Revised Common Lectionary (Semicontinuous)
91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
2 “నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
అని నేను యెహోవాకు చెబుతాను.
3 దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
4 కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
5 రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
6 చీకటిలో దాపురించే రోగాలకు గాని
మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.
14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
నేను వారికి జవాబు ఇస్తాను.
వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
నేను వాళ్లను రక్షిస్తాను.”
దొంగ ప్రవక్తలకు వ్యతిరేకంగా తీర్పు
9 ప్రవక్తలకు పవిత్రమైన మాటలు:
నేను విచారంగా ఉన్నాను. నా హృదయం పగిలింది.
నా ఎముకలు వణుకుతున్నాయి.
నేను (యిర్మీయా) ఒక తాగుబోతు వ్యక్తిలా ఉన్నాను.
యెహోవాను బట్టి, ఆయన పవిత్ర వాక్కును బట్టి నేనిలా వున్నాను.
10 యూదా రాజ్యం వ్యభిచరించే వారితో నిండిపోయింది.
వారనేక విధాలుగా అవిశ్వాసులై ఉన్నారు.
యెహోవా రాజ్యాన్ని శపించాడు.
అందుచే అది బీడై పోయింది.
పచ్చిక బయళ్లలో మొక్కలు ఎండి చచ్చిపోతున్నాయి.
పొలాలన్నీ ఎడారుల్లా మారినాయి.
ప్రవక్తలంతా దుష్టులయ్యారు.
ప్రవక్తలు వారి శక్తియుక్తుల్ని తప్పుడు విధంగా వినియోగిస్తున్నారు.
11 “ప్రవక్తలు, యాజకులు కూడా దుష్టులయ్యారు.
వారు నా ఆలయంలోనే దుష్టకార్యాలు చేయటం నేను చూశాను.”
ఇదే యెహోవా వాక్కు.
12 “కావున నా సందేశం ఇక మీదట వారికివ్వను.
వారి జీవితం బలవంతంగా అంధకారంలో నడిచినట్లుంటుంది.
ప్రవక్తలకు, యాజకులకు మార్గం అతి నునుపై జారిపడేలా ఉంటుంది.
గాఢాంధకారంలో ప్రవక్తలు, యాజకులు జారిపడతారు.
వారి మీదికి విపత్తును తీసుకొని వస్తాను.
ఆ సమయంలో ఆ ప్రవక్తలను, యాజకులను శిక్షిస్తాను.”
ఇదే యెహోవా వాక్కు.
13 “సమరయ[a] ప్రవక్తలు చెడు చేయటం నేను చూశాను.
బూటకపు దేవత బయలు పేరిట వారు భవిష్య విషయాలు చెప్పటం నేను చూశాను.
ఆ ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజలను యెహోవాకు దూరం చేశారు.
14 యూదా ప్రవక్తలు యెరూషలేములో ఘోరమైన
పనులు చేయటం నేను చూశాను.
ఈ ప్రవక్తలు వ్యభిచార దోషానికి పాల్పడ్డారు.
వారు అబద్ధాలను వింటారు.
వారు తప్పుడు బోధలను అనుసరించారు.
వారు దుర్మార్గులను, చెడు కార్యాలు చేయటానికి ప్రోత్సహించారు.
అందువల్ల ప్రజలు పాపం చేయటం మానలేదు.
వారు సొదొమ నగరం వలె ఉన్నారు.
యెరూషలేము ప్రజలు నా దృష్టిలో
గొమొర్రా నగరం వలె ఉన్నారు!”
15 అందువల్ల సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ ప్రవక్తల విషయంలో ఇలా చెపుతున్నాడు.
“ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ శిక్ష విషముతిన్నట్లు, చేదు నీరు తాగినట్లు ఉంటుంది.
ఆ ప్రవక్తలు ఆధ్యాత్మిక పరమైన
ఒక రుగ్మతను ప్రబలింప చేశారు.
ఆ రోగం దేశ వ్యాప్తంగా చెలరేగింది, కావున ఆ ప్రవక్తలను నేను శిక్షిస్తాను.
ఆ రోగం యెరూషలేములోని ప్రవక్తల నుండే సంక్రమించింది.”
16 సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ విషయాలు చెప్పుతున్నాడు:
“ఆ ప్రవక్తలు మీకు చెప్పే విషయాలను మీరు లక్ష్యపెట్టవద్దు.
వారు మిమ్మల్ని మోసపుచ్చాలని ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రవక్తలు దర్శనాలను గురించి మాట్లాడతారు.
కాని వారా దర్శనాలను నానుండి పొందలేదు.
