Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 33-35

యాకోబు ఏశావును కలిసికొనుట

33 యాకోబు చూడగా ఏశావు రావడం కనబడింది. ఏశావు, అతనితో 400 మంది మనుష్యులు వస్తున్నారు. యాకోబు తన కుటుంబాన్ని నాలుగు గుంపులుగా చేశాడు. లేయా, ఆమె పిల్లలు ఒక గుంపులో ఉన్నారు, రాహేలు, యోసేపు ఒక గుంపులో ఉన్నారు, ఇద్దరు దాసీలు, వారి పిల్లలు మరి రెండు గుంపుల్లో ఉన్నారు. దాసీలను వారి పిల్లలను యాకోబు ముందు ఉంచాడు. తర్వాత యాకోబు లేయాను ఆమె పిల్లలను ఉంచాడు. ఆ తర్వాత, చివరగా రాహేలును, యోసేపును ఉంచాడు యాకోబు.

యాకోబు తానే ఏశావు వస్తున్న వైపు ముందుగా వెళ్లాడు. కనుక ఏశావు దగ్గరకు వచ్చిన మొదటివాడు అతడే. యాకోబు తన అన్న దగ్గరకు నడుస్తూ ఏడు సార్లు నేలమీద సాగిలపడ్డాడు.

యాకోబును చూడగానే అతణ్ణి కలుసుకొనేందుకు ఏశావు పరుగెత్తాడు. ఏశావు అతణ్ణి కౌగిలించుకొని హత్తుకొన్నాడు. ఏశావు అతని మెడమీద ముద్దు పెట్టుకొని, వారిద్దరు సంతోషముతో ఏడ్చేశారు. ఏశావు చూడగా స్త్రీలు, పిల్లలు అతనికి కనబడ్డారు. “నీతో ఉన్న వీళ్లంతా ఎవరు?” అని అతడు అడిగాడు.

“దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు వీళ్లంతాను. దేవుడు నాకు మేలు చేశాడు” అంటూ జవాబు చెప్పాడు యాకోబు.

తర్వాత ఇద్దరు దాసీలు, వారితో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లారు. వాళ్లంతా అతని ముందు సాష్టాంగపడ్డారు. తర్వాత లేయా, ఆమెతో ఉన్న పిల్లలు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు. తరువాత, రాహేలు, యోసేపు ఏశావు దగ్గరకు వెళ్లి సాష్టాంగపడ్డారు.

“నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నాకు కనబడిన ప్రజలంతా ఎవరు? పైగా ఆ జంతువులన్నీ దేని కోసం?” అని ఏశావు అడిగాడు.

దానికి యాకోబు “నీవు నన్ను స్వీకరించాలని అవన్నీ నీకు నా కానుకలు” అని జవాబిచ్చాడు.

కాని ఏశావు, “సోదరా, నాకు నీవు కానుకలు ఇవ్వాల్సిన పని లేదు. నాకు కావాల్సినంత ఉన్నది” అన్నాడు.

10 యాకోబు ఇలా అన్నాడు: “అలా కాదు, నేను నిన్ను బతిమాలుకొంటున్నాను. నీవు నిజంగా నన్ను అంగీకరిస్తుంటే, నీవు నా కానుకలు కూడా అంగీకరించాలి. మరలా నేను నీ ముఖం చూడటం నాకెంతో సంతోషంగా ఉంది. దేవుని ముఖము చూసినట్లు ఉంది. నీవు నన్ను అంగీకరించటం చూస్తే నాకు ఎంతో సంతోషంగా ఉంది. 11 అందుచేత నేను నీకు ఇస్తున్న కానుకలను కూడ స్వీకరించమని ప్రార్థిస్తున్నా. దేవుడు నాకు ఎంతో మేలు చేశాడు. నాకు కావల్సిన దానికంటే ఎక్కువగా ఉంది.” ఈ విధంగా తన కానుకల్ని తీసుకోమని యాకోబు ఏశావును బతిమాలాడు. కనుక ఏశావు ఆ కానుకలను స్వీకరించాడు.

12 అప్పుడు ఏశావు, “ఇంక నీవు ప్రయాణం కొనసాగించు. నేను కూడ నీతో వస్తాను” అన్నాడు.

