Revised Common Lectionary (Semicontinuous)
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
మంచి మరియు చెడ్డ అంజూరపు పండ్లు
24 యెహోవా నాకు ఈ వస్తువులను చూపించాడు: యెహోవా మందిరం ముందు ఉంచబడిన రెండు బుట్టల అంజూరపు పండ్లను చూశాను. (నాకు ఈ దర్శనం బబులోను రాజైన నెబుకద్నెజరు యెకోన్యాను[a] బందీగా తీసుకొని పోయిన తరువాత కలిగింది. యెకోన్యా రాజైన యెహోయాకీము కుమారుడు. యెకోన్యా, అతని ముఖ్యమైన అధికారులు యెరూషలేము నుండి తీసుకొనిపోబడినారు. వారు బబులోనుకు బందీలుగా కొనిపోబడినారు. నెబుకద్నెజరు యూదా రాజ్యంలోని చాలా మంది వడ్రంగులను, లోహపు పనివారలను కూడ తీసుకొనిపోయాడు.) 2 ఒక బుట్ట నిండా మంచి అంజూరపు పండ్లున్నాయి. అవి వాటి కాలం కంటే ముందు పండిన పండ్లవలె ఉన్నాయి. కాని రెండవ బుట్టలో కుళ్లిపోయిన అంజూరపు పండ్లున్నాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లి పోయాయి.
3 “యిర్మీయా, నీవు ఏమి చూస్తున్నావు? అని యెహోవా నన్ను అడిగాడు.
“నేను అంజూరపు పండ్లను చూస్తున్నాను. అవి చాలా మంచి పండ్లు. చెడి పోయిన పండ్లు కుళ్లి పోయాయి. అవి తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయాయి,” అని నేను సమాధానమిచ్చాను.
4 పిమ్మట యెహోవా వర్తమానం నాకు చేరింది. 5 ఇశ్రాయేలు దేవుడైవ యెహోవా ఇలా చెప్పాడు: “యూదా ప్రజలు తమ దేశాన్నుండి బయటకు కొనిపోబడ్డారు. వారి శత్రువు వారిని బబులోనుకు తీసుకొనిపోయాడు. ఆ ప్రజలు ఈ మంచి అంజూరపండ్లలా ఉన్నారు. ఆ ప్రజల పట్ల నేను కనికరం చూపుతాను. 6 నేను వారిని రక్షిస్తాను. నేను వారిని తిరిగి యూదా రాజ్యానికి తీసుకొని వస్తాను. నేను వారిని చీల్చి పారవేయను. వారిని పైకి తీసుకొని వస్తాను! వారిని పెరికి వేయను. వారు అభివృద్ది చెందటానికి వారిని స్థిరంగా నాటుతాను. 7 వారు నన్ను తెలుసుకొనగోరేలా చేస్తాను. నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. వారు నా ప్రజలు; నేను వారి దేవుడను. బబులోనులో వున్న ఆ బందీలంతా పూర్ణహృదయ పరివర్తనతో నా వైపు తిరుగుతారు గనుక నేనిదంతా చేస్తున్నాను.
8 “కాని యూదా రాజైన సిద్కియా మాత్రం తినటానికి పనికిరాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె అవుతాడు. సిద్కియా, అతని ఉన్నతాధికారులు, యెరూషలేములో యింకా మిగిలి వున్న ప్రజలు, మరియు ఈజిప్టులో నివసిస్తున్న యూదా ప్రజలు కుళ్లిన ఈ అంజూరపు పండ్లవలె ఉంటారు. 9 నేను వారిని శిక్షిస్తాను. ఆ శిక్ష భూమిమీద ప్రజలందరికీ భయంతో కూడిన విస్మయాన్ని కల్గిస్తుంది! యూదా వారిని చూచి తక్కిన ప్రజలు హేళన చేస్తారు. వారిని గూర్చి హాస్యోక్తులు పలుకుతారు. నేను వారిని చిందర వందర చేసి పడవేసిన అన్ని ప్రదేశాలలో ప్రజలు వారిని శపిస్తారు. 10 వారి మీదికి కత్తిని, కరువును, రోగాలను పంపుతాను. వారంతా చనిపోయే వరకు వారిని ఎదుర్కొంటూ వుంటాను. వారికి, వారి పితరులకు నేనిచ్చిన భూమిమీద వారిక ఎంత మాత్రము ఉండరు.”
43 దేవుని మహిమ చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
యేసు తన మరణాన్ని గురించి మాట్లాడటం
(మత్తయి 17:22-23; మార్కు 9:30-32)
యేసు చేసింది చూసి వాళ్ళు తమ ఆశ్చర్యం నుండి కోలుకోక ముందే యేసు తన శిష్యులతో ఈ విధంగా అన్నాడు: 44 “నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మనుష్యకుమారుణ్ణి ఒక ద్రోహి యితర్లకు అప్పగిస్తాడు.” 45 వాళ్ళకు దీని అర్థం తెలియలేదు. వాళ్ళకు అర్థం కాకుండునట్లు రహస్యంగా ఉంచబడింది. దాన్ని గురించి అడగటానికి వాళ్ళకు ధైర్యం చాలలేదు.
దేవుని రాజ్యంలో ఎవరు గొప్ప?
(మత్తయి 18:1-5; మార్కు 9:33-37)
46 తమలో అందరికన్నా ఎవరు గొప్ప అన్న అంశంపై శిష్యుల మధ్య ఒక వాదం మొదలైంది. 47 యేసుకు వాళ్ళ ఆలోచనలు తెలిసిపోయాయి. ఆయన ఒక చిన్న పిల్లవాణ్ణి తీసుకొని తన ప్రక్కన నిలబెట్టుకొని 48 వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా పేరిట ఈ పసివానిని అంగీకరిస్తే నన్ను అంగీకరించిన దానితో సమానము. నన్ను అంగీకరిస్తే నన్ను పంపిన వానిని అంగీకరించిన దానితో సమానము. మీలో అందరికన్నా తక్కువవాడు అందరికన్నా గొప్పవానితో సమానము.”
© 1997 Bible League International