Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 29-30

యాకోబు రాహేలును కలసికొనుట

29 ఇంకా యాకోబు తన ప్రయాణం కొనసాగించాడు. తూర్పు దేశానికి అతడు వెళ్లాడు. యాకోబు అలా చూడగానే, పొలాల్లో ఒక బావి కనబడింది. గొర్రెల మందలు మూడు ఆ బావి దగ్గర పండుకొని ఉన్నాయి. ఆ గొర్రెలు నీళ్లు త్రాగే స్థలం ఆ బావి. ఆ బావిమీద ఒక పెద్ద బండ పెట్టి ఉంది. గొర్రెలన్నీ అక్కడికి రాగానే, ఆ గొర్రెల కాపరులు ఆ బావిమీద బండను దొర్లిస్తారు. అప్పుడు గొర్రెలన్నీ ఆ నీళ్లు త్రాగుతాయి. ఆ గొర్రెలు పూర్తిగా త్రాగిన తర్వాత గొర్రెల కాపరులు ఆ బండను మళ్లీ దాని స్థానంలో పెట్టేస్తారు.

“సోదరులారా, ఎక్కడి వాళ్లు మీరు?” అని ఆ గొర్రెల కాపరులను యాకోబు అడిగాడు.

“మేము హారాను వాళ్లం” అని వారు జవాబిచ్చారు.

అందుకు యాకోబు, “నాహోరు కుమారుడు లాబాను మీకు తెలుసా?” అని అడిగాడు.

“మాకు తెలుసు” అని గొర్రెల కాపరులు జవాబు ఇచ్చారు.

అప్పుడు యాకోబు “అతను ఎలా ఉన్నాడు?” అని అడిగాడు.

“అతను బాగానే ఉన్నాడు, అంతా క్షేమమే. అదిగో చూడు, ఆ వస్తున్నది అతని కుమార్తె. ఆమె పేరు రాహేలు, అతని గొర్రెల్ని తోలుకొస్తున్నది” అన్నారు వాళ్లు.

“చూడండి, ఇప్పుడు ఇంకా పగలు ఉంది. సూర్యాస్తమయానికి చాలా సమయం ఉంది. రాత్రి కోసం గొర్రెల్ని మందగా చేర్చటానికి ఇంకా వేళ కాలేదు. కనుక వాటికి నీళ్లు పెట్టి, మళ్లీ పొలాల్లోనికి వెళ్లనియ్యండి” అన్నాడు యాకోబు.

కానీ గొర్రెల కాపరులు, “మందలన్నీ ఇక్కడ గుమిగూడేవరకు మేము అలా చేయటానికి వీల్లేదు. అప్పుడు మేము బావిమీద బండ దొర్లిస్తాము, గొర్రెలు నీళ్లు త్రాగుతాయి” అన్నారు.

కాపరులతో యాకోబు మాట్లాడుతుండగానే, రాహేలు తన తండ్రి గొర్రెలతో అక్కడికి వచ్చింది. (ఆ గొర్రెల బాధ్యత రాహేలుది.) 10 రాహేలు లాబాను కుమార్తె. యాకోబు తల్లియైన రిబ్కాకు లాబాను సోదరుడు. రాహేలును చూడగానే యాకోబు వెళ్లి, బండను దొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టాడు. 11 అప్పుడు యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని ఏడ్చాడు. 12 తను ఆమె తండ్రి బంధువును అనీ, రిబ్కా కుమారుడననీ యాకోబు రాహేలుతో చెప్పాడు. కనుక రాహేలు యింటికి పరుగెత్తి, తన తండ్రితో ఆ విషయాలు చెప్పింది.

13 తన సోదరి కుమారుడు యాకోబును గూర్చిన వార్త లాబాను విన్నాడు. అందుచేత అతణ్ణి కలుసుకొనేందుకు లాబాను పరుగెత్తాడు. లాబాను అతడ్ని కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన యింటికి తీసుకొని వచ్చాడు. జరిగినదంతా యాకోబు లాబానుతో చెప్పాడు.