13 కాని యాకోబు అతనితో ఇలా చెప్పాడు: “నా పిల్లలు బలహీనులని నీకు తెలుసు. పైగా నా మందలు, వాటి పిల్లలను గూర్చిన జాగ్రత్త నేను తీసుకోవాలి. ఒక్క రోజునే నేను వాటిని చాలా దూరం నడిపిస్తే అవి చస్తాయి. 14 అందుచేత నీవు ముందు వెళ్లు. నేను మెల్లగా నీ వెనుక వస్తాను. పశువులు, మిగిలిన జంతువులు క్షేమంగా ఉండగలిగినంత నిదానంగా నేను నడుస్తాను. మరియు నా పిల్లలు కూడ మరీ అలసిపోకుండా నేను మెల్లగా వస్తాను. శేయీరులో నేను నిన్ను కలుసుకొంటాను.”

15 ఏశావు, “అలాగైతే నీకు సహాయంగా నా మనుష్యులను కొందర్ని నీతో ఉంచుతాను” అన్నాడు.

కానీ యాకోబు, “అదంతా నీ దయ. కాని అలా చేయాల్సిన అవసరం ఏమీ లేదు” అన్నాడు. 16 కనుక ఆ రోజు ఏశావు శేయీరుకు తిరుగు ప్రయాణం కట్టాడు. 17 అయితే యాకోబు సుక్కోతుకు వెళ్లాడు. అక్కడ తనకోసం ఒక యిల్లు, తన పశువుల కోసం కొట్టములు కట్టాడు. అందుకే ఆ చోటుకు సుక్కోతు[a] అని పేరు.

18 ఆ తర్వాత, యాకోబు పద్దనరాము నుండి కనానులో ఉన్న షెకెము పట్టణం వరకు తన ప్రయాణాన్ని క్షేమంగా ముగించాడు. ఆ పట్టణానికి సమీపంగా ఒక పొలంలో యాకోబు తన నివాసం ఏర్పాటు చేసుకొన్నాడు. 19 షెకెము తండ్రియైన హమోరు కుటుంబం దగ్గర యాకోబు ఆ పొలాన్ని కొన్నాడు. యాకోబు నూరు వెండి నాణ్యాలు చెల్లించాడు. 20 దేవుణ్ణి ఆరాధించటానికి యాకోబు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి “ఏల్, ఇశ్రాయేలీయుల దేవుడు” అని పేరు పెట్టాడు.

దీనాను చెరచుట

34 యాకోబు లేయాల కుమార్తె దీనా. ఒక రోజు, ఆ ఊరి స్త్రీలను చూడాలని దీనా బయటకు వెళ్లింది. ఆ దేశం రాజైన హమోరు కుమారుడు షెకెము దీనాను చూశాడు. అతడు ఆమెను బంధించి, బలవంతంగా ఆమెతో శయనించాడు. షెకెము దీనాను ప్రేమించాడు. ఆమె తనను పెళ్లి చేసుకునేలా ఒప్పించేందుకు ఆమెతో మాట్లాడాడు. “నేను పెళ్లి చేసుకోవటానికి దయచేసి ఈ అమ్మాయినే తెచ్చి పెట్టమని” షెకెము తన తండ్రితో చెప్పాడు.

ఆ యువకుడు తన కూతురికి చేసిన దుష్కార్యాన్ని గూర్చి యాకోబు విన్నాడు. అయితే యాకోబు కుమారులంతా పశువులతోబాటు పొలాల్లో ఉన్నారు. అందుచేత వాళ్లు ఇంటికి తిరిగి వచ్చేంత వరకు యాకోబు ఏమీ చేయలేదు. అదే సమయంలో షెకెము తండ్రి హమోరు యాకోబుతో మాట్లాడేందుకు వెళ్లాడు.

జరిగినదాన్ని గూర్చి యాకోబు కుమారులకు పొలంలోనే తెలిసింది. ఇది విని వాళ్లకు చాలా కోపం వచ్చింది. యాకోబు కూతురుతో షెకెము శయనించి, ఇశ్రాయేలీయుల వంశానికి అవమానం తెచ్చాడు గనుక వారికి పిచ్చి కోపం రెచ్చిపోయింది. షెకెము చాలా చెడ్డపని చేశాడు కనుక ఆ సోదరులంతా పొలాలనుండి వచ్చేశారు.

అయితే హమోరు ఆ సోదరులతో మాట్లాడాడు. “నా కుమారుడు షెకెముకు దీనా కావాలని ఉంది. దయచేసి వాడిని ఆమెను పెళ్లి చేసుకోనివ్వండి. మనకు ఒక ప్రత్యేక ఒడంబడిక ఉన్నట్లు ఈ వివాహం వ్యక్తం చేస్తుంది. అప్పుడు మా మగవాళ్లు మీ అమ్మాయిలను, మీ మగవాళ్లు మా అమ్మాయిలను పెళ్లి చేసుకోవచ్చు. 10 ఈ దేశంలోనే మీరు కూడ మాతో కలిసి ఉండవచ్చును. భూమిని స్వంతం చేసుకొనేందుకు, వ్యాపారం చేసేందుకు ఇక్కడ మీకు స్వేచ్ఛ ఉంటుంది” అన్నాడు.

11 షెకెము కూడ యాకోబుతోను, దీనా అన్నదమ్ములతో మాట్లాడాడు. షెకెము అన్నాడు: “దయచేసి నన్ను స్వీకరించండి, నేను చేసిన దాని విషయంలో నన్ను క్షమించండి. మీరు నన్నేమి చేయమంటే అది చేస్తా. 12 మీరు నన్ను దీనాను పెళ్లి చేసుకోనిస్తే, మీరు కోరిన కన్యాశుల్కం మీకు ఇస్తా. మీరు ఏమి అడిగితే అది ఇస్తా కాని దీనాను నన్ను పెళ్లాడనివ్వండి.”

13 షెకెముతో, అతని తండ్రితో అబద్ధం చెప్పాలని యాకోబు కుమారులు నిశ్చయించుకున్నారు. వారి సోదరి దీనాకు షెకెము చేసిన నీచకార్యాన్నిబట్టి ఆ సోదరులు ఇంకా కోపంగానే ఉన్నారు. 14 కనుక ఆ సోదరులు, “నీకు ఇంకా సున్నతి కాలేదు గనుక నిన్ను మా సోదరిని పెళ్లి చేసుకోనివ్వం. మా సోదరి నిన్ను చేసుకోవడం తప్పు అవుతుంది. 15 అయితే నీవు ఈ ఒక్క పని చేస్తే నిన్ను ఆమెను పెళ్లి చేసుకోనిస్తాం. మీ పట్టణంలో ప్రతి పురుషుడూ మాలాగే సున్నతి చేసుకోవాలి. 16 అప్పుడు మీ పురుషులు మా స్త్రీలను, మా పురుషులు మీ స్త్రీలను పెళ్లి చేసుకోవచ్చు. అప్పుడు మనమంతా ఒక్క ప్రజ అవుతాం. 17 సున్నతికి మీరు నిరాకరిస్తే, దీనాను మేము తీసుకెళ్ళిపోతాం” అని అతనితో చెప్పారు.

18 ఈ ఒడంబడిక హమోరుకు, షెకెముకు చాలా సంతోషం కలిగించింది. 19 దీనా సోదరులు అడిగినట్లు చేయాలంటే షెకెముకు చాలా సంతోషంగా ఉంది.

షెకెము, అతని కుటుంబంలోకెల్లా చాలా గౌరవం గలవాడు. 20 హమోరు, షెకెము వారి పట్టణంలో సమావేశ స్థలానికి వెళ్లారు. ఆ పట్టణంలోని పురుషులతో వారు మాట్లాడి, అన్నారు: 21 “ఈ ఇశ్రాయేలీయులు మనతో నిజంగా స్నేహంగా ఉండాలని కోరుతున్నారు. వాళ్లను మన దేశంలోనే నివసించి వ్యాపారం చేసుకోనిద్దాం. మనందరికి సరిపోయేంత భూమి మనకు ఉంది. మనం వాళ్ల స్త్రీలను స్వేచ్ఛగా వివాహం చేసుకోవచ్చు. అలానే వారి పురుషులు వివాహం చేసుకొనేందుకు మన స్త్రీలను సంతోషంగా మనం ఇవ్వవచ్చు. 22 అయితే మన పురుషులంతా ఒక పని చేయడానికి ఒప్పుకోవాలి. ఇశ్రాయేలు ప్రజల్లాగే మన మగవాళ్లంతా సున్నతి చేసుకొనేందుకు సమ్మతించాలి. 23 మనం ఇలా చేస్తే, వాళ్ల ఆల మందలు, జంతువులు, వస్తుజాలం అన్నీ మనకి దక్కి, మనం ధనికులం అవుతాం. కనుక మనం వాళ్లతో ఈ ఒడంబడిక చేయాల్సిందే, వాళ్లు మనతోనే ఉంటారు.” 24 సమావేశ స్థలంలో ఈ మాటను విన్న మగవాళ్లంతా షెకెము, హమోరులతో ఏకీభవించారు. ఆ సమయంలో ప్రతి పురుషునికి సున్నతి జరిగింది.

25 మూడు రోజుల తర్వాత, సున్నతి పొందిన మగవాళ్లు ఇంకా బాధపడుతూనే ఉన్నారు. ఈ సమయంలో ఆ మనుష్యులు బలహీనంగా ఉంటారని యాకోబు ఇద్దరు కుమారులు షిమ్యోను, లేవీలకు తెలుసు. కనుక వారు పట్టణంలోకి వెళ్లి, ఆ పురుషులందర్నీ అక్కడే చంపేశారు. 26 దీనా సోదరులు షిమ్యోను, లేవీ కలిసి హమోరును, అతని కుమారుని చంపేసారు. అంతట వారు షెకెము యింటినుండి దీనాను తీసుకొని వెళ్లిపోయారు. 27 యాకోబు మిగిలిన కుమారులు ఆ పట్టణంలోకి వెళ్లి, అక్కడ ఉన్న సమస్తం దోచుకొన్నారు. వారి సోదరికి, షెకెము చేసిన దాని విషయంలో వారు ఇంకా కోపంగా ఉన్నారు. 28 కనుక వారి జంతువులన్నింటినీ ఆ సోదరులు తీసుకుపోయారు. వారి గాడిదలను, పట్టణంలో, పొలాల్లో మిగిలినదంతా వారు దోచుకొన్నారు. 29 ప్రజలకు ఉన్నదంతా ఆ సోదరులు దోచుకుపోయారు. చివరికి వారి భార్యలను, పిల్లలను కూడా ఆ సోదరులు తీసుకొని వెళ్లిపోయారు.

30 అయితే షిమ్యోనుతోనూ, లేవీతోనూ యాకోబు అన్నాడు, “మీరు నాకు చాలా కష్టం తెచ్చి పెట్టారు. ఈ దేశంలో ఉన్న ప్రజలంతా నన్ను అసహ్యించుకొంటారు. కనానీ ప్రజలు, పెరిజ్జీ ప్రజలు అంతా నాకు వ్యతిరేకంగా లేస్తారు. మనమేమో చాలా కొద్దిమందిమే ఉన్నాం. ఈ దేశంలో ఉన్నవాళ్లంతా ఏకమై మనమీద యుద్ధానికి వస్తే, నన్ను నాశనం చేస్తారు. నాతోబాటే మన ప్రజలందర్నీ నాశనం చేస్తారు.”

31 అయితే ఆ సోదరులు, “ఈ ప్రజలు మా సోదరిని ఒక వేశ్యలా చేస్తే, చూస్తూ ఊరుకోమంటావా? లేదు, మా సోదరికి అలా చేయటం వారిది తప్పు” అని చెప్పారు.

బేతేలులో యాకోబు

35 “బేతేలు పట్టణం వెళ్లు. అక్కడ నివసించి, ఆరాధనకు బలిపీఠం నిర్మించు. నీవు నీ అన్న ఏశావు దగ్గర్నుండి పారిపోతున్నప్పుడు నీకు అక్కడ ప్రత్యక్షమైన ఏల్ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో. అక్కడ ఆ దేవుణ్ణి ఆరాధించటానికి ఒక బలిపీఠం తయారు చేసుకో” అని దేవుడు యాకోబుతో చెప్పాడు.

