Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
14 “ప్రజలు ప్రమాణాలు చేస్తూ, ‘ఇశ్రాయేలీయులను ఈజిప్టునుండి తీసుకొని వచ్చిన నిత్యుడైన దేవునితోడు’ అని వారు అంటారు. కాని ప్రజలు ఈ మాటలు అనకుండా ఉండే సమయం ఆసన్నమవుతూఉంది.” ఇది యెహోవా వాక్కు. 15 ప్రజలు వాగ్దానాలు చేసి అంటారు: “నిత్యుడైన దేవుని సాక్షిగా అని, ‘ఇశ్రాయేలీయులను ఉత్తర దేశంనుండి తీసుకొని వచ్చినది నిత్యుడైన యెహోవాయే!’ అని, ‘ఇశ్రాయేలీయులను ఆయన పంపిన దేశాలనుండి మరల తీసుకొని వచ్చినది ఆయనే’ అని అంటారు. ప్రజలు ఇలా ఎందుకు అంటారు? ఎందువల్లనంటే ఇశ్రాయేలీయులను వారి పూర్వీకులకు నేనిచ్చిన రాజ్యానికి మరల తీకుకొనివస్తాను.
16 “ఈ రాజ్యానికి చాలామంది జాలరులను త్వరలో పంపిస్తాను” ఇది యెహోవా వాక్కు “ఆ జాలరులు యూదా ప్రజలను పట్టుకుంటారు. అది జరిగిన పిమ్మట ఈ రాజ్యానికి చాలామంది వేటగాండ్రను పిలిపిస్తాను. ఈ వేటగాండ్రు[a] యూదావారిని ప్రతి కొండమీద, పర్వతంమీద, కొండ బొరియల్లోను వేటాడతారు. 17 వారు చేసేదంతా నేను చూస్తాను. యూదా వారు చేసేది దేనినీ నానుండి దాచలేరు. వారి పాపం నానుండి మరుగు పర్చబడలేదు. 18 యూదా ప్రజలు చేసిన దుష్కార్యాలకు తగిన శిక్ష విధిస్తాను. వారి ప్రతి పాపానికీ రెండు సార్లు శిక్షిస్తాను. ఇది ఎందుకు చేస్తానంటే, వారు నా రాజ్యాన్ని ‘అపవిత్ర’ పర్చారు. వారు నా రాజ్యాన్ని భయంకరమైన విగ్రహాలతో ‘కలుషితం’ చేశారు. ఆ విగ్రహాలను నేను అసహ్యించుకుంటాను. కాని వారు నా దేశాన్నంతా ఘోరమైన చెడు విగ్రహాలతో నింపివేశారు.”
19 యెహోవా, నీవే నాకు బలం; నీవే నాకు రక్షణ.
ఆపదలో తలదాచుకోటానికి నీవే సురక్షితమైన చోటు.
ప్రపంచ దేశాలన్నీ నీ శరణు వేడి వస్తాయి.
ఆ దేశాల వారంతా ఇలా అంటారు: “మా పితరులు చాలామంది బూటకపు దేవుళ్లను నమ్మారు.
వారా పనికిమాలిన విగ్రహాలను ఆరాధించారు.
కాని ఆ విగ్రహాలు వారికి ఏ రకంగానూ సహాయపడలేవు.
20 ప్రజలు వారికై వారు నిజమైన దేవతలను చేయగలరా?
చేయలేరు! వారు విగ్రహాలను మాత్రమే చేయగలరు. కాని ఆ బొమ్మలు నిజానికి దేవుళ్లే కారు!”
21 “అందుచేత బొమ్మల దేవుళ్లను చేసేవారికి నేను గుణపాఠం నేర్పుతాను.
ఇప్పుడే వారికి నా శక్తిని గురించీ, నా బలాన్ని గురించీ తెలియజెబుతాను.
అప్పుడు నేనే దేవుడననే జ్ఞానం వారికి కలుగుతుంది.
నేనే యోహోవా అని వారు తెలుసుకుంటారు.”
నేరం గుండెపై వ్రాయబడింది
17 “యూదా ప్రజల పాపం తుడిచి వేయలేని
చోట వ్రాయబడింది.
వారి పాపాలు ఇనుపకలంతో రాతిలోకి చెక్కబడ్డాయి.
వారి పాపాలు వజ్రపు మొనతో రాతిలోకి చెక్కబడ్డాయి.
వారి గుండెలే ఆ రాతి ఫలకలు.
2 బూటకపు దేవుళ్లకు అంకితం చేసిన బలిపీఠాలు
వారి పిల్లలకు గుర్తున్నాయి.
ఆ పాపాలన్నీ బలిపీఠం కొమ్ములమీద[b] చెక్కబడినాయి.
