Revised Common Lectionary (Semicontinuous)
40 దేవునికి తన ప్రజల మీద కోపం వచ్చింది.
దేవుడు వారితో విసిగిపోయాడు!
41 దేవుడు తన ప్రజలను ఇతర రాజ్యాలకు అప్పగించాడు.
వారి శత్రువులు వారిని పాలించేటట్టుగా దేవుడు చేసాడు.
42 దేవుని ప్రజలను శత్రువులు తమ అదుపులో పెట్టుకొని
వారికి జీవితాన్నే కష్టతరం చేసారు.
43 దేవుడు తన ప్రజలను అనేకసార్లు రక్షించాడు.
కాని వారు దేవునికి విరోధంగా తిరిగి వారు కోరిన వాటినే చేశారు.
దేవుని ప్రజలు ఎన్నెన్నో చెడ్డపనులు చేసారు.
44 కాని దేవుని ప్రజలు ఎప్పుడు కష్టంలో ఉన్నా వారు సహాయం కోసం ఎల్లప్పుడూ దేవునికి మొరపెట్టారు.
ప్రతిసారి దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు.
45 దేవుడు తన ఒడంబడికను ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొన్నాడు.
దేవుడు ఎల్లప్పుడూ తన గొప్ప ప్రేమతో వారిని ఆదరించాడు.
46 ఆ ఇతర ప్రజలు దేవుని ప్రజలను ఖైదీలుగా పట్టుకొన్నారు.
అయితే దేవుడు తన ప్రజల యెడల ఆ మనుష్యులు దయ చూపునట్లు చేశాడు.
47 మా దేవుడవైన యెహోవా, మమ్ములను రక్షించు.
నీ పవిత్ర నామాన్ని స్తుతించగలిగేలా
ఈ జనముల మధ్యనుండి మమ్మల్ని సమీకరించుము.
అప్పుడు నీకు మేము స్తుతులు పాడగలం.
48 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
దేవుడు ఎల్లప్పుడూ జీవిస్తున్నాడు, ఆయన శాశ్వతంగా జీవిస్తాడు.
మరియు ప్రజలందరూ, “ఆమేన్! యెహోవాను స్తుతించండి!” అని చెప్పారు.
నాశనం వస్తూవుంది
17 మీకున్నదంతా సర్దుకొని వెళ్లటానికి సిద్దమవ్వండి.
యూదా ప్రజలారా మీరు నగరంలో చిక్కుకున్నారు.
శత్రువులు నగరాన్ని చుట్టు ముట్టారు.
18 యెహోవా ఇలా చెప్పాడు,
“ఈ సారి యూదా ప్రజలను ఈ దేశంనుండి వెళ్ల గొడతాను.
వారికి బాధను, శ్రమను కలుగజేస్తాను.
వారికి ఒక గుణ పాఠం నేర్పటానికి నేనిదంతా చేస్తాను.”[a]
19 అయ్యో నేను (యిర్మీయా) బాగా గాయపడ్డాను
నా గాయం మానరానిది.
“ఇది నా రోగం, నేను దానిచే బాధ పడవలసినదే”
అని నేను తలపోశాను.
20 నా గుడారం పాడైపోయింది.
దాని తాళ్లన్నీ తెగిపోయాయి.
నా పిల్లలు నన్ను వదిలేశారు.
వారు వెళ్లిపోయారు.
నా గుడారం మరల నిర్మించటానికి సహాయం చేయుటకు ఒక్కడు కూడా మిగలలేదు.
నాకు ఆశ్రయం కల్పించటానికి ఒక్కడూ మిగలలేదు.
21 గొర్రెల కాపరులు (నాయకులు) మందమతులయ్యారు!
వారు యెహోవాను కనుగొనే ప్రయత్నం చేయరు,
వారు జ్ఞాన శూన్యులు.
అందువల్లనే వారి మందలు (ప్రజలు) చెల్లాచెదురై తప్పిపోయాయి.
22 ఒక పెద్ద శబ్దం వస్తోంది, వినుము!
ఆ పెద్ద శబ్దం ఉత్తర దిశనుండి వస్తూవుంది.
అది యూదా నగరాలను నాశనం చేస్తుంది.
యూదా ఒక వట్టి ఎడారిలా మారుతుంది.
అది గుంట నక్కలకు స్థావరమవుతుంది.
23 యెహోవా, వారి స్వంత జీవితాలను వారి స్వాధీనంలో ఉంచుకోరని నాకు తెలుసు.
ప్రజలు వారి భవిష్యత్తును గూర్చి పథకాలను వేసుకోలేరు.
జీవించుటకు సరైన మార్గం వారికి తెలియదు.
ఏది సన్మార్గమో ప్రజలకు నిజంగా తెలియదు.
24 యెహోవా, మమ్మల్ని సరిదిద్దుము!
నీవు మమ్ము నశింపజేయవచ్చు
కాని మాపట్ల నిష్పక్షపాతంగా వుండుము!
కోపంలో మమ్మల్ని శిక్షించవద్దు!
25 నీకు కోపంవస్తే,
అన్యదేశాలను శిక్షించుము.
వారు నిన్నెరుగరు; గౌరవించరు.
ఆ ప్రజలు నిన్ను పూజించరు.
ఆ రాజ్యాలు యాకోబు వంశాన్ని నాశనం చేశాయి.
వారు ఇశ్రాయేలును పూర్తిగా నాశనం చేశారు.
వారు ఇశ్రాయేలు యొక్క స్వంత దేశాన్ని నాశనం చేశారు.
శాస్త్రుల్ని విమర్శించటం
(మత్తయి 23:1-36; మార్కు 12:38-40; లూకా 11:37-54)
45 ప్రజలు యేసు చెబుతున్న విషయాలు వింటూ అక్కడే ఉన్నారు. ఆయన తన శిష్యులకు ఈ విధంగా చెప్పాడు: 46 “శాస్త్రుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నిండుగా అంగీలువేసుకొని తిరగాలి అంటే వారికి చాలా యిష్టం. సంతలో నడుస్తున్నప్పుడు ప్రజలు దండాలు పెడితే సంతసిస్తారు. విందుకు వెళ్ళినప్పుడు, సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ముఖ్యమైన స్థానాల్లో కూర్చోవటానికి ప్రాకులాడుతారు. 47 వితంతువుల్ని మోసం చేసి వాళ్ళ ఇళ్ళు దోచుకుంటారు. కాని పైకి మాత్రం చాలాసేపు ప్రార్థనలు చేస్తూవుంటారు. అలాంటి వాళ్ళను దేవుడు తీవ్రంగా శిక్షిస్తాడు.”
నిజమైన కానుక
(మార్కు 12:41-44)
21 యేసు చుట్టూ చూసాడు. ధనవంతులు హుండీలో కానుకలు వేయటం ఆయన గమనించాడు. 2 అతి పేదరాలైన ఒక వితంతువు రెండు పైసాలు హుండీలో వెయ్యటం కూడా ఆయన గమనించాడు. 3 ఆయన, “నేను చెప్పేదేమిటంటే ఈ బీదవితంతువు అందరికన్నా ఎక్కువ ఆ హుండిలో వేసింది. 4 యితర్లు తమ దగ్గరున్న సంపద నుండి కొంత మాత్రమే కానుకగా వేసారు. కాని ఆమె తాను జీవించటానికి దాచుకొన్నదంతా ఆ హుండీలో వేసింది” అని అన్నాడు.
© 1997 Bible League International