కనుక యాకోబు తన కుటుంబం అంతటితో, సేవకులందరితో ఇలా చెప్పాడు: “మీ దగ్గర ఉన్న చెక్క, లోహములతో చేయబడిన ఆ తప్పుడు దేవతలన్నిటిని నాశనం చేయండి. మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. శుభ్రమైన వస్త్రాలను ధరించండి. మనం యిక్కడ్నుండి బేతేలుకు వెళ్లిపోవాలి. ఆ స్థలంలో నాకు కష్టం కలిగినప్పుడు సహాయం చేసినటువంటి దేవునికి బలిపీఠం కట్టాను. ఆ దేవుడే నేను వెళ్లిన ప్రతి చోటా నాతో ఉన్నాడు.”

కనుక ప్రజలు వారి దగ్గర ఉన్న అసత్య దేవతలన్నిటిని యాకోబుకు ఇచ్చివేశారు. వారంతా వారి చెవులకు ధరించిన నగలను యాకోబుకు ఇచ్చివేశారు. షెకెము దగ్గర ఉన్న సింధూర వృక్షం క్రింద యాకోబు వీటన్నిటిని పాతి పెట్టాడు.

యాకోబు, అతని కుమారులు ఆ స్థలం విడిచి వెళ్లిపోయారు. ఆ ఊరి ప్రజలు వీరిని వెంబడించి, చంపాలనుకొన్నారు. అయినా వారు చాలా భయపడి,[b] యాకోబును వెంబడించలేదు. కనుక యాకోబు, అతని వాళ్లంతా లూజు వెళ్లారు. లూజు ఇప్పుడు బేతేలు అని పిలువబడుతోంది. అది కనాను దేశంలో ఉంది. అక్కడ యాకోబు ఒక బలిపీఠం కట్టాడు. ఆ స్థలానికి ఏల్ బేతేలు అని యాకోబు పేరు పెట్టాడు. అతడు తన సోదరుని నుండి పారిపోతున్నప్పుడు మొట్టమొదటి సారిగా అక్కడే దేవుడు అతనికి ప్రత్యక్షమైన కారణంగా యాకోబు ఈ పేరును నిర్ణయించాడు.

రిబ్కా దాది దెబోరా అక్కడే చనిపోయింది. బేతేలులో సింధూర వృక్షం క్రింద ఆమెను వారు పాతిపెట్టారు. ఆ స్థలానికి అల్లోను బాకూత్ అని వారు పేరు పెట్టారు.

యాకోబు క్రొత్త పేరు

పద్దనరాము నుండి యాకోబు తిరిగి వస్తుండగా, దేవుడు మరల అతనికి ప్రత్యక్షమయి, యాకోబును యిలా ఆశీర్వదించాడు. 10 “నీ పేరు యాకోబు. కాని, ఆ పేరును నేను మార్చేస్తాను. ఇప్పుడు నీవు యాకోబు అని పిలువబడవు. నీ క్రొత్త పేరు ‘ఇశ్రాయేలు’ అని ఉంటుంది.” కాబట్టి దేవుడు అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు.

11 అతనితో దేవుడన్నాడు: “నేను సర్వశక్తిమంతుడనైన దేవుణ్ణి. కనుక నీకు ఈ ఆశీర్వాదం ఇస్తున్నాను: నీకు చాలా సంతోషం కలిగి, ఒక గొప్ప జనాంగంగా పెరుగుదువు! మరిన్ని జనాంగాలు, మరికొందరు రాజులు నీలో నుండి ఉద్భవిస్తారు. 12 అబ్రాహాము, ఇస్సాకులకు ఒక ప్రత్యేక దేశం నేనిచ్చాను. ఇప్పుడు ఆ దేశాన్ని నేను నీకు ఇస్తున్నాను. పైగా నీ తర్వాత జీవించే నీ ప్రజలందరికీ ఆ దేశాన్ని నేను ఇస్తున్నాను.” 13 అంతలో దేవుడు అక్కడ్నుండి వెళ్లిపోయాడు. 14-15 ఈ స్థలంలో ఒక స్మారక శిల[c] యాకోబు నిలబెట్టాడు. ద్రాక్షారసం, తైలం పోసి ఆ బండను పవిత్రం చేశాడు యాకోబు. ఆ స్థలంలో దేవుడు యాకోబుతో మాట్లాడాడు గనుక ఇది ఒక ప్రత్యేక స్థలం. యాకోబు ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు.

