Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 46-48

ఇశ్రాయేలుకు దేవుని అభయం

46 కనుక ఇశ్రాయేలు ఈజిప్టుకు తన ప్రయాణం మొదలు పెట్టాడు. మొదట ఇశ్రాయేలు బెయేర్షెబాకు వెళ్లాడు. అక్కడ తన తండ్రియైన ఇస్సాకు దేవుణ్ణి ఇశ్రాయేలు ఆరాధించాడు. అతడు బలులు అర్పించాడు. ఆ రాత్రి ఒక కలలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడాడు. “యాకోబూ, యాకోబూ” అన్నాడు దేవుడు.

“ఇదిగో ఇక్కడే ఉన్నాను” అని ఇశ్రాయేలు జవాబు ఇచ్చాడు.

అప్పుడు దేవుడు అన్నాడు: “నేను దేవుణ్ణి, నీ తండ్రి దేవుణ్ణి. ఈజిప్టు వెళ్లేందుకు భయపడకు. ఈజిప్టులో నిన్ను ఒక గొప్ప జనంగా నేను చేస్తాను. నీతో కూడ నేను ఈజిప్టుకు వస్తాను. మళ్లీ నేనే నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వస్తాను. నీవు ఈజిప్టులో మరణిస్తావు, కాని యోసేపు నీతో ఉంటాడు. నీవు చనిపోయినప్పుడు అతని స్వంత చేతులే నీ కళ్లను మూస్తాయి.”

ఇశ్రాయేలు ఈజిప్టుకు వెళ్ళుట

అప్పుడు యాకోబు బెయేర్షెబా విడిచి, ఈజిప్టుకు ప్రయాణం చేశాడు. అతని కుమారులు, ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రిని, భార్యలను, తమ పిల్లలందరిని ఈజిప్టుకు తీసుకొని వచ్చారు. ఫరో పంపిన బండ్లలో వారు ప్రయాణం చేశారు. తమ పశువులు, కనాను దేశంలో వారికి ఉన్నవి అన్నీ వారితోబాటు ఉన్నవి. కనుక ఇశ్రాయేలు తన పిల్లలందరితో, తన కుటుంబం అంతటితో కలిసి ఈజిప్టు వెళ్లాడు. అతని కుమారులు అతని మనుమళ్లు, అతని కుమార్తెలు, అతని మనమరాళ్లు అతనితో ఉన్నారు. అతని కుటుంబం అంతా అతనితో కలిసి ఈజిప్టుకు వెళ్లారు.

యాకోబు (ఇశ్రాయేలు) కుటుంబం

ఇశ్రాయేలుతో కలిసి ఈజిప్టుకు వెళ్లిన అతని కుమారులు, కుటుంబము వాళ్ల పేర్లు:

రూబేను యాకోబుయొక్క మొదటి కుమారుడు. రూబేను కుమారులు: హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

10 షిమ్యోను కుమారులు; యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీ స్త్రీ కుమారుడు షావూలు.

11 లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారీ.

12 యూదా కుమారులు: ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను కనానులో ఉన్నప్పుడే చనిపోయారు) పెరెసు కుమారులు: హెస్రోను, హామూలు,

13 ఇశ్శాఖారు కుమారులు: తోలా, పువ్యా, యోబు, షిమ్రోను.

14 జెబూలూను కుమారులు: సెరెదు, ఏలోను, యహలేలు.

15 రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలూను యాకోబు భార్య లేయా ద్వారా అతని కుమారులు. లేయా ఆ కుమారులను పద్దనరాములో కన్నది. ఆమె కుమార్తె దీనా కూడ ఉంది. ఈ కుటుంబంలో 33 మంది ఉన్నారు.

16 గాదు కుమారులు: సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, అరోదీ, అరేలీ,

17 ఆషేరు కుమారులు: ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరీయా, వారి సోదరి శెరహు. బెరీయా కుమారులు: హెబెరు, మల్కీయేలు.

18 వారంతా యాకోబుకు అతని భార్య లేయా సేవకురాలు జిల్ఫాద్వారా పుట్టిన కుమారులు. ఈ కుటుంబంలో 16 మంది ఉన్నారు.

19 మరియు అతని భార్య రాహేలు ద్వారా పుట్టిన కుమారుడు బెన్యామీను కూడ యాకోబుతో ఉన్నాడు. (యోసేపు కూడ రాహేలుకు పుట్టినవాడే కాని అతడు అప్పటికే ఈజిప్టులో ఉన్నాడు.)

