Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 106:40-48

40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
    దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
    వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
    వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
    కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
    దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
    ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
    దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
    అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
    నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
    అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.

యిర్మీయా 9:12-26

12 ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా?
    యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా?
యెహోవా వార్త ఎవ్వడైనా వివరించగలడా?
    రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది?
    జన సంచారంలేని వట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది.

13 యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.
ఆయన ఇలా చెప్పినాడు: “ఆ విధంగా జరుగుటకు కారణమేమంటే యూదా ప్రజలు నా మాట వినలేదు.
వారికి నా ఉపదేశములు ఇచ్చాను.
    కాని వారు వినటానికి నిరాకరించారు.
    వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు.
14 యూదా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు.
    వారు మొండివారు.
వారు బూటకపు దేవతైన బయలును అనుసరించారు.
    బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు.”

15 సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెపుతున్నాడు,
“యూదా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను.
    విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను.
16 యూదా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను.
వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది.
    వారు గాని, వారి తండ్రులు గాని ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగియుండలేదు.
కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను.
    యూదా ప్రజలను వారు చంపివేస్తారు.
    ప్రజలెవ్వరూ మిగలకుండా వారు చంపివేస్తారు.”

17 సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు,
“ఇప్పుడు నీవీ విషయాల గురించి అలోచించుము!
    శవాలకు అంత్యక్రియలు జరిపించేటప్పుడు విలపించేందుకు సొమ్ము తీసుకొనే స్త్రీలను పిలిపించుము.
    కార్యములు నిర్వహించుటలో అనుభవమున్న వారిని పిలువనంపుము.
18 ‘ఆ స్త్రీలను వెంటనే వచ్చి మాకొరకు విలపించమనండి.
అప్పుడు మా నేత్రాలు కన్నీటితో నిండిపోతాయి.
    కన్నీరు కాలువలై ప్రవహిస్తుంది’ అని ప్రజలంటారు.

19 “సీయోను నుండి గట్టిగా విలపించే రోదన,
    ‘మేము నిజంగా నాశనమయ్యాము!
    మేము నిజంగా అవమానం పాలైనాము!
మా ఇండ్లు నాశనం చేయబడినాయి కావున మేము మా రాజ్యాన్ని వదిలి పోవాలి’ అంటూ వినిపిస్తూ ఉంది.”

20 యూదా స్త్రీలారా, యెహోవా వర్తమానం మీరిప్పుడు వినండి.
    యెహోవా వాక్కు వినటానికి మీ చెవులనివ్వండి.
యెహోవా ఇలా అంటున్నాడు, మీ కుమార్తెలకు గగ్గోలుగా విలపించటం ఎలానో నేర్పండి.
    ప్రతీ స్త్రీ ఈ విలాపగీతం పాడటం నేర్చుకోవాలి:
21 “మృత్యువు మా కిటికీలగుండా ఎక్కి లోనికి వచ్చింది.
    మృత్యువు మా భవనాలలో ప్రవేశించింది.
వీధుల్లో ఆడుకొంటున్న మా పిల్లల వద్దకు మృత్యువు వచ్చింది.
    బహిరంగ స్థలాలలో కలుసుకొనే యువకుల వద్దకు మృత్యువు వచ్చింది.”

22 “యిర్మీయా, ‘ఇది యెహోవా వాక్కు అని చెప్పుము,
పొలాలలో పశువుల పేడలా శవాలు పడివుంటాయి.
    పంటకోత కాలంలో చేల నిండా వేసిన పనల్లా శవాలు భూమి మీద పడివుంటాయి
    కాని వాటిని తీసి వేయటానికి ఒక్కడూ ఉండడు.’”

23 యెహోవా ఇలా చెబుతున్నాడు:
“తెలివిగల వారు తమ ప్రజ్ఞా విశేషాల గురించి
    గొప్పలు చెప్పుకోరాదు.
బలవంతులు తమ బలాన్ని గురించి
    గొప్పలు చెప్పుకోరాదు.
శ్రీమంతులు తమ ఐశ్వర్యాన్ని గూర్చి
    గొప్పలు చెప్పుకోరాదు.
24 ఎవడైనా గొప్పలు చెప్పుకోదలిస్తే వానిని ఈ విషయాలపై చెప్పుకోనిమ్ము.
    నన్నతను అర్థం చేసుకున్నట్లు, నన్ను తెలుసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
నేనే నిజమైన దేవుడనని తను అర్థం చేసుకున్నట్లు గొప్పలు చెప్పుకోనిమ్ము.
    నేను దయామయుడనని, న్యాయవర్తనుడనని గొప్పలు చెప్పనిమ్ము.
    యెహోవానైన నేను భూమి మీద మంచి కార్యాలు నెరవేర్చు తానని గొప్పలు చెప్పనీయుము.
    నేను ఆ పనులన్నీ చేయటానికి యిష్టపడతాను.”
ఈ వర్తమానం యెహోవా వద్దనుండి వచ్చినది.