వారి దర్శనాలన్నీ వారి కల్పనాలే.
17 కొంత మంది ప్రజలు యెహోవా యొక్క నిజమైన సందేశాలను సైతం అసహ్యించుకుంటారు.
అందువల్ల ప్రవక్తలు ఆ ప్రజలకు రకరకాల విషయాలు చెపుతారు.
‘మీకు శాంతి సమకూరుతుంది’ అని వారంటారు.
కొంత మంది ప్రజలు బహు మొండివారు.
వారు చేయదలచుకున్నదేదో అదే చేస్తారు.
కావున వారికి ఆ ప్రవక్తలు,
‘మీకు ఏ కీడూ రాదు!’ అని చెపుతారు.
18 కాని ఈ ప్రవక్తలలో ఏ ఒక్కడూ పరలోక సభలో[b] నిలవలేదు.
వారిలో ఏ ఒక్కడూ యెహోవాను గాని, యెహోవా వాక్కును గాని దర్శించలేదు.
వారిలో ఏ ఒక్కడూ యెహోవా సందేశం పట్ల శ్రద్ధ వహించలేదు.
19 ఇప్పుడు యెహోవా నుండి శిక్ష తుఫానులావస్తుంది!
యెహోవా కోపం ఉగ్రమైన గాలి వానలా ఉంటుంది!
ఆ దుష్టుల తలలు చితికి పోయేలా అది వారి మీదికి విరుచుకు పడుతుంది.
20 యెహోవా చేయదలచుకున్నదంతా చేసేవరకు
ఆయన కోపం చల్లారదు.
అంత్యదినాల్లో దీనిని మీరు
సరిగా అర్థం చేసుకుంటారు.
21 ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు.
కాని వారికి వారే తమ వర్తమానాలను చాటటానికి పరుగున పోయారు.
నేను వారితో మాట్లాడలేదు.
కాని వారు నా పేరుతో ప్రవచించారు.
22 వారు నా సర్వ సభలో నిలిచి ఉండినట్లయితే
వారు నా సందేశాలను యూదా ప్రజలకు చెప్పి ఉండేవారు.
ప్రజలు చెడు మార్గాలు తొక్కకుండా ఆపేవారు.
వారు దుష్ట కార్యాలు చేయకుండా ఆపేవారు.”
8 నేను మీకు ఆజ్ఞాపించటం లేదు. ఇతరులు చేస్తున్న సేవతో మీ ప్రేమను పోల్చి చూడాలని ఉంది. మీ ప్రేమ ఎంత నిజమైందో చూడాలని ఉంది. 9 మన యేసు క్రీస్తు ప్రభువు అనుగ్రహం ఎంత గొప్పదో మీకు తెలుసు. ఆయన ఐశ్వర్యవంతుడైనా మీ కొరకు పేదవాడయ్యాడు. ఆయన పేదరికం వల్ల మీరు ఐశ్వర్యవంతులు కావాలని ఆ విధంగా చేసాడు.
10 ఈ విషయంలో మీకు ఏది మంచిదో అది చెబుతాను. పోయిన సంవత్సరం మీరు అందరికన్నా ఎక్కువగా యివ్వటమే కాకుండా అలాంటి ఉద్దేశ్యం ఉన్నవాళ్ళలో మీరే ప్రథములు. 11 కార్యాన్ని మొదలు పెట్టటంలో చూపిన ఆసక్తి దాన్ని పూర్తి చెయ్యటంలో కూడా చూపండి. మీ శక్త్యానుసారం చెయ్యండి. 12 మీకు యివ్వాలనే ఆసక్తి ఉంటే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. మీ దగ్గర లేనిదాన్ని బట్టి కాకుండా ఉన్నదాన్ని బట్టి మీరిచ్చింది అంగీకరిస్తాడు. 13 మీ మీద భారం మోపి యితరుల భారం తగ్గించాలని కాదు కాని అందరికీ సమానంగా ఉండవలెనని నా ఉద్దేశ్యం. 14 ప్రస్తుతం మీ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కనుక అవసరమున్నవాళ్ళకు మీరు సహాయం చెయ్యటం సమంజసమే. అలా చేస్తే మీకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు సహాయం చేస్తారు. అప్పుడు సమంజసంగా ఉంటుంది. 15 లేఖనాల్లో ఈ విధంగా వ్రాసారు:
“ఎక్కువ కూడబెట్టిన వాని దగ్గర ఎక్కువ లేదు.
తక్కువ కూడబెట్టిన వాని దగ్గర తక్కువ లేదు.”(A)
© 1997 Bible League International