Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:137-144

సాదె

137 యెహోవా, నీవు మంచివాడవు.
    నీ చట్టాలు న్యాయమైనవి.
138 ఒడంబడికలో నీవు మాకు ఇచ్చిన న్యాయ చట్టాలు మంచివి.
    యెహోవా, మేము నీ న్యాయ చట్టాలపై నిజంగా నమ్మకముంచగలము.
139 నా ఉత్సాహం నాలో కృంగిపోయినది.
    ఎందుకంటే, నా శత్రువులు నీ న్యాయ చట్టాలను మరచిపోయారు.
140 యెహోవా, మేము నీ మాట నమ్మగలుగుటకు మాకు రుజువు ఉంది.
    అదంటే నాకు ప్రేమ.
141 నేను యువకుడను. ప్రజలు నన్ను గౌరవించరు.
    కాని నేను నీ ఆజ్ఞలు మరచిపోను.
142 యెహోవా, నీ మంచితనం శాశ్వతంగా ఉంటుంది.
    నీ ఉపదేశాలు నమ్మదగినవి.
143 నాకు కష్టాలు, చిక్కులు కలిగాయి.
    కాని నీ ఆజ్ఞలు నాకు ఆనందకరము.
144 నీ ఒడంబడిక శాశ్వతంగా మంచిది.
    నేను జీవించగలుగునట్లు నీ ఒడంబడికను గ్రహించుటకు నాకు సహాయం చేయుము.

యిర్మీయా 33:14-26

మంచి కొమ్మ

14 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “నేను ఇశ్రాయేలు, యూదా ప్రజలకు ఒక ప్రత్యేకమైన వాగ్దానం చేసియున్నాను. నేనిచ్చిన మాట నెరవేర్చుకునే సమయం ఆసన్నమవుతూ వుంది. 15 ఆ సమయంలో దావీదు వంశం నుండి ఒక మంచి ‘కొమ్మ’ చిగురించి పెరిగేలా చేస్తాను. ఆ మంచి ‘కొమ్మ’ (రాజు) దేశానికి ఏది మంచిదో, ఏది నీతి దాయకమో అది చేస్తుంది. 16 ఈ ‘కొమ్మ’ చిగిర్చిన కాలంలో యూదా ప్రజలు రక్షింపబడతారు. యెరూషలేములో ప్రజలు సురక్షితంగా జీవిస్తారు. ఈ కొమ్మ పేరు ‘యెహోవాయే మా నీతి.’”

17 యెహోవా ఇలా చెపుతున్నాడు, “దావీదు వంశంలోని ఒక వ్యక్తి సదా సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలీయులను పరిపాలిస్తాడు. 18 లేవీయుల వంశంలోనివారే ఎల్లప్పుడూ యాజకులుగా ఉంటారు. ఆ యాజకులు సదా నా ఎదుట నిలచి నాకు దహన బలులు, ధాన్యార్పణలు, బలులు అర్పిస్తారు.”

19 యిర్మీయాకు యెహోవా నుండి ఈ వర్తమానం వచ్చింది. 20 యెహోవా ఇలా అన్నాడు: “నాకు రాత్రింబవళ్లతో ఒక ఒడంబడిక ఉంది. అవి అలా ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాయి. ఆ ఒడంబడికను మీరు మార్చలేరు! దివారాత్రులు క్రమం తప్పక అలా వస్తూనే ఉంటాయి. మీరా నిబంధన మార్చగల్గిననాడు, 21 నా సేవకుడైన దావీదు, నా సేవకులైన లేవీయులతో యాజకులతో నా ఒడంబడికను కూడా మార్చగల్గుతారు. అప్పుడు దావీదు వంశంలోని వారు రాజులు కాలేరు. లేవీ వంశం వారు యాజకులు కాలేరు. 22 కాని నేను నా సేవకుడైన దావీదు వంశం, లేవీ వంశం అభివృద్ధి పొందేలా చేస్తాను. ఆకాశంలో నక్షత్రాల్లా వారి సంతతి వృద్ధి పొందుతుంది. ఆ నక్షత్రాలను ఎవ్వరూ లెక్కపెట్టలేరు. మరియు వారి సంతానం సముద్ర తీరాన గల ఇసుక రేణువుల్లా వృద్ధి పొందుతుంది. ఆ ఇసుక రేణువులను ఎవ్వరూ లెక్క పెట్టలేరు.”

