Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 19-20

ఇశ్రాయేలీయులతో దేవుని ఒడంబడిక

19 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి ప్రయాణమైన మూడో నెలలో వారు సీనాయి అరణ్యము చేరుకొన్నారు. ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు. అప్పుడు మోషే పర్వతం[a] మీద దేవుడి దగ్గరకు వెళ్లాడు. మోషే ఆ పర్వతం మీద ఉన్నప్పుడు, అతనితో దేవుడు ఇలా చెప్పాడు. “యాకోబు మహా వంశమైన ఇశ్రాయేలు ప్రజలకు ఈ విషయాలు చెప్పు: ‘నా శత్రువులకు నేను చేసిన పనులన్నీ మీరు చూసారు. ఈజిప్టు వాళ్లకు నేను ఏమి చేసానో మీరు చూసారు. పక్షిరాజువలె[b] నేను మిమ్మల్ని ఈజిప్టు నుండి మోసుకొని వచ్చి, నా దగ్గరకు, ఇక్కడికి తీసుకొచ్చాను. కనుక ఇప్పుడు మీరు నా మాటలకు లోబడాలి అంటున్నాను. నా ఒడంబడికను నిలబెట్టండి. మీరు ఇలా చేస్తే, మీరు వా ప్రత్యేకమైన స్వంత ప్రజలుగా ఉంటారు. మీరు ఒక ప్రత్యేక జాతిగా యాజకుల సామ్రాజ్యంగా మీరు ఉంటారు.’ మోషే, నేను నీతో చెప్పిన ఈ విషయాలు ఇశ్రాయేలు ప్రజలతో నీవు తప్పక చెప్పాలి.”

కనుక మోషే పర్వతం దిగివచ్చి ప్రజల పెద్దలను (పరిపాలకులను) సమావేశపర్చాడు. వాళ్లతో చెప్పమని యెహోవా తనకు ఆజ్ఞాపించిన విషయాలన్నింటినీ మోషే ఆ పెద్దలకు చెప్పాడు. ప్రజలంతా కలిసి మాట్లాడారు. “యెహోవా చెప్పిన దానికంతటికీ మేము విధేయులం” అని వారు చెప్పారు.

తర్వాత పర్వతం మీద దేవుని దగ్గరకు మోషే వెళ్లాడు. ప్రజలు ఆయనకు విధేయులవుతారు అని మోషే దేవునితో చెప్పాడు. “దట్టమైన మేఘంలో నేను మీ దగ్గరకు వస్తాను. నేను నీతో మాట్లాడుతాను. నేను నీతో మాట్లాడటం ప్రజలంతా వింటారు. నీవు చెప్పే విషయాలు ప్రజలు ఎల్లప్పుడూ నమ్మేటట్టుగా నేను ఈ పని చేస్తాను.” అని యెహోవా మోషేతో చెప్పాడు.

అప్పుడు ప్రజలు చెప్పిన సంగతులన్నీ యెహోవాతో చెప్పాడు మోషే.

10 యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ప్రత్యేకమైన ఒక సమావేశంగా ప్రజల్ని ఇవ్వాళ రేపు నీవు సిద్ధం చేయాలి. ప్రజలు తమ బట్టలు ఉదుక్కొని 11 మూడో రోజున నా కోసం సిద్ధంగా ఉండాలి. మూడో రోజున సీనాయి పర్వతం మీదికి యెహోవా దిగివస్తాడు. ప్రజలంతా నన్ను చూస్తారు. 12-13 అయితే ప్రజలు పర్వతానికి దూరంగా ఉండాలని నీవు తప్పక చెప్పాలి. ఒక గీతగీసి ప్రజలు ఆ గీత దాటి రాకుండా చూడు. ఏ మనిషిగాని, జంతువుగాని పర్వతాన్ని తాకినట్లయితే, చంపేయాలి. బాణాలతో, లేక రాళ్లతో కొట్టి చంపేయాలి. కాని అలాంటి వాణ్ణి ఎవరూ ముట్టుకోకూడదు. బూర ఊదేంత వరకు ప్రజలు వేచి ఉండాలి. అప్పుడే వాళ్లు పర్వతం మీదికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వబడుతుంది,” అని మోషేతో యెహోవా చెప్పాడు.

14 కనుక మోషే పర్వతం దిగి కిందికి వెళ్లాడు. ఆయన ప్రజల దగ్గరికి వెళ్లి, ప్రత్యేక సమావేశం కోసం వాళ్లను సిద్ధం చేసాడు. ప్రజలు వాళ్ల బట్టలు ఉదుక్కొన్నారు.

15 అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.

