Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
14 “దేవుడు లేడు” అని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొంటారు.
బుద్ధిహీనులు దారుణమైన, చెడు కార్యాలు చేస్తారు.
వారిలో కనీసం ఒక్కడు కూడా మంచి పనులు చేయడు.
2 పరలోకం నుండి యెహోవా క్రింద మనుష్యులను చూశాడు.
వివేకంగలవాణ్ణి కనుక్కోవాలని దేవుడు ప్రయత్నించాడు.
(వివేకంగల వాడు సహాయం కోసం దేవుని తట్టు తిరుగుతాడు.)
3 కాని ప్రతి మనిషి దేవుని నుండి తిరిగిపోయాడు.
మొత్తం మనుష్యులంతా చెడ్డవాళ్లయ్యారు.
కనీసం ఒక్క వ్యక్తి కూడా
మంచి పనులు చేయలేదు.
4 దుర్మార్గులు నా ప్రజలను నాశనం చేశారు.
ఆ దుర్మార్గులు దేవుణ్ణి అర్థం చేసుకోరు.
దుర్మార్గులు తినుటకు ఆహారం సమృద్ధిగా ఉంది.
ఆ మనుష్యులు యెహోవాను ఆరాధించరు.
5-6 దుష్టులైన మీరు పేదవారి ఆలోచనలను చెడగొడ్తారు.
కాని పేదవాడు తన రక్షణకొరకు దేవుని మీద ఆధారపడ్డాడు.
కాని ఆ దుర్మార్గులు చాలా భయపడిపోయారు.
ఎందుకంటే దేవుడు మంచి మనుష్యులతో ఉన్నాడు గనుక.
7 సీయోనులోని ఇశ్రాయేలీయులను ఎవరు రక్షిస్తారు?
ఇశ్రాయేలీయులను రక్షించేవాడు యెహోవాయే. యెహోవా ప్రజలు తీసుకొనిపోబడ్డారు. బలవంతంగా బందీలుగా చేయబడ్డారు.
కాని యెహోవా తన ప్రజలను వెనుకకు తీసుకొని వస్తాడు.
ఆ సమయంలో యాకోబు (ఇశ్రాయేలు) ఎంతో సంతోషిస్తాడు.
4 ఇదే యెహోవా వాక్కు.
“ఇశ్రాయేలూ, నీవు రావాలనుకుంటే,
తిరిగి నా వద్దకు రమ్ము
నీ విగ్రహాలను విసరివేయి!
నానుండి దూరంగా పోవద్దు!
2 నీవు ఆ విధంగా చేస్తే,
నీవు ప్రమాణం చేయటానికి ఈ మాటలు చెప్పగలవు
‘నిత్యుడైన యెహోవా తోడు’
అని నీవనగలవు
నీవీ మాటలు సత్యమైన,
న్యాయమైన, నీతిమార్గాన పలుకగలవు.
నీవీ పనులు చేస్తే, యెహోవా రాజ్యాలను దీవిస్తాడు.
యెహోవా చేసిన పనులను వారు పొగడుతారు.”
3 యూదా ప్రజలకు, యెరూషలేము నగరవాసులకు యెహోవా ఇలా చెపుతున్నాడు:
“మీ భూములు దున్నబడలేదు.
వాటిని దున్నండి!
ముండ్లపొదలలో విత్తనాలు చల్లవద్దు.
4 యెహోవా యొక్క ప్రజలుగా మీరు తయారుకండి.
మీ హృదయాలను మార్చుకోండి[a]
యూదా ప్రజలారా, యెరూషలేము వాసులారా, మీలో పరివర్తన రాకపోతే
నాకు చాలా కోపం వస్తుంది.
నా కోపం అగ్నిలా ప్రజ్వరిల్లుతుంది.
నా కోపం మిమ్మల్ని దహించి వేస్తుంది.
ఆ అగ్ని జ్వాలల్ని ఎవ్వరూ ఆర్పలేరు! అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది?
మీరు చేసిన పాపకార్యాలవల్లనే ఇదంతా జరుగుతుంది.”
ఉత్తర దిశ నుండి విపత్తు
5 “ఈ వర్తమానాన్ని యూదా ప్రజలకు ప్రకటించుము:
“యెరూషలేములో ప్రతి పౌరునికి తెలియజేయుము,
‘దేశమంతా బూర వూది’
బాహాటంగా ఇలా చెప్పుము,
‘మీరంతా కలిసి రండి!
రక్షణకై మనమంతా బలమైన నగరాలకు తప్పించుకుపోదాం!’
6 సీయోను వైపుకు సంకేత ధ్వజాన్ని ఎగురవేయుము.
మీ ప్రాణరక్షణకై పారిపొండి! ఆలస్యం చేయవద్దు!
ఇది మీరు త్వరగా చేయండి. ఎందువల్లననగా ఉత్తర దిశనుండి[b] నేను విపత్తును తీసుకొని వస్తున్నాను.
