Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 4-6

ప్రథమ కుటుంబం

ఆదాముకు అతని భార్య హవ్వకు లైంగిక సంబంధాలు కలిగాయి. హవ్వ ఒక శిశువుకు జన్మనిచ్చింది. ఆ శిశువుకు కయీను[a] అని నామకరణం జరిగింది. హవ్వ “యెహోవా సహాయంతో నేను ఒక మనిషిని పొందాను” అంది.

ఆ తర్వాత హవ్వ మరో శిశువుకు జన్మనిచ్చింది. ఈ శిశువు కయీనుకు తమ్ముడు. అతనికి హేబెలు అని నామకరణం చేశారు. హేబెలు గొర్రెల కాపరి అయ్యాడు. కయీను వ్యవసాయదారుడయ్యాడు.

ప్రథమ హత్య

3-4 కోతకాలంలో కయీను యెహోవాకు ఒక అర్పణను తెచ్చాడు. నేలనుండి తాను పండించిన ఆహార పదార్థాన్ని కయీను తెచ్చాడు. హేబెలు తన మందలో నుండి కొన్ని మంచి బలిసిన తొలిచూలు గొర్రెల్ని తెచ్చాడు.

హేబెలును, అతని అర్పణను దేవుడు స్వీకరించాడు. అయితే కయీనును, అతని అర్పణను దేవుడు అంగీకరించలేదు. అందువల్ల కయీను దుఃఖించాడు. అతనికి చాలా కోపం వచ్చేసింది. యెహోవా కయీనును అడిగాడు: “నీవెందుకు కోపంగా ఉన్నావు? నీ ముఖం అలా విచారంగా ఉందేమిటి? నీవు మంచి పనులు చేస్తే నాతో నీవు సరిగ్గా ఉంటావు. అప్పుడు నిన్ను నేను అంగీకరిస్తాను. కాని నీవు చెడ్డ పనులు చేస్తే అప్పుడు నీ జీవితంలో ఆ పాపం ఉంటుంది. నీ పాపం నిన్ను అదుపులో ఉంచుకోవాలనుకొంటుంది. కానీ నీవే ఆ పాపమును[b] అదుపులో పెట్టాలి.”

“మనం పొలంలోకి వెళ్దాం రా” అన్నాడు కయీను తన తమ్ముడైన హేబెలుతో. కనుక కయీను, హేబెలు పొలంలోకి వెళ్లారు. అప్పుడు కయీను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతన్ని చంపేశాడు.

తర్వాత, “నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడు?”

అంటూ కయీనును యెహోవా అడిగాడు. “నాకు తెలియదు. నా తమ్ముణ్ణి కాపలా కాయడం, వాణ్ణి గూర్చి జాగ్రత్త తీసుకోవడమేనా నా పని?” అని కయీను జవాబిచ్చాడు.

10 అప్పుడు యెహోవా యిలా అన్నాడు, “నీవు చేసింది ఏమిటి? నీవే నీ తమ్ముణ్ణి చంపేసావు. నీ తమ్ముని రక్తం నేల నుండి నాకు మొర పెట్టుతూ వుంది. 11 (నీవు నీ తమ్ముణ్ణి చంపావు) నీ చేతులనుండి అతని రక్తాన్ని తీసుకోవటానికి భూమి నోరు తెరచుకుంది. భూమిమీద నుండి నీవు శపించబడ్డావు. 12 ఇది వరకు నీవు మొక్కలు నాటుకొన్నావు. అవి చక్కగా పెరిగాయి. కాని ఇప్పుడు నీవు మొక్కలు నాటినా, నీ మొక్కలు ఏపుగా ఎదగటానికి నేల తోడ్పడదు. భూమి మీద నీకు ఇల్లు కూడా ఉండదు. ఒక చోటు నుండి మరొక చోటుకు నీవు తిరుగుతూ ఉంటావు.”

13 అప్పుడు కయీను అన్నాడు: “ఇది నేను భరించలేని శిక్ష! 14 చూడు! నన్ను ఈ భూమిని విడిచిపెట్టేటట్లు నీవు బలవంతం చేశావు. నేను నీనుండి వెళ్లిపోయి దాగుకొంటాను. (నీ రక్షణనుండి దూరంగా వెళ్తాను). నేనిక్కడ, అక్కడ తిరుగుతుంటాను. నన్ను ఎవరు చూస్తారో వాళ్లు నన్ను చంపేస్తారు.”

15 అప్పుడు కయీనుతో యెహోవా ఇలా అన్నాడు: “నేను అలా జరుగనివ్వను! కయీనూ, నిన్ను ఎవరైనా చంపితే, నేను వారిని మరింతగా శిక్షిస్తా.” తరువాత కయీనుకు యెహోవా ఒక గుర్తు వేశాడు. ఎవ్వరూ అతణ్ణి చంపకూడదు అని ఈ గుర్తు సూచిస్తుంది.

కయీను కుటుంబం

16 అప్పుడు కయీను యెహోవా సన్నిధి నుండి వెళ్లిపోయాడు. ఏదెనుకు తూర్పునవున్న నోదు దేశములో కయీను నివసించాడు.

17 కయీను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.

18 హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.

19 లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. 20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి. 21 ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు.) సితారాను, పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి. 22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.

23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు:

“ఆదా, సిల్లా, నా మాట వినండి!
    లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి:
ఒకడు నన్ను గాయపర్చాడు కనుక నేను వాడ్ని చంపేశాను.
    ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేశాను.
24 కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం!
    కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది.”

ఆదాము హవ్వలకు షేతు పుట్టుట

25 ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. 26 షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని అతడు పేరు పెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.

ఆదాము కుటుంబ చరిత్ర

ఆదాము[c] వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదామును) చేశాడు. ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.

ఆదాముకు 130 సంవత్సరముల వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బ్రతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

షేతుకు 105 సంవత్సరముల వయస్సులో ