Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 9-11

పశువులకు రోగం

అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: “నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’ ఇంకా నీవు వారిని పోనివ్వక ఆపి ఉంచితే పొలాల్లోని నీ జంతువులు అన్నింటి మీద యెహోవా తన శక్తిని ఉపయోగిస్తాడు. నీ గుర్రాలు, నీ గాడిదలు, ఒంటెలు, పశువులు, గొర్రెలు అన్నింటికీ భయంకర రోగం వచ్చేటట్టు యెహోవా చేస్తాడు. ఈజిప్టు జంతుజాలంకంటె ఇశ్రాయేలీయుల జంతువుల్ని యెహోవా ప్రత్యేకంగా చూస్తాడు. ఇశ్రాయేలీయులకు చెందిన జంతువుల్లో ఏదీ చావదు ఇదంతా జరగటానికి యెహోవా సమయాన్ని నిర్ణయించాడు. రేపు ఈ దేశంలో ఇది జరిగేటట్టు యెహోవా చేస్తాడు.”

మర్నాడు ఉదయాన్నే ఈజిప్టు పొలాల్లోని జంతువులన్నీ చచ్చాయి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు చెందిన జంతువుల్లో ఒక్కటికూడా చావలేదు. ఇశ్రాయేలీయుల జంతువులు ఏవైనా చచ్చాయేమో చూడమని ఫరో మనుష్యుల్ని పంపాడు. ఇశ్రాయేలీయుల జంతువుల్లో ఒక్కటి కూడ చావలేదు. ఫరో మాత్రం మొండిగానే ఉండిపోయాడు. అతడు ప్రజల్ని వెళ్లనివ్వలేదు.

దద్దుర్లు

మోషే, అహరోనులకు యెహోవా ఇలా చెప్పాడు, “మీ చేతుల నిండా కొలిమిలోని బూడిదను తీసుకోండి. మోషే, ఫరో ముందర గాలిలో ఈ బూడిదను వెదజల్లాలి. ఇది దుమ్ముగా మారి ఈజిప్టు దేశం అంతటా వ్యాపిస్తుంది. ఈజిప్టులో ఎప్పుడెప్పుడు ఏ వ్యక్తిని లేక జంతువును ఈ దుమ్ము తాకుతుందో ఆ చర్మంమీద దద్దుర్లు పుడతాయి.”

10 మోషే, అహరోనులు కొలిమి నుండి బూడిద తీసుకొన్నారు. తర్వాత వెళ్లి ఫరో ఎదుట నిలబడ్డారు. ఆ బూడిదను వారు గాలిలో వెదజల్లారు, మనుష్యుల మీద, జంతువుల మీద దద్దుర్లు పుట్టడం మొదలయింది. 11 చివరికి మాంత్రికులకు కూడా ఆ దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది. 12 అయితే యెహోవా ఫరోను మొండి వాడిగా చేసాడు. అందుచేత మోషే, అహరోనుల మాట వినేందుకు ఫరో ఒప్పుకోలేదు. ఇది సరిగ్గా యెహోవా చెప్పినట్టే జరిగింది.

వడగళ్లు

13 అప్పుడు మోషేతో యెహోవా ఇలా అన్నాడు: “ఉదయాన్నే లేచి, ఫరో దగ్గరికి వెళ్లు. ‘నన్ను ఆరాధించడానికి, నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల దేవుడైన, యెహోవా అంటున్నాడని అతనితో చెప్పు. 14 నీవు గనుక ఇలా చెయ్యకపోతే, అప్పుడు నీ మీద, నీ ప్రజలమీద, నీ అధికారుల మీద నా శక్తి అంతా ప్రయోగిస్తాను. అప్పుడు నాలాంటి దేవుడు ప్రపంచంలోనే లేడని నీకు తెలుస్తుంది. 15 నేను నా శక్తిని ప్రయోగించి, ఒక్క రోగం రప్పించానంటే, అది నిన్ను, నీ ప్రజల్ని భూమి మీద లేకుండా తుడిచి పారేస్తుంది. 16 అయితే ఒక కారణం వల్ల నేను నిన్ను ఇక్కడ ఉంచాను. నా శక్తిని నీవు చూడాలని నిన్ను ఇక్కడ ఉంచాను. అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు నా విషయం తెల్సుకొంటారు. 17 నీవు ఇంకా నా ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నావు. నీవు వాళ్లను స్వతంత్రంగా వెళ్లనివ్వడంలేదు. 18 కనుక రేపు ఈ వేళకు మహా బాధాకరమైన వడగళ్ల వానను నేను కురిపిస్తాను. ఇంతకు ముందు ఎన్నడూ ఈజిప్టు ఒక దేశంగా ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకూ ఇలాంటి వడగళ్ల వాన పడలేదు. 19 ఇక నీవు నీ జంతువుల్ని క్షేమంగా ఉండేచోట పెట్టుకోవాలి. ప్రస్తుతం పొలాల్లో ఉన్న నీ స్వంతదైన ప్రతిదాన్నీ భద్రమైన చోట నీవు ఉంచుకోవాలి. ఎందుచేతనంటే పొలాల్లో నిలబడి ఉండే మనిషిగాని జంతువుగాని చచ్చినట్లే. ఇంట్లో చేర్చబడకుండా ఉండే ప్రతి దానిపైనా వడగళ్లు కురుస్తాయి.’”

