Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
139 యెహోవా, నీవు నన్ను పరీక్షించావు.
నన్ను గూర్చి నీకు అంతా తెలుసు.
2 నేను ఎప్పుడు కూర్చునేది ఎప్పుడు లేచేది నీకు తెలుసు.
దూరంలో ఉన్నా, నా తలంపులు నీకు తెలుసు.
3 యెహోవా, నేను ఎక్కడికి వెళ్లుతున్నది, ఎప్పుడు పండుకొంటున్నది నీకు తెలుసు.
నేను చేసే ప్రతీది నీకు తెలుసు.
4 యెహోవా, నా మాటలు నా నోటిని దాటక ముందే
నేను ఏమి చెప్పాలనుకొన్నానో అది నీకు తెలుసు.
5 యెహోవా, నీవు నా ముందు, నా వెనుక, నా చుట్టూరా ఉన్నావు.
నీవు నెమ్మదిగా నీ చేయి నామీద వేస్తావు.
6 నీకు తెలిసిన విషయాలను గూర్చి నాకు ఆశ్చర్యంగా ఉంది.
గ్రహించటం నాకు కష్టతరం.
13 యెహోవా, నా శరీరమంతటినీ[a] నీవు చేశావు.
నేను ఇంకా నా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నేను నీకు తెలుసు.
14 యెహోవా, నీవు నన్ను సృష్టించినప్పుడు నీవు చేసిన ఆశ్చర్యకరమైన కార్యాలు అన్నింటి కోసం నేను నీకు వందనాలు అర్పిస్తున్నాను.
నీవు చేసే పనులు ఆశ్చర్యం, అది నాకు నిజంగా తెలుసు.
15 నన్ను గూర్చి నీకు పూర్తిగా తెలుసు. నా తల్లి గర్భంలో దాగి ఉండి,
నా శరీరం రూపాన్ని దిద్దుకుంటున్నప్పుడు నా ఎముకలు పెరగటం నీవు గమనించావు.
16 యెహోవా, నా తల్లి గర్భంలో నా శరీరం పెరగటం నీవు చూశావు.
ఈ విషయాలన్నీ నీ గ్రంథంలో వ్రాయబడ్డాయి. ప్రతిరోజు నీవు నన్ను మరువక గమనించావు.
17 దేవా, నీ తలంపులు గ్రహించటం ఎంతో కష్టతరం.
నీకు ఎంతో తెలుసు.
18 వాటిని లెక్కించగా అవి భూమి మీద ఉన్న యిసుక రేణువుల కంటే ఎక్కువగా ఉంటాయి.
కాని నేను వాటిని లెక్కిం చటం ముగించిన తర్వాత కూడా యింకా నీతోనే ఉంటాను.
యిర్మీయా మూడవ విన్నపం
14 యెహోవా, నీవు నన్ను బాగుచేస్తే
నేను నిజంగా స్వస్థపడతాను!
నన్ను రక్షిస్తే,
నేను నిజంగా రక్షింపబడతాను.
యెహోవా, నిన్ను నేను స్తుతిస్తున్నాను.
15 యూదా ప్రజలు నన్ను ప్రశ్నలడుగుతూవుంటారు.
“యిర్మీయా, యెహోవా వర్తమానం ఎక్కడ?
ఆ వర్తమానం నెరవేరేలా చేయి!” అని వారంటారు.
16 యెహోవా, నేను నీనుండి దూరంగా పారిపోలేదు.
నేను నిన్ను అనుసరించాను.
నీవు కోరిన విధంగా నేను గొర్రెలకాపరినయ్యాను.
ఆ భయంకరమైన రోజు రావాలని నేను కోరుకోలేదు.[a]
యెహోవా, నేను చెప్పిన విషయాలు నీకు తెలుసు.
జరుగుతున్నదంతా నీవు చూస్తూనే ఉన్నావు.
17 యెహోవా, నన్ను నాశనం చేయవద్దు.
