంలో నివసించాయి.

13 యెపున్నె కుమారుడైన కాలేబుకు యూదా దేశంలో భాగం ఇవ్వాల్సిందిగా యెహోషువను యెహోవా ఆజ్ఞాపించాడు. కనుక దేవుడు ఆజ్ఞాపించిన భూమిని కాలేబుకు యెహోషువ ఇచ్చాడు. హెబ్రోను అనికూడ పిలువబడిన కిర్యత్ అర్బ పట్టణాన్ని యెహోషువ అతనికి ఇచ్చాడు (అనాకు తండ్రి అర్బ) 14 హెబ్రోనులో నివాసం ఉన్న అనాకీ వంశాలు మూడింటిని కాలేబు వెళ్లగొట్టేసాడు. అవి శాషాయి, అహీమాను, తల్మయి వంశాలు. వారు అనాకు కుటుంబంవారు. 15 తర్వాత దెబీరులో నివసిస్తున్న ప్రజల మీద కాలేబు యుద్ధం చేసాడు. (గతంలో దెబీరును కిర్యత్ సెఫెర్ అనికూడ పిలిచేవాళ్లు) 16 “కిర్యత్ సెఫెర్ మీద దాడి చేసి, ఆ పట్టణాన్ని ఓడించే మగవాడెవడో అతడు నా కుమార్తె అక్సాను పెళ్లాడవచ్చు. అతనికి నా కూతుర్ని బహుమానంగా ఇస్తాను” అన్నాడు కాలేబు.

17 కాలేబు సహోదరుడైన కనజు కుమారుడు ఒత్నియేలు ఆ పట్టణాన్ని ఓడించాడు. కనుక కాలేబు తన కుమార్తె అక్సాను ఒత్నియేలుకు భార్యగా ఇచ్చాడు. 18 తన తండ్రి కాలేబు దగ్గర మరికొంత భూమి అడగాలని ఒత్నియేలు అక్సాను[c] కోరాడు. (అక్సా తన తండ్రి దగ్గరకు వెళ్లింది.) ఆమె తన గాడిద మీద నుండి దిగగానే “నీకేం కావాలి?” అని కాలేబు ఆమెను అడిగాడు.

19 “నాకు ఒక ఆశీర్వాదం కావాలి[d] (నీరుగల భూమి నాకు కావాలి). నీవు నాకు నెగెవులో[e] ఇచ్చిన భూమి ఎడారి భూమి. కనుక నీటి ఊటలు గల భూమి నాకు ఇవ్వాలి” అని అక్సా జవాబిచ్చింది. కనుక మెరకలోను పల్లంలోని నీటి ఊటలు గల భూమిని కాలేబు ఆమెకు ఇచ్చాడు.

20 యూదా వంశానికి దేవుడు వాగ్దానం చేసిన భూమి దొరికింది. ఒక్కో కుటుంబానికి ఆ భూమిలో భాగం దొరికింది.

21 నెగెవు దక్షిణాన గల పట్టణాలన్నీ యూదా వంశానికి వచ్చాయి. ఈ పట్టణాలు ఎదోము సరిహద్దు సమీపంగా ఉన్నాయి. ఆ పట్టణాల జాబితా ఇది;

కబ్జీలు, ఎదెరు, యగురు, 22 కీనా, దిమోనా, అదాదా: 23 కెదేషు, హసోరు, ఇత్నాను 24 జీపు, తెలెం, బెయలోత్ 25 హసొర్, హదత్తా, కెరియోతు, హెస్రొను (హసోరు అని కూడ పిలువబడుతుంది) 26 అమాము, షెమ, మొలాదా 27 హసర్‌గద్దా, హెష్మొను, బెత్‌పెలెతు, 28 హసర్‌షువలు, బెయెర్‌షెబ, బిజ్యోత్యా 29 బాలా, ఇయం, ఎజెము, 30 ఎల్తోలద్, కెసిల్, హోర్మ, 31 సిక్లగు, మద్మన్నా, సన్సన్నా, 32 లెబయొతు, ష్హిలిం, అయిన్ మరియు రిమ్మోన్. మొత్తం మీద 29 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి. పడమటి కొండ దిగువల్లోకూడ యూదా వంశం వారికి పట్టణాలు వచ్చాయి.

ఆ పట్టణాల జాబితా ఇది:

33 ఎష్తాయోలు, జొర్యా, అష్నా 34 జానోహ, ఎన్‌గన్నీము, తప్పుయ, ఎనాం 35 యార్ముత్, అదుల్లాము శోకో, అజెకా, 36 షరాయిం, అదితాయిము, మరియు గెదెరా (గెదెరోతాయిము అనికూడ పిలువబడింది) మొత్తం మీద 14 పట్టణాలు, వాటి పొలాలు.