20 ఈజిప్టులో యోసేపుకు ఇద్దరు కుమారులు: మనష్షే, ఎఫ్రాయిము. (ఓను పట్టణ యాజకుడు పోతీఫెర కుమార్తె ఆసెనతు యోసేపు భార్య).

21 బెన్యామీను కుమారులు: బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహి, రోషు, ముప్పీము, హుప్పీము, అర్దు.

22 వారంతా యాకోబుకు అతని భార్య రాహేలు ద్వారా కలిగిన సంతానం. ఈ కుటుంబంలో 14 మంది ఉన్నారు.

23 దాను కుమారుడు: హుషీము

24 నఫ్తాలి కుమారులు: యహసేలు, గూనీ, యోసేరు, షల్లేము.

25 వారు యాకోబు, బిల్హాలకు పుట్టిన కుమారులు (రాహేలు సేవకురాలు బిల్హా). ఈ కుటుంబంలో 7 మంది ఉన్నారు.

26 ఇలా యాకోబు సంతానం ఈజిప్టుకు వెళ్లారు. యాకోబు మూలంగా కలిగిన పిల్లలు మొత్తం 66 మంది. (యాకోబు భార్యలు ఈ లెక్కలో లేరు). 27 మరియు యోసేపు ఇద్దరు కుమారులు కూడ ఉన్నారు. వారు ఈజిప్టులో పుట్టారు. కనుక ఈజిప్టులో యాకోబు కుటుంబంలో 70 మంది ఉన్నారు.

ఇశ్రాయేలు ఈజిప్టుకు వచ్చుట

28 యాకోబు మొదట యూదాను యోసేపు దగ్గరకు పంపించాడు. గోషెను దేశంలోని యోసేపు దగ్గరకు యూదా వెళ్లాడు. ఆ తర్వాత యాకోబు, అతని వాళ్లు ఆ దేశంలో ప్రవేశించారు. 29 యోసేపు తన తండ్రి వచ్చేస్తున్నాడని విన్నాడు. గోషెనులో తన తండ్రి ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు యోసేపు తన రథం సిద్ధం చేసుకొని బయల్దేరాడు. యోసేపు తన తండ్రిని చూడగానే అతని మెడమీద పడి కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చాడు.

30 అప్పుడు ఇశ్రాయేలు, “ఇప్పుడు నేను మనశ్శాంతిగా మరణించవచ్చు, నీ ముఖం నేను చూశాను, నీవు ఇంకా బ్రతికే ఉన్నావని నేను చూడగలిగాను” అని యోసేపుతో చెప్పాడు.

31 తన సోదరులతోను, తన తండ్రి కుటుంబంతోను యోసేపు ఇలా చెప్పాడు: “నేను వెళ్లి మీరు వచ్చినట్లు ఫరోతో చెబుతాను. ఫరోతో నేను ఏమని చెబుతానంటే ‘నా అన్నలు, నా తండ్రి కుటుంబం కనాను దేశం విడిచి ఇక్కడ నా దగ్గరకు వచ్చారు. 32 ఈ నా కుటుంబం గొర్రెల కాపరుల కుటుంబం. నిత్యం వాళ్లు పశువుల్ని, మందల్ని కలిగి ఉండేవాళ్లు. వారి పశువుల్ని, వారికి కలిగిన అంతటిని వాళ్లతోబాటు వారు తెచ్చుకొన్నారు.’ 33 ఫరో మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేం పని చేస్తారు? అని మిమ్మును అడుగుతాడు. 34 అప్పుడు మీరు ‘మేము గొర్రెల కాపరులం, మా జీవితకాలమంతా మా పశువుల్ని మేపుకొంటూ జీవించాం. మాకు ముందు మా పూర్వీకులు ఇలాగే జీవించారు’ అని చెప్పండి. అప్పుడు ఫరో మిమ్మును గోషెను దేశంలో జీవింపనిస్తాడు. గొర్రెల కాపరులంటే ఈజిప్టు ప్రజలకు యిష్టం లేదు, కనుక మీరు గోషెను దేశంలో ఉండవచ్చు.”

