Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
విలాప వాక్యములు 3:19-26

19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
    నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
    నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
    నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
    నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
    యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
    ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
    అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.

25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
    ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా
    వేచియుండటం క్షేమకరం

విలాప వాక్యములు 1:7-15

యెరూషలేము గతాన్ని తలుస్తూవుంది
యెరూషలేము బాధపడిన దినాలను, నివాసం లేక
    తిరిగిన రోజులను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంది.
ఆమె తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసికొంటూవుంది.
    పాత రోజుల తన అనుభవాలను ఆమె తలపోసుకొంటుంది.
శత్రువు తన ప్రజలను చెరబట్టిన దినాలను ఆమె జ్ఞాపకం చేసికొంటూ ఉంది.
    ఆమెకు కలిగిన నిస్సహాయ పరిస్థితిని ఆమె జ్ఞాపకం చేసికొంటుంది.
ఆమె శత్రువులు ఆమెను చూచి నవ్వారు.
    ఆమె నాశనం చేయబడినందున వారు నవ్వారు.
యెరూషలేము ఘోరంగా పాపం చేసింది.
    యెరూషలేము పాపాల కారణంగా
    ఆమెను చూసిన వారంతా తలలూపే పరిస్థితి వచ్చింది.
ఆమెను గౌరవించిన వారంతా ఇప్పుడామెను అసహ్యించుకుంటున్నారు.
    ఆమెను వారు నగ్నంగా చూశారు,
    గనుక వారామెను అసహ్యించు కుంటున్నారు.
యెరూషలేము మూల్గుతూ ఉంది.
    ఆమె వెనుదిరిగి పోతూవుంది.
యెరూషలేము చీర చెంగులు మురికి అయ్యాయి.
    తనకు జరుగబోయే విషయాలను గూర్చి ఆమె ఆలోచించలేదు.
ఆమె పతనం విస్మయం కలుగజేస్తుంది.
    ఆమెను ఓదార్చటానికి ఆమెకు ఎవ్వరూలేరు.
“ఓ ప్రభూ, నేనెలా బాధపడ్డానో చూడు!
    తనెంత గొప్పవాడినని నా శత్రువు అనుకొంటున్నాడో చూడు!” అని ఆమె అంటూ ఉంది.

10 శత్రువు తన చేతిని చాచాడు.
    అతడామె విలువైన వస్తువులన్నీ తీసికొన్నాడు.
వాస్తవంగా, పరదేశీయులు తన పవిత్ర దేవాలయములో ప్రవేశించటం ఆమె చూసింది.
    ఓ యెహోవా, ఆ ప్రజలు నీ పరిశుద్ధ స్థలాన్ని ప్రవేశించకూడదు! అని నీవు ఆజ్ఞాపించావు.
11 యెరూషలేము ప్రజలంతా ఉస్సురుమంటూ ఉన్నారు.
    ఆమె ప్రజలంతా ఆహారం కొరకు వెదుకుతున్నారు.
ఆహారం కొరకు వారికున్న విలువైన వస్తువులన్నీ ఇచ్చివేస్తున్నారు.
    ఇది వారు తమ ప్రాణాలు నిలుపుకోవటానికి చేస్తున్నారు.
యెరూషలేము ఇలా అంటున్నది: “యెహోవా, ఇటు చూడు; నావైపు చూడు!
    ప్రజలు నన్నెలా అసహ్యించుకొంటున్నారో చూడు.”
12 త్రోవన పోయే ప్రజలారా, మీరు నన్ను లక్ష్యపెట్టినట్లు లేదు.
    కాని నావైపు దృష్టి ప్రసరించి చూడండి.
నా బాధవంటి బాధ మరొక్కటేదైనా ఉందా?
    నాకు సంభవించిన బాధలాంటిది మరేదైనా ఉందా?
యెహోవా నన్ను శిక్షంచిన బాధకు మించిన బాధ మరేదైనా ఉందా?
    ఆయనకు తీవ్రమైన కోపం వచ్చిన రోజున ఆయన నన్ను శిక్షించాడు.
13 యెహోవా పైనుండి అగ్ని కురిపించాడు
    ఆ అగ్ని నా ఎముకలకంటింది.
ఆయన నా కాళ్లకు వలపన్నాడు.
    ఆయన నన్ను అన్ని వైపులకు తిప్పాడు.
ఆయన నన్ను ఒక బీడు భూమిలా మార్చాడు.
    నేను రోజంతా అస్వస్థతగా ఉన్నాను.

14 “కాడివలె నా పాపాలు కట్టబడ్డాయి.
    యెహోవా చేతుల్లో నా పాపాలు మూటగట్టబడ్డాయి.
యెహోవా కాడి నా మెడ మీద ఉంది.
    యెహోవా నన్ను బలహీన పర్చాడు.
నేను ఎదిరించలేని ప్రజలకు
    యెహోవా నన్ను అప్పజెప్పాడు.
15 బలమైన నా సైనికులందరినీ యెహోవా తిరస్కరించాడు.
ఆ సైనికులంతా నగరంలోనివారే పిమ్మట యెహోవా ఒక జనసమూహాన్ని నా మీదికి తెచ్చాడు.
    నా యువ సైనికులను చంపటానికే ఆయన ఆ జనాన్ని తీసుకొని వచ్చాడు.
ద్రాక్షా గానుగలలో వున్న కాయలపై (ప్రజలు) యెహోవా అడుగువేసి త్రొక్కాడు.
    ఆ ద్రాక్షా గానుగ కన్యక అయిన యెరూషలేము కుమారి.

మత్తయి 20:29-34

ఇద్దరు గ్రుడ్డి వాళ్ళకు చూపురావటం

(మార్కు 10:46-52; లూకా 18:35-43)

29 యేసు, ఆయన శిష్యులు యెరికో పట్టణం నుండి బయలు దేరి వెళ్తూండగా చాలా మంది ప్రజలు ఆయన్ని అనుసరించారు. 30 దారి ప్రక్కన కూర్చొన్న ఇద్దరు గ్రుడ్డివాళ్ళు యేసు ఆ దారిన వస్తున్నాడని విని, “మమ్మల్ని కరుణించు దావీదు కుమారుడా!” అని బిగ్గరగా అన్నారు.

31 ప్రజలు వాళ్ళను నిశ్శబ్దంగా వుండమని గద్దించారు. కాని ఆ గ్రుడ్డివాళ్ళు యింకా బిగ్గరగా, “ప్రభూ! దావీదు కుమారుడా! మాపై దయ చూపు!” అని అన్నారు.

32 యేసు ఆగి ఆ గ్రుడ్డివాళ్ళను పిలిచి, “ఏం చెయ్యమంటారు?” అని అడిగాడు.

33 “ప్రభూ! మాకు చూపుకావాలి!” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

34 యేసుకు వాళ్ళపై దయ కలిగి వాళ్ళ కళ్ళను తాకాడు. వెంటనే వాళ్ళకు చూపు వచ్చింది. వాళ్ళు ఆయన్ని అనుసరించారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International