20 ఫరో అధికారులలో కొందరు యెహోవా మాటను గమనించారు. వాళ్లు వెంటనే వారి పశువులన్నిటినీ, బానిసలందరినీ ఇండ్లలో చేర్చారు. 21 కాని మిగతా వాళ్లు యెహోవా సందేశాన్ని లెక్క చేయలేదు. అలాంటి వారు పొలాల్లో ఉన్న తమ బానిసలందరిని, జంతువులన్నింటిని అక్కడే ఉండ నిచ్చారు.

22 నీ చేతులు గాలిలో పైకి ఎత్తు, “ఈజిప్టు అంతటా వడగళ్ల వాన ప్రారంభం అవుతుంది. ఈజిప్టు పొలాల్లో ఉన్న మొక్కలన్నిటి మీద, జంతువుల మీద, మనుష్యులందరి మీద వడగళ్లు పడతాయి” అని మోషేతో యెహోవా చెప్పాడు.

23 కనుక మోషే తన కర్రను పైకి ఎత్తాడు, ఉరుములు, మెరుపులు వచ్చేటట్టు, భూమి మీద వడగళ్లు కురిసేటట్టు యెహోవా చేసాడు. ఈజిప్టు అంతటా వడగళ్లు పడ్డాయి. 24 వడగళ్లు పడుతోంటే, ఆ వడగళ్లతో పాటు మెరుపులు మెరిసాయి. ఈజిప్టు ఒక రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి, ఈజిప్టును ఇంత దారుణంగా దెబ్బతీసిన వడగళ్ల వాన ఇదే. 25 ఈజిప్టు పొలాల్లో ఉన్న సర్వాన్నీ ఈ వడగళ్ల వాన నాశనం చేసింది. మనుష్యుల్ని, జంతువుల్ని, మొక్కల్ని వడగళ్లు నాశనం చేసాయి. వడగళ్ల మూలంగా పొలాల్లోని చెట్లన్నీ విరిగి పోయాయి. 26 ఇశ్రాయేలు ప్రజలు నివసించే గోషేను ఒక్కటే వడగళ్లు పడని ఒకే ఒక చోటు.

27 మోషే అహరోనులను ఫరో పిలిపించాడు. ఫరో వారితో, “ఈ సారి నేను పాపం చేసాను. యెహోవా న్యాయమంతుడు. తప్పు నాది, నా ప్రజలది. 28 వడగళ్లు, ఉరుములు మరీ భయంకరంగా ఉన్నాయి! వాటిని ఆపేయమని దేవుణ్ణి అడుగు. నేను మిమ్మల్ని వెళ్లిపోనిస్తాను. మీరు ఇక్కడ ఉండనక్కర్లేదు.” అని చెప్పాడు.

29 మోషే ఫరోతో చెప్పాడు: “నేను ఈ పట్టణంనుండి యెహోవా ఎదుట నా చేతులు చాచి ప్రార్థిస్తాను. ఉరుములు, వడగళ్లు ఆగిపోతాయి. ఈ భూమిమీద యెహోవా ఉన్నాడని మీరు అప్పుడు తెలుసుకొంటారు. 30 అయినా నీవు నీ అధికారులు ఇంకా యెహోవాకు భయపడడంలేదని నాకు తెలుసు.”