16 మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం ఆ పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. ఆ బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు. 17 అప్పుడు పర్వతం దగ్గర దేవుణ్ణి కలుసుకొనేందుకు ప్రజలను వారి బసలోనుంచి మోషే బయటకు నడిపించాడు. 18 సీనాయి పర్వతం పొగతో నిండిపోయింది. కొలిమిలోనుంచి లేచినట్టు పొగ ఆ పర్వతం మీద నుండి పైకి లేచింది. యెహోవా అగ్నిలా ఆ పర్వతం మీదికి వచ్చినందువల్ల యిలా జరిగింది. పైగా పర్వతం అంతా వణకడం మొదలయ్యింది. 19 బూర శబ్దం మరింత గట్టిగా మోగింది. దేవునితో మోషే మాట్లాడినప్పుడల్లా ఉరుములాంటి స్వరంతో యెహోవా జవాబిచ్చాడు.

20 సీనాయి కొండ మీదికి యెహోవా దిగి వచ్చాడు. పరలోకంనుంచి ఆ కొండ శిఖరం మీదికి యెహోవా దిగి వచ్చాడు. అప్పుడు మోషేను తనతో కూడ పర్వత శిఖరం మీదికి రమ్మని యెహోవా పిలిచాడు. కనుక మోషే పర్వతం మీదికి వెళ్లాడు.

21 అప్పుడు యెహోవా మోషేతో, “నీవు కిందికి వెళ్లి, ప్రజలు నాకు సమీపంగా రాకూడదని, నావైపు చూడకూడదని వారితో చెప్పు. వారు కనుక అలా చేస్తే, వారిలో చాల మంది చస్తారు. 22 నాకు సమీపంగా వచ్చే యాజకులు ఈ ప్రత్యేక సమావేశం కోసం వారిని సిద్ధం చేసుకోవాలని వారితో చెప్పు. వారు ఇలా చేయకపోతే, నేను వాళ్లను శిక్షిస్తాను” అని చెప్పాడు.

23 కానీ మోషే యెహోవాతో “ప్రజలు పర్వతం మీదికి రాలేరు. ఒక గీత గీయమని, ప్రజల్ని ఆ గీత దాటి పవిత్ర స్థలం దగ్గరకు రానివ్వవద్దని నీవే మాకు చెప్పావు” అని అన్నాడు.

24 యెహోవా మోషేతో, “కింద ప్రజల దగ్గరకు వెళ్లి, అహరోనును తీసుకొనిరా. అతణ్ణి నీతోపాటు తీసుకొనిరా, కాని యాజకుల్ని, ప్రజల్ని, రానివ్వవద్దు. వాళ్లు నాకు సమీపంగా వస్తే, నేను వాళ్లను శిక్షిస్తాను” అన్నాడు.

25 మోషే ప్రజల దగ్గరకు కిందికి వెళ్లి, ఈ సంగతులు వారితో చెప్పాడు.

పది ఆజ్ఞలు

20 అప్పుడు మోషేతో దేవుడు ఈ మాటలు చెప్పాడు:

“నేను మీ దేవుణ్ణి, యెహోవాను. ఈజిప్టు దేశం నుండి నేనే మిమ్మల్ని బయటికి రప్పించాను. బానిసత్వం నుండి నేనే మిమ్మల్ని విడుదల చేసాను. (కనుక ఈ ఆజ్ఞలకు మీరు విధేయులు కావాలి)

“నేను గాక వేరే దేవుళ్లు ఎవ్వరినీ మీరు ఆరాధించకూడదు.

“విగ్రహాలు ఏవీ మీరు చేయకూడదు పైన ఆకాశానికి సంబంధించింది గాని, క్రింద భూమికి సంబంధించిందిగాని, భూమి క్రింద నీళ్లకు సంబంధించిందిగాని, దేని విగ్రహాన్ని లేక పటాన్ని చేయవద్దు. ఎలాంటి విగ్రహాల్నీ పూజించవద్దు, సేవించవద్దు. ఎందుకంటే, యెహోవాను నేనే మీ దేవుణ్ణి. నేను నా ప్రజలు వేరే దేవుళ్లను పూజించటాన్ని ద్వేషిస్తాను.[c] ఒక వ్యక్తి నాకు వ్యతిరేకంగా పాపం చేస్తే ఆ వ్యక్తి నన్ను ద్వేషిస్తున్నాడు. ఆ వ్యక్తి సంతానాన్ని మూడు, నాలుగు తరాల వరకు నేను శిక్షిస్తాను. అయితే నా ఆజ్ఞలను ప్రేమించి, విధేయులయ్యే ప్రజలకు వేల తరాలవరకు నేను ఎంతో దయ చూపిస్తాను.