అషేరా దేవతకు అంకితం చేయబడిన
దేవతా చెక్కస్తంభాలు కూడ వారికి గుర్తున్నాయి.
కొండలమీద, పచ్చని చెట్లక్రింద జరిగిన
తంత్రాలన్నీ వారికి గుర్తున్నాయి.
3 మైదాన ప్రదేశాలలోగల పర్వాతాల మీద జరిగిన
సంగతులు వారికి గుర్తున్నాయి.
యూదా ప్రజలకు నిధి నిక్షేపాలున్నాయి.
వాటిని నేను అన్య ప్రజలకు ఇచ్చివేస్తాను!
మీ దేశంలోగల ఉన్నత స్థలాలన్నీ (పూజా ప్రదేశాలు) ప్రజలు నాశనం చేస్తారు.
ఆ ప్రదేశాలలో ఆరాధనలు చేసి మీరు పాపం చేశారు.
4 నేను మీకిచ్చిన రాజ్యాన్ని పోగొట్టుకుంటారు.
మీ విరోధులు మిమ్మల్ని బానిసలుగా తీసుకొని పోయేలా చేస్తాను.
ఎందువల్లనంటే, నేను చాలా కోపంగా ఉన్నాను.
నా కోపం దహించే అగ్నిలా ఉంది. మీరందులో శాశ్వతంగ కాలిపోతారు.”
చివరి మాట
7 “తుకికు” నా గురించి అన్ని విషయాలు మీకు చెబుతాడు. అతడు విశ్వాసం గల పరిచారకుడు. ప్రభువు సేవ చేయటంలో నా సహచరుడు. 8 మా పరిస్థితులు మీకు తెలియాలనీ, అతడు మీ మనస్సుకు శాంతి కలిగించాలనే ముఖ్యోద్దేశంతో అతణ్ణి మీ దగ్గరకు పంపుతున్నాను. 9 మనకు ప్రియ సోదరుడు, విశ్వాసం కలవాడు అయినటువంటి ఒనేసిముతో కలిసి అతడు వస్తున్నాడు. “ఒనేసిము” మీ వద్దనుండి వచ్చినవాడే. ఇక్కడ జరుగుతున్నవన్నీ వాళ్ళు చెబుతారు.
10 నాతో కారాగారంలో ఉన్న “అరిస్తార్కు”, “మార్కు” మీకు వందనములు తెలుపుతున్నారు. మార్కు బర్నబాకు మేనల్లుడు. మార్కు కోసం మీరు చేయవలసినవాటిని గురించి యిదివరకే చెప్పాను. అతడక్కడికి వస్తే అతనికి స్వాగతం చెప్పండి. 11 “యూస్తు” అని పిలువబడే యేసు కూడా మీకు వందనములు చెప్పమన్నాడు. దేవుని రాజ్యం కొరకు నాతో కలిసి పని చేస్తున్నవాళ్ళలో ఈ ముగ్గురు మాత్రమే యూదా మతము నుండి మనలో చేరినవారు. నా ఈ కృషిలో వాళ్ళు నాకు చాలా ఆదరణగా ఉన్నారు.
12 మీలో ఒకడైన “ఎపఫ్రా” మీకు వందనములు తెలుపుతున్నాడు. ఇతడు యేసు క్రీస్తు సేవకుడు. మీకు దైవేచ్ఛపై పూర్తిగా విశ్వాసం ఉండాలనీ, మీరు ఆత్మీయంగా పరిపూర్ణత పొందాలనీ, మీ కొరకు అతడు దేవుణ్ణి పట్టుదలతో ప్రార్థిస్తూ ఉన్నాడు. 13 ఇతడు మీకోసం “లవొదికయ” “హియెరాపొలి” గ్రామాలలోనివాళ్ళ కోసం కష్టపడి పని చేస్తున్నాడని నేను గట్టిగా చెప్పగలను. 14 మన ప్రియమిత్రుడు, వైద్యుడైన “లూకా” మరియు “దేమాయు” మీకు వందనములు చెపుతున్నారు.
15 లవొదికయలోని సోదరులకు, “నుంఫా” కు, ఆమె యింట్లోని క్రీస్తు సంఘానికి నా శుభాకాంక్షలు. 16 ఈ లేఖను మీ సంఘంలో చదివాక, లవొదికయలోనున్న సంఘంలో కూడా చదివేటట్లు చూడండి. ఆ తర్వాత లవొదికయ నుండి వచ్చిన లేఖను మీ సంఘంలో చదవండి. 17 ప్రభువు అప్పగించిన కార్యాన్ని పూర్తి చెయ్యమని “అర్ఖిప్పు” తో చెప్పండి.
© 1997 Bible League International