Revised Common Lectionary (Semicontinuous)
యాత్ర కీర్తన.
129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
2 నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
కాని వారు ఎన్నడూ జయించలేదు.
3 నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
4 అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
5 సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
6 ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
7 పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
8 ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
“యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.
బబులోనుకు సంబంధించిన సందేశం
50 బబులోను దేశానికి, కల్దీయులను ఉద్దేశించి యెహోవా ఈ సందేశాన్ని ఇచ్చాడు. యెహోవా ఈ వర్తమానాన్ని యిర్మీయా ద్వారా చెప్పాడు.
2 “అన్ని దేశాల వారికి ఈ వర్తమానం ప్రకటించండి!
జెండా ఎగురవేసి ఈ సందేశం ప్రకటించండి!
పూర్తి సమాచారాన్ని ప్రకటిస్తూ ఇలా చెప్పండి,
‘బబులోను రాజ్యం వశపర్చుకోబడుతుంది.
బేలు[a] దైవం అవమానపర్చబడుతుంది.
మర్దూక్ మిక్కిలి భీతిల్లుతుంది.
బబులోను విగ్రహాలు అవమానపర్చబడతాయి.
దాని విగ్రహ దేవతలు భయంతో నిండిపోతాయి.’
3 ఉత్తర దేశమొకటి బబులోనును ఎదుర్కొంటుంది.
ఆ దేశం బబులోనును వట్టి ఎడారివలె మార్చివేస్తుంది.
ప్రజలెవ్వరూ అక్కడ నివసించరు.
మనుష్యులు, జంతువులు అంతా అక్కడ నుండి పారిపోతారు”
4 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో
ఇశ్రాయేలు ప్రజలు, యూదా ప్రజలు కలిసి ఒక్కరీతిగా రోదిస్తారు.
వారంతా కలిసి వారి దేవుడైన
యెహోవాను వెతుక్కుంటూ వెళతారు.
5 ఆ ప్రజలు సియోనుకు ఎలా వెళ్లాలి అని దారి అడుగుతారు.
వారు ఆ దిశగా వెళ్లటానికి బయలు దేరుతారు.
ప్రజలు యిలా అంటారు. ‘రండి, మనల్ని మనము యెహోవాకు కలుపుకొందాం.
శాశ్వతమైన ఒక నిబంధన చేసికొందాము.
మన మెన్నటికీ మరువలేని ఒక నిబంధన చేసికొందాం.’
6 “నా ప్రజలు తప్పిపోయిన గొర్రెలవలె ఉన్నారు.
వారి కాపరులు (నాయకులు) వారిని తప్పుదారి పట్టించారు.
వారి నాయకులు వారిని కొండల్లో, కోనల్లో తిరిగేలా చేశారు.
వారి విశ్రాంతి స్థలమెక్కడో వారు మర్చిపోయారు.
7 నా ప్రజలను చూచిన వారంతా వారిని గాయపర్చారు.
పైగా వారి శత్రువులు, ‘మేము ఏ నేరమూ చేయలేదన్నారు.’
ఆ ప్రజలు యెహోవా పట్ల పాపం చేశారు. యెహోవాయే వారి అసలైన విశ్రాంతి స్థలం.
వారి తండ్రులు నమ్మిన యెహోవాయే వారి దేవుడు.
17 “పొలాల్లో చెల్లాచెదరైన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
సింహాలు తరిమిన గొర్రెల్లా ఇశ్రాయేలు వున్నది.
వానిని తిన్న మొదటి సింహం అష్షూరు రాజు.
వాని ఎముకలు నలుగగొట్టిన చివరి సింహం బబులోను రాజైన నెబుకద్నెజరు.
18 కావున సర్వశక్తిమంతుడు, ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా ఇలా చెపుతున్నాడు,
‘బబులోను రాజును, అతని దేశాన్ని నేను త్వరలో శిక్షిస్తాను.
నేను అష్షూరు రాజును శిక్షించినట్లు అతనిని నేను శిక్షిస్తాను.
19 “‘కాని ఇశ్రాయేలును మళ్లీ వాని స్వంత పొలాలకు తీసుకొని వస్తాను.
అతడు కర్మేలు పర్వతం మీదను బాషాను భూముల్లోను పండిన పంటను తింటాడు.
అతడు తిని, తృప్తి పొందుతాడు.
ఎఫ్రాయిము మరియు గిలాదు ప్రాంతాలలో గల కొండల మీద అతడు తింటాడు.’”
20 యెహోవా ఇలా చెపుతున్నాడు, “ఆ సమయంలో ప్రజలు ఇశ్రాయేలు యొక్క తప్పులెదకటానికి గట్టిగా ప్రయత్నిస్తారు.
కాని వారికి కన్పించదు.
ప్రజలు యూదా పాపాలు వెదక యత్నిస్తారు.
కాని ఏ పాపాలూ కనుగొనబడవు.
ఎందువల్లనంటే ఇశ్రాయేలు, యూదా రాజ్యాలలో మిగిలిన కొద్దిమందిని నేను రక్షిస్తున్నాను.
పైగా వారి పాపాలన్నిటినీ నేను క్షమిస్తున్నాను.”
యేసు ఏకాంతంగా ప్రార్థించటం
(మత్తయి 26:36-46; మార్కు 14:32-42)
39 “అలవాటు ప్రకారం యేసు ఒలీవల కొండ మీదికి వెళ్ళటానికి బయలుదేరాడు. ఆయన శిష్యులు ఆయన్ని అనుసరించారు. 40 అక్కడికి చేరుకొన్నాక వాళ్ళతో, మీరు శోధనలో పడకుండ ఉండటానికి ప్రార్థించాలి” అని అన్నాడు.
41 ఆయన వాళ్ళనుండి రాయి విసిరినంత దూరం వెళ్ళి, మోకరిల్లి ఈ విధంగా ప్రార్థించాడు: 42 “తండ్రీ! నీకిష్టమైతే ఈ గిన్నె నా నుండి తీసివెయ్యి. కాని నెరవేరవలసింది నా యిచ్ఛ కాదు: నీది.” 43 అప్పుడు ఒక దేవదూత పరలోకంలో నుండి వచ్చి ఆయనకు శక్తినివ్వటానికి ప్రత్యక్షమైనాడు. 44 ఆయన ఆవేదనతో యింకా తీవ్రంగా దేవుణ్ణి ప్రార్థించాడు. నేలమీద పడ్తున్న ఆయన చెమట చుక్కలు రక్తపు చుక్కల్లా ఉన్నాయి. 45 ప్రార్థించటం ముగించాక ఆయన తన శిష్యుల దగ్గరకు వెళ్ళాడు. దుఃఖంవల్ల అలసిపోయి వాళ్ళు నిద్రిస్తూ ఉన్నారు. 46 వాళ్ళతో, “ఎందుకు పడుకున్నారు? లేచి మీరు శోధింపబడకూడదని ప్రార్థించండి” అని అన్నాడు.
© 1997 Bible League International