Revised Common Lectionary (Semicontinuous)
23 కనుక, సీయోను ప్రజలారా, సంతోషించండి.
మీ యెహోవా దేవునియందు ఆనందంగా ఉండండి.
ఎందుకంటే ఆయన తన మంచితనాన్ని చూపి వర్షం కురిపిస్తాడు.
ఇదివరకటివలె ఆయన మీకు తొలకరి వర్షాలు, కడపటి వర్షాలు కురిపిస్తాడు.
24 మరియు కళ్లాలు గోధుమలతో నిండిపోయి ఉంటాయి.
క్రొత్త ద్రాక్షారసం మరియు ఒలీవ నూనె సీసాలలో పొర్లిపోతూంటాయి.
25 “నేనే యెహోవాను, నా సైన్యాన్ని మీకు విరోధంగా పంపించాను.
ఆ దండు మిడుతలు, ఆ దూకుడు మిడుతలు, ఆ వినాశ మిడుతలు
మరియు ఆ కోత మిడుతలు మీ పంటను తినివేశాయి.
కాని నేనే యెహోవాను, ఆ కష్టకాల సంవత్సరాలన్నింటికీ
తిరిగి మీకు నేను చెల్లిస్తాను.
26 అప్పుడు మీకు తినేందుకు సమృద్ధిగా ఉంటుంది.
మీరు తృప్తిగా ఉంటారు.
మీ యెహోవా దేవుని నామం మీరు స్తుతిస్తారు.
మీకోసం అయన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు.
నా ప్రజలు తిరిగి ఎన్నటికి సిగ్గుపరచబడరు.
27 ఇశ్రాయేలు ప్రజలకు నేను తోడుగా ఉన్నానని మీరు తెలుసుకొంటారు.
మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొంటారు.
మరో దేవుడు ఎవ్వరూ లేరు.
నా ప్రజలు తిరిగి ఎన్నడూ సిగ్గుపడరు.”
యెహోవా ప్రజలందరికీ తన ఆత్మను ఇస్తాడు
28 “దీని తరువాత
ప్రజలందరిమీద నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
మీ కుమారులు, మీ కుమార్తెలు ప్రవచిస్తారు.
మీ ముసలివాళ్ళు కలలు కంటారు.
మీ యువకులు దర్శనాలు చూస్తా రు.
29 ఆ సమయంలో నా సేవకులమీద,
సేవకురాండ్రమీద కూడ నా ఆత్మను కుమ్మరిస్తాను (ఇస్తాను).
30 ఆకాశంలోను, భూమిమీదను ఆశ్చర్యకార్యాలు నేను చూపిస్తాను.
రక్తం, అగ్ని, దట్టమైన పొగ ఉంటాయి.
31 సూర్యుడు చీకటిగా మార్చబడతాడు.
చంద్రుడు రక్తంగా మార్చబడతాడు.
అప్పుడు యెహోవాయొక్క
మహా భయంకర దినం వస్తుంది!
32 అప్పుడు యెహోవా నామాన్ని స్మరించే ఏ వ్యక్తి అయినా సరే రక్షింపబడతాడు.
సీయోను కొండమీద యెరూషలేములో రక్షింపబడిన మనుష్యులు ఉంటారు.
ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరుగుతుంది.
మిగిలిన వారిలో
యెహోవా పిలిచినవారు ఉంటారు.
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
65 సీయోను మీద ఉన్న దేవా, నేను నిన్ను స్తుతిస్తాను.
నేను వాగ్దానం చేసిన వాటిని నేను నీకు ఇస్తాను.
2 నీవు చేసిన వాటిని గూర్చి మేము చెబుతాము మరియు నీవు మా ప్రార్థనలు వింటావు.
నీ దగ్గరకు వచ్చే ప్రతి మనిషి యొక్క ప్రార్థనలూ నీవు వింటావు.
3 మా పాపాలు మేము భరించలేనంత భారమైనప్పుడు,
ఆ పాపాలను నీవు తీసివేస్తావు.
4 దేవా, నీ ప్రజలను నీవు ఏర్పరచుకొన్నావు.
నీ ఆలయానికి వచ్చి నిన్ను ఆరాధించుటకు నీవు మమ్మల్ని ఏర్పాటు చేసికొన్నావు.
మాకు చాలా సంతోషంగా ఉంది!