రాహేలు ప్రసవిస్తూ చనిపోవుట

16 యాకోబు, అతని వాళ్లు బేతేలు నుండి ప్రయాణమయ్యారు. ఇంక వారు ఎఫ్రాతా (బెత్లెహేం) చేరుతారనగా, రాహేలుకు ప్రసవ వేదన ప్రారంభమయింది. 17 అయితే ఈ కాన్పులో రాహేలు చాలా కష్టపడుతోంది. ఆమె విపరీతంగా బాధపడుతోంది. రాహేలు పనిమనిషి ఇది చూసి, “రాహేలూ, భయపడకు. నీవు మరో కుమారుణ్ణి కంటున్నావు” అని చెప్పింది.

18 కుమారుని కంటుండగా రాహేలు చనిపోయింది. చనిపోక ముందు ఆ పిల్లవాడికి బెనోని[d] అని ఆమె పేరు పెట్టింది. అయితే యాకోబు అతనికి బెన్యామీను[e] అని పేరు పెట్టాడు.

19 ఎఫ్రాతా మార్గంలో రాహేలు సమాధి చేయబడింది (ఎఫ్రాతా అంటే బెత్లెహేం). 20 రాహేలు గౌరవార్థం, ఆమె సమాధి మీద యాకోబు ఒక ప్రత్యేక బండను ఉంచాడు. ఆ ప్రత్యేక బండ నేటికీ అక్కడ ఉంది. 21 అప్పుడు ఇశ్రాయేలు (యాకోబు) తన ప్రయాణం కొనసాగించాడు. ఏదెరు శిఖరానికి కొద్దిగా దక్షిణంగా అతడు శిబిరం వేశాడు.

22 ఇశ్రాయేలు అక్కడ కొన్నాళ్లపాటు ఉండిపోయాడు. అతడు అక్కడ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు దాసి బిల్హాతో రూబేను శయనించాడు. ఇశ్రాయేలు ఇది విని చాలా కోపగించుకొన్నాడు.

ఇశ్రాయేలు (యాకోబు) కుటుంబం

యాకోబుకు (ఇశ్రాయేలుకు) 12 మంది కుమారులు.

23 అతని భార్య లేయా మూలంగా అతనికి ఆరుగురు కుమారులు ఉన్నారు. రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబూలును.

24 అతని భార్య రాహేలు మూలంగా అతనికి ఇద్దరు కుమారులున్నారు. యోసేపు, బెన్యామీను.

25 రాహేలు పనిమనిషి బిల్హా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దాను, నఫ్తాలి.

26 లేయా పనిమనిషి జిల్ఫా మూలంగా అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గాదు, ఆషేరు.

వీరు పద్దనరాములో యాకోబుకు (ఇశ్రాయేలుకు) పుట్టిన కుమారులు.

27 కిర్యతర్బాలోని (హెబ్రోను) మమ్రేలోనున్న తన తండ్రి ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. అబ్రాహాము, ఇస్సాకులు నివసించిన చోటు ఇది. 28 ఇస్సాకు 180 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు. 29 ఇస్సాకు చాలకాలం నిండు జీవితాన్ని జీవించాడు. అతడు చనిపోయినప్పుడు వృద్ధుడు. అతని తండ్రి సమాధి చేయబడిన చోటనే, అతని కుమారులైన ఏశావు, యాకోబులు అతణ్ణి కూడ సమాధి చేశారు.

మత్తయి 10:1-20

యేసు అపోస్తలులను పంపటం

(మార్కు 3:13-19; 6:7-13; లూకా 6:12-16; 9:1-6)

10 యేసు తన పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి దయ్యాల్ని వదిలించటానికి, అన్ని రకాల వ్యాధుల్ని, బాధల్ని నయం చేయటానికి వాళ్ళకధికారం ఇచ్చాడు. ఆ పన్నెండుగురి అపోస్తలుల పేర్లు ఇవి:

సీమోను; ఇతన్నే పేతురు అని పిలిచేవాళ్ళు.

