Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 2

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

యిర్మీయా 18:12-23

12 కాని యూదా ప్రజలు ఇలా సమాధాన మిస్తారు, ‘మార్చుటకు ప్రయత్నం చేయుటవల్ల ఏమీ ప్రయోజనముండదు. మేము చేయదలచుకున్నదేదో అదే చేస్తూపోతాము. మాలో ప్రతివాడూ తన కఠినమైన దుష్టమైన హృదయం ఎలా చెపితే అలా నడుచుకుంటాడు.’”

13 యెహోవా చెప్పే విషయాలు వినండి:

“అన్య దేశాల ప్రజలను ఈ ప్రశ్న అడగండి:
    ‘ఇశ్రాయేలు చేసినటువంటి దుష్కార్యాలు మరెవరైనా చేస్తున్నట్లు మీరెప్పుడైనా విన్నారా?’
పైగా ఇశ్రాయేలు దేవుని వధువులా ఉంది!
14 పొలాల్లో నుండి బండలు తమంత తాము బయటికి పోవని నీకు తెలుసు.[a]
    లెబానోను పర్వతాల నుండి మంచు ఎన్నడూ కరిగిపోదని కూడా నీకు తెలుసు.
    అక్కడ ప్రవహించే శీతల వాగులు ఎన్నడూ ఎండిపోవని కూడా నీకు తెలుసు.
15 కాని నా ప్రజలు నన్ను గురించి మర్చిపోయారు.
    వారు పనికిరాని విగ్రహాలకు బలులు సమర్పించారు.
    నా ప్రజలు వారు చేసే పనులలో తొట్రు పాటు చెందుతారు.
వారి పితరులు నడచిన పాత దారిలో నడిచి తడబడతారు.
    నా ప్రజలు వేరే మార్గాన నడుస్తారు.
గతుకుల బాటలపై నడుస్తారు.
    కాని వారు మంచి మార్గంపై నన్ననుసరించరు!
16 యూదా రాజ్యం వట్టి ఎడారిగా మారిపోతుంది!
ఆ దారిన పోయే వారందరు దాని గతిచూచి ఆశ్చర్యంతో తలలు ఆడిస్తారు.
    ఆ దేశం ఎలా నాశనమైపోయిందా అని వారు తికమక పడతారు!
17 యూదా ప్రజలను వారి శత్రువులముందు పనికి రానివారిగా పడవేస్తాను.
    బలమైన తూర్పుగాలి వస్తువులను చెల్లాచెదరు చేసేలా నేను వారిని విసరివేస్తాను.
నేనా ప్రజలను నాశనం చేస్తాను. ఆ సమయంలో నేను వారికి అండగా వస్తున్నట్టు నన్ను చూడలేరు.
    మరియు! నేను వారిని వదిలి పెడుతున్నట్లుగా చూస్తారు!”

ప్రజల కుట్ర, యిర్మియా విన్నపం

18 పిమ్మట యిర్మీయా శత్రువులు ఇలా అన్నారు: “రండి. మనం యిర్మీయా పై కుట్ర పన్నుదాము. నిశ్చయముగా యాజకుడు చెప్పిన ధర్మశాస్త్రము వృధాపోదు, జ్ఞానులు చెప్పిన సలహాలు ఇంకా మనతో ఉంటాయి. ప్రవక్తల మాటలు మనకు ఇంకా ఉంటాయి. అందువల్ల మనం అతనిపై అబద్ధప్రచారం చేద్దాం. అది అతనిని నాశనం చేస్తుంది. అతడి మాటలను మనం వినము.”