నేను అతి భయంకరమైన వినాశనాన్ని తీసుకొని వస్తున్నాను.”
7 తన గుహనుండి ఒక “సింహం” బయటికి వచ్చింది.
రాజ్యాలను నాశనం చేసేవాడు కదలి వస్తున్నాడు.
నీ రాజ్యాన్ని సర్వ నాశనం చేయటానికి అతడు ఇల్లు వదిలి వస్తున్నాడు.
నీ పట్టణాలు ధ్వంసమవుతాయి.
వాటిలో నివసించటానికి ఒక్కడూ మిగలడు.
8 కావున నారబట్టలు[c] ధరించండి. మిక్కిలిగా విలపించండి!
ఎందువల్లనంటే యెహోవా మీపట్ల చాలా కోపంగా ఉన్నాడు.
9 ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది.
“ఇది జరిగే సమయంలో రాజు, ఇతర నాయకులు తమ ధైర్యాన్ని కోల్పోతారు.
యాజకులు బెదరిపోతారు!
ప్రవక్తలు భయపడి, విస్మయం పొందుతారు!”
10 అప్పుడు యిర్మీయానైన నేను ఇలా చెప్పాను, “నా ప్రభువగు యెహోవా, నీవు నిజంగా యూదా, యెరూషలేము ప్రజలను మోసపుచ్చావు. ‘మీకు శాంతి కలుగుతుంది’ అని వారికి చెప్పియున్నావు. కాని ఇప్పుడు వారి గొంతుకలమీద కత్తి ఉంది!”
దుర్బోధకులు
2 కాని పూర్వం ప్రజల మధ్య దొంగ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళు. అదే విధంగా మీ మధ్యకూడా దుర్బోధకులు ఉంటారు. వాళ్ళు నాశనానికి దారితీసే సిద్ధాంతాల్ని రహస్యంగా ప్రవేశపెడుతూ, తమను కొన్న ప్రభువును కూడా కాదంటారు. తద్వారా తమను తాము నాశనం చేసుకుంటారు. ఇది త్వరలోనే జరుగుతుంది. 2 అవమానకరమైన వాళ్ళ పద్దతుల్ని అనేకులు పాటించి సత్యానికే అపకీర్తి తెస్తారు. 3 ఈ దుర్బోధకులు తమలో ఉన్న అత్యాశలవల్ల తాము సృష్టించిన కథలతో తమ స్వలాభం కొరకు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. దేవుడు వాళ్ళకు విధించిన శిక్ష చాలాకాలం నుండి వాళ్ళ కోసం కాచుకొని ఉంది. రానున్న ఆ వినాశనం ఆగదు.
4 దేవుడు పాపం చేసిన దేవదూతల్ని కూడా విడిచిపెట్టకుండా నరకంలో[a] వేసాడు. తీర్పు చెప్పే రోజుదాకా అక్కడ వాళ్ళను అంధకారంలో బంధించి ఉంచుతాడు.
5 దేవుడు పురాతన ప్రపంచంపై సానుభూతి చూపలేదు. దుర్మార్గులైన ఆనాటి ప్రజలమీదికి ప్రళయం రప్పించాడు. నీతిని బోధించిన నోవహు, మిగతా ఏడుగురు తప్ప అందరూ నాశనమైపొయ్యారు.
6 దుర్మార్గులకు ఏమి సంభవిస్తుందో చూపడానికి దేవుడు సొదొమ, గొమొఱ్ఱా పట్టణాలను భస్మం చేసి వాటిని ఉదాహరణలుగా చూపించాడు. 7 కాని దేవుడు నీతిమంతుడైన లోతును రక్షించాడు. ప్రజలు అరాచకంగా, అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉండటంవల్ల లోతు చాలా బాధపడ్తూ ఉండేవాడు. 8 ఆ నీతిమంతుడు దుర్మార్గుల మధ్య ప్రతిరోజూ నివసిస్తూ, వాళ్ళ దుష్ప్రవర్తనల్ని చూస్తూ, వింటూ ఉండేవాడు. వాళ్ళు చేస్తున్న దుష్ట పనులు చూసి అతని హృదయం తరుక్కుపోయేది.
9 విశ్వాసుల్ని పాపాలు చేయకుండా చేసి ఎలా కాపాడుకోవాలో ఆ ప్రభువుకు తెలుసు. తీర్పు చెప్పే రోజుదాకా దుర్మార్గుల్ని ఎలా శిక్షిస్తూ ఉండాలో కూడా ఆ ప్రభువుకు తెలుసు. 10 అధికారాన్నుల్లంఘిస్తూ, అసహ్యకరమైన ఐహిక వాంఛల్ని తీర్చుకుంటూ గర్వాంధులై పరలోక నివాసుల్ని దూషించటానికి భయపడనివాళ్ళ విషయంలో యిది ముఖ్యంగా నిజమౌతుంది.
ఇలాంటి దుర్బోధకులు ధైర్యంగా గర్వంతో గొప్పవాళ్ళను దూషిస్తారు.
© 1997 Bible League International