అతని సోదరుడు అంద్రెయ.

జెబెదయి కుమారుడు యాకోబు,

యాకోబు సోదరుడు యోహాను.

ఫిలిప్పు,

బర్తొలొమయి,

తోమా,

పన్నులు సేకరించే మత్తయి,

అల్ఫయి కుమారుడు యాకోబు,

తద్దయి అని పిలువబడే లెబ్బయి,

కనానీయుడైన సీమోను,

యేసుకు ద్రోహం చేసిన యూదా ఇస్కరియోతు.

ఆ పన్నెండుగురిని ప్రజల వద్దకు పంపుతూ వారికి యేసు ఈ విధంగా ఉపదేశించాడు: “యూదులు కాని వాళ్ళ దగ్గరకు గాని, సమరయ దేశంలోని పట్టణాలలోకి గాని వెళ్ళకండి. దానికి మారుగా ఇశ్రాయేలు ప్రజల వద్దకు వెళ్ళండి. వారు తప్పిపోయిన గొఱ్ఱెలవలె ఉన్నారు. వెళ్ళి, దేవుని రాజ్యం దగ్గరలోనే ఉందని ప్రకటించండి. జబ్బుతో ఉన్న వాళ్ళకు నయం చెయ్యండి. దయ్యాలను వదిలించండి. మీకు ఉచితంగా లభించింది ఉచితంగా యివ్వండి. బంగారం కాని, వెండికాని, రాగి కాని మీ సంచిలో పెట్టుకొని వెళ్ళకండి, 10 మీరు ప్రయాణం చేసేటప్పుడు సంచిని కాని, దుస్తుల్ని కాని, చెప్పుల్ని కాని, చేతి కర్రను కాని మీ వెంట తీనుకెళ్ళకండి. పని చేసిన వాళ్ళకు కూలి దొరకాలి కదా!

11 “మీరు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకు వెళ్ళినా మంచి వాడెవరో విచారించి, ఆ గ్రామం వదిలే దాకా అతని ఇంట్లోనే ఉండండి. 12 మీరా ఇంట్లోకి ప్రవేశించినప్పుడు ఆ ఇంట్లో ‘శాంతి కలుగునుగాక’ అనండి. 13 ఆ ఇంటివారు యోగ్యులైతే మీరు చెప్పిన శాంతి ఆ ఇంటివారికి కలుగుతుంది. లేక పోయినట్లైతే ఆ శాంతి మీకే తిరిగి వస్తుంది. 14 ఒక వేళ, మీకు ఎవ్వరూ స్వాగతం చెప్పక పోయినట్లైతే, ఆ ఇంటిని కాని లేక ఆ గ్రామాన్ని కాని వదిలి వెళ్ళేముందు మీ కాలి ధూళి దులిపి వెయ్యండి. 15 ఇది సత్యం, తీర్పు చెప్పే రోజు సొదొమ మరియు గొమొఱ్ఱా పట్టణాలకన్నా మీరు వదిలిన గ్రామం భరించలేని స్థితిలో ఉంటుంది.

కష్టాలను గురించి యేసు హెచ్చరించటం

(మార్కు 13:9-13; లూకా 21:12-17)

16 “తోడేళ్ళ మధ్యకు గొఱ్ఱెల్ని పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నాను. అందువల్ల పాముల్లాగా తెలివిగా, పాపురాల్లా నిష్కపటంగా మీరు మెలగండి. 17 కాని, వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు మిమ్మల్ని స్థానిక సభలకు అప్పగిస్తారు. తమ సమాజ మందిరాల్లో కొరడా దెబ్బలుకొడతారు. 18 వాళ్ళు నా కారణంగా మిమ్మల్ని పాలకుల ముందుకు, రాజుల ముందుకు తీసుకు వెళ్తారు. మీరు వాళ్ళ ముందు, యూదులుకాని ప్రజలముందు నా గురించి చెప్పాలి. 19 వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగించినప్పుడు, ఏ విధంగా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని చింతించకండి. మీరు ఏం మాట్లాడాలో దేవుడు ఆ సమయంలో మీకు తెలియచేస్తాడు. 20 ఎందుకంటే, మాట్లాడేది మీరు కాదు. మీ తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడుతాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International