Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: ఒక స్తుతి కీర్తన.
66 భూమి మీద ఉన్న సమస్తమా, దేవునికి ఆనందధ్వని చేయుము!
2 మహిమగల ఆయన నామాన్ని స్తుతించండి.
స్తుతిగీతాలతో ఆయనను ఘనపరచండి.
3 ఆయన కార్యాలు అద్భుతమైనవి. ఆయనకు ఇలా చెప్పండి:
దేవా, నీ శక్తి చాలా గొప్పది. నీ శత్రువులు సాగిలపడతారు. వారికి నీవంటే భయం.
4 సర్వలోకం నిన్ను ఆరాధించుగాక.
నీ నామమునకు ప్రతి ఒక్కరూ స్తుతి కీర్తనలు పాడుదురుగాక.
5 దేవుడు చేసిన అద్భుత విషయాలను చూడండి.
అవి మనల్ని ఆశ్చర్యపరుస్తాయి.
6 సముద్రాన్ని[a] ఆరిపోయిన నేలలా దేవుడు చేశాడు.
ఆయన ప్రజలు నదిని దాటి వెళ్లారు.[b]
అక్కడ వారు ఆయనపట్ల సంతోషించారు.
7 దేవుడు తన మహా శక్తితో ప్రపంచాన్ని పాలిస్తున్నాడు.
సర్వత్రా మనుష్యులను దేవుడు గమనిస్తున్నాడు.
ఏ మనిషీ ఆయన మీద తిరుగుబాటు చేయలేడు.
8 ప్రజలారా, మా దేవుని స్తుతించండి.
స్తుతి కీర్తనలు ఆయన కోసం గట్టిగా పాడండి.
9 దేవుడు మాకు జీవాన్ని ఇచ్చాడు.
దేవుడు మమ్మల్ని కాపాడుతాడు.
10 దేవుడు మమ్మల్ని పరీక్షించాడు. మనుష్యులు నిప్పుతో వెండిని పరీక్షించునట్లు దేవుడు మమ్మల్ని పరీక్షించాడు.
11 దేవా, నీవు మమ్మల్ని ఉచ్చులో పడనిచ్చావు.
భారమైన బరువులను నీవు మాపైన పెట్టావు.
12 మా శత్రువులను నీవు మా మీద నడువ నిచ్చావు.
అగ్నిగుండా, నీళ్ల గుండా నీవు మమ్మల్ని ఈడ్చావు.
కాని క్షేమ స్థలానికి నీవు మమ్మల్ని తీసుకొచ్చావు.
అబద్ద ప్రవక్త హనన్యా
28 యూదా రాజుగా సిద్కియా పాలన నాలుగు సంవత్సరాలు[a] దాటి ఐదవ నెల గడుస్తూ ఉండగా ప్రవక్త హనన్యా నాతో మాట్లాడాడు. హనన్యా తండ్రి పేరు అజ్జూరు. హనన్యా గిబియోను పట్టణవాసి. హనన్యా నాతో మాట్లాడినప్పుడు అతడు దేవాలయంలో వున్నాడు. యాజకులు, ఇతర ప్రజలు అందరు కూడ అక్కడ చేరి వున్నారు. హనన్యా ఇలా చెప్పాడు. 2 “ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తమంతుడగు యెహోవా ఇలా చెపుతున్నాడు. ‘యూదా ప్రజల మెడపై బబులోను రాజు వుంచిన కాడిని నేను విరిచి వేస్తాను. 3 రెండు సంవత్సరాలు గడిచేలోగా యెహోవా గుడి నుండి బబులోను రాజు నెబుకద్నెజరు తీసుకొనిపోయిన వస్తువులన్నిటినీ నేను తిరిగి తెస్తాను. నెబుకద్నెజరు ఆ వస్తువులన్నిటినీ బబులోనుకు తీసుకొని పోయాడు. కాని వాటన్నిటినీ నేను తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తాను. 4 యూదా రాజైన యెహోయాకీమను కూడా ఈ స్థానానికి నేను తీసుకొని వస్తాను. యెకోన్యా యెహోయాకీము కుమారుడు. నెబుకద్నెజరు బలవంతం చేసి తమ ఇండ్ల నుండి బబులోనుకు తీసుకొని పోయిన యూదా ప్రజలందరినీ నేను తిరిగి తీసుకొని వస్తాను.’ ఇది యెహోవా నుంచి వచ్చిన సమాచారం ‘కావున బబులోను రాజు యూదా ప్రజల మెడపై ఉంచిన కాడిని నేను విరుగగొడతాను!’”
5 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యాకు ఇలా సమాధానం చెప్పాడు. వారు దేవాలయంలో నిలబడి వున్నారు. యాజకులు, మరియు అక్కడ చేరిన ప్రజలు యిర్మీయా సమాధానం వినగలిగారు. 6 హనన్యాతో యిర్మీయా ఇలా అన్నాడు: “తధాస్తు! నిజంగా యెహోవా అలా చేయుగాక! నీవు ప్రవచించిన వర్తమానం యెహోవా నిజం చేయుగాక! బబులోను నుంచి దేవాలయ సంబంధిత వస్తువులన్నీటినీ యెహోవా ఇక్కడికి తీసుకొని వచ్చుగాక! బలవంతంగా తమ ఇండ్లు వదిలి పోయేలా చేయబడిన ప్రజలందరినీ యెహోవా మరల ఇక్కడికి తీసికొని వచ్చుగాక!
