Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
14 “మనమిక్కడ అనవసరంగా ఎందుకు కూర్చున్నాము?
రండి, బలమైన నగరాలకు పారిపోదాం.
మన దేవుడైన యెహోవా మనల్ని చంపబోతూవుంటే, మనం అక్కడే చనిపోదాం.
మనం యెహోవా పట్ల తీరని పాపం చేశాం.
అందుచేత దేవుడు విషం కలిపిన నీటిని మనకు తాగటానికి ఇచ్చాడు.
15 మనం శాంతిని కోరుకున్నాం;
కాని శాంతి కలుగలేదు.
స్వస్థత సమయం కొరకు ఎదురు చూశాం,
కాని విపత్తు మాత్రమే ముంచుకొచ్చింది.
16 దాను వంశీయుల రాజ్యంనుండి
శత్రు గుర్రాల వగర్పులు వినిపిస్తూ ఉన్నాయి.
వాటి డెక్కల తాకిడికి భూమి కంపిస్తూ ఉంది.
వారీ దేశాన్ని, దానిలో నివసిస్తున్న ప్రతి దాన్నీ
నాశనం చేయాలని వచ్చియున్నారు.
వారీ నగరాన్ని, నగరవాసులను
సర్వనాశనం చేయటానికి వచ్చారు.
17 “యూదా ప్రజలారా, మీ మీదికి విషసర్పాలను[a] పంపుతున్నాను.
ఆ సర్పాలను అదుపుచేయటం సాధ్యపడదు.
ఆ విషనాగులు మిమ్మల్ని కాటు వేస్తాయి.”
ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.!
2 ప్రయాణీకులు రాత్రిలో తలదాచుకొనే ఇల్లు వంటి ప్రదేశం
ఎడారిలో నాకొకటి ఉంటే
అక్కడ నా ప్రజలను వదిలి వేయగలను.
వారినుండి నేను దూరంగా పోగలను!
ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు.
వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు.
3 “వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు.
వాటినుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి.
సత్యం కాదు కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది.
వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు.
వారు నన్నెరుగకున్నారు.”
ఈ విషయాలు యెహోవా చెప్పియున్నాడు.
4 “మీ పొరుగు వారిని కనిపెట్టి ఉండండి!
మీ స్వంత సోదరులనే మీరు నమ్మవద్దు!
ఎందువల్లనంటే ప్రతి సోదరుడూ మోసగాడే.
ప్రతి పొరుగు వాడూ నీ వెనుక చాటున మాట్లాడేవాడే.
5 ప్రతివాడూ తన పొరుగువానితో అబద్ధములు చెప్పును.
ఎవ్వడూ సత్యం పలుకడు.
యూదా ప్రజలు అబద్ధమాడుటలో
తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు.
వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది!
6 ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది.
అబద్ధాలను అబద్ధాలు అనుసరించాయి!
ప్రజలు నన్ను తెలుసుకోవటానికి నిరాకరించారు.” ఈ
విషయాలను యెహోవా చెప్పినాడు!
7 కావున, సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెబుతున్నాడు,
“లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యూదా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను!
నాకు వేరే మార్గం లేదు.
నా ప్రజలు పాపం చేశారు.
8 యూదా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు.
వారి నాలుకలు అబద్ధాలనే మాట్లాడతాయి.
ప్రతివాడూ తన పొరుగు వానితో పైకి ఇంపుగానే మాట్లాడతాడు.
కాని అతడు తన పొరుగు వానిని ఎదిరించటానికి రహస్య పథకాలు వేస్తాడు.
9 మరి యూదా ప్రజలు ఈ పనులన్నీ చేస్తున్నందుకు నేను వారిని శిక్షించవద్దా?”
“ఆ రకమైన ప్రజలను నేను శిక్షించాలని నీకు తెలుసు.
నేను వారికి తగిన శిక్ష విధించాలి.”
ఇది యెహోవా వాక్కు.
10 నేను (యిర్మీయా) కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను.
వట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడతాను.
ఎందువల్లనంటే జీవించివున్నవన్నీ పోయినాయి.
ఎవ్వడూ అక్కడ పయనించడు.
ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు.
పక్షులు ఎగిరి పోయాయి:
పశువులు పారిపోయాయి.
11 “నేను (యెహోవా) యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను.
అది గుంట నక్కలకు[a] స్థావరమవుతుంది.
నేను యూదా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను.
అందుచే అక్కడ ఎవ్వరూ నివసించరు.”
నిజమైన కానుక
(లూకా 21:1-4)
41 ఒక రోజు యేసు, మందిరంలో కానుకలు వేసే పెట్టెకు ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఆ పెట్టెలో డబ్బును వేయటం ఆయన గమనించాడు. ధనవంతులు చాలామంది పెద్ద పెద్ద మొత్తాల్ని ఆ పెట్టెలో వేసారు. 42 కాని ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణెములను ఆ పెట్టెలో వేసింది.
43 యేసు తన శిష్యులను దగ్గరకు పిలిచి, “ఇది నిజం. ఈ పేద వితంతువు ఆ పెట్టెలో అందరికన్నా ఎక్కువ డబ్బు వేసింది. 44 మిగతా వాళ్ళు తాము దాచుకొన్న ధనంలో కొంత భాగం మాత్రమే వేసారు. కాని ఆమె పేదదైనా తన దగ్గరున్నదంతా వేసింది” అని అన్నాడు.
© 1997 Bible League International