Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 129

యాత్ర కీర్తన.

129 నా జీవిత కాలమంతా నాకు ఎంతోమంది శత్రువులు.
    ఇశ్రాయేలూ, ఆ శత్రువులను గూర్చి మాకు చెప్పుము.
నా జీవిత కాలమంతా నాకు ఎంతో మంది శత్రువులు ఉన్నారు
    కాని వారు ఎన్నడూ జయించలేదు.
నా వీపుమీద లోతైన గాయాలు అయ్యేంతవరకు వారు నన్ను కొట్టారు.
    నాకు చాలా పెద్ద, లోతైన గాయాలు అయ్యాయి.
అయితే దయగల యెహోవా తాళ్ళను తెగకోసి
    ఆ దుర్మార్గులనుండి నన్ను విడుదల చేసాడు.
సీయోనును ద్వేషించిన మనుష్యులు ఓడించబడ్డారు.
వారు పోరాటం మానివేసి పారిపోయారు.
ఆ మనుష్యులు ఇంటి కప్పు మీద మొలిచిన గడ్డిలాంటి వాళ్లు.
    ఆ గడ్డి ఎదుగక ముందే వాడిపోతుంది.
పని వానికి ఆ గడ్డి గుప్పెడు కూడా దొరకదు.
    ధాన్యపు పన కట్టేందుకు కూడా అది సరిపోదు.
ఆ దుర్మార్గుల పక్కగా నడుస్తూ వెళ్లే మనుష్యులు, “యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక” అని చెప్పరు.
    “యెహోవా నామమున మేము మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాము” అని చెబుతూ మనుష్యులు వారిని ఏమీ అభినందించరు.

యిర్మీయా 39

యెరూషలేము పతనం

39 యెరూషలేము ఈ విధంగా లోబరచుకోబడింది: యూదా రాజ్యంలో సిద్కియా పాలన తొమ్మిది సంవత్సరాలు దాటి పదవ నెల గడుస్తూఉంది. అప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యాన్నంతా కూడగట్టుకొని యెరూషలేము మీదికి తరలి వచ్చాడు. దానిని ఓడించటానికి అతడు నగరాన్ని ముట్టడించాడు. సిద్కియా పాలనలో పదకొండు సంవత్సరాల నాలుగు నెలలు దాటి తొమ్మిదవ రోజున యెరూషలేము నగర ప్రాకారం (గోడ) పగులగొట్టబడింది. దానితో బబులోను రాజు యొక్క ఉన్నతాధికారులంతా యెరూషలేము నగరం ప్రవేశించారు. వారు మధ్య ద్వారం వద్దకు వచ్చి కూర్చున్నారు. ఆ వచ్చిన వారిలో సిమ్గరు జిల్లాకు పాలకుడైన నేర్గల్‌షరేజరు; మరొక ప్రముఖమైన అధికారి శర్సెకీము; తదితర ఉన్నతాధికారులు ఉన్నారు.

యూదా రాజగు సిద్కియా బబులోను నుంచి వచ్చిన అధికారులను చూచి తన సైనికులతో కలసి పారిపోయాడు. రాత్రి సమయంలో వారు యెరూషలేమును వదిలి రాజుయొక్క ఉద్యానవనం ద్వారా బయటకు వెళ్లారు. రెండు గోడల మధ్య వున్న ద్వారం గుండా వారు వెళ్లారు. వారక్కడి నుండి ఎడారివైపు వెళ్లారు. కాని కల్దీయుల సైన్యం సిద్కియాను, అతనితో ఉన్న సైనికులను తరుముకుంటూ పోయారు. కల్దీయుల సైన్యం సిద్కియాను యెరికో మైదానాలలో పట్టుకున్నారు. వారు సిద్కియాను పట్టుకుని బబులోను రాజగు నెబుకద్నెజరు వద్దకు తీసికొని వెళ్లారు. నెబుకద్నెజరు ఆ సమయంలో హమాతు రాజ్యంలో ఉన్న రిబ్లా పట్టణంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సిద్కియాకు వ్యతిరేకంగా నెబుకద్నెజరు తన తీర్పును ఇచ్చాడు. రిబ్లా పట్టణంలో సిద్కియా కుమారులను అతను చూస్తూ ఉండగానే బబులోను రాజు చంపివేశాడు. మరియు సిద్కియా చూస్తూ ఉండగానే యూదా రాజ్యాధికారులందరినీ నెబుకద్నెజరు చంపివేశాడు. తరువాత సిద్కియా కండ్లను నెబుకద్నెజరు పెరికివేశాడు. అతడు సిద్కియాకు కంచు సంకెళ్లను తగిలించి బబులోనుకు తీసికొని పోయాడు.

బబులోను సైన్యం రాజగృహానికి, యెరూషలేము వాసుల ఇండ్లకు నిప్పు పెట్టారు. మరియు వారు యెరూషలేము గోడలను పడగొట్టారు. నెబూజరదాను అను వ్యక్తి బబులోను రాజు ప్రత్యేక అంగరక్షకుల దళానికి అధిపతి. అతడు యెరూషలేములో ఉన్న వారిని బందీలుగా పట్టుకున్నాడు. అతడు వారిని బబులోనుకు తీసికొని పోయాడు. 10 కాని ప్రత్యేక అంగరక్షకుల దళాధికారి నెబూజరదాను యూదాలోని కొంతమంది పేద ప్రజలను నగరంలో వదిలివేశాడు. వారు ఆస్తి పాస్తులు ఏమీ లేనివారు. కావున ఆ రోజున నెబూజరదాను యూదాలోని పేద ప్రజలకు ద్రాక్షాతోటలను, పొలాలను ఇచ్చాడు.