14 అప్పుడు లాబాను, “ఇదంతా భలే బాగుందే, అయితే నీవు నా స్వంత కుటుంబపు వాడివే సుమా” అన్నాడు. అందువల్ల యాకోబు లాబానుతో ఒక నెల అక్కడే నివసించాడు.

లాబాను యాకోబును మోసగించుట

15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.

16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.

17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.[a] 18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.

19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.

20 కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.

21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను పని చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.

22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేశావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేశాను. ఎందుకు నన్ను నీవు మోసం చేశావు?” అన్నాడు.

26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”

28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు. 29 తన దాసీ బిల్హాను తన కుమార్తె రాహేలుకు దాసీగా ఇచ్చాడు. 30 కనుక యాకోబు రాహేలుతో కూడా సంభోగించాడు. లేయాకంటే రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించాడు. లాబాను దగ్గర మరో ఏడు సంవత్సరాలు యాకోబు పని చేశాడు.

యాకోబు కుటుంబం పెరుగుట

31 లేయాకంటె రాహేలును యాకోబు ఎక్కువగా ప్రేమించడం యెహోవా చూశాడు. అందుచేత యెహోవా లేయాకు పిల్లలు పుట్టేలాగు చేశాడు. రాహేలుకు పిల్లలు లేరు.

32 లేయాకు ఒక కొడుకు పుట్టాడు. ఆమె అతనికి రూబేను[b] అని పేరు పెట్టింది. “నా కష్టాలను యెహోవా చూశాడు. నా భర్త నన్ను ప్రేమించటం లేదు. ఒకవేళ నా భర్త ఇప్పుడైనా నన్ను ప్రేమిస్తాడేమో” అని లేయా అతనికి ఈ పేరు పెట్టింది.

33 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి షిమ్యోను[c] అని ఆమె పేరు పెట్టింది. “నేను ప్రేమించబడటం లేదని తెలిసి యెహోవా విని, నాకు ఈ కుమారుణ్ణి ఇచ్చాడు” అని లేయా చెప్పింది.

34 లేయా మళ్లీ గర్భవతి అయింది, మరో కొడుకు పుట్టాడు. ఆ కుమారునికి ఆమె లేవి[d] అని పేరు పెట్టింది. “ఇప్పుడు నా భర్త నన్ను తప్పకుండా ప్రేమిస్తాడు. అతనికి ముగ్గురు కుమారుల్ని నేను ఇచ్చాను” అనుకొంది లేయా.

35 అప్పుడు లేయాకు మరో కొడుకు పుట్టాడు. ఈ కుమారునికి యూదా[e] అని ఆమె పేరు పెట్టింది. “నేను ఇప్పుడు యెహోవాను స్తుతిస్తాను” అని అతనికి ఆ పేరు పెట్టింది లేయా. అంతటితో ఆమెకు సంతాన ప్రాప్తి ఆగిపోయింది.

30 తాను యాకోబుకు పిల్లల్ని కనటం లేదని రాహేలు తెలుసుకొంది. రాహేలు తన సోదరి లేయాను గూర్చి అసూయపడింది. అందుచేత “నాకూ పిల్లల్ని యివ్వు, లేకపోతే నేను చస్తాను” అంది రాహేలు యాకోబుతో.

యాకోబుకు రాహేలు మీద కోపం వచ్చింది. “నేనేమి దేవుణ్ణి కాను. నీకు పిల్లలు పుట్టకుండా చేసింది దేవుడు” అని చెప్పాడు యాకోబు.

అప్పుడు రాహేలు “నా దాసిని బిల్హాను నీవు తీసుకో. ఆమెతో శయనించు. నా కోసం ఆమె బిడ్డను కంటుంది. అప్పుడు ఆమె మూలంగా నేను తల్లినవుతాను” అని చెప్పింది.

