Revised Common Lectionary (Semicontinuous)
19 ఓ యెహోవా, నా దుఃఖాన్ని,
నేను నా నివాసాన్ని కోల్పోయిన తీరును గుర్తుపెట్టుకొనుము.
నీవు నాకిచ్చిన చేదుపానీయాన్ని, విషం (శిక్ష) కలిపిన పానీయాలను జ్ఞాపకం పెట్టుకొనుము.
20 నా కష్టాలన్నీ నాకు బాగా జ్ఞాపకం ఉన్నాయి.
నేను మిక్కిలి విచారిస్తున్నాను.
21 కాని నేను మరలా ఆలోచించగా నాకు కొంత ఆశ పొడచూపింది.
నేను ఇలా అనుకున్నాను.
22 యెహోవా యొక్క ప్రేమ, దయ అంతంలేనివి.
యెహోవా కృపా కటాక్షాలు తరగనివి.
23 అవి నిత్య నూతనాలు.
ఓ యెహోవా, నీ విశ్వసనీయత గొప్పది.
24 “యెహోవా నా దేవుడు.
అందువల్లనే నాకీ ఆశ పొడచూపింది,” అని నేను అనుకున్నాను.
25 ఆయన కోసం నిరీక్షించే వారికి యెహోవా శుభం కలుగజేస్తాడు.
ఆయన కోసం వెదికేవారికి యెహోవా ఉదారుడు.
26 యెహోవా రక్షణకై నెమ్మదిగా
వేచియుండటం క్షేమకరం
యెరూషలేము పతనం
52 యూదాకు రాజయ్యే నాటికి సిద్కియాకు ఇరవై యొక్క సంవత్సరాల వయస్సు. యెరూషలేములో సిద్కియా పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఈమె తండ్రి పేరు యిర్మీయా.[a] హమూటలు వంశం వారు లిబ్నా పట్టణవాసులు. 2 రాజైన యెహోయాకీము మాదిరిగానే సిద్కియా కూడా దుష్ట కార్యాలు చేశాడు. సిద్కియా ఆ చెడు కార్యాలు చేయటం యెహోవాకు ఇష్టం లేదు. 3 వారి పట్ల యెహోవా కోపగించటంతో యెరూషలేములోను, యూదాలోను భయంకరమైన సంఘటనలు జరిగాయి. చివరికి యెరూషలేము, యూదా ప్రజలను తన ముందు నుంచి దూరంగా తోసివేశాడు.
బబులోను రాజుమీద సిద్కియా తిరుగుబాటు చేశాడు. 4 కావున సిద్కియా పాలనలో తొమ్మిది సంవత్సరాల పది నెలలు దాటి పదవ రోజు[b] గడుస్తూ వుండగా బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి దండెత్తాడు. నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా వెంటబెట్టుకు వచ్చాడు. బబులోను సైన్యం యెరూషలేము బయట దిగింది. తరువాత వారు నగరపు గోడల మీదికి ఎగబాకటానికి అనువుగా చుట్టూ దిమ్మలు కట్టారు. 5 రాజైన సిద్కియా పాలనలో పదకొండవ సంవత్సరం[c] జరిగే వరకు యెరూషలేము నగరం బబులోను సైన్యం ముట్టడిలో వుంది. 6 ఆ సంవత్సరం నాల్గవ నెలలో తొమ్మిదవ రోజున నగరంలో కరువు తీవ్రమయ్యింది. నగరంలో ఆహార పదార్ధాలు అయిపోవటం కారణంగా ప్రజలకు తినటానికి తిండి కరువయ్యింది. 7 ఆ రోజున బబులోను సైన్యం యెరూషలేములోనికి ప్రవేశించింది. యెరూషలేము సైన్యం పారిపోయింది. రాత్రి సమయంలో సైనికులు నగరం వదిలి పారిపోయారు. రెండు గోడల మధ్య ద్వారం గుండా వారు బయటకి పోయారు. ఆ ద్వారం రాజు యొక్క ఉద్యానవనం వద్ద వుంది. బబులోను సైన్యం నగరాన్ని చుట్టుముట్టి ఉన్నప్పటికీ, యెరూషలేము సైనికులు పారిపోగలిగారు. వారు ఎడారివైపు పారిపోయారు.
8 కాని, కల్దీయుల సైన్యం రాజైన సిద్కియాను వెంటాడింది. వారు యెరికో మైదానంలో అతన్ని పట్టుకున్నారు. కాని సిద్కియా సైనికులంతా పారిపోయారు. 9 బబులోను సైన్యం రాజైన సిద్కియాను చెరబట్టింది రిబ్లా నగరంలోవున్న బబులోను రాజు వద్దకు అతన్ని తీసికొని వెళ్లారు. రిబ్లా నగరం హమాతు రాజ్యంలో వుంది. బబులోను రాజు రిబ్లా నగరంలో రాజైన సిద్కియాపై తీర్పు ప్రకటించాడు. 10 రిబ్లా నగరంలోనే బబులోను రాజు సిద్కియా కుమారులను చంపివేశాడు. తన కుమారులు క్రూరంగా చంపబడటం సిద్కియా బలవంతాన చూశాడు. (ఆ హింస చూడటానికి అతనిపై వత్తిడి వచ్చింది.) యూదా అధికారులందరినీ కూడ బబులోను రాజు చంపివేశాడు. 11 పిమ్మట బబులోను రాజు సిద్కియా కండ్లు పెరికివేశాడు. అతనికి కంచు గొలుసులు వేశాడు. తరువాత సిద్కియాను అతడు బబులోనుకు తీసికొనిపోయాడు. బబులోనులో సిద్కియాను అతడు చెరసాలలో ఉంచాడు. సిద్కియా చనిపోయే వరకు చెరసాలలోనే ఉన్నాడు.
స్ముర్నలోని సంఘానికి
8 “స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:
“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:
9 “మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.
11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.
© 1997 Bible League International