ఇశ్రాయేలు గోషెనులో స్థిరపడుట

47 యోసేపు ఫరో దగ్గరకు వెళ్లి, “నా తండ్రి, నా సోదరులు, వారి కుటుంబాలు మొత్తం ఇక్కడికి వచ్చారు. వారి పశువులు, కనాను దేశంలో వారికి కలిగినది మొత్తం వారితో తెచ్చుకొన్నారు. వారిప్పుడు గోషెనులో ఉన్నారు” అని చెప్పాడు. యోసేపు తన సోదరులలో అయిదుగురిని తనతో కూడ ఫరో ఎదుటికి తీసుకొని వెళ్లాడు.

“మీ వృత్తి ఏమిటి?” అని ఫరో ఆ సోదరులను అడిగాడు.

ఆ సోదరులు ఫరోతో, “అయ్యా, మేము గొర్రెల కాపరులం. మాకు ముందున్న మా పూర్వీకులు కూడా గొర్రెల కాపరులే” అని చెప్పారు. “కనాను దేశంలో కరవు కాలం చాలా దారుణంగా ఉంది. మా పశువులకు అవసరమైన గడ్డి ఉన్న పొలాలు ఎక్కడా లేవు. అందుచేత ఈ దేశంలో బ్రతుకుదామని మేము ఇక్కడికి వచ్చాం. మీరు దయచేసి మమ్మల్ని గోషెను దేశంలో ఉండనివ్వాల్సిందిగా మనవి చేస్తున్నాం” అని వారు ఫరోతో చెప్పారు.

అప్పుడు యోసేపుతో ఫరో చెప్పాడు: “నీ తండ్రి, నీ సోదరులు నీ దగ్గరకు వచ్చారు. వారు నివసించేందుకు ఈజిప్టులో ఏ స్థలమైనా సరే నీవు వారికోసం కోరుకోవచ్చు. నీ తండ్రికి, నీ సోదరులకు శ్రేష్ఠమైన భూమి ఇవ్వు. గోషెను దేశంలో వారిని ఉండనివ్వు. వారు నైపుణ్యంగల కాపరులైతే, వారు నా పశువులను కూడ చూసుకోవచ్చు.”

అప్పుడు యోసేపు తన తండ్రి యాకోబును ఫరో ఎదుటికి తీసుకొని వచ్చాడు. యాకోబు ఫరోను ఆశీర్వదించాడు.

అప్పుడు ఫరో “నీ వయస్సెంత?” అని యాకోబును అడిగాడు.

“నేను తక్కువ కాలం ఎక్కువ కష్టాలతో బ్రతికాను. 130 సంవత్సరాలే నేను బ్రతికాను. నా తండ్రి, ఆయన పూర్వీకులు నాకంటె చాలా ఎక్కువ కాలం బ్రతికారు” అని ఫరోతో యాకోబు చెప్పాడు.

10 యాకోబు ఫరోను ఆశీర్వదించాడు. తర్వాత యాకోబు ఫరో ఎదుటి నుండి వెళ్లిపోయాడు.

11 యోసేపు ఫరోకు విధేయుడయ్యాడు. అతడు తన తండ్రికి, తన సోదరులకు ఈజిప్టలో మంచి భూమిని సమీపంగా ఇచ్చాడు. ఈజిప్టులో రామసేసు నగరానికి దగ్గరలోవున్న ఈ భూమి అతి శ్రేష్ఠమైంది. 12 మరియు తన తండ్రికి, సోదరులకు, వారి మనుష్యులందరికీ అవసరమైన ఆహారాన్ని యోసేపు వారికి ఇచ్చాడు.

ఫరోకోసం యోసేపు భూమి కొనుట

13 కరవు కాలం మరీ తీవ్రం అయింది. దేశంలో ఎక్కడా ఆహారం లేదు. ఈ కష్టకాలం మూలంగా ఈజిప్టు, కనాను దేశాలు చాలా పేదవయ్యాయి. 14 ఆ దేశంలో ప్రజలు మరింత ధాన్యం కొన్నారు. యోసేపు ఆ ధనం ఆదా చేసి, దానిని ఫరో ఇంటికి తెచ్చాడు. 15 కొన్నాళ్లకు ఈజిప్టులోను, కనానులోను ప్రజల దగ్గర పైకం అయిపోయింది. ధాన్యం కొనేందుకే వారి డబ్బు అంతా ఖర్చు పెట్టారు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి, “దయచేసి మాకు ధాన్యం ఇవ్వండి. మా డబ్బు అయిపోయింది. మేము భోజనం చేయకపోతే మీరు చూస్తుండగానే మేము మరణిస్తాం” అని చెప్పారు.