కనుక రాహేలు తన దాసియైన బిల్హాను యాకోబుకు ఇచ్చింది. యాకోబు బిల్హాతో శయనించాడు. బిల్హా గర్భవతి అయింది, యాకోబుకు ఒక కుమారుని కన్నది.

“దేవుడు నా ప్రార్థన విన్నాడు. నాకు ఒక కుమారుని ఇవ్వాలని ఆయన నిర్ణయం చేశాడు” అని చెప్పి, రాహేలు ఆ కుమారునికి “దాను”[f] అని పేరు పెట్టింది.

బిల్హా మరల గర్భవతియై, యాకోబుకు మరో కుమారుని కన్నది. రాహేలు “నా అక్కతో పోటీలో చాలా కష్టపడి పోరాడాను. నేనే గెలిచాను” అని చెప్పి ఆ కుమారునికి “నఫ్తాలి” అని పేరు పెట్టింది.

లేయా తనకు ఇక పిల్లలు పుట్టడం లేదని గ్రహించింది. అంచేత తన దాసి జిల్ఫాను ఆమె యాకోబుకు ఇచ్చింది. 10 అప్పుడు జిల్ఫాకు ఒక కొడుకు పుట్టాడు. 11 లేయా “నేను అదృష్టవంతురాలిని” అనుకొని, ఆ కుమారునికి “గాదు”[g] అని పేరు పెట్టింది. 12 జిల్ఫాకు మరో కుమారుడు పుట్టాడు. 13 “నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు స్త్రీలు నన్ను సంతోషం అని పిలుస్తారు” అని లేయా ఆ కుమారునికి “ఆషేరు”[h] అని పేరు పెట్టింది.

14 గోధుమ కోతకాలంలో రూబేను పొలాల్లోకి వెళ్లాడు. అక్కడ ప్రత్యేకమైన పూలు[i] అతనికి కనబడ్డాయి. ఆ పూలు తెచ్చి రూబేను తన తల్లి లేయాకు ఇచ్చాడు. అయితే రాహేలు, “నీ కొడుకు తెచ్చిన పూలు దయచేసి నాకూ కొన్ని ఇవ్వవూ” అని లేయాను అడిగింది.

15 లేయా, “ఇప్పటికే నీవు నా భర్తను తీసివేసుకొన్నావు. ఇప్పుడేమో నా కొడుకు తెచ్చిన పూలను తీసుకోవటానికి ప్రయత్నిస్తున్నావా” అంది.

కాని రాహేలు “నీ కొడుకు తెచ్చిన పూలు గనుక నీవు నాకు ఇస్తే, ఈ వేళ రాత్రికి నీవు యాకోబుతో శయనించవచ్చు” అని జవాబిచ్చింది.

16 ఆ రాత్రి యాకోబు పొలంనుంచి వచ్చాడు. అతన్ని చూచి, అతన్ని కలుసుకోవటానికి లేయా బయటకు వెళ్లింది. “ఈ వేళ రాత్రి నీవు నాతో పండుకోవాలి. నా కొడుకు తెచ్చిన పూలతో నిన్ను నేను కొన్నాను” అని ఆమె చెప్పింది. కనుక ఆ రాత్రి యాకోబు లేయాతో పండుకొన్నాడు.

17 అప్పుడు దేవుడు లేయాను మళ్లీ గర్భవతిని కానిచ్చాడు. ఆమె అయిదవ కుమారుని కన్నది. 18 లేయా అంది, “నా భర్తకు నా దాసిని ఇచ్చాను గనుక దేవుడు నాకు ప్రతిఫలాన్ని యిచ్చాడు.” అందుకని లేయా అతనికి ఇశ్శాఖారు[j] అని పేరు పెట్టింది.

