Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
యిర్మీయా 18:1-11

కుమ్మరి మరియు బంకమట్టి

18 ఈ వర్తమానం యిర్మీయాకు యెహోవానుండి వచ్చినది: “యిర్మీయా, కుమ్మరి వాని ఇంటికి వెళ్లు. నా వర్తమానం నీకు అక్కడ యిస్తాను.”

నేను కుమ్మరివాని ఇంటికి వెళ్లాను. ఆ కుమ్మరి తన సారె (చక్రం) పై కుండలు చేస్తున్నాడు. బంకమన్నుతో అతడొక కుండను చేస్తున్నాడు. కాని ఆ కుండరూపులో ఏదో లోపం వచ్చింది. చేసే కుండను తీసివేసి ఆ మట్టితో కుమ్మరి మరో కుండను చేశాడు. తన చేతి వ్రేళ్లను నైపుణ్యంగా ఉపయోగించి తనుకోరిన రీతిగా కుండను మలిచాడు.

అప్పుడు యెహోవా వాక్కు నాకు వినిపించింది: “ఇశ్రాయేలు వంశమా, నేను (యెహోవా) నీ విషయంలో కూడా అదేరీతిగా చేయగలనని నీకు తెలుసు. నీవు కుమ్మరి చేతిలో మట్టిలా వున్నావు. నేను కుమ్మరి వానిలా వున్నాను! నేను ఒక దేశాన్ని గురించిగాని, ఒక సామ్రాజ్యాన్ని గురించి గాని మాట్లాడే సమయం రావచ్చు. నేనారాజ్యాన్ని పెరికి వేయగలనని చెప్పవచ్చు. లేదా, ఆ దేశాన్నిగాని, ఆ సామ్రాజ్యాన్నిగాని క్రిందికి లాగి నాశనం చేస్తానని నేను అంటాను. అయితే ఆ దేశపు ప్రజలు మనస్సు మార్చుకొని తమ నడవడికను సరిచేసికోవచ్చు. ఆ దేశ ప్రజలు దుష్టకార్యాలు చేయటం మానివేయవచ్చు. అప్పుడు నా మనస్సును కూడా నేను మార్చుకుంటాను. ఆ దేశానికి బాధలు తెచ్చి పెట్టిన పథకాన్ని నేను అమలుపర్చను. ఒక దేశాన్ని గురించి నేను ప్రస్తావించే మరో సమయంరావచ్చు. నేనా దేశాన్ని తీర్చిదిద్ది, దాన్ని సుస్థిర పరుస్తానని అనవచ్చు. 10 కాని ఆ దేశ ప్రజలు నాకు విధేయులుకాకుండా దుష్టకార్యాలు చేస్తూ ఉండవచ్చు. అప్పుడు ఆ దేశానికి చేయదలచుకున్న మంచి పనుల విషయంలో నేను పునరాలోచించవలసి వుంటుంది.

11 “కావున యిర్మీయా, యూదా ప్రజలకు, యెరూషలేము వాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడని చెప్పుము: ‘మీకు నేనిప్పుడే కష్టాలు సిద్ధం చేస్తున్నాను. మీకు వ్యతిరేకంగా పథకాలు తయారు చేస్తున్నాను. కావున మీరు చేస్తున్న దుష్టకార్యాలు చేయటం మానివేయాలి. ప్రతి ఒక్కడూ మార్పు చెందాలి. సత్కార్యాలు చేయటం మొదలు పెట్టాలి!’

కీర్తనలు. 139:1-6

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
    నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
    దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
    నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
    నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
    నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
    గ్రహించటం నాకు కష్టతరం.

కీర్తనలు. 139:13-18

13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
    నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
    నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
    నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
    ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
    నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
    కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.

ఫిలేమోనుకు 1-21

యేసు క్రీస్తు కోసం ఖైదీనైన పౌలును మరియు మన సోదరుడైన తిమోతియు, మా ప్రియ జతపనివాడైన ఫిలేమోనుకు, మరియు మన సోదరి అప్ఫియకు, మనతో సహా పోరాటం సాగిస్తున్న అర్ఖిప్పుకు, మీ యింట్లో సమావేశమయ్యే సంఘానికి వ్రాస్తున్న సంగతులు:

మన తండ్రియైన దేవుడు, మన యేసు క్రీస్తు ప్రభువు మిమ్మల్ని అనుగ్రహించి మీకు శాంతి ప్రసాదించు గాక!

ప్రార్థన, కృతజ్ఞత

కాబట్టి నేను ప్రార్థనలను చేసినప్పుడెల్లా నిన్ను జ్ఞాపకం పెట్టుకొని నా దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొనుచున్నాను. యేసు ప్రభువు పట్ల నీకున్న భక్తిని గురించి, భక్తులపట్ల నీకున్న ప్రేమను గురించి నేను విన్నాను. క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన విశ్వాసాన్ని నీవు యితరులతో ఉత్సాహంగా పంచుకోగల్గాలనీ నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. సోదరా! నీవు భక్తులకు సహాయం చేసి వాళ్ళను ఆనందపరిచావు. కనుక నీ ప్రేమ నాకు చాలా ఆనందమును, తృప్తిని కల్గించింది.