16 “మీ పశువుల్ని ఇవ్వండి, నేను మీకు ఆహారం ఇస్తాను” అని యోసేపు జవాబిచ్చాడు. 17 కనుక ప్రజలు ఆహారం కొనేందుకు వారి పశువులను, గుర్రాలను, మిగిలిన జంతువులన్నిటిని ఉపయోగించారు. ఆ సంవత్సరం యోసేపు వారికి ఆహారం ఇచ్చి, వారి పశువులను తీసుకున్నాడు.

18 అయితే ఆ తర్వాత సంవత్సరం ప్రజల దగ్గర జంతువులు లేవు, ఆహారం కొనేందుకు ఉపయోగించటానికి ఏమీ లేవు. కనుక ప్రజలు యోసేపు దగ్గరకు వెళ్లి “మా దగ్గర ఇంకేమీ డబ్బు లేదని మీకు తెలుసు. మా పశువులన్నీ ఇప్పుడు మీవే. మా దగ్గర నీవు చూస్తున్న మా శరీరాలు, మా భూమి తప్ప ఇంకేమి లేవు. 19 మీరు చూస్తుండగానే నిశ్చయంగా మేము చనిపోతాం. కానీ, మీరు మాకు ఆహారం ఇస్తే, మేము మా భూమిని ఫరోకు ఇస్తాం, మేము ఆయన బానిసలంగా ఉంటాము. మేము నాట్లు వేయటానికి మాకు విత్తనాలు ఇవ్వండి. అప్పుడు మేము చావక బ్రతుకుతాం. భూమి మా కోసం మరోసారి పంటను ఇస్తుంది” అని చెప్పారు.

20 కనుక యోసేపు ఈజిప్టులోని భూమి అంతటినీ ఫరోకోసం కొన్నాడు. ఈజిప్టులోని ప్రజలంతా వారి భూములను యోసేపుకు అమ్మివేశారు. వారు చాలా కరువుతో ఉన్నందుచేత ఇలా చేశారు. 21 మరియు ప్రజలందరు ఫరోకు బానిసలయ్యారు. ఈజిప్టు అంతటిలో ప్రజలు ఫరోకు బానిసలు. 22 యాజకుల స్వంత భూములను మాత్రమే యోసేపు కొనలేదు. యాజకుల పనికి ఫరో జీతం ఇచ్చాడు గనుక వారు వారి భూములను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బును ఆహారం కొనేందుకు వారు ఉపయోగించుకొనేవారు.

23 యోసేపు ప్రజలతో చెప్పాడు, “ఇప్పుడు మిమ్మల్ని, మీ భూముల్ని ఫరోకోసం నేను కొన్నాను. కనుక నేను విత్తనాలు ఇస్తాను, మీరు మీ భూముల్లో నాట్లు వేయవచ్చును. 24 కోతకాలంలో మీ పంటలో అయిదింట ఒక వంతు ఫరోకు ఇవ్వాలి. అయిదింట నాలుగు వంతులు మీకోసం మీరు ఉంచుకోవచ్చు. మీరు ఉంచుకొనే గింజలను మీ ఆహారం కోసమూ, వచ్చే సంవత్సరం విత్తనాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మీరు మీ కుటుంబాలను, పిల్లలను పోషించుకోవచ్చు.”

25 ప్రజలు, “మీరు మా ప్రాణాలు రక్షించారు. మేము సంతోషంగా మీకు, ఫరోకు బానిసలంగా ఉంటాం” అన్నారు.

26 కనుక ఈ సమయంలో యోసేపు ఆ దేశంలో చట్టం చేశాడు. ఆ చట్టం నేటికీ కొనసాగుతుంది. భూమిలోనుండి వచ్చే దిగుబడి అంతటిలోనూ అయిదింట ఒక వంతు ఫరోకు చెందుతుంది అనేది ఆ చట్టం. భూములన్నీ ఫరో స్వంతం. యాజకుల భూమి మాత్రమే ఫరో స్వంతం కాలేదు.

నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు

27 ఇశ్రాయేలు (యాకోబు) ఈజిప్టులో ఉన్నాడు. గోషెను దేశంలో అతడు నివసించాడు. అతని కుటుంబం పెరిగి చాలా పెద్దది అయింది. ఈజిప్టులో వారు ఆ భూమిని సంపాదించి వర్ధిల్లారు.