19 లేయా మళ్లీ గర్భవతి అయింది, ఆరో కుమారుణ్ణి కన్నది. 20 లేయా అంది “ఒక చక్కని బహుమానం దేవుడు నాకు ఇచ్చాడు. ఇప్పుడు తప్పక యాకోబు నన్ను స్వీకరిస్తాడు. ఎందుకంటే ఆయనకు నేను ఆరుగురు కుమారుల్ని యిచ్చాను.” కనుక జెబూలూను[k] అని ఆ కుమారునికి పేరు పెట్టింది.

21 తర్వాత లేయాకు కూతురు పుట్టింది. ఆ కూతురుకు దీనా అని పేరు పెట్టింది.

22 అప్పుడు రాహేలు ప్రార్థన దేవుడు విన్నాడు. రాహేలుకు పిల్లలు పుట్టేట్లుగా దేవుడు చేశాడు. 23-24 రాహేలు గర్భవతి అయింది, ఒక కుమారుణ్ణి కన్నది. “దేవుడు నా అవమానం తొలగించి, నాకూ ఒక కుమారుణ్ణి ఇచ్చాడు” అని ఆమె చెప్పింది. “దేవుడు నాకు మరో కుమారుణ్ణి అనుగ్రహించు గాక” అంటూ రాహేలు ఆ కుమారునికి యోసేపు అని పేరు పెట్టింది.

యాకోబు లాబానును మోసగించుట

25 యోసేపు పుట్టిన తర్వాత లాబానుతో యాకోబు అన్నాడు: “ఇక నా మాతృదేశంలోని నా స్వంత యింటికి నన్ను వెళ్లనివ్వు. 26 నా భార్యల్ని, పిల్లలను నాకు అప్పగించు. నీ దగ్గర 14 సంవత్సరాలు పనిచేసి నేను వాళ్లను సంపాదించుకొన్నాను. నీ దగ్గర నేను మంచి పని చేసానని నీకు తెలుసు.”

27 అతనితో లాబాను అన్నాడు: “నన్ను ఒక్క మాట చెప్పనివ్వు. నీ మూలంగానే యెహోవా నన్ను ఆశీర్వదించాడని నాకు తెలుసు. 28 నీకు ఏం చెల్లించమంటావో చెప్పు, అది నీకు నేను చెల్లిస్తాను.”

29 యాకోబు జవాబిచ్చాడు: “నీ కోసం నేను కష్టపడి పని చేసానని నీకు తెలుసు. నీ గొర్రెల మందలను నేను కాస్తూ ఉండగా అవి విస్తరించాయి, క్షేమంగా ఉన్నాయి. 30 నేను వచ్చిన మొదట్లో నీకు ఉన్నది స్వల్పం. ఇప్పుడు నీకు చాలా విస్తారంగా ఉంది. నీ కోసం నేను ఏదైనా చేసినప్పుడల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇక నా కోసం నేను పని చేసుకోవాలి, నా ఇంటిని నేను కట్టుకోవాలి.”

31 “అలాగైతే నేను నీకు ఏమి ఇవ్వాలి?” అని లాబాను అడిగాడు.

యాకోబు ఇలా జవాబిచ్చాడు: “నీవు నాకు ఏమీ యివ్వక్కర్లేదు. నీవు నన్ను ఈ ఒక్క పని చేయనిస్తే చాలు: నేను మళ్లీ వెళ్లి నీ గొర్రెలను కాస్తాను. 32 అయితే ఈ వేళ నీ గొర్రెల మందల్లో నన్ను నడువనియ్యి, వాటిలో మచ్చలుగాని చారలుగాని ఉన్న ప్రతి గొర్రె పిల్లను నన్ను తీసుకోనివ్వు. అలాగే నల్ల మేకపిల్లలు అన్నిటిని, చారలు మచ్చలు ఉన్న ప్రతి ఆడ మేకను నన్ను తీసుకోనివ్వు. అదే నాకు జీతం. 33 నా నిజాయితీ ఏమిటో భవిష్యత్తులో నీవు తేలిగ్గా తెలుసుకోవచ్చు. నీవు వచ్చి నా మందల్ని చూడవచ్చు. మచ్చలేని మేకగాని, నలుపు లేని గొర్రెగాని నా దగ్గర ఉంటే, దాన్ని నేను దొంగిలించినట్లు నీకు తెలుస్తుంది.”

