Revised Common Lectionary (Semicontinuous)
మేమ్
97 నీ ధర్మశాస్త్రాన్ని నేనెంతగా ప్రేమిస్తానో!
దినమంతా అదే నా ధ్యానం.
98 నీ ఆజ్ఞ నన్ను నా శత్రువులకంటే
జ్ఞానవంతునిగా చేస్తుంది.
99 నా గురువులందరికంటే నాకు ఎక్కువ గ్రహింపు ఉన్నది.
ఎందుకంటే నీ ఉపదేశాలే నా ధ్యానం కాబట్టి.
100 ముసలివారి కంటే నేనెక్కువ అర్థం చేసుకొంటాను.
కారణం ఏమిటంటే, నేను నీ శాసనాలను అనుసరిస్తాను.
101 నీ వాక్కు ప్రకారం నడుచుకోటానికి
ప్రతి చెడు మార్గంనుండి నేను తప్పించుకొంటాను.
102 యెహోవా, నీవు నా ఉపాధ్యాయుడవు
కనుక నేను నీ న్యాయ చట్టాలకు విధేయుడనవటం మానను.
103 నీ మాటలు నా నోటికి తేనెకంటే మధురం.
104 నీ ఉపదేశాలు నన్ను తెలివిగలవాణ్ణి చేస్తాయి,
అందుచేత తప్పుడు ఉపదేశాలు నాకు అసహ్యము.
15 యెహోవా ఇలా సెలవిస్తున్నాడు:
“రామాలో రోదన వినవచ్చింది.
అది ఒక తీవ్రమైన రోదన; గొప్ప విషాదం.
రాహేలు[a] తన పిల్లలు హతులైన కారణంగా
ఆమె ఓదార్పు పొందుటకు నిరాకరిస్తుంది.”
16 కాని యెహోవా ఇలా అంటున్నాడు: “విలపించుట ఆపి వేయుము.
నీవు కంట తడి పెట్టవద్దు!
నీ పనికి తగిన ప్రతిఫలం నీకు దక్కుతుంది!”
ఇది యెహోవా సందేశం.
“ఇశ్రాయేలు ప్రజలు తమ శత్రు రాజ్యం నుండి తిరిగి వస్తారు.
17 కావున, ఇశ్రాయేలూ, మంచి భవిష్యత్తుకు నీవు ఆశతో ఎదురు చూడుము.”
ఇది యెహోవా వాక్కు.
“నీ పిల్లలు వారి రాజ్యానికి తిరిగి వస్తారు.
18 ఎఫ్రాయిము విలపిస్తున్నట్లు నేను విన్నాను.
ఎఫ్రాయిము ఇలా అంటూవుండగా నేను విన్నాను:
‘యెహోవా, నీవు నిజంగా నన్ను శిక్షించావు! నేను మంచి గుణపాఠం నేర్చుకున్నాను.
నేనిక ఎన్నడూ తర్భీతు పొందని కోడెదూడలా ఉన్నాను.
దయచేసి నన్ను శిక్షించటం మానివేయుము.
నేను తిరిగి నీ యొద్దకు వస్తాను.
నీవే నిజమైన నా యెహోవా దేవుడవు.
19 యెహోవా, నేను నీకు దూరమయ్యాను.
కాని నేను చేసిన దుష్కార్యాలను నేను గుర్తించాను.
కావున నేను నా జీవన విధానాన్ని మార్చుకొని, హృదయ పరివర్తన కలిగియున్నాను.
నా చిన్న తనంలో నేను చేసిన మూర్ఖపు పనులకు సిగ్గుపడి కలవరపడియున్నాను.’”
20 దేవుడు ఇలా చెప్పుచున్నాడు:
“ఎఫ్రాయిము నా ముద్దు బిడ్డ అని మీకు తెలుసు.
ఆ బిడ్డను నేను ప్రేమిస్తున్నాను.
అవును, నేను ఎఫ్రాయిముకు వ్యతిరేకంగా తరచు మాట్లాడియున్నాను.
అయినా నేను అతనిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను.
నేనతన్ని గాఢంగా ప్రేమిస్తున్నాను.
నేను నిజంగా అతన్ని ఓదార్చ గోరుతున్నాను.”
ఇది యెహోవా సందేశం.
21 “ఇశ్రాయేలు ప్రజలారా, రహదారి గుర్తులను నెలకొల్పండి.
ఇంటి మార్గాన్ని సూచించే గుర్తులను నిలబెట్టండి.
మార్గాన్ని కనిపెట్టుకొని ఉండండి.
మీరు పయనించే దారిని శ్రద్ధగా పరిశీలిస్తూ ఉండండి.
ఇశ్రాయేలూ, నా కన్యకా, ఇంటికి రమ్ము!
నీ నగరాలకు తిరిగిరా.
22 నీవు విశ్వాసం లేని కుమార్తెవై ఉన్నావు.
కాని ఇంకెంత కాలం అక్కడిక్కడ తిరుగుతావు. ఎప్పుడు ఇంటికి వస్తావు?
“నీ దేశంలో ఒక నూతనమైన దానిని యెహోవా సృష్టించినప్పుడు
ఒక స్త్రీ తన పురుషుని ఆవరిస్తుంది.”[b]
23 ఇశ్రాయేలు దేవుడు సర్వశక్తిమంతుడు అయిన యెహోవా ఇలా అంటున్నాడు: “యూదా ప్రజలకు నేను మళ్లీ మంచి పనులు చేస్తాను. వారిని తిరిగి నేను నిర్బందము నుండి తీసికొస్తాను. ఆ సమయంలో యూదా రాజ్యంలో దాని నగరాల్లోని ప్రజలు మళ్లీ ఇలా అంటారు: ‘ఓ నీతిగల నివాసమా, ఓ పవిత్ర పర్వతమా, యెహోవా నిన్ను దీవించు గాక!’[c]
24 “యూదా పట్టణాలలోని ప్రజలంతా శాంతి యుత సహాజీవనం చేస్తారు. రైతులు, స్థిరంగా లేకుండా తిరిగే పశువుల కాపరులు, అంతా యూదాలో ప్రశాంతంగా కలిసి జీవిస్తారు. 25 బలహీనులకు, అలసిపోయిన ప్రజలకు నేను విశ్రాంతిని, బలాన్ని ఇస్తాను. దుఃఖిస్తున్న వారి కోరికను తీరుస్తాను.”
26 అది విన్న తరువాత నేను (యిర్మీయా) మేల్కొని చుట్టూ చూశాను. అదెంతో హాయిని గూర్చిన నిద్ర.
గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం
(మత్తయి 20:29-34; లూకా 18:35-43)
46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.
48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.
49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.
వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.
51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.
ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.
52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.
© 1997 Bible League International