31 అప్పుడే జనుము గింజ పట్టింది. యవలు అప్పుడే పూత పట్టాయి. అయిననూ ఈ మొక్కలు నాశనం అయ్యాయి. 32 అయితే గోధుమలు, మిరప ఇతర ధాన్యాలకంటె ఆలస్యంగా పక్వానికి వస్తాయి. అందుచేత ఈ మొక్కలు నాశనం కాలేదు. 33 మోషే ఫరోను విడిచి పట్టణం బయటికి వెళ్లాడు. యెహోవా యెదుట అతడు తన చేతులు చాచాడు. ఉరుములు, వడగళ్లు ఆగిపోయాయి. నేలమీద వర్షం కురవడం కూడ ఆగిపోయింది.

34 ఎప్పుడయితే వర్షం, వడగళ్లు, ఉరుములు ఆగిపోవడం ఫరో చూశాడో, అప్పుడు అతను మళ్లీ తప్పు చేసాడు. అతను అతని అధికారులు మళ్లీ మొండికెత్తారు. 35 ఇశ్రాయేలు ప్రజల్ని స్వేచ్ఛగా వెళ్లనిచ్చేందుకు నిరాకరించాడు ఫరో. యెహోవా మోషే ద్వారా చెప్పినట్లే ఇది జరిగింది.

మిడతలు

10 యెహోవా మోషేతో, “ఫరో దగ్గరకు వెళ్లు. నేనే అతణ్ణి అతని అధికారులని మొండిగా చేస్తాను. నా మహత్తర అద్భుతాలను నేను వాళ్లకు చూపించాలని నేనే ఇలా చేసాను. అలాగే ఈజిప్టులో నేను చేసిన అద్భుతాలు, ఇతర మహత్యాల విషయం మీరుకూడ మీ పిల్లలకు మీ పిల్లల పిల్లలకు చెప్పవచ్చని వీటిని చేసాను. అప్పుడు నేనే యెహోవానని మీరంతా తెల్సుకొంటారు” అని చెప్పాడు.

మోషే, అహరోనులు ఫరో దగ్గరకు వెళ్లారు. “‘ఎంత కాలం నీవు నాకు లోబడకుండా తిరస్కరిస్తావు? నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు అని హీబ్రూ ప్రజల యెహోవా దేవుడు అంటున్నాడు అని వారు అతనితో చెప్పారు. నీవు నా ప్రజలను వెళ్లనివ్వకపోతే, రేపు నీ దేశంలోకి మిడతలను తీసుకొస్తాను. నేల అంతా మిడతలతో నిండి పోతుంది. నీకు నేల కనబడనంత విస్తారంగా మిడతలు ఉంటాయి. వడగళ్ల వానలో మిగిలింది యింకేమైనా ఉంటే, దాన్ని కాస్తా మిడతలు తినేస్తాయి. పొలాల్లో చెట్ల ఆకులన్నిటినీ మిడతలు తినేస్తాయి. మీ ఇండ్లు మీ అధికారుల ఇండ్లు, ఈజిప్టులో ఉన్న మొత్తం ఇండ్లన్నీ మిడతలతో నిండిపోతాయి. మీ తల్లిదండ్రులు, తాతలు ఎన్నడైనా చూచిన వాటికంటే ఎక్కువ మిడతలు ఉంటాయి. ఈజిప్టులో మనుష్యులు నివాసం మొదలు పెట్టినప్పటినుండి ఎన్నడైనా ఉన్న మిడతల కంటె ఎక్కువ మిడతలు ఉంటాయి.’” తరువాత మోషే ఫరోను విడిచి, వెనుదిరిగాడు.

“ఇంకెన్నాళ్లు ఈ మనుష్యులు మనల్ని చిక్కుల్లో పెడతారు. మగవాళ్లందర్నీ వారి యెహోవా దేవుడ్ని ఆరాధించుకొనేందుకు వెళ్లనివ్వు. నీవు వాళ్లను వెళ్లనియ్యకపోతే, నీవు గుర్తించక ముందే, ఈజిప్టు నాశనం అయిపోతుంది” అని ఫరో అధికారులు అతనితో చెప్పారు.