34 “అది నాకు సమ్మతమే. నీవు అడిగినట్లు మనం చేద్దాం” అన్నాడు లాబాను. 35 అయితే మచ్చలు ఉన్న మేకపోతులన్నింటిని ఆ రోజే లాబాను దాచిపెట్టేశాడు. మచ్చలు ఉన్న ఆడ మేకలన్నింటిని కూడ లాబాను దాచిపెట్టేశాడు. ఈ గొర్రెలను కనిపెట్టి ఉండమని లాబాను తన కుమారులతో చెప్పాడు. 36 కనుక ఆ కుమారులు మచ్చలుగల గొర్రెలన్నింటిని మరో చోటుకు తోలుకొని వెళ్లారు. మూడు రోజుల పాటు వారు ప్రయాణం చేశారు. యాకోబు అక్కడ ఉండి, మిగిలిన జంతువులన్నింటి విషయం జాగ్రత్త పుచ్చుకొన్నాడు. అయితే అక్కడ ఉన్నవాటిలో మచ్చలు ఉన్నవి గాని చారలు ఉన్నవి గాని ఏ జంతువు లేదు.

37 కనుక బూరగ, బాదం అను చెట్ల పచ్చటి కొమ్మలు యాకోబు నరికాడు. ఆ చువ్వల పైబెరడును అక్కడక్కడ యాకోబు తీసివేసినందువల్ల వాటి మీద తెల్ల చారలు కనబడుతున్నాయి. 38 నీళ్లు త్రాగే స్థలాల్లో మందల ముందు యాకోబు ఆ చువ్వలను ఉంచాడు. ఆ జంతువులు నీళ్లు త్రాగటానికి వచ్చినప్పుడు, అక్కడే అవి కలిసేవి. 39 ఆ చువ్వల ముందర మేకలు చూలు కట్టినప్పుడు మచ్చలు, చారలు, నలుపుగల పిల్లలు వాటికి పుట్టాయి.

40 మచ్చలు, నలుపు ఉన్న జంతువులను మిగతా జంతువులనుండి యాకోబు వేరుచేశాడు. యాకోబు తన జంతువులను లాబాను జంతువులనుండి వేరుగా ఉంచాడు. 41 మందలోని బలమైన జంతువులు ఎదైనప్పుడల్లా యాకోబు ఆ చువ్వలను వాటి కళ్లముందు ఉంచాడు. ఆ కొమ్మల దగ్గర ఆ జంతువులు చూలు కట్టేవి. 42 అయితే ఒక్కటి, బలహీనమైన జంతువులు ఎదైనప్పుడు యాకోబు ఆ కొమ్మలను అక్కడ పెట్టలేదు. కనుక బలహీనమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ లాబానువే. బలమైన జంతువులకు పుట్టిన పిల్లలన్నీ యాకోబువి. 43 ఈ విధంగా యాకోబు చాలా ధనికుడయ్యాడు. పెద్ద మందలు, చాలా మంది సేవకులు, ఒంటెలు, గాడిదలు అతనికి ఉన్నాయి.

మత్తయి 9:1-17

యేసు పక్షవాత రోగిని నయం చేయటం

(మార్కు 2:1-12; లూకా 5:17-26)

యేసు పడవనెక్కి సముద్రం దాటి తన స్వగ్రామానికి వచ్చాడు. కొందరు వ్యక్తులు మంచం పట్టిన ఒక పక్షవాత రోగిని చాప మీద పడుకోబెట్టి ఆయన దగ్గరకు తీసికొని వచ్చారు. యేసు వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాత రోగితో, “ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడ్డాయి” అని అన్నాడు.

ఇది విని కొందరు శాస్త్రులు తమలో తాము, “ఇతడు దైవదూషణ చేస్తున్నాడు” అని అనుకొన్నారు.

