Add parallel Print Page Options

గ్రుడ్డివానికి దృష్టి కలిగించటం

(మత్తయి 20:29-34; లూకా 18:35-43)

46 ఆ తర్వాత వాళ్ళు యెరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్ళతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయి కుమారుడు బర్తిమయి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు బిక్షగాడు. 47 ఆ గ్రుడ్డివాడు, వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని, “యేసూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు!” అని బిగ్గరగా అనటం మొదలు పెట్టాడు.

48 చాలామంది అతణ్ణి తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు. “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని యింకా బిగ్గరగా అరిచాడు.

49 యేసు ఆగి, “అతణ్ణి పిలవండి” అని అన్నాడు.

వాళ్ళా గ్రుడ్డివానితో, “ధైర్యంగా లేచి నిలుచో. ఆయన నిన్ను పిలుస్తున్నాడు” అని అన్నారు. 50 ఆ గ్రుడ్డివాడు కప్పుకొన్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి, గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు.

51 యేసు, “ఏమి కావాలి?” అని అడిగాడు.

ఆ గ్రుడ్డివాడు, “రబ్బీ! నాకు చూపు కావాలి” అని అన్నాడు.

52 యేసు, “నీ విశ్వాసం నీకు నయం చేసింది. యిక వెళ్ళు” అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.

Read full chapter