28 యాకోబు ఈజిప్టులో 17 సంవత్సరాలు జీవించాడు. కనుక యాకోబు వయస్సు 147 సంవత్సరాలు. 29 తాను త్వరలో చనిపోతానని తెలిసి, ఇశ్రాయేలు (యాకోబు) తన కుమారుడు యోసేపును తన దగ్గరకు పిల్చాడు. “నీవు నన్ను ప్రేమిస్తే, నీ చేయి నా తొడక్రింద పెట్టి ప్రమాణం చేయి. నేను చెప్పినట్లు నీవు చేస్తావని, నాకు నీవు నమ్మకంగా ఉంటావని వాగ్దానం చేయి. నేను మరణించినప్పుడు నన్ను ఈజిప్టులో పాతిపెట్టవద్దు. 30 నా పూర్వీకులు పాతిపెట్టబడిన చోట నన్ను పాతిపెట్టు. ఈజిప్టు నుండి నన్ను తీసుకొనిపోయి, మన కుటుంబ సమాధుల స్థలంలో నన్ను పాతిపెట్టు” అన్నాడు.

“నీవు చెప్పినట్లు చేస్తానని నేను వాగ్దానం చేస్తున్నా” అని యోసేపు జవాబిచ్చాడు.

31 అప్పుడు యాకోబు, “నాకు ప్రమాణం చేయి” అన్నాడు. అందుకు యోసేపు అలా చేస్తానని ప్రమాణం చేశాడు. అంతట ఇశ్రాయేలు పడక మీద తన తలను వెనుకకు వాల్చాడు.[a]

మనష్షే, ఎఫ్రాయిములకు ఆశీర్వాదాలు

48 కొంత కాలం తర్వాత, తన తండ్రి చాలా అస్వస్థతగా ఉన్నాడని యోసేపుకు తెలిసింది. కనుక మనష్షే, ఎఫ్రాయిము అనే తన యిద్దరు కుమారులను తీసుకొని, యోసేపు తన తండ్రి దగ్గరకు వెళ్లాడు. యోసేపు వచ్చినప్పుడు ఎవరో ఇశ్రాయేలుతో చెప్పారు, “నీ కుమారుడు యోసేపు నిన్ను చూడటానికి వచ్చాడు” అని. ఇశ్రాయేలు చాలా బలహీనంగా ఉన్నాడు, అయినప్పటికీ కష్టంగా ప్రయత్నించి తన పడకమీద కూర్చున్నాడు.

అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు, “కనాను దేశంలోని ఊజు వద్ద సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. అక్కడే దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నాతో చెప్పాడు: ‘నిన్ను ఒక గొప్ప వంశంగా నేను చేస్తాను. నీకు అనేకమంది పిల్లలను నేను ఇస్తాను, మీరు గొప్ప జనం అవుతారు. మీ వంశీకులు ఈ భూమిని శాశ్వతంగా స్వంతం చేసుకుంటారు.’ ఇప్పుడు నీకు ఇద్దరు కుమారులు ఉన్నారు. నేను రాకముందు యిక్కడ ఈజిప్టు దేశంలో ఈ ఇద్దరు కుమారులు పుట్టారు. ఎఫ్రాయిము, మనష్షే అనే నీ యిద్దరు కుమారులు నా స్వంత కుమారుల్లాగే ఉంటారు. రూబేను, షిమ్యోనులు నాకెలాగో వారు కూడ నాకు అంతే. కనుక ఈ ఇద్దరు బాలురు నా కుమారులే. నాకు ఉన్న దానంతటిలో వారికి కూడ భాగం ఉంది. అయితే నీకు ఇంకా కుమారులు పుడితే, వాళ్లు నీ స్వంత కుమారులుగా ఉంటారు. అయితే వారు ఎఫ్రాయిము మనష్షేలకు కుమారులుగా ఉంటారు. అంటే భవిష్యత్తులో ఎఫ్రాయిము, మనష్షేలు కలిగి ఉండే దానంతటిలో వాళ్లూ భాగస్థులవుతారు. పద్దనరాము నుండి చేసిన ప్రయాణంలో రాహేలు చనిపోయింది. ఇది నాకు చాలా దుఃఖం కలిగించింది. ఆమె కనాను దేశంలో చనిపోయింది. అప్పటికి మేము ఇంకా ఎఫ్రాతా (ఎఫ్రాతా బెత్లెహేము) వైపు ప్రయాణం చేస్తున్నాం. ఎఫ్రాతా పోయే మార్గంలో నేను ఆమెను సమాధి చేశాను.”