“మీ దేవుడైన యెహోవా పేరును మీరు తప్పుగా ప్రయోగించకూడదు. ఒక వ్యక్తి గనుక యెహోవా పేరును తప్పుగా ప్రయోగిస్తే, ఆ వ్యక్తి దోషి. యెహోవా అతణ్ణి నిర్దోషిగా చేయడు.

“సబ్బాతును ఒక ప్రత్యేక రోజుగా ఉంచుకోవడం మరచిపోవద్దు. వారానికి ఆరు రోజులు మీరు మీ పని చేసుకోవచ్చు. 10 అయితే, యెహోవా గౌరవార్థం ఏడవరోజు విశ్రాంతి రోజు కనుక ఆ రోజు ఏ వ్యక్తీ పని చేయకూడదు. అంటే మీరు, మీ కొడుకులు, కూతుళ్లు, మీ ఆడ, మగ బానిసలు, చివరికి మీ జంతువులు, మీ పట్టణాల్లో నివసించే విదేశీయులు కూడాను. 11 ఎందుకంటే, యెహోవా ఆరు రోజులు పనిచేసి ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని వాటిలో ఉండే సమస్తాన్ని చేసాడు. ఏడో రోజున దేవుడు విశ్రాంతి తీసుకొన్నాడు. ఈ విధంగా ఏడవరోజును యెహోవా ఆశీర్వదించాడు. దాన్ని చాలా ప్రత్యేకమైన రోజుగా యెహోవా చేసాడు.

12 “నీ తండ్రిని, నీ తల్లిని సన్మానించు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చే దేశంలో నీకు పూర్తి ఆయుష్షు ఉండేటట్టుగా నీవు ఇలా చేయాలి.

13 “నీవు ఎవ్వరినీ హత్య చేయకూడదు.

14 “వ్యభిచార పాపం నీవు చేయకూడదు.

15 “నీవు దొంగతనం చేయకూడదు.

16 “నీ పొరుగువాళ్ల విషయంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు.

17 “ఇతరుల వస్తువుల్ని నీవు తీసుకోవాలని ఆశ పడకూడదు. నీ పొరుగు వాడి ఇంటిని, లేక వాని భార్యను, లేక వాని ఆడ, మగ సేవకులను, లేక వాని ఆవులను, లేక అతని గాడిదలను తీసుకోవాలని నీవు ఆశపడకూడదు. నీ పొరుగువానికి చెందినది ఏదీ తీసుకోవాలని నీవు ఆశపడకూడదు.”

ప్రజలకు దేవుడంటే భయం

18 ఇంతసేపూ లోయలో ప్రజలు కొండమీది ఉరుము శబ్దం వింటూనే ఉన్నారు. మెరుపులు చూస్తునే ఉన్నారు. కొండమీద నుండి పొగ లేవడం వారు చూసారు. ప్రజలు భయపడి వణకిపోయారు. వాళ్లు కొండకు దూరంగా నిలబడి గమనించారు.

19 అప్పుడు ప్రజలు మోషేతో “నీవు మాతో మాట్లాడాలంటే మేము వింటాం. కాని దేవుణ్ణి మాత్రం మాతో మాట్లాడనివ్వకు. అలా జరిగితే మేము చస్తాము,” అని చెప్పారు.

20 అప్పుడు మోషే, “తాను మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని రుజువు చేయడానికే, యెహోవా వచ్చాడు. మీరు పాపం చేయకుండా ఉండేలా మీరు ఆయనను గౌరవించాలని ఆయన కోరుతున్నాడు” అని ప్రజలకు చెప్పాడు.

21 దేవుడువున్న దట్టమైన మేఘం దగ్గరకు మోషే వెళుతోంటే, ప్రజలు ఆ కొండకు దూరంగా నిలబడ్డారు. 22 అప్పుడు ఈ సంగతులు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పమని యెహోవా మోషేతో చెప్పాడు. “ఆకాశం నుండి నేను మీతో మాట్లాడటం మీరు చూసారు. 23 కనుక మీరు బంగారంతోగాని, వెండితోగాని నాకు పోటీగా విగ్రహాలు చేసుకోకూడదు. ఈ అబద్ధపు దేవుళ్లను మీరు చేసుకోకూడదు.