25 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది: “శారీరకంగా మాత్రమే సున్నతి సంస్కారం పొందిన వారిని నేను శిక్షించే సమయము ఆసన్నమవుతూ ఉంది. 26 తమ చెంపలను కత్తిరించే ఈజిప్టు, యూదా, ఎదోము, అమ్మోను, మోయాబు ప్రజలు మరియు ఎడారిలో నివసించే జనులందరిని గూర్చి నేను మాట్లాడుతున్నాను. ఈ దేశాలలోని పురుషులు శారీరకంగా సున్నతి సంస్కారం పొందియుండలేదు. కాని ఇశ్రాయేలు కుటుంబం నుండి వచ్చిన ప్రజలు హృదయ సంబంధమైన సున్నతి సంస్కారం కలిగియుండలేదు.”

అపొస్తలుల కార్యములు 4:1-12

అపొస్తలులు మరియు యూదుల మహాసభ

యాజకులు, మందిరం యొక్క ద్వారపాలకుల అధిపతి, సద్దూకయ్యులు కలిసి పేతురు, యోహాను ఉన్న చోటికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ప్రజలకు ఉపదేశిస్తూ ఉన్నారు. ఆ అపొస్తలులు ప్రజలకు ఉపదేశించటం, యేసును ఉదాహరణగా తీసుకొని చనిపోయినవాళ్ళు బ్రతికి వస్తారని ప్రకటించటం విని వాళ్ళకు చాలా కోపం వచ్చింది. వాళ్ళు పేతురును, యోహానును బంధించారు. అప్పటికే సాయంకాలమై ఉండటం వల్ల మరుసటి రోజు దాకా వాళ్ళను బంధించి ఉంచారు. వాళ్ళ సందేశాన్ని విని అనేకులు విశ్వాసులయ్యారు. ఆ విశ్వాసుల సంఖ్య సుమారు అయిదు వేలదాకా పెరిగిపోయింది.

మరుసటి రోజు నాయకులు, పెద్దలు, పండితులు యెరూషలేములో సమావేశం అయ్యారు. “అన్న” అనే ప్రధాన యాజకుడు, కయప, యోహాను, అలెక్సంద్రు, ప్రధాన యాజకుని కుటుంబానికి చెందినవాళ్ళంతా ఆ సమావేశంలో ఉన్నారు. పేతురును, యోహానును వీళ్ళ ముందుకు పిలుచుకు వచ్చారు. “ఏ అధికారంతో, ఎవరి పేరిట మీరాపని చేసారు?” అని వాళ్ళు ప్రశ్నించటం మొదలు పెట్టారు.

అదే సమయంలో, పేతురు పవిత్రాత్మతో నిండినవాడై వాళ్ళకు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ప్రజా నాయకులారా! పెద్దరాలా! ఒక కుంటివానికి చేసిన ఉపకారాన్ని గురించి మమ్మల్ని ప్రశ్నించాలనుకొంటున్నారా? అతనికి ఎవరు నయం చేసారని తెలుసుకోవాలనుకొంటున్నారా? 10 అలాగైతే మీరు, ఇశ్రాయేలు ప్రజలు ఇది తెలుసుకోవాలి. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట ఈ కుంటివాడు పూర్తిగా నయమై మీ ముందు నిలుచున్నాడు. మీరు యేసును సిలువకు వేసి చంపినా దేవుడాయన్ని బ్రతికించాడు.

11 ‘ఇల్లు కట్టువాళ్ళైన మీరు పారవేసిన రాయి ఈ యేసే!
    ఇప్పుడది మూలకు తలరాయి అయింది.’(A)

12 రక్షణ యింకెవరి ద్వారా లభించదు. ఎందుకంటే, రక్షణ పొందటానికి ఈ పేరు (యేసు క్రీస్తు) తప్ప మరే పేరును దేవుడు మానవులకు తెలుపలేదు. ఈ పేరుకు తప్ప ఆ శక్తి ప్రపంచంలో మనుష్యులకివ్వబడిన మరే పేరుకు లేదు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International