37 యూదా వంశంవారికి ఇవ్వబడిన పట్టణాలు

సెనాము, హదష, మిగ్దల్‌గాదు, 38 దిలాన్, మిస్సే, యొక్తయెలు 39 లాకీషు, బొస్కతు, ఎగ్లోను 40 కబ్బోన్, లహ్మను, కిత్లషు 41 గెదెరొతు, బెత్‌దాగొను నయమా, మరియు మక్కెదా. మొత్తంమీద 16 పట్టణాలు మరియు వాటి పొలాలు.

42 యూదా ప్రజలకు లభించిన ఇతర పట్టణాలు:

లిబ్నా, ఎతెరు, అషను, 43 ఇప్తా, అష్న, నెజిబు 44 కెయిలా, అక్జీబు, మారేషా. మొత్తంమీద 9 పట్టణాలు మరియు వాటి పొలాలు. 45 ఎక్రోను పట్టణం, దాని సమీపంలో గల అన్ని చిన్న పట్టణాలు, పొలాలు యూదా ప్రజలకే దొరికాయి. 46 ఎక్రోనుకు పశ్చిమాన గల ప్రాంతం, అష్డోదుకు సమీపంలో ఉన్న పట్టణాలు, పొలాలు అన్నీ కూడా వారికి లభించాయి. 47 అష్డోదు చుట్టూ ఉన్న ప్రాంతం అంతాను, అక్కడి చిన్న పట్టణాలు యూదా దేశంలో భాగమే. గాజా చుట్టూ ఉన్న ప్రాంతం, పొలాలు, పట్టణాలు కూడా యూదా ప్రజలకే వచ్చాయి. ఈజిప్టు నదివరకు వారి దేశం విస్తరించింది. మరియు వారిదేశం మధ్యధరా సముద్ర తీరం వెంబడి విస్తరించింది.

48 కొండ దేశంలోకూడా యూదా ప్రజలకు పట్టణాలు ఇవ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది:

షామిరు, యత్తిరు, శాకొ, 49 దన్నా, కిర్యత్ సన్నా, (దెబిర్ అనికూడ పిలువబడింది) 50 అనబు, ఎష్తెమో, అనీం 51 గోషెను, హలొను, మరియు గిలో. మొత్తం మీద 11 పట్టణాలు మరియు వాటి పొలాలు.

52 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడ ఇవ్వబడ్డాయి:

అరబు, దూమా, ఎషాను, 53 యనీము, బెత్ తప్పుయా, అఫెకా, 54 హుమతా, కిర్యత్ అర్బ (హెబ్రోను అని కూడ పిలువబడింది) మరియు సీయోరు. 9 పట్టణాలు, వాటి పొలాలు ఉన్నాయి.

55 ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వబడ్డాయి:

మయోను, కర్మెలు, జీపు, యుట్ట, 56 యెజ్రెయేలు, యొకెదియము, జనోవా 57 కయిను, గిబియ మరియు తిమ్నా మొత్తం మీద 10 పట్టణాలు మరియు వాటి పొలాలు.

58 యూదా ప్రజలకు ఈ పట్టణాలు కూడా ఇవ్వ బడ్డాయి:

హల్‌హులు, బెత్‌జూరు, గెదొరు, 59 మారాతు, బెత్‌అనొతు మరియు ఎల్‌తెకొను. మొత్తం మీద అవి 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.

60 రబ్బ, కిర్యత్‌బెతు (కిర్యత్యారీం అనికూడా పిలువ బడుతుంది) రెండు పట్టణాలు కూడ యూద ప్రజలకు ఇవ్వబడ్డాయి.

61 యూదా ప్రజలకు ఎడారి పట్టణాలు యివ్వబడ్డాయి. ఆ పట్టణాల జాబితా ఇది:

బెత్ అరాబా, మిద్దిను, సెకాకా 62 నిబ్షాను, ఉప్పు పట్టణం, మరియు ఎన్‌గేది. మొత్తం మీద 6 పట్టణాలు మరియు వాటి పొలాలు.

63 యెరుషలేములో నివసిస్తున్న యెబూసీ ప్రజలను యూదా సైన్యం బయటకు వెళ్లగొట్ట లేక పోయింది. కనుక యెరుషలేములోని యూదా ప్రజల మధ్య యెబూసీ ప్రజలు నేటికీ ఇంకా నివసిస్తూనే ఉన్నారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International