వాళ్ళు ఏమనుకొంటున్నారో యేసుకు తెలిసిపోయింది. ఆయన వాళ్ళతో, “మీ హృదయాల్లోకి దురాలోచనల్ని ఎందుకు రానిస్తారు? ‘నీ పాపాలు క్షమించబడ్డాయి’ అని అనటం సులభమా లేక ‘లేచి నిలుచో’ అని అనటం సులభమా? పాపాలు క్షమించటానికి మనుష్య కుమారునికి అధికారముందని మీకు తెలియాలి!” అని వాళ్ళతో అన్నాక, పక్షవాత రోగితో, “లే! నీ చాపను తీసికొని యింటికి వెళ్ళు!” అని అన్నాడు.

పక్షవాతంతో ఉన్నవాడు లేచి యింటికి వెళ్ళాడు. ఇది చూసి అక్కడున్న ప్రజల్లో భక్తి కలిగింది. మానవులకు ఇలాంటి అధికారమిచ్చిన దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు.

మత్తయిని పిలవటం

(మార్కు 2:13-17; లూకా 5:27-32)

యేసు అక్కడి నుండి బయలుదేరి వెళ్తుండగా, మత్తయి అనేవాడు కూర్చొని పన్నులు వసూలు చేస్తూ ఉండటం చూసాడు. యేసు అతనితో, “నన్ను అనుసరించు!” అని అన్నాడు. మత్తయి లేచి ఆయన్ని అనుసరించాడు.

10 యేసు మత్తయి యింట్లో భోజనానికి కూర్చుని ఉండగా, చాలామంది పన్నులు సేకరించే వాళ్ళు, పాపులు వచ్చారు, వాళ్ళంతా యేసుతో, ఆయన శిష్యులతో కలిసి భోజనానికి కూర్చున్నారు. 11 పరిసయ్యులు ఇది గమనించి యేసు శిష్యులతో, “మీ ప్రభువు పన్నులు సేకరించే వారితోను, పాపులతోను కలిసి ఎందుకు భోజనం చేస్తాడు?” అని అడిగారు.

12 యేసు ఇదివిని, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. 13 ‘నేను కోరేది దయ, జంతువుల బలినికాదు’(A) అనే వాక్యానికి అర్థమేమిటో వెళ్ళి నేర్చుకోండి. ఎందుకంటే నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.

యేసు ఇతర మతనాయకులవలె కాదు

(మార్కు 2:18-22; లూకా 5:33-39)

14 ఆ తర్వాత యోహాను శిష్యులు వచ్చి, యేసును, “మేము, పరిసయ్యులు ఉపవాసం చేస్తాం కదా; మరి మీ శిష్యులు ఉపవాసం ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.

15 యేసు, “పెళ్ళికుమారుని అతిథులు పెళ్ళి కుమారుడు వాళ్ళతో ఉండగా ఎందుకు ఉపవాసం చేస్తారు? పెళ్ళి కుమారుడు వెళ్ళి పోయే సమయం వస్తుంది. అప్పుడు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని సమాధానం చెప్పాడు.

16 “పాత వస్త్రం యొక్క చిరుగును క్రొత్త వస్త్రంతో కుట్టరు. అలా చేస్తే ఆ అతుకు చినిగిపోతుంది. అంతే కాక ఆ చిల్లు యింకా పెద్దదౌతుంది. 17 అదే విధంగా క్రొత్త ద్రాక్షారసమును పాతతోలు సంచిలో దాచరు. అలా చేస్తే ఆ తోలుసంచి చినిగిపోయి ఆ ద్రాక్షారసము నాశనమైపోతుంది. అంతేకాక ఆ తోలు సంచి నాశనమైపోతుంది. అందువల్ల క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తోలు సంచిలోనే దాచి ఉంచాలి. అలా చేస్తే రెండూ భద్రంగా ఉంటాయి” అని యేసు అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International