7 “కాని హనన్యా! నేను చెప్పేది విను. ప్రజలారా, మీరందరు నేను చెప్పేది వినండి. 8 హనన్యా! నీవు, నేను ప్రవక్తలం అవటానికి పూర్వం చాలా ముందు కాలంలో ప్రవక్తలుండినారు. చాలా దేశాలకు, మహా సామ్రాజ్యాలకు యుద్ధాలు, కరువులు, భయంకరమైన రోగాలు వస్తాయని వారు చెప్పియున్నారు. 9 కాని మనకు సుఖ సంతోషాలు, శాంతి లభిస్తాయని చేప్పే ప్రవక్త నిజంగా యెహోవాచే పంపబడినవాడేనా అని మనం నిర్ధారణ చేయవలసి వుంది. ఆ ప్రవక్త చెప్పినది నిజమయ్యే పక్షంలో, అతడు నిజంగా యెహోవాచే పంపబడిన వాడని ప్రజలు తెలుసుకోవచ్చు.”
10 యిర్మీయా ఒక కాడిని తన మెడకు తగిలించుకుని ఉన్నాడు. ప్రవక్త హనన్యా ఆ కాడిని యిర్మీయా మెడనుండి తీసి విరుగగొట్టాడు. 11 పిమ్మట అక్కడ చేరిన ప్రజలంతా వినేలా హనన్యా ఇలా బిగ్గరగా చెప్పాడు: “యెహోవా సెలవిచ్చినదేమంటే, ఇదే రీతిని బబులోను రాజు నెబుకద్నెజరు వేసిన కాడిని నేను విరిచి వేస్తాను. అతడు ఆ కాడిని ప్రపంచ దేశాలన్నిటిపై వేశాడు. కాని రెండు సంవత్సరాల కాలంలోపల నేనా కాడిని విరిచివేస్తాను.”
హనన్యా అలా చెప్పిన పిమ్మట యిర్మీయా దేవాలయం నుండి వెళ్లి పోయాడు.
12 తరువాత యెహోవా సందేశం యిర్మీయాకు వచ్చింది. యిర్మీయా మెడ నున్న కాడిని తీసి హనన్యా విరచి వేసిన తరువాత ఇది జరిగింది. 13 యెహోవా యిర్మీయాతో ఇలా చెప్పాడు, “నీవు వెళ్లి హనన్యాతో ఇలా చెప్పుము, ‘యెహోవా ఇలా అంటున్నాడు, నీవు చెక్కతో చేయబడిన కాడిని విరుగగొట్టావు. కాని దానికి బదులు నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను.’ 14 ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అన్నాడు: ‘ఆ దేశాలన్నిటిపైన నేనొక ఇనుప కాడిని వేస్తున్నాను. బబులోను రాజు నెబుకద్నెజరుకు వారంతా దాస్యం చేయాలనే ఉద్దేశంతో నేనలా చేస్తున్నాను. వారు అతనికి బానిసలవుతారు. కృరమృగాలను కూడ అదుపులో పెట్టగల శక్తిని నెబుకద్నెజరుకు ప్రసాదిస్తాను.’”
15 అప్పుడు ప్రవక్త యిర్మీయా ప్రవక్త హనన్యా వద్దకు వచ్చి ఇలా చెప్పాడు, “హనన్యా, వినుము! యెహోవా నిన్ను పంపలేదు. కాని యూదా ప్రజలు అబద్ధాలు నమ్మేలా చేశావు. 16 అందువల్ల యెహోవా ఇలా చెపుతున్నాడు, ‘హనన్యా, త్వరలో నిన్ను ఈ ప్రపంచం నుండి తీసుకొని వెళతాను. ఈ సంవత్సరమే నీవు చనిపోతావు. ఎందువల్లనంటే ప్రజలు యెహోవాకు వ్యతిరేకంగా తిరిగేలా నీవు బోధించావు గనుక.’”
17 హనన్యా అదే సంవత్సరం ఏడవ నెలలో చనిపోయాడు.
యేసు రోగిని నయం చేయటం
(మత్తయి 8:1-4; మార్కు 1:40-45)
12 యేసు ఒక గ్రామంలో ఉండగా ఒళ్ళంతా కుష్టురోగం ఉన్న వాడు ఆయన్ని చూడాలని వచ్చాడు. యేసును చూడగానే ఆయన కాళ్ల ముందు సాష్టాంగ పడి, “ప్రభూ! మీరు దయ తలిస్తే నాకు నయం చెయ్యగలరు!” అని వేడుకొన్నాడు.
13 యేసు, “నీకు నయం చేస్తాను!” అని అంటూ తన చేయి జాపి అతణ్ణి తాకాడు. వెంటనే కుష్టురోగం అతణ్ణి వదిలి పోయింది. 14 ఆ తర్వాత యేసు, “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు. కాని వెళ్ళి యాజకునికి చూపు! మోషే ఆజ్ఞాపించిన కానుకను అర్పించు. నీకు నయమైపోయిందని నిరూపించుకో!” అని ఆజ్ఞాపించాడు.
15 కాని యేసును గురించి యింకా చాలా మందికి తెలిసిపోయింది. ఆయన బోధనలు వినటానికి, తమరోగాలు నయం చేసుకోవటానికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు. 16 కాని యేసు ప్రార్థించటానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు.
© 1997 Bible League International