కష్టకాలంలో నేను నిన్నాశ్రయిస్తాను.
18 ప్రజలు నన్ను హింసిస్తున్నారు.
వారిని సిగ్గుపడేలాచేయి.
కాని నాకు ఆశాభంగం కలుగచేయకుము.
ఆ ప్రజలనే పారిపోయేలా చేయుము.
కాని నన్ను మాత్రం పారిపోనీయవద్దు.
ఆ భయంకరమైన దుర్దినాన్ని నా శత్రువు పైకి రప్పించుము.
వారిని పూర్తిగా సర్వనాశనం చేయుము. వారిని పూర్తిగా భంగపర్చుము.
సబ్బాతు దినాన్ని పవిత్రంగా ఆచరించటం
19 యెహోవా ఈ విషయాలు నాకు చెప్పాడు: “యిర్మీయా, నీవు వెళ్లి యెరూషలేము ‘ముఖద్వారం’[b] వద్ద నిలబడు. అక్కడ యూదా రాజులు లోనికి, బయటికి వెళ్తూ ఉంటారు. అక్కడ ప్రజలకు నా వర్తమానం అందజేయి. తరువాత అన్ని ద్వారాల వద్దకూ వెళ్లి అలాగే చేయి.”
20 ఆ ప్రజలకు ఇలా చెప్పుము: “యెహోవా వర్తమానం వినండి. యూదా రాజులారా, వినండి. యూదా ప్రజలారా, వినండి. ఈ ద్వారం ద్వారా యెరూషలేములోనికి వచ్చే ప్రజలారా, మీరంతా నేను చెప్పేది వినండి! 21 యెహోవా ఈ విషయాలు చెప్పినాడు సబ్బాతు దినాన మీరేమీ బరువులు మోయకుండా జాగ్రత్త తీసుకోండి. యెరూషలేము నగర ద్వారాల గుండా విశ్రాంతి దినాన ఏమీ బరువులు తేవద్దు. 22 మీ ఇండ్లనుండి కూడా పవిత్ర విశ్రాంతి దినాన బరువులు తేవద్దు. ఆ రోజున మీరు ఏపనీ చేయవద్దు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్ర పర్చాలి. ఇదే రకపు ఆజ్ఞను మీ పూర్వీకులకు కూడ యిచ్చియున్నాను. 23 కాని మీ పూర్వీకులు నా ఆజ్ఞను శిరసావహించలేదు. వారు నేను చెప్పిన దానిని లక్ష్య పెట్టలేదు. మీ పితరులు బహు మొండివారు. నేను వారిని శిక్షించాను. కాని దానివల్ల ఏమీ మంచి జరగలేదు. వారు నేను చెప్పినది వినలేదు. 24 కాని మీరు నా ఆజ్ఞను అనుసరించేలా జాగ్రత్తపడాలి.” ఇది యెహోవా వాక్కు. “మీరు ఎట్టి పరిస్థితిలోనూ విశ్రాంతి దినాన యెరూషలేము నగర ద్వారాలనుండి బరువులు తేరాదు. మీరు విశ్రాంతి దినాన్ని పవిత్రపర్చాలి. అనగా మీరు ఆ రోజు ఏ పనీ చేయకుండా దాని పవిత్రతను కాపాడవచ్చు.