కనుక మోషే అహరోనులను తన దగ్గరకు మళ్లీ తీసుకురమ్మని ఫరో తన అధికారులతో చెప్పాడు. “మీరు వెళ్లి మీ యెహోవా దేవుడ్ని ఆరాధించండి, అయితే ఎవరెవరు వెళ్లుచున్నది నాకు సరిగ్గా చెప్పండి?” అన్నాడు ఫరో.

“మా ప్రజలలో పడుచువాళ్లు, వృద్ధులు వెళ్తారు! మాతోబాటు మా కుమారులు మా కుమార్తెలను, మా గొర్రెల్ని మా పశువుల్ని కూడ తీసుకుపోతాం. ఇది మా యెహోవా పండుగ గనుక మేమంతా వెళ్తాము” అని జవాబిచ్చాడు మోషే.

10 ఫరో వాళ్లతో, “నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని వెళ్లనిచ్చే ముందు యెహోవా నిజంగా మీతో ఉండి తీరాలి. చూస్తోంటే, 11 మీరేదో దుర్మార్గం తలపెట్టి నట్లుంది. మగాళ్లు వెళ్లి యెహోవాను ఆరాధించవచ్చు. అసలు మీరడిగింది అదే. అంతేగాని మీరంతా మొత్తం వెళ్లి పోయేందుకు వీల్లేదు” అని చెప్పి మోషే, అహరోనులను ఫరో పంపించి వేసాడు.

12 యెహోవా మోషేతో “ఈజిప్టు మీద నీ చేయి ఎత్తు, మిడతలు వచ్చేస్తాయి. ఈజిప్టు మొత్తం నేలమీద మిడతలు ఆవరించేస్తాయి. వడగళ్లు నాశనం చేయకుండా మిగిలిన పంట అంతటినీ ఆ మిడతలు తినేస్తాయి” అని చెప్పాడు.

13 కనుక మోషే ఈజిప్టు దేశం మీద తన కర్ర ఎత్తగా తూర్పు నుండి బలంగా గాలి వీచేటట్టు యెహోవా చేసాడు. ఆ రోజంతా, ఆ రాత్రి అంతా గాలి వీచింది. తెల్లవారేటప్పటికి ఈజిప్టు అంతటా మిడతల్ని తెచ్చి పడేసింది ఆ గాలి.

14 మిడతలు ఈజిప్టు దేశంలోకి ఎగిరివచ్చి నేలమీదంతటా కమ్మాయి. ఈజిప్టులో ఇది వరకు ఎన్నడూ లేనన్ని మిడతలు వచ్చేసాయి. పూర్వం ఎన్నడూ అన్ని మిడతలు ఉండలేదు. 15 నేల అంతా మిడతలు కమ్మేశాయి. దేశం అంతా చీకటి అయిపోయింది. వడగళ్లు నాశనం చేయకుండా మిగిల్చిన చెట్లలో ప్రతి ఫలాన్ని, నేలమీద ఉన్న ప్రతి మొక్కనూ మిడతలు తినేసాయి. మొత్తం ఈజిప్టులో ఎక్కడేగాని ఏ చెట్లకూ మొక్కలకూ ఒక్క ఆకు గూడ మిగల్లేదు.

16 వెంటనే మోషే అహరోనులను పిలిపించాడు ఫరో, “మీకు, మీ యెహోవా దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసాను. 17 ఈ సారికి నా పాపాలు క్షమించండి. నా దగ్గర్నుండి ఈ మృత్యువును (మిడతలను) తీసివేయమని యెహోవాను అడగండి” అని చెప్పాడు ఫరో.

18 మోషే ఫరో దగ్గరనుండి వెళ్లిపోయి యెహోవాను ప్రార్థించాడు. 19 కనుక యెహోవా ఆ గాలిని మార్చేసాడు. పడమటినుండి గాలి బలంగా వీచేటట్టు చేసాడు. ఆ గాలి మిడతలన్నింటినీ ఎర్ర సముద్రంలోకి కొట్టేసింది. ఈజిప్టులో ఒక్క మిడతకూడ మిగల్లేదు. 20 అయితే యెహోవా ఫరోను మాత్రం ఇంకా మొండిగా చేసాడు. ఇశ్రాయేలు ప్రజల్ని ఫరో వెళ్లనివ్వలేదు.

