Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 91:1-6

91 మహోన్నతుడైన దేవుని ఆశ్రయంలో నివసించే వాడు
    సర్వశక్తిమంతుడైన దేవుని నీడలో విశ్రాంతి తీసుకొంటాడు.
“నీవే నా క్షేమ స్థానం, నా కోట. నా దేవా, నేను నిన్నే నమ్ముకొన్నాను.”
    అని నేను యెహోవాకు చెబుతాను.
దాగి ఉన్న అపాయాలన్నింటి నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
    ప్రమాదకరమైన రోగాలన్నింటినుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు.
కాపుదలకోసం నీవు దేవుని దగ్గరకు వెళ్లవచ్చు.
    పక్షి తన రెక్కలతో దాని పిల్లలను కప్పునట్లు ఆయన నిన్ను కాపాడుతాడు.
    దేవుడు కేడెంగా, నిన్ను కాపాడే గోడలా ఉంటాడు.
రాత్రివేళ నీవు దేనికి భయపడవు.
    పగటివేళ శత్రువు బాణాలకు నీవు భయపడవు.
చీకటిలో దాపురించే రోగాలకు గాని
    మధ్యాహ్నం వేళ దాపురించే వ్యాధులకుగాని నీవు భయపడవు.

కీర్తనలు. 91:14-16

14 యెహోవా చెబుతున్నాడు: “ఒక వ్యక్తి నన్ను నమ్ముకొంటే, నేను అతన్ని రక్షిస్తాను.
    నా పేరు అతనికి తెలుసు కనుక నేను కాపాడుతాను.
15 నా అనుచరులు సహాయంకోసం నాకు మొరపెడ్తారు.
    నేను వారికి జవాబు ఇస్తాను.
    వారికి కష్టం కలిగినప్పుడు నేను వారితో ఉంటాను. నేను వారిని తప్పించి, ఘనపరుస్తాను.
16 నా అనుచరులకు నేను దీర్ఘాయుష్షు యిస్తాను.
    నేను వాళ్లను రక్షిస్తాను.”

యిర్మీయా 23:23-32

23 “ఇక్కడ ఈ స్థలములో నేను దేవుడను.
    నేను దూర ప్రాంతంలో కూడా దేవుడను.
ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం
    నేను దూరంలో లేను!
24 ఒక వ్యక్తి నాకు కనపడకుండా రహస్య స్థావరంలో దాగటానికి ప్రయత్నించవచ్చు.
కాని వానిని చూడటం నాకు తేలిక ఎందువల్లనంటే
    నేను స్వర్గంలోను, భూమి మీద సర్వత్రా వ్యాపించి వున్నాను!”

25 “నా పేరు మీద అబద్ధాలు బోధించే ప్రవక్తలున్నారు. ‘నాకు స్వప్న దర్శనమయింది. నాకు స్వప్న దర్శనమయింది,’ అని వారంటారు. వారు అలా చెప్పటం నేను విన్నాను. 26 ఎంత కాలం ఇది కొన సాగుతుంది? ఆ ప్రవక్తలు అబద్ధాలనే ఆలోచిస్తారు. వారు ఆలోచించిన అబద్ధాలనే ప్రజలకు భోదిస్తారు. 27 యూదా ప్రజలు నా పేరు మర్చి పోయేలా చేయటానికి ఆ ప్రవక్తలు ప్రయత్నిస్తున్నారు. వారొకరి కొకరు ఈ దొంగ కలల గురించి చెప్పుకొనటం ద్వారా ఇది సాధించాలని చూస్తున్నారు. తమ పూర్వీకులు నన్ను మర్చిపోయిన రీతిగా, ఇప్పుడు నా ప్రజలు నన్ను మర్చిపోయేలా చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. వారి పూర్వీకులు నన్ను మర్చిపోయి, బూటకపు దేవత బయలును ఆరాధించారు. 28 ఎండుగడ్డి, గోధుమలు ఒక్కటి గావు! అదే రీతిగా, ఆ ప్రవక్తల కలలు నా సందేశాలు కానేరవు. ఎవరైనా తన కలలను గూర్చి చెప్పుకోదలిస్తే చెప్పవివ్వండి. కాని నా వర్తమానం విన్నవాడు మాత్రం దానిని యదార్థంగా చెప్పాలి. 29 నా సందేశం అగ్నిలావుంటుంది” ఇదే యెహోవా వాక్కు “అది ఒక బండను పగులకొట్టే సమ్మెటలా ఉంటుంది.

30 “కావున ఆ దొంగ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇది యెహోవా నుండి వచ్చిన వర్తమానం “ఈ ప్రవక్తలు ఒకరి నుండి ఒకరు నా మాటలు దొంగిలించటానికి ప్రయత్నిస్తూ ఉంటారు.[a] 31 నేను ఈ దొంగ ప్రవక్తలకు వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారు కల్పించిన మాటలనే వారు ఉపయోగిస్తూ, అది నా సందేశమన్నట్లు నటిస్తారు. 32 అసత్య దర్శనాలను బోధించే ఈ ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.” ఇదే యెహోవా వాక్కు. “వారి అబద్ధాల ద్వారా అసత్య ప్రచారాల ద్వారా వారు నా ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారు. ప్రజలకు బోధించే నిమిత్తం ఆ ప్రవక్తలను నేను పంపియుండలేదు! నా తరఫున ఏమి చేయటానికీ నేను వారికి ఆజ్ఞ ఇవ్వలేదు! యూదా ప్రజలకు వారేరకంగా సహాయపడలేరు.” ఇదే యెహోవా వాక్కు.

ఎఫెసీయులకు 2:1-10

క్రీస్తులో పునర్జీవం

ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.

కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.

మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International