24 “నా కోసం ఒక ప్రత్యేక బలిపీఠం చేయండి. ఈ బలిపీఠం చేయడానికి మట్టి ఉపయోగించండి. ఈ బలిపీఠం మీద దహనబలులు, సమాధాన బలులు, బలిగా నాకు అర్పితం చేయండి. ఇలా చేయటానికి మీ గొర్రెల్ని, పశువుల్ని వాడుకోండి. నన్ను జ్ఞాపకం చేసుకోమని నేను మీకు చెప్పే ప్రతి చోటా మీరు యిలా చేయాలి. అప్పుడు నేను వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. 25 మీరు బండలతో[d] బలిపీఠం కడితే, చెక్కబడిన బండలతో దానిని కట్టవద్దు. ఎందుకంటే, పనిముట్లతో మీరు పని చేసినప్పుడు మీరు దానిని అపవిత్రం చేస్తారు. బండల మీద మీరు ఏవైనా పని ముట్లు ప్రయోగిస్తే, ఆ బలిపీఠాన్ని నేను అంగీకరించను. 26 బలిపీఠం మీదికి వెళ్లేందుకు మీరు మెట్లు చేయకూడదు. అలా మెట్లు ఉంటే, ప్రజలు బలిపీఠం వైపుకి చూసినప్పుడు మీ దిగంబరత్వం అంతా వారికి కనబడుతుంది.”

మత్తయి 18:21-35

క్షమించని సేవకుని ఉపమానం

21 అప్పుడు పేతురు యేసు దగ్గరకు వచ్చి, “ప్రభూ! నా సోదరుడు నా పట్ల పాపం చేస్తే నేనెన్ని సార్లు అతణ్ణి క్షమించాలి? ఏడుసార్లా?” అని అడిగాడు.

22 యేసు ఈ విధంగా సమాధానం చెప్పాడు, “ఏడుసార్లు కాదు, డెబ్బది ఏడు సార్లు[a] క్షమించాలని చెబుతున్నాను.

23 “అందువల్లే దేవుని రాజ్యాన్ని తన సేవకులతో లెక్కలు పరిష్కరించుకోవాలన్న రాజుతో పోల్చవచ్చు. 24 ఆ రాజు లెక్కలు పరిష్కరించటం మొదలు పెట్టగానే వేలకొలది తలాంతులు[b] అప్పు ఉన్న ఒక వ్యక్తిని భటులు రాజుగారి దగ్గరకు పిలుచుకు వచ్చారు. 25 కాని అప్పు ఉన్న వాని దగ్గర చెల్లించటానికి డబ్బు లేదు. అందువల్ల ఆ రాజు అతణ్ణి, అతని భార్యను, అతని సంతానాన్ని, అతని దగ్గర ఉన్న వస్తువులన్నిటిని అమ్మేసి అప్పు చెల్లించమని ఆజ్ఞాపించాడు.

26 “ఆ సేవకుడు రాజు ముందు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వండి, మీకివ్వ వలసిన డబ్బంతా యిచ్చేస్తాను’ అని వేడుకొన్నాడు. 27 రాజు ఆ సేవకునిపై దయచూపి అతణ్ణి విడుదల చేసాడు. పైగా అతని అప్పుకూడా రద్దు చేసాడు.

28 “ఆ సేవకుడు వెలుపలికి వెళ్ళి, తనతో కలసి పనిచేసే సేవకుణ్ణి చూసాడు. తనకు వంద దేనారాలు అప్పువున్న అతని గొంతుక పట్టుకొని, ‘నా అప్పు తీర్చు!’ అని వేధించాడు.

29 “అప్పువున్నవాడు మోకరిల్లి, ‘కొద్ది గడువు యివ్వు! నీ అప్పు తీరుస్తాను!’ అని బ్రతిమిలాడాడు.

30 “కాని అప్పిచ్చిన వాడు దానికి అంగీకరించలేదు. పైగా వెళ్ళి తన అప్పు తీర్చే దాకా ఆ అప్పున్నవాణ్ణి కారాగారంలో వేయించాడు. 31 తోటి సేవకులు జరిగింది చూసారు. వాళ్ళకు చాలా దుఃఖం కలిగింది. వాళ్ళు వెళ్ళి జరిగిందంతా తమ రాజుతో చెప్పారు.

32 “అప్పుడు ఆ ప్రభువు ఆ సేవకుణ్ణి పిలిచి, కోపంతో ‘దుర్మార్గుడా! నీవు బ్రతిమిలాడినందుకు నీ అప్పంతా రద్దు చేసాను. 33-34 మరి, నేను నీమీద దయ చూపినట్లే నీవు నీ తోటి సేవకునిపై దయ చూపనవనరంలేదా?’ అని అన్నాడు. ఆ తదుపరి తన అప్పంతా తీర్చేదాకా చిత్రహింస పెట్టమని ఆ సేవకుణ్ణి భటులకు అప్పగించాడు.

35 “మీలో ప్రతి ఒక్కరూ మీ సోదరుణ్ణి మనసారా క్షమించక పోతే పరలోకంలో వున్న నా తండ్రి మీ పట్ల ఆ రాజులాగే ప్రవర్తిస్తాడు.”

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International