ఒనేసిము కొరకు విజ్ఞప్తి

క్రీస్తు పేరిట నీవు చేయవలసిన కర్తవ్యాలను ఆజ్ఞాపించగల అధికారం నాకున్నా, నేను ప్రేమతో నీకు విజ్ఞప్తి చేస్తున్నాను. పౌలను నేను, వయస్సు మళ్ళిన వాణ్ణిగా, యేసు క్రీస్తు ఖైదీని. 10 నా కుమారునితో సమానమైన ఒనేసిము విషయంలో నిన్ను ఒకటి వేడుకొంటున్నాను. నేను ఖైదీగా ఉన్నప్పుడు అతడు నా కుమారుడయ్యాడు. 11 గతంలో అతనివలన నీకు ఉపయోగం లేదు. కాని యిప్పుడు అతనివలన నీకూ, నాకూ, యిద్దరికీ ఉపయోగం ఉంది.

12 నా గుండెలాంటివాడైన అతణ్ణి తిరిగి నీ దగ్గరకు పంపుతున్నాను. 13 నేను సువార్త కారణంగా ఖైదీగా ఉన్నాను. ఈ సమయంలో నీ స్థానంలో అతడు నాకు సహాయం చేయాలని నా అభిలాష, కనుక అతణ్ణి నా దగ్గరే ఉంచుకోవాలనుకొన్నాను. 14 కాని నీ అనుమతి లేకుండా నేనిది చేయదలచుకోలేదు. నీవు చేసే ఈ సహాయం నా ఒత్తిడివల్ల కాకుండా నీ యిష్ట ప్రకారం చెయ్యాలని నా ఉద్దేశ్యం.

15 ఒనేసిము నీ నుండి కొంతకాలం దూరం అయ్యాడు. చిరకాలం నీ దగ్గర ఉండాలని యిలా జరిగిందేమో. 16 అతడు యిప్పుడు దాసుడు మాత్రమే కాదు. క్రీస్తును నమ్మిన మన ప్రియ సోదరుడు. అతడు నాకు చాలా దగ్గరి వాడు. తోటి మనిషిగా, ప్రభువువల్ల కలిగిన బంధంలో ఒక సోదరునిగా, అతన్ని నీవు యింకా దగ్గరివానిగా భావిస్తావు.

17 నీవు నన్ను నీ భాగస్వామిగా భావిస్తూన్నట్లయితే నాకు స్వాగతం చెప్పినట్లే, అతనికి కూడా స్వాగతం చెప్పు. 18 అతడు నీ పట్ల ఏదైనా అపరాధం చేసి ఉంటే, లేక అతడు నీకు ఏదైనా అప్పు ఉంటే అది నా లెక్కలో వ్రాయి. 19 నేను ఆ అప్పును తీరుస్తానని పౌలు అను నేను నా స్వహస్తంతో వ్రాస్తున్నాను. కాని నీవు నీ జీవితంతో సహా నాకు బాకీ ఉన్నావని చెప్పనవసరం లేదు. 20 కనుక నా సోదరా! ప్రభువు కోసం దయచేసి నాకీ సహాయం చేయి. క్రీస్తు కారణంగా మనం సోదరులం కనుక నాకీ తృప్తి కలిగించు. 21 నీ విధేయతపై నాకు నమ్మకం ఉంది. నేను అడిగిన దానికన్నా ఎక్కువే చేస్తావని నాకు తెలుసు. అందుకే నీకు వ్రాస్తున్నాను.

లూకా 14:25-33

నన్ను వెంబడించగలవేమో తీర్మానించుకొనుము

(మత్తయి 10:37-38)

25 ప్రజలు గుంపులు గుంపులుగా యేసుతో ప్రయాణం చేస్తూవున్నారు. యేసు వాళ్ళ వైపు తిరిగి, 26 “నాతో వచ్చి, తన తల్లి తండ్రులకన్నా, తన భార్యకన్నా, తన సంతానానికన్నా, తన తోబుట్టువులకన్నా, చివరకు తన ప్రాణానికన్నా నన్ను ఎక్కువగా ప్రేమించలేనివాడు నా శిష్యుడు కాలేడు. 27 అంతేకాక తన సిలువను మోసికొని నన్ను అనుసరించనివాడు నా శిష్యుడు కాలేడు.

28 “గోపురం కట్టాలనుకొన్నవాడు కూర్చొని దానికి ఎంత వ్యయమౌతుందో అంచనా వేయడా? తన దగ్గర కావలసినంత డబ్బు ఉందో లేదో చూసుకోడా? 29-30 పునాదులు వేసాక దాన్ని పూర్తి చెయ్యలేక పోతే చూసిన వాళ్ళంతా ‘ఇతడు కట్టటం మొదలెట్టాడు కాని పూర్తి చెయ్యలేక పోయాడు’ అని అతణ్ణి హేళన చేస్తారు.

31 “అంతేకాక ఒక రాజు మరొక రాజుతో యుద్ధం చెయ్యటానికి వెళ్తాడనుకోండి. అతడు శాంతంగా కూర్చొని తన పదివేల సైన్యంతో యుద్దం చేయబోతున్న ఇరవై వేల సైన్యాన్ని ఎదిరించగలనా లేదా అని ఆలోచించడా? 32 యుద్ధం చేయలేనని అనుకుంటే సైన్యాలు దూరంగా ఉన్నప్పుడే తన రాయబారుల్ని పంపి సంధి చేసుకొంటాడు.

33 “అదే విధంగా మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి. మీరు మీకున్న వాటిని వదిలివేయకుంటే నా శిష్యులు కాలేరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International