అంధకారం

21 అప్పుడు యెహోవా, “నీ చెయ్యి పైకెత్తు, ఈజిప్టు చీకటిమయం అవుతుంది. చీకటిలో తడవులాడేటంత కటిక చీకటి కమ్ముతుంది” అని మోషేతో చెప్పాడు.

22 కనుక మోషే తన చేతిని పైకి ఎత్తగానే ఒక చీకటి మేఘం ఈజిప్టును ఆవరించేసింది. ఈజిప్టులో మూడు రోజుల పాటు ఆ చీకటి ఉండిపోయింది. 23 ఎవ్వరూ ఎవ్వర్నీ చూడలేక పోయారు. మూడు రోజుల వరకు ఎవ్వరూ వాళ్ల స్థానాలు విడిచి పెట్టలేదు. అయితే ఇశ్రాయేలు ప్రజలు నివసించే ప్రదేశాలన్నింటిలో వెలుగు ఉంది.

24 ఫరో మళ్లీ మోషేను పిలిపించి, “వెళ్లి యెహోవాను ఆరాధించండి. మీరు మీ పిల్లల్ని మీతో కూడా తీసుకొని వెళ్లొచ్చు. కాని మీ గొర్రెల్ని, పశువుల్ని మాత్రం ఇక్కడ విడిచి పెట్టిండి” అన్నాడు.

25 “మా గొర్రెల్ని, పశువుల్ని మాతో కూడ తీసుకొని వెళ్లడమేకాదు, మేము వెళ్లేటప్పుడు మీరు కూడ కానుకలు, బలి అర్పణలు మాకు యివ్వాలి. మా యెహోవా దేవుడ్ని ఆరాధించడానికి ఈ బలులను మేము వాడుకొంటాము. 26 యెహోవాను ఆరాధించేందుకు మా జంతువుల్ని కూడ మేము తీసుకొని వెళ్తాము. ఒక్క డెక్క కూడ ఇక్కడ విడిచి పెట్టబడదు. యెహోవాను ఆరాధించేందుకు ఏమేమి కావాలో సరిగ్గా మాకూ ఇంకా తెలియదు. మేము వెళ్తున్న చోటికి చేరిన తర్వాతే అది మాకు తెలుస్తుంది. అందుచేత యివన్నీ మేము తీసుకెళ్లాల్సిందే” అని మోషే అన్నాడు.

27 యెహోవా ఫరోను ఇంకా మొండిగా చేసాడు. అందుచేత ఫరో ప్రజలను వెళ్లనివ్వలేదు. 28 అప్పుడు ఫరో మోషేతో, “పో, నా దగ్గర్నుండి వెళ్లిపో! నీవు మళ్లీ ఇక్కడకు రాకూడదు. నన్ను కలుసుకోవాలని మరోసారి వస్తే, నీవు చస్తావు” అన్నాడు.

29 “మోషే ఫరోతో, నీవు చెప్పింది నిజమే. నిన్ను చూడ్డానికి నేను మళ్లీ రాను” అని చెప్పాడు.

జ్యేష్ఠుల మరణం

11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా ఒక నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి. ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.’” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు.

మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్యరాత్రి మరణదూత ఈజిప్టులో తిరుగుతాడు. ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి. గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి. కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు. అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”

యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు. 10 ఆ కారణం చేతనే ఫరో యెదుట మోషే, అహరోనులు ఈ మహా అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి వెళ్లనియ్యకుండా అంత మొండికెత్తేటట్టు యెహోవా చేసాడు.

మత్తయి 15:21-39

యేసు యూదులు కాని స్త్రీకి సహాయం చేయటం

(మార్కు 7:24-30)

21 యేసు ఆ ప్రదేశాన్ని వదిలి తూరు, సీదోను ప్రాంతాలకు వెళ్ళాడు. 22 కనాను ప్రాంతానికి చెందిన ఒక స్త్రీ యేసు దగ్గరకు ఏడుస్తూ వచ్చి, “ప్రభూ! దావీదు కుమారుడా! నాపై దయ చూపు. నా కూతురు దయ్యం పట్టి చాలా బాధ పడుతుంది” అని ఆయనతో అన్నది.