25 “‘మీరీ ఆజ్ఞను పాటిస్తే, దావీదు సింహాసనంపై కూర్చునే రాజులంతా యెరూషలేము నగర ద్వారం గుండా వస్తారు. ఆ రాజులు రధాలమీద, గుర్రాల మీద ఎక్కి వస్తారు. ఆ రాజుల వెంట యూదా, యెరూషలేము ప్రజానాయకులు కూడా వుంటారు. యెరూషలేము నగరంలో శాశ్వతంగా ప్రజలు నివసిస్తారు. 26 యూదా పట్టణాలనుండి ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. చుట్టుపట్లవున్న చిన్న చిన్న గ్రామాలనుండి కూడా ప్రజలు యెరూషలేము నగరానికి వస్తారు. బెన్యామీను వంశీయులున్న రాజ్యంనుండి కూడా ప్రజలు వస్తారు[c] పడమట నున్న కొండవాలు ప్రాంతం నుండి, మన్యప్రాంతం నుండి కూడా ప్రజలు వస్తారు. మరియు యూదా దక్షిణ ప్రాంతంనుండి కూడా నెగెవు ప్రజలు వస్తారు. ఆ ప్రజలు కృతజ్ఞతార్పణలు, దహన బలులు, బలులు, ధాన్యార్పణలు, ధూపద్రవ్వాలు, తెస్తారు. వారా అర్పణలను, బలులను యెహోవా ఆలయానికి తెస్తారు.
27 “‘అయితే, మీరు నామాట వినక నాకు విధేయులై యుండకపోతే మీకు కీడు సంభవిస్తుంది. సబ్బాతు దినాన యెరూషలేముకు మీరు బరువులు మోసుకువస్తే మీరు దానిని పవిత్ర దినంగా పరిగణించుట లేదని అర్థం. అప్పుడు నేను ఆర్పజాలని అగ్నిని ప్రజ్వరిల్ల జేస్తాను. ఆ అగ్ని యెరూషలేము ద్వారములవద్ద మొదలవుతుంది. అది భవనాలన్నిటినీ దగ్ధం చేసేవరకు మంటలు చెలరేగుతూనే ఉంటాయి.’”
యేసును వెంబడించుటవలన కష్టములు వచ్చును
(లూకా 12:51-53; 14:26-27)
34 “నేను శాంతిని నెలకొల్పటానికి వచ్చాననుకోకండి. నేను ఈ ప్రపంచంలోకి శాంతిని తీసుకు రాలేదు. కత్తిని తెచ్చాను. 35-36 ఎందుకంటే నేను,
‘తండ్రి కుమార్ల మధ్య,
తల్లీ కూతుర్ల మధ్య,
అత్తా కోడళ్ళ మధ్య,
విరోధం కలిగించాలని వచ్చాను.
ఒకే యింటికి చెందిన వాళ్ళు ఆ యింటి యజమాని శత్రువులౌతారు.’(A)
37 “తన తల్లి తండ్రుల్ని నా కన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడు కాడు. తన కొడుకును కాని, లేక కూతుర్నికాని నాకన్నా ఎక్కువగా ప్రేమించే వ్యక్తి నాతో రావటానికి అర్హుడుకాడు. 38 నన్ను వెంబడించేవాడు తనకియ్యబడిన సిలువను అంగీకరించకపోతే, నాకు యోగ్యుడు కాడు. 39 జీవితాన్ని కాపాడుకొనువాడు దాన్ని పోగొట్టుకొంటాడు. నా కోసం జీవితాన్ని పోగొట్టుకొన్నవాడు జీవితాన్ని సంపాదించుకొంటాడు.
నిన్ను ఆహ్వానించువారిని దేవడు దీవించును
(మార్కు 9:41)
40 “మిమ్మల్ని స్వీకరించువాడు నన్ను స్వీకరించినట్లే. నన్ను స్వీకరించినవాడు నన్ను పంపిన దేవుణ్ణి స్వీకరించినట్లే. 41 ఒక వ్యక్తి ప్రవక్త అయినందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి ఆ ప్రవక్త పొందిన ఫలం పొందుతాడు. ఒక వ్యక్తి నీతిమంతుడైనందుకు అతనికి స్వాగతం చెప్పిన వ్యక్తి నీతిమంతుడు పొందే ఫలం పొందుతాడు. 42 మీరు నా అనుచరులైనందుకు, ఈ అమాయకులకు ఎవరు ఒక గిన్నెడు నీళ్ళనిస్తారో వాళ్ళకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది నిజం.”
© 1997 Bible League International