Revised Common Lectionary (Semicontinuous)
137 బబులోను నదుల దగ్గర మనం కూర్చొని
సీయోనును జ్ఞాపకం చేసికొని ఏడ్చాం.
2 దగ్గర్లో ఉన్న నిరవంజి చెట్లకు[a] మన సితారాలు తగిలించాము.
3 బబులోనులో మనల్ని బంధించిన మనుష్యులు మనల్ని పాటలు పాడమని చెప్పారు.
సంతోషగీతాలు పాడమని వారు మనకు చెప్పారు.
సీయోను గూర్చి పాటలు పాడమని వారు మనకు చెప్పారు.
4 కాని విదేశంలో మనం యెహోవాకు
కీర్తనలు పాడలేము!
5 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా కుడిచేయి ఎన్నడూ వాయించకుండా ఎండిపోవును గాక!
6 యెరూషలేమా, ఎన్నడైనా నేను నిన్ను మరచిపోతే
నా నాలుక పాడకుండా అంగిటికి అంటుకుపోవును గాక!
నేను ఎన్నటికీ నిన్ను మరువనని
వాగ్దానం చేస్తున్నాను.
7 యెరూషలేము ఎప్పటికీ నా మహా ఆనందం అని నేను ప్రమాణం చేస్తున్నాను!
యెహోవా, యెరూషలేము పడిన రోజున
ఎదోమీయులు ఏమి చేసారో జ్ఞాపకం చేసుకొనుము.
దాని పునాదుల వరకు పడగొట్టండి అని వారు అరిచారు.
8 బబులోనూ, నీవు నాశనం చేయబడతావు!
నీకు రావాల్సిన శిక్ష నీకు యిచ్చేవాడు ఆశీర్వదించబడునుగాక! నీవు మమ్మల్ని బాధించినట్టు, నిన్ను బాధించేవాడు ఆశీర్వదించబడును గాక!
9 నీ చంటి బిడ్డలను తీసుకొని వారిని బండమీద చితుక గొట్టేవాడు ధన్యుడు.
16 “ఈ విషయాలన్నిటిపట్ల నేను వ్యధ చెందుతున్నాను.
నా కళ్ళు; కన్నీళ్లతో తడిసిపోయాయి.
నన్ను ఓదార్చు వారెవ్వరూ నావద్ద లేరు.
నన్ను ఓదార్చి స్వస్థపర్చు వారెవ్వరూ లేరు.
నా పిల్లలు బంజరు భూమిలా ఉన్నారు.
శత్రువు గెలవటంతో వారలా తాయారయ్యారు.”
17 సీయోను[a] తన చేతులు చాపింది.
ఆమెను ఆదరించేవారెవ్వరూ లేరు.
యాకోబు[b] శత్రువులకు యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు.
యాకోబు శత్రువులకు అతనిని చుట్టుముట్టుమని
యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు. యెరూషలేము అపవిత్రమయ్యింది.
ఆ శత్రువుల మధ్య ఆమె అపవిత్రురాలైంది.
18 “నేను యెహోవాను అనుసరించటానికి తిరస్కరించాను.
అందువల్ల ఆయన చేసిన పని న్యాయమైనదే అని ఆమె అంటూ వుంది.
కావున ప్రజలారా, వినండి!
నా బాధను గమనించండి!
నా యువతీ యువకులు బందీలైపోయారు.
19 నా ప్రేమికులను నేను పిలిచాను.
కాని వారు నన్ను మోసగించారు.
నా యాజకులు, నా పెద్దలు నగరంలో చనిపోయారు.
ఆహారం కొరకు వారు అన్వేషించారు.
వారు తమ ప్రాణాలను నిలుపుకోదల్చారు.
20 “యెహోవా, నా వైపు చూడు. నేను బాధలో ఉన్నాను!
నాలో కలవరం చెలరేగింది! నా గుండె తలక్రిందులైనట్లు నాకు భావన కలుగుతూ వుంది!
నా కలవరపాటుకు కారణం
నేను మొండిగా తిరిగుబాటు చేయటమే!
నా పిల్లలు నడివీధుల్లో కత్తికి గురి అయ్యారు.
ఇంటిలోపల మృత్యువు పొంచివుంది.
21 “నా గోడు విను, నేను దుఃఖభారంతో నిట్టూర్చుతున్నాను.
ఓదార్చటానికి నాకు ఎవ్వరూ లేరు.
నా శత్రువులంతా నా కష్టాల గురించి విన్నారు.
విని సంతోషపడ్డారు.
నీవు నాకు ఈ శిక్ష విధించినందుకు వారు సంతోషించారు.
నీవు ప్రకటించిన ఆ రోజును ఇప్పుడు రప్పించుము.
ఆ రోజున నా శత్రువులు ఇప్పుడు
నేనున్న స్థితికి వచ్చేలా చేయుము.
22 “నా శత్రువుల దుష్టత్వం నీ ముందు ప్రకటితమవ్వనిమ్ము.
నా పాపాలకు నీవు నన్ను శిక్షించినట్లు,
అప్పుడు వారి దుష్టత్వానికి వారిని శిక్షించుము.
పొంగిన ధుఃఖంతో ఎడతెరిపి లేకుండా నేను మూల్గుతున్నాను. అందువల్ల నీవు ఇది చెయ్యి.
నా హృదయం కృంగి కృశించినందున నీవు ఈ పని చెయ్యి.”
విశ్వాసము, జ్ఞానము
2-3 నా సోదరులారా! మీకు పరీక్షలు కలిగినప్పుడు పరమానందంగా భావించండి. విశ్వాసం పరీక్షింపబడటం వల్ల సహనం కలుగుతుందని మీకు తెలుసు. 4 మీరు చేసే పనిలో పూర్తిగా సహనం చూపండి. అలా చేస్తే మీరు బాగా అభివృద్ధి చెంది పరిపూర్ణత పొందుతారు. అప్పుడు మీలో ఏ లోపం ఉండదు.
5 మీలో జ్ఞానం లేనివాడు ఉంటే అతడు దేవుణ్ణి అడగాలి. దేవుడు కోపగించుకోకుండా అందరికీ ధారాళంగా యిస్తాడు. కనుక మీకు కూడా యిస్తాడు. 6 కాని దేవుణ్ణి అడిగినప్పుడు సంశయించకుండా విశ్వాసంతో అడగండి. సంశయించేవాడు గాలికి ఎగిరి కొట్టుకొను సముద్రం మీది తరంగంతో సమానము. 7 అలాంటివాడు ప్రభువు నుండి తనకు ఏదైనా లభిస్తుందని ఆశించకూడదు. 8 అలాంటివాడు ద్వంద్వాలోచనలు చేస్తూ అన్ని విషయాల్లో చంచలంగా ఉంటాడు.
ధనము, దరిద్రము
9 దీనస్థితిలో ఉన్న సోదరుడు తనకు గొప్ప స్థానం లభించినందుకు గర్వించాలి. 10 ధనవంతుడు తాను కూడా గడ్డిపువ్వులా రాలిపోవలసినవాడే కనుక తనకు దీనస్థితి కలిగినందుకు ఆనందించాలి. 11 ఎందుకంటే, సూర్యుడు ఉదయిస్తాడు. మండుటెండకు గడ్డి ఎండిపోతుంది. దాని పువ్వులు రాలి దాని అందం చెడిపోతుంది. అదే విధంగా ధనవంతుడు తన వ్యాపారం సాగిస్తుండగానే మరణిస్తాడు.
© 1997 Bible League International