నీ ఆలయంలో నీ పరిశుద్ధ ఇంటిలో మాకన్నీ అద్భుత విషయాలే ఉన్నాయి.
5 దేవా, నీవు మమ్మల్ని రక్షించుము. మంచి మనుష్యులు నిన్ను ప్రార్థిస్తారు.
నీవు వారి ప్రార్థనలకు జవాబిస్తావు.
వారి కోసం నీవు ఆశ్చర్య కార్యాలు చేస్తావు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నిన్ను నమ్ముకొంటారు.
6 దేవుడు తన మహాశక్తిని ఉపయోగించి పర్వతాలను చేశాడు.
మనచుట్టూరా ఆయన శక్తిని చూడగలము.
7 ఘోషించే సముద్రాలను దేవుడు నిమ్మళింప చేస్తాడు.
మరియు ప్రపంచంలో ఉన్న మనుష్యులందరినీ దేవుడు సంతోషంతో స్తుతింప చేస్తాడు.
8 దేవుడు చేసే శక్తివంతమైన విషయాలకు భూమిమీద ప్రతి మనిషీ భయపడతాడు.
దేవా, నీవు సూర్యుని ఉదయింపజేసే, అస్తమింపజేసే ప్రతి చోటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
9 నీవు భూమిని గూర్చి శ్రద్ధ తీసుకొంటావు.
నీవు దానికి నీరు పోస్తావు, అది దాని పంటలు పండించేలా నీవు చేస్తావు.
దేవా, నీవు కాలువలను ఎల్లప్పుడూ నీళ్లతో నింపుతావు.
నీవు ఇలా చేసి పంటలు పండింపచేస్తావు.
10 దున్నబడిన భూమి మీద వర్షం కురిసేటట్టు నీవు చేస్తావు.
భూములను నీవు నీళ్లతో నానబెడతావు.
నేలను నీవు వర్షంతో మెత్తపరుస్తావు.
అప్పుడు నీవు మొలకలను ఎదిగింపచేస్తావు.
11 కొత్త సంవత్సరాన్ని మంచి పంటతో నీవు ప్రారంభింప చేస్తావు.
బండ్లను నీవు అనేక పంటలతో నింపుతావు.
12 అరణ్యము, కొండలు పచ్చగడ్డితో నిండిపోయాయి.
13 పచ్చిక బయళ్లు గొర్రెలతో నిండిపోయాయి.
లోయలు ధాన్యంతో నిండిపోయాయి.
పచ్చిక బయళ్లు, లోయలు సంతోషంతో పాడుతున్నట్లున్నాయి.
6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. 7 ఈ పోటీలో నేను బాగా పరుగెత్తాను. విశ్వాసాన్ని వదులుకోకుండా పందెం ముగించాను. 8 ఇప్పుడు “నీతి” అనే కీరీటం నా కోసం కాచుకొని ఉంది. నీతిగా తీర్పు చెప్పే ప్రభువు “ఆ రానున్న రోజు” దాన్ని నాకు బహుమతిగా యిస్తాడు. నాకే కాక, ఆయన రాక కోసం నిరీక్షిస్తున్నవాళ్ళందరికీ ఆ బహుమతి లభిస్తుంది.
16 నా విషయంలో మొదటి సారి విచారణ జరిగినప్పుడు నాకు ఎవ్వరూ సహాయం చెయ్యలేదు. అందరు నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపొయ్యారు. దేవుడు వాళ్ళను క్షమించు గాక! 17 నా ద్వారా సువార్త ప్రకటింపబడాలని యూదులు కానివాళ్ళందరు వినాలని ప్రభువు నా ప్రక్కన నిలబడి నాకు శక్తినిచ్చాడు. సింహాల నోటినుండి నన్ను కాపాడాడు. 18 ప్రభువు నాకు ఏ విధమైన కీడు సంభవించకుండా నన్ను కాపాడి, క్షేమంగా పరలోకంలో ఉన్న తన రాజ్యానికి పిలుచుకు వెళ్తాడు. ఆయనకు చిరకాలం మహిమ కలుగుగాక! ఆమేన్.
పరిసయ్యుడు, పన్నులు సేకరించేవాడు
9 తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు: 10 “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు. 11 పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి. 12 నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
13 “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు. 14 దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
© 1997 Bible League International