Revised Common Lectionary (Semicontinuous)
137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
4 కాని విదేశంలో మనం యెహోవాకు
కీర్తనలు పాడలేము!
5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
వాగ్దానం చేస్తున్నాను.
7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
9 నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
యెహోవాకు ప్రార్థన
5 యెహోవా! మాకు జరిగిన దానిని జ్ఞాపకము చేసికొనుము.
మాకు జరిగిన అవమానాన్ని తిలకించుము.
2 మా రాజ్యం పరాయివాళ్ల వశమయ్యింది.
మా ఇండ్లు అన్యదేశీయులకు ఇవ్వబడ్డాయి.
3 మేము అనాధలమయ్యాము.
మాకు తండ్రిలేడు.
మా తల్లులు విధవరాండ్రవలె అయ్యారు.
4 మా తాగే నీరు మేము కొనవలసి వచ్చింది.
మేము వాడే కట్టెలకు మేము డబ్బు చెల్లించవలసి వచ్చింది.
5 మా మెడమీద బలవంతంగా కాడి మోయవలసి వచ్చింది.
మేము అలసిపోయాము. మాకు విశ్రాంతి లేదు.
6 మేము ఈజిప్టుతో ఒక ఒడంబడిక చేసికొన్నాము.
తగిన ఆహార పదార్థాల సరఫరాకు మేము అష్షూరుతో కూడ ఒక ఒడంబడిక చేసికొన్నాము.
7 నీపట్ల మా పూర్వీకులు అపచారం చేశారు. వారిప్పుడు చచ్చిపోయారు.
వారి పాపాలకు ఇప్పుడు మేము కష్టాలనుభవిస్తున్నాము.
8 బానిసలు మాకు పాలకులయ్యారు.
వారినుండి మమ్మల్ని రక్షించటానికి ఎవ్వరూ లేరు.
9 మేము ఆహారం సంపాదించటానికి మా ప్రాణాలు తెగించవలసి వచ్చింది.
ఎడారిలో కత్తులు ధరించివున్న మనుష్యుల మూలంగా మేము మా ప్రాణాలను తెగించవలసి వచ్చింది.
10 నిప్పు కొలిమిలా మా చర్మం వేడెక్కింది.
నకనకలాడే ఆకలి కారణంగా మా చర్మం వేడెక్కింది.
11 సీయోను స్త్రీలపై శత్రువులు అత్యాచారాలు జరిపారు.
వారు యూదా నగరాలలో స్త్రీలను చెరిపారు.
12 మా రాజకుమారులను శత్రువు ఉరితీశాడు.
వారు మా పెద్దలను గౌరవించలేదు.
13 శత్రువు మా యువకులచే తిరుగలి తిప్పించి పిండిపట్టించాడు.
మా యువకులు కట్టెల మోపులు మోయలేక తొట్రిల్లారు.
14 నగర ద్వారాల వద్ద పెద్దలు ఏమాత్రం కూర్చోడంలేదు.
యువకులు సంగీతం పాడటం మానివేశారు.
15 మా హృదయాల్లో సంతోషం ఏ మాత్రం లేదు.
మా నాట్యం చనిపోయిన వారి కొరకు విలాపంగా మారింది.
16 మా తలనుండి కిరీటం కింద పడిపోయింది.
మేము పాపం చేయటం మూలంగా మాకు చెడు పరిణామాలు వచ్చాయి.
17 ఇందు మూలంగా మా గుండెలు అలిసిపోయాయి.
ఫలితంగా మా కండ్లు మసకబారాయి.
18 సీయోను పర్వతం బీడు భూమి అయ్యింది.
సీయోను పర్వతం మీద నక్కలు సంచరిస్తున్నాయి.
19 కాని యెహోవా, నీవు శాశ్వతంగా పరిపాలిస్తావు.
నీ రాచరిక సింహాసనం కలకాలం అలా నిలిచివుంటుంది.
20 యెహోవా, నీవు మమ్మల్ని శాశ్వతంగా మర్చి పోయినట్లున్నావు.
నీవు మమ్మల్ని ఇంత దీర్ఘకాలం వదిలి వెళ్లావు.
21 యెహోవా, మమ్మల్ని నీవద్దకు చేర్చుకో. మేము సంతోషంగా నీదరి చేరుతాము.
మా రోజులను మునుపటిలా మార్చివేయుము.
22 నీవు మమ్మల్ని పూర్తిగా తిరస్కరించావు.
నీవు మాపట్ల మిక్కిలి కోపం వహించావు.
ఎండిపొయిన అంజూరపు చెట్టు
(మత్తయి 21:18-19)
12 మరుసటిరోజు వాళ్ళు బేతనియనుండి బయలుదేరి వస్తుండగా యేసుకు ఆకలి వేసింది. 13 కొంత దూరంలో ఆకులున్న అంజూరపు చెట్టు ఉండటం యేసు చూసాడు. దాని మీద పండ్లున్నాయేమో చూడాలని దగ్గరకు వెళ్ళాడు. కాని దగ్గరకు వెళ్ళాక, అది పండ్లు కాచేకాలం కానందువల్ల ఆయనకు ఆకులు తప్ప పండ్లు కనిపించలేదు. 14 అప్పుడు యేసు ఆ చెట్టుతో, “ఎన్నడూ ఎవ్వరూ నీ ఫలాల్ని తినకూడదు!” అని అన్నాడు. ఆయన అలా అనటం శిష్యులు విన్నారు.
యేసు విశ్వాస శక్తిని చూపటం
(మత్తయి 21:20-22)
20 ఉదయం ఆ దారిన నడుస్తూ వాళ్ళా అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండటం గమనించారు. 21 పేతురుకు యేసు అన్నమాటలు జ్ఞాపకం వచ్చి యేసుతో, “రబ్బీ! అదిగో చూడండి; మీరు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది” అని అన్నాడు.
22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుణ్ణి విశ్వసించండి. 23 ఇది నిజం. హృదయంలో అనుమానించకుండా తాను అన్నది జరుగుతుందని నమ్మి ఒక కొండతో ‘వెళ్ళి సముద్రంలో పడు’ అని అంటే, అలాగే సంభవిస్తుంది. 24 అందువల్ల నేను చెప్పేదేమిటంటే, మీరు ప్రార్థించేటప్పుడు ఏది అడిగినా మీకు లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించండి. అప్పుడు మీకది లభిస్తుంది.
© 1997 Bible League International