19 యెహోవా, నా మనవి ఆలకించుము.
    నా శత్రువుల మాట విని వారిని మంచి మార్గంలో నడిచేలా నీవే నిర్ణయించుము.
20 నేను యూదా ప్రజలకు మేలు చేశాను.
    వారు నాకు ప్రతిగా కీడు చేస్తున్నారు.
    నన్ను చంపే ఉద్దేశ్యంతో వారు గోతిని తవ్వి సిద్ధం చేశారు.
21 కావున నీవిప్పుడు వారి పిల్లలు క్షామంలో తిండి లేక మాడి పోయేలా జేయి.
    వారి శత్రువులు వారిని కత్తులతో ఓడించును గాక!
వారి భార్యలు తమ పిల్లలను భర్తలను పోగొట్టు కొందురు గాక!
    యూదా రాజ్యంలో పురుషులంతా చనిపోవుదురు గాక!
    వారి భార్యలను వితంతువులుగా చేయి.
    వారి యువకులు యుద్ధంలో కత్తి వేటుకు చనిపోవును గాక.
22 వారి ఇండ్లలో రోదనలు కలుగును గాక!
    నీవు వారిపైకి ఆకస్మికంగా శత్రువును రప్పించినపుడు వారు మిక్కిలి విలపించేలా చేయి.
నా శత్రువులు నన్ను మోసం చేయదలచినందుకు ఇదంతా వారికి సంభవించును గాక!
    నా అడుగు పడ్డ వెంటనే పట్టడానికి బోనులు అమర్చారు.
23 యెహోవా, నన్ను చంపటానికి వారి ఎత్తుగడలన్నీ నీకు తెలుసు.
    వారి నేరాలను క్షమించవద్దు. వారి పాపాలను తుడిచి వేయవద్దు.
నా శత్రువులను మట్టు బెట్టు!
    నీకు కోపం వచ్చినపుడు వారిని శిక్షించు!

1 తిమోతికి 3:14-4:5

14 నేను నీ దగ్గరకు త్వరలోనే రావాలనుకొంటున్నాను. అయినా నేనీ ఆజ్ఞల్ని ఎందుకు వ్రాస్తున్నానంటే, 15 ఒకవేళ నేను రావటం ఆలస్యం అయితే ప్రజలు దేవుని కుటుంబంలో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఏ విధంగా ప్రవర్తించాలో ఈ లేఖ ద్వారా నీకు తెలియజేస్తున్నాను. దేవుని సంఘం ఒక స్తంభంలాంటిది. అది సత్యానికి ఆధారమైనది. 16 ఆత్మీయతలో ఉన్న రహస్యం నిస్సందేహంగా చాలా గొప్పది.

క్రీస్తు మానవ రూపం ఎత్తాడు.
పరిశుద్ధాత్మ వలన ఆయన నిజమైన నిర్దోషిగా నిరూపించబడ్డాడు.
దేవదూతలు ఆయన్ని చూసారు.
రక్షకుడని ఆయన గురించి జనాంగములకు ప్రకటింపబడింది.
ప్రజలు ఆయన్ని విశ్వసించారు.
ఆయన తన మహిమతో పరలోకానికి కొనిపోబడ్డాడు.

దొంగ బోధకులు

చివరిదినాల్లో కొందరు విశ్వాసాన్ని వదిలి మోసగించే దయ్యాల బోధనల్ని అనుసరిస్తారని పరిశుద్ధాత్మ స్పష్టంగా చెపుతున్నాడు. దొంగ మాటలు చెప్పేవాళ్ళు దొంగ ఉపదేశాలు చేస్తారు. వాళ్ళ అంతరాత్మలు మొద్దుబారాయి. అలాంటివాళ్ళు వివాహం చేసుకోవటం తప్పని, కొన్ని రకాల ఆహారాలు తినకూడదని బోధిస్తారు. కాని దేవుడు ఆ ఆహారాలు తినటానికే సృష్టించాడు. విశ్వాసులు, సత్యాన్ని తెలుసుకొన్నవాళ్ళు దేవునికి కృతజ్ఞతలర్పించి ఆ ఆహారాల్ని భుజించాలి. దేవుడు తినటానికి సృష్టించినవన్నీ మంచివే కనుక మనం దేన్నీ నిరాకరించకూడదు. అన్నిటినీ దేవునికి కృతజ్ఞతలర్పించి భుజించాలి. అవి దేవుని వాక్యం వల్లను, ప్రార్థన ద్వారాను పవిత్రం చేయబడినాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International