అప్పుడు యోసేపు కుమారులను ఇశ్రాయేలు చూశాడు. “ఈ పిల్లలు ఎవరు?” అని యోసేపును అడిగాడు.

యోసేపు తన తండ్రితో, “వీళ్లు నా కుమారులు. దేవుడు నాకు ఇచ్చిన అబ్బాయిలు వీళ్లే” అని చెప్పాడు.

“నీ కుమారులను నా దగ్గరకు తీసుకొని రా! నేను వారిని ఆశీర్వదిస్తాను” అన్నాడు ఇశ్రాయేలు.

10 ఇశ్రాయేలు వృద్ధుడు గనుక అతని చూపు సరిగ్గా లేదు. అందుచేత యోసేపు ఆ బాలురను తన తండ్రికి దగ్గరగా తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలు వారిని కౌగలించుకొని ముద్దు పెట్టుకొన్నాడు. 11 అప్పుడు ఇశ్రాయేలు, “నీ ముఖం మళ్లీ చూస్తానని నేను ఎన్నడూ అనుకోలేదు. అయితే చూడు! నిన్ను, నీ పిల్లలను కూడ దేవుడు నన్ను చూడనిచ్చాడు” అన్నాడు యోసేపుతో.

12 అప్పుడు యోసేపు ఆ బాలురను ఇశ్రాయేలు ఒడిలోనుండి దించగా, వారు అతని తండ్రి ఎదుట సాగిలపడ్డారు.

13 ఎఫ్రాయిమును తన కుడి ప్రక్కను, మనష్షేను తన ఎడమ ప్రక్కను యోసేపు ఉంచాడు. (కనుక ఇశ్రాయేలుకు ఎడమ ప్రక్క ఎఫ్రాయిము, కుడి ప్రక్క మనష్షే ఉన్నారు). 14 కానీ ఇశ్రాయేలు తన చేతులను అటుయిటు మార్చి చిన్న పిల్లవాడు ఎఫ్రాయిము తలమీద తన కుడి చేతిని పెట్టాడు. తర్వాత ఇశ్రాయేలు పెద్దపిల్లవాడు మనష్షే తలమీద తన ఎడమ చేతిని పెట్టాడు. మనష్షే జ్యేష్ఠుడైనప్పటికి అతడు తన ఎడమ చేతిని మనష్షే మీద ఉంచాడు. 15 మరియు ఇశ్రాయేలు యోసేపును ఆశీర్వదించి ఇలా చెప్పాడు:

“నా పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకు మన దేవుణ్ణి ఆరాధించారు.
    ఆ దేవుడే నా జీవితమంతా నన్ను నడిపించాడు.
16 ఆయనే నా కష్టాలన్నింటినుండి నన్ను రక్షించిన దూత.
    ఆయనే ఈ బాలురను దీవించాలని నేను ప్రార్థిస్తున్నాను.
ఇప్పుడు ఈ పిల్లలకు నా పేరు ఉంటుంది. మన పూర్వీకులు అబ్రాహాము, ఇస్సాకుల పేర్లు వారికి ఉంటాయి.
    వారు ఈ భూమి మీద గొప్ప వంశాలుగా గొప్ప రాజ్యాలుగా ఎదగాలని నా ప్రార్థన.”

17 తన తండ్రి కుడిచేయి ఎఫ్రాయిము మీద ఉంచినట్లు యోసేపు చూశాడు. ఇది యోసేపుకు సంతోషం కలిగించలేదు. యోసేపు తన తండ్రి చేయి తీసుకొని, ఎఫ్రాయిము తలమీదనుండి తీసి, మనష్షే తలమీద ఉంచాలనుకొన్నాడు. 18 యోసేపు తన తండ్రితో, “నీ కుడి చేయి సరైన వాడిమీద పెట్టలేదు. మనష్షే జ్యేష్ఠుడు” అని చెప్పాడు.

19 అయితే అతని తండ్రి వాదించి చెప్పాడు, “నాకు తెలుసు కొడుకా, మనష్షే జ్యేష్ఠుడు. అతడు గొప్పవాడవుతాడు. అతడు అనేకమంది ప్రజలకు తండ్రి కూడ అవుతాడు. కానీ చిన్నవాడు పెద్దవాడికంటె గొప్పవాడవుతాడు. మరియు చిన్నవాడి వంశం ఇంకా చాలా పెద్దదిగా ఉంటుంది.”