11 కాని యిర్మీయా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదానుకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. 12 “యిర్మీయాను వెదకి తెలిసికొని అతని విషయంలో జాగ్రత్త తీసికో. అతనిని గాయపర్చవద్దు. అతనేదడిగితే అది యివ్వు” అని ఆజ్ఞ ఇచ్చాడు.

13 ప్రత్యేక అంగరక్షక దళాధికారి నెబూజరదాను, బబులోను సైన్యంలో ముఖ్యాధికారియైన నెబూషజ్బాను, మరో ఉన్నతాధికారి నేర్గల్షరేజరు మరియు ఇతర బబులోను సైన్యాధికారులు యిర్మీయాను పిలిపించారు. 14 యూదా రాజు రక్షకుల ఆధీనంలో ఆలయ ప్రాంగణంలో వున్న యిర్మీయాను ఆ వచ్చిన వ్యక్తులు బయటకు తీసికొని వెళ్లారు. బబులోను సైన్యాధికారులు యిర్మీయాను గెదల్యాకు[a] అప్పగించారు. గెదల్యా అనేవాడు అహీకాము కుమారుడు. అహీకాము అనేవాడు షాఫాను కుమారుడు. యిర్మీయాను తిరిగి ఇంటికి తీసికొని పోవటానికి గెదల్యాకు ఆజ్ఞ ఇవ్వబడింది. అందువల్ల యిర్మీయా తన ఇంటికి తీసికొనిపోబడగా అతడు తన ప్రజలతో కలిసి నివసించాడు.

ఎబెద్మెలెకునకు యెహోవా వర్తమానం

15 ఆలయ ప్రాంగణంలో యిర్మీయా బందీగా ఉన్నప్పుడు యెహోవా నుండి ఒక వర్తమానం అతనికి వచ్చింది. ఆ వర్తమానం ఇలా ఉంది: 16 “యిర్మీయా, నీవు వెళ్లి ఈ వర్తమానాన్ని ఇతియోపియవాడగు ఎబెద్మెలెకునకు అందజేయుము: ‘ఇతశ్రాయేలీయుల దేవుడు సర్వశక్తుడు అయిన యెహోవా ఇలా చెప్పుచున్నాడు, ఈ యెరూషలేము నగర విషయంలో నా వర్తమానాలన్నీ అతి త్వరలో నిజమయ్యేలా చేస్తాను. వినాశనం ద్వారా నా వర్తమానాలు నిజమవుతాయిగాని శుభ కార్యాల ద్వారా కాదు. నేను చెప్పినదంతా నిజమవటం నీ కళ్లతో నీవే చూస్తావు. 17 కాని ఎబెద్మెలెకూ, ఆ రోజున నిన్ను నేను రక్షిస్తాను.’ ఇది యెహోవా సందేశం. ‘నీవు ఎవరిని చూచి భయబడుతున్నావో వారికి నిన్ను అప్పగించను. 18 ఎబెద్మెలెకూ, నిన్ను నేను రక్షిస్తాను. నీవు కత్తివాతబడి చనిపోవు. నీవు తప్పించుకొని జీవిస్తావు. నీవు నన్ను నమ్మావు. గనుక అలా జరుగుతుంది.’” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చింది.

యాకోబు 5:7-12

సహనము

అందువల్ల సోదరులారా! ప్రభువు వచ్చే వరకు సహనంతో ఉండండి. రైతు పొలం నుండి వచ్చే విలువైన పంటకోసం ఏ విధంగా కాచుకొని ఉంటాడో గమనించండి. అతడు, తొలకరి కడవరి వర్షం దాకా సహనంతో కాచుకొని ఉంటాడు. ప్రభువు రానున్న సమయం సమీపిస్తోంది. కనుక ధైర్యం చెడకుండా సహనంతో ఉండండి. సోదరులారా! ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకోకండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు. ఆ న్యాయాధిపతి మీ తలుపు ముందు నిలుచున్నాడు.

10 సోదరులారా! ప్రభువు పక్షాన మాట్లాడిన ప్రవక్తలు కష్టాలు అనుభవించారు. వాళ్ళలో సహనం ఉంది. వాళ్ళను ఆదర్శంగా తీసుకోండి. 11 కష్టాలు అనుభవించి కూడా విశ్వాసంతో ఉన్నవాళ్ళను మనము ధన్యులుగా భావిస్తాము. యోబు సహనాన్ని గురించి మీరు విన్నారు. ప్రభువు చేసినదాన్ని చూసారు. ప్రభువులో దయా దాక్షిణ్యాలు సంపూర్ణంగా ఉన్నాయి.

మీరేమంటున్నారో జాగ్రత్త

12 నా సోదరులారా! అన్నిటికన్నా ముఖ్యమైనదేమిటంటే, పరలోకం పేరిట గాని, భూమి పేరిట గాని, మరేదానిపై గాని ఒట్టు పెట్టుకోకండి. మీరు “ఔను” అని అనాలనుకొంటె “ఔను” అనండి. “కాదు” అని అనాలనుకొంటె “కాదు” అని అనండి. అలా చేస్తే దేవుడు మిమ్మల్ని శిక్షించడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International