23 యేసు ఏ సమాధానం చెప్పలేదు. అందువల్ల శిష్యులు వచ్చి, “ఆమె బిగ్గరగా కేకలు వేస్తూ మనవెంట వస్తోంది. ఆమెను వెళ్ళమనండి” అని విజ్ఞప్తి చేసారు.

24 యేసు, “తప్పిపోయిన ఇశ్రాయేలు ప్రజల[a] కోసం మాత్రమే దేవుడు నన్ను పంపాడు” అని అన్నాడు.

25 ఆ స్త్రీ వచ్చి యేసు ముందు మోకరిల్లి, “ప్రభూ! నాకు సహాయం చెయ్యండి!” అని అడిగింది.

26 యేసు, “దేవుని సంతానానికి చెందిన ఆహారం తీసుకొని కుక్కలకు వెయ్యటం న్యాయం కాదు” అని సమాధానం చెప్పాడు.

27 “ఔను ప్రభూ! కాని, కుక్కలు కూడా తమ యజమాని విస్తరు నుండి పడిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె అన్నది.

28 అప్పుడు యేసు, “అమ్మా! నీలో ఉన్న విశ్వాసం గొప్పది. నీవు కోరినట్లే జరుగుతుంది” అని సమాధానం చెప్పాడు. ఆ క్షణంలోనే ఆమె కూతురుకు నయమై పోయింది.

యేసు అనేకులను నయం చేయటం

29 యేసు అక్కడి నుండి బయలుదేరి, గలిలయ సరస్సు తీరము మీదుగా నడిచి కొండ మీదికి వెళ్ళి కూర్చున్నాడు.

30 ప్రజలు గుంపులు గుంపులుగా అక్కడికి వచ్చారు. వాళ్ళు తమ వెంట కుంటి వాళ్ళను, గ్రుడ్డి వాళ్ళను, కాళ్ళు చేతులు పడి పోయిన వాళ్ళను, మూగ వాళ్ళను యింకా అనేక రకాల రోగాలున్న వాళ్ళను తీసికొని వచ్చి ఆయన కాళ్ళ ముందు పడ వేసారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు. 31 మూగ వాళ్ళకు మాట వచ్చింది. కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకు నయమైపోయింది. కుంటి వాళ్ళు నడిచారు. గ్రుడ్డి వాళ్ళకు చూపు వచ్చింది. ఇవన్నీ జరగటం చూసి ప్రజలు ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించారు.

యేసు నాలుగువేల మందికి పైగా భోజనం పెట్టటం

(మార్కు 8:1-10)

32 యేసు తన శిష్యుల్ని పిలిచి వాళ్ళతో, “వీళ్ళపట్ల నాకు చాలా జాలి వేస్తోంది. వాళ్ళు మూడు రోజులనుండి నా దగ్గరే ఉన్నారు. వాళ్ళ దగ్గర తినటానికి ఏమీ లేదు. వాళ్ళను ఆకలితో పంపటం నాకిష్టం లేదు. అలా పంపివేస్తే వాళ్ళు దారిలో మూర్ఛ పడిపోతారు” అని అన్నాడు.

33 ఆయన శిష్యులు సమాధానంగా, “ఈ మారు మూల ప్రాంతంలో అందరికి సరిపోయె రొట్టెలు ఎక్కడ దొరుకుతాయి?” అని అన్నారు.

34 “మీ దగ్గర ఎన్ని రొట్టెలున్నాయి?” యేసు అడిగాడు.

“ఏడు రొట్టెలు, కొన్ని చేపలు ఉన్నాయి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

35 యేసు ప్రజల్ని కూర్చోమన్నాడు. 36 ఆ తర్వాత ఆ ఏడు రొట్టెల్ని, చేపల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని విరిచి శిష్యులకు యిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచి పెట్టారు. 37 అందరూ సంతృప్తిగా తిన్నారు. ఆ తర్వాత శిష్యులు మిగిలిన ముక్కల్ని ఏడు గంపల నిండా నింపారు. 38 స్త్రీలు, చిన్న పిల్లలు కాక నాలుగు వేలమంది పురుషులు ఆ రోజు అక్కడ భోజనం చేసారు. 39 యేసు ప్రజల్ని పంపేసాక పడవనెక్కి మగదాను ప్రాంతానికి వెళ్ళాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International