Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు స్తుతి కీర్తన.
79 దేవా, కొందరు మనుష్యులు నీ ప్రజలతో యుద్ధం చేసేందుకు వచ్చారు.
ఆ మనుష్యులు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపరచి నాశనం చేసారు.
యెరూషలేమును వారు శిథిలాలుగా విడిచి పెట్టారు.
2 అడవి పక్షులు తినేందుకుగాను నీ సేవకుల దేహాలను శత్రువు విడిచిపెట్టాడు.
అడవి మృగాలు తినేందుకు నీ అనుచరుల దేహాలను వారు విడిచిపెట్టారు.
3 దేవా, నీ ప్రజల రక్తం నీళ్లలా యెరూషలేమంతటి చుట్టూ ప్రవహించేంతవరకు శత్రువు వారిని చంపాడు.
మృత దేహాలను పాతి పెట్టేందుకు ఏ ఒక్కరూ విడువబడ లేదు.
4 మా పొరుగు రాజ్యాలు మమ్మల్ని అవమానించాయి.
మా చుట్టూరా ఉన్న ప్రజలంతా మమ్మల్ని చూచి నవ్వుతూ, ఎగతాళి చేస్తున్నారు.
5 దేవా, నీవు మా మీద ఎప్పటికీ కోపంగానే ఉంటావా?
బలమైన నీ భావాలు అగ్నిలా మండుతూనే ఉంటాయా?
6 దేవా, నిన్ను ఎరుగని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
నీ నామాన్ని ఆరాధించని రాజ్యాల మీదికి నీ కోపాన్ని మరల్చుము.
7 ఎందుకంటే ఆ రాజ్యాలు యాకోబును నాశనం చేశాయి.
వారు యాకోబు దేశాన్ని నాశనం చేశారు.
8 దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము.
త్వరపడి. నీ దయ మాకు చూపించుము.
నీవు మాకు ఎంతో అవసరం.
9 మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము.
నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము.
మమ్మల్ని రక్షించుము.
నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
ఇశ్రాయేలు పొరుగు వారికి దేవుని వాగ్దానం
14 యెహోవా ఇలా చెప్పాడు, “ఇశ్రాయేలు చుట్టు పట్లవుండే ప్రజలకు నేనేమి చేస్తానో నీకు చెపుతాను. ఆ జనులు చాలా దుర్మార్గులు. నేను ఇశ్రాయేలీయుల కిచ్చిన రాజ్యాన్ని వారు ధ్వంసం చేశారు. ఆ దుష్ట జనులను నేను పెల్లగించి, వారి రాజ్యంనుండి బయటికి త్రోసివేస్తాను. వారితో పాటు యూదా వారిని కూడా పెల్లగించుతాను. 15 నేను వారిని తమ రాజ్యం నుండి భ్రష్టులను చేశాక, వారి విషయంలో నేను బాధపడతాను. తరువాత ప్రతి కుటుంబాన్నీ దాని స్వస్థలానికి, స్వంత ఆస్తికి తీసుకొని వస్తాను. 16 కాకపోతే ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నాకోరిక. గతంలో వారు నా ప్రజలకు బయలు దేవత పేరు మీద వాగ్దానాలు చేయటం నేర్పినారు. ఇప్పుడు ఆ ప్రజలు తగిన గుణపాఠం నేర్చుకోవాలని నా ప్రయత్నం. వారు నా పేరు ఉపయోగించుట నేర్చుకోవాలి. ‘నిత్యుడైన దేవుని సాక్షిగా …’ అని వారు చెప్పుట నేర్చుకోవాలి. అప్పుడు నేను వారిని నా ప్రజల మధ్య నిత్యము నివసించేలా చేస్తాను. 17 కాని ఏ దేశమైనా మాట వినకపోతే, అప్పుడు నేను వారిని సర్వ నాశనం చేస్తాను. చచ్చిన మొక్కలవలె వారిని లాగి పారవేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
నడికట్టు సంకేతం
13 యెహోవా నాతో ఇలా అన్నాడు, “యిర్మీయా, నీవు వెళ్లి నారతో చేసిన ఒక నడికట్టు బట్టకొని[a] తీసుకురా. దానిని నీవు ధరించుము. కాని దానిని తడవనీయవద్దు.”
2 కావున యెహోవా చెప్పిన విధంగా నేనొక నడికట్టు వస్త్రం కొని ధరించాను. 3 అప్పుడు రెండవసారి యెహోవా వాక్కు నాకు వినబడింది. 4 ఆ వాక్కు ఇలా వుంది: “యిర్మీయా, నీవు కొని ధరించిన నడికట్టు వస్త్రం తీసుకొని ఫరాతుకు[b] వెళ్లుము. అక్కడ ఒకబండ బీటలో ఆ నడికట్టు వస్త్రాన్ని దాచి పెట్టు.”
5 అందుచేత నేను ఫరాతు (యూఫ్రటీసు) కు వెళ్లి ఒక బండ బీటలో నడికట్టు వస్త్రాన్ని (చల్లడము) అక్కడ యెహోవా చెప్పిన రీతిలో దాచాను. 6 చాలా రోజుల తరువాత యెహోవా నాతో, “యిర్మీయా, ఇప్పుడు ఫరాతుకు వెళ్లుము. బండ బీటలో నిన్ను దాయమని చెప్పిన నడికట్టు వస్త్రాన్ని తీసుకొని రమ్ము” అని చెప్పాడు.
7 అప్పుడు నేను ఫరాతుకు వెళ్లి నడికట్టు వస్త్రాన్ని తవ్వి తీశాను. నేను దాచిన బండ బొరియలోనుండి దానిని వెలికి తీశాను. కాని నేను దానిని ధరించ లేక పోయాను. కారణమేమంటే అది జీర్ణించిపోయింది. అది ఎందుకూ పనికిరానిదయ్యింది.
8 అప్పుడు యెహోవా వర్తమానం నాకు చేరింది. 9 యెహోవా ఇలా చెప్పినాడు: “నడికట్టు బట్ట జీర్ణించి, ఎందుకూ పనికిరానిదయి పోయింది. అదే విధంగా, యూదాలోను, యెరూషలేములోనుగల గర్విష్టులనందరినీ నాశనం చేస్తాను. 10 యూదాలోని గర్విష్టులను, దుష్టులను నాశనం చేస్తాను. వారు నా వాక్కు వినటానికి నిరాకరిస్తున్నారు. మొండి వైఖరి దాల్చి, వారు చేయదలచుకున్న పనులే వారు చేస్తారు. వారు అన్యదేవుళ్లను అనుసరించి, ఆరాధిస్తారు. అటువంటి యూదా వారంతా ఈ నార నడికట్టు బట్టలా అయిపోతారు. వారు సర్వనాశనమవుతారు. వారెందుకూ పనికిరారు. 11 నడికట్టు వస్త్రాన్ని మనుష్యులు తమ నడుము చుట్టూ గట్టిగా కట్టుకుంటారు. అదే మాదిరి ఇశ్రాయేలు సంతతి వారిని, యూదా వంశంవారిని నాచుట్టూ కప్పుకొన్నాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది “నేనలా ఎందుకు చేసినానంటే వారంతా నా ప్రజలు కావాలని. నా ప్రజలు నాకు ఖ్యాతిని, మహిమను, గౌరవాన్ని తెస్తారనుకున్నాను. కాని నా ప్రజలు నా మాటనే వినలేదు.”
3 సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? 2 ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. 3 మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? 4 అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:
“నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది.
నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”(A)
5 మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. 6 ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?
7 “నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? 8 మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.
© 1997 Bible League International