23 యిర్మీయా ఈ వర్తమానాన్ని యెహోవా నుండి విన్నాడు: 24 “యిర్మీయా, ప్రజలేమనుకుంటున్నారో నీవు విన్నావా? ‘యెహోవా ఇశ్రాయేలు, యూదా రెండు వంశాల వారికి విముఖుడయ్యాడు. యెహోవా వారిని ముందు ఎన్నుకున్నాడు. కాని ఇప్పుడాయన వారిని తిరస్కరించాడు.’ వారు మా ప్రజలను ఎంతగా ద్వేషస్తున్నారంటే, మా ప్రజలు ఒక రాజ్యంగా కూడా అంగీకరించటం లేదు.”

25 అయితే యెహోవా ఇలా అంటున్నాడు: “దివారాత్రులతో నా ఒడంబడిక కొనసాగకపోతే, భూమ్యాకాశాలకు సంబంధించిన న్యాయసూత్రాలను నేను చేయకపోతే, బహుశః నేనా ప్రజలను వదిలి వేస్తాను. 26 బహుశః అప్పుడు యాకోబు సంతతి నుండి నేను దూరంగా ఉంటాను. బహుశః అప్పుడే నేను దావీదు వంశం వారు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారిని ఏలకుండా చేస్తాను. కానీ నిర్బంధంలో నుండి వారిని మరలా వారి స్వదేశానికి తెస్తాను. ఆ ప్రజల పట్ల దయగలిగి ఉంటాను.”

2 కొరింథీయులకు 1:1-11

దైవేచ్ఛ వల్ల యేసు క్రీస్తు అపొస్తులునిగా ఉన్న పౌలు నుండి, మన సోదరుడైన తిమోతి నుండి కొరింథులో ఉన్న దేవుని సంఘానికి మరియు అకయ ప్రాంతంలోని పవిత్రులకు.

మన తండ్రియైన దేవుని నుండి, యేసు క్రీస్తు ప్రభువు నుండి మీకు అనుగ్రహము, శాంతి లభించాలని కోరుతున్నాను.

దేవునికి వందనాలు చెల్లించుట

మన యేసు క్రీస్తు ప్రభువును, తండ్రియైన దేవుణ్ణి స్తుతిద్దాము. దేవుడు దయామయుడు. మనకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. ఆయన మన కష్టాలు తొలగిపోవటానికి సహాయం చేస్తాడు. ఆయనలాగే మనము కూడా యితరుల కష్టాలు తొలగించటానికి సహాయం చెయ్యాలని ఆయన ఉద్దేశం. క్రీస్తు కష్టాల్ని మనము పంచుకొన్న విధంగా ఆయన ద్వారా కలిగే సహాయాన్ని కూడా పంచుకొందాము. మీకు సహాయం చెయ్యాలని, రక్షణ కలగాలని మేము కష్టాలు అనుభవిస్తున్నాము. మీకు సహాయం చెయ్యటానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఈ సహాయం వల్ల మేము అనుభవించిన కష్టాలు మీరు కూడా అనుభవించేటట్లు మీలో సహనం కలుగుతుంది. నాకు మీ పట్ల గట్టి నమ్మకం ఉంది. మీరు మా కష్టాలు పంచుకొన్నట్లుగానే, మాకు కలిగే సహాయాన్ని కూడా పంచుకొంటారని మాకు తెలుసు.

మేము ఆసియ ప్రాంతంలో అనుభవించిన కష్టాలు మీకు చెప్పకుండా ఉండలేము. మాకు అక్కడ తీవ్రమైన కష్టాలు కలిగాయి. అవి మేము మోయలేనంతగా ఉండినవి. జీవిస్తామనే ఆశ కూడా పోయింది. మా మనస్సులకు మరణదండన పొందినట్లు అనిపించింది. మమ్మల్ని మేము నమ్ముకోరాదని, చనిపోయినవాళ్ళను బ్రతికించే దేవుణ్ణి నమ్మాలని ఇలా జరిగింది. 10 దేవుడు మమ్మల్ని ఆ ప్రమాదకరమైన చావునుండి రక్షించాడు. ఇక ముందు కూడా రక్షిస్తాడు. మాకు ఆయన పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. 11 మీరు ప్రార్థించి మాకు సహాయం చెయ్యాలి. ఎంతమంది ప్రార్థిస్తే దేవుడు మాకు అంత సహాయం చేస్తాడు. దేవుడు మాకు ఆ సహాయం చేసాక, అందరూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం కలుగుతుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International