20 అలా ఇశ్రాయేలు ఆనాడు వారిని ఆశీర్వదించాడు.

“ఇశ్రాయేలువారు ఆశీర్వదించుటకు
    నీ నామాన్ని ఉపయోగిస్తారు.
ఎవరినైనా ఆశీర్వదించినప్పుడు ‘దేవుడు ఎఫ్రాయిము
    మరియు మనష్షేవలె చేయునుగాక అని వాళ్లంటారు’ అని అతడు చెప్పాడు.”

ఈ విధంగా మనష్షేకంటె ఎఫ్రాయిమును గొప్ప చేశాడు ఇశ్రాయేలు.

21 అప్పుడు యోసేపుతో ఇశ్రాయేలు అన్నాడు “చూడు, నా మరణ ఘడియ దాదాపు సమీపించింది. అయితే దేవుడు మాత్రం ఇంకా మీతో ఉంటాడు. మీ పూర్వీకుల దేశానికి ఆయన మిమ్మును నడిపిస్తాడు. 22 నీ సోదరులకు ఇవ్వనిది నేను నీకు ఇచ్చాను. అమోరీ ప్రజలనుండి నేను గెలుచుకొన్న పర్వతాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఆ పర్వతం కోసం నా కత్తితో, నా బాణంతో నేను ఆ మనుష్యులతో పోరాడి గెల్చాను.”

మత్తయి 13:1-30

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మార్కు 4:1-9; లూకా 8:4-8)

13 అదే రోజు యేసు ఇంటి నుండి వెళ్ళి సరస్సు ప్రక్కన కూర్చున్నాడు. ఆయన చుట్టు పెద్ద ప్రజల గుంపు సమావేశమైంది. అందువల్ల ఆయన పడవనెక్కి కూర్చున్నాడు. ప్రజలు సరస్సు ఒడ్డున నిలుచున్నారు. ఆయన వాళ్ళకు ఎన్నో విషయాలు ఉపమానాలు చెబుతూ బోధించాడు,

“ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనాలు చల్లుతుండగా కొన్ని విత్తనాలు దారి ప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని తినివేసాయి. మరి కొన్ని విత్తనాలు మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందున అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యోదయమయ్యాక ఆ మొక్కలు వాడి పొయ్యాయి. వాటివేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరి కొన్ని విత్తనాలు ముండ్ల మొక్కల మధ్య పడ్డాయి. ఈ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కల్ని అణిచి వేసాయి. మరి కొన్ని విత్తనాలు సారవంతమైన నేలపై బడ్డాయి. వాటిలో కొన్ని నూరు రెట్ల పంటను, కొన్ని అరవై రెట్ల పంటను, కొన్ని ముప్పైరెట్ల పంటనిచ్చాయి. వినేవాళ్లు వినండి!”

యేసు బోధించుటకు ఉపమానములను ఎందుకు ఉపయోగించాడు

(మార్కు 4:10-12; లూకా 8:9-10)

10 శిష్యులు వచ్చి యేసును, “మీరు ప్రజలతో ఉపమానాలు ఉపయోగించి ఎందుకు మాట్లాడుతారు?” అని అడిగారు.

11 ఆయన ఈ విధంగా సమాధానం చెప్పాడు: “దేవుని రాజ్యం యొక్క రహస్యాలను తెలుసుకొనే జ్ఞానాన్ని మీరు పొందారు. వాళ్ళుకాదు. 12 దేవుడు గ్రహింపు ఉన్న వాళ్ళకు ఇంకా ఎక్కువగా ఇస్తాడు. లేని వాళ్ళ దగ్గరనుండి ఉన్నది కూడా తీసివేస్తాడు. 13 నేను వాళ్ళతో ఉపమానాల ద్వారా ఎందుకు మాట్లాడుతున్నానంటే, చూసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. విన్నా అర్దంచేసుకోరు, గ్రహించరు. 14 తద్వారా యెషయా ప్రవక్త ద్వారా చెప్పిన ఈ ప్రవచనం వాళ్ళ విషయంలో నిజమైంది:

‘మీరు తప్పక వింటారు,
    కాని అర్థంచేసుకోలేరు.
మీరు తప్పక చూస్తారు
    కాని గ్రహించలేరు.
15 వాళ్ళు కళ్ళతో చూసి, చెవుల్తో విని,
    హృదయాలతో అర్థం చేసుకొని నావైపు మళ్ళితే
    నేను వాళ్ళను నయం చేస్తాను.
కాని అలా జరుగరాదని
    ఈ ప్రజల హృదయాలు మొద్దుబారాయి.
    వాళ్ళకు బాగా వినిపించదు.
    వాళ్ళు తమ కళ్ళు మూసికొన్నారు.’(A)

16 కాని మీ కళ్ళు చూడకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. మీ చెవులు వినకలుగుతున్నాయి. కనుక అవి ధన్యమైనవి. 17 ఎందుకంటే ఎందరో ప్రవక్తలు, నీతిమంతులు మీరుచూస్తున్నవి చూడాలని ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని ఆశించారు. కాని వినలేక పోయారు. ఇది సత్యం.

యేసు విత్తనము యొక్క ఉపమానమును వివరించటం

(మార్కు 4:13-20; లూకా 8:11-15)

18 “మరి విత్తనాన్ని చల్లే రైతు ఉపమానాన్ని గురించి వినండి.

19 “కొందరు దేవుని రాజ్యాన్ని గురించి వింటారు. కాని అర్థం చేసుకోరు. అలాంటి హృదయాల్లో నాటబడిన దైవ సందేశాన్ని సైతాను తీసుకు వెళ్తాడు. వీళ్ళను రహదారి ప్రక్కనపడిన విత్తనాలతో పోల్చవచ్చు.

20 “దైవ సందేశాన్ని విని వెంటనే ఆనందంగా అంగీకరించే వాళ్ళను రాతి నేలపైబడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. 21 అలాంటి విత్తనాలకు వేర్లు ఉండవు. కనుక అవి చాలాకాలం బ్రతుకవు. సందేశం వలన కష్టాలుకాని హింసలు కాని సంభవించినప్పుడు వాళ్ళు వెంటనే దాన్ని వదలి వేస్తారు.

22 “దైవ సందేశాన్ని విని జీవితంలోని కష్టాలకు, ధనంవలన కలిగే మోసానికి ఉక్కిరి బిక్కిరై, నిష్పలులై పోయే వాళ్ళను ముళ్ళ మొక్కల్లో పడిన విత్తనాలతో పోల్చవచ్చు.

23 “దైవ సందేశాన్ని విని దాన్ని అర్ధం చేసుకొనే వాళ్ళను సారవంతమైన భూమిలో పడ్డ విత్తనాలతో పోల్చవచ్చు. వాటిలో కొన్ని నూరురెట్లు పంటను, కొన్ని అరవై రెట్లు పంటను, కొన్ని ముప్పైరెట్లు పంటను యిస్తాయి.”

కలుపు మొక్కలు

24 యేసు వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని మంచి విత్తనాల్ని తన పొలంలో నాటిన మనిషితో పోల్చవచ్చు. 25 అందరూ నిద్రపోతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ విత్తనాల మధ్య కలుపు విత్తనాలను చల్లిపోయాడు. 26 గోధుమ మొలకెత్తి విత్తనం వేసింది. వాటితో సహా కలుపుమొక్కలు కూడ కనిపించాయి. 27 పని వాళ్ళు, తమ యజమాని దగ్గరకు వచ్చి ‘అయ్యా! మీరు మీ పొలంలో మంచి విత్తనాలను నాటలేదా? మరి కలపు మొక్కలు ఎట్లా మొలిచాయి?’ అని అడిగారు.

28 “‘ఇది శత్రువు చేసిన పని’ అని ఆ యజమాని సమాధానం చెప్పాడు.

“పని వాళ్ళు, ‘మమ్మల్ని వెళ్ళి కలుపు తీయమంటారా?’ అని అడిగారు.

29 “అతడు, ‘వద్దు! మీరిప్పుడు కలుపు తీస్తే గోధుమ మొక్కల్ని కూడా పెరికి వేసే అవకాశం ఉంది. 30 కోతకొచ్చేవరకు రెండింటినీ పెరగనివ్వండి. అప్పుడు నేను కోత కోసే వాళ్ళతో, మొదట కలుపు మొక్కలు కోసి, కాల్చివేయటానికి వాటిని మోపులుగా కట్టి కాల్చివేయండి. ఆ తర్వాత గోధుమ గింజల్ని ప్రోగు చేసి నా ధాన్యపు కొట్టులోకి తీసుకు వెళ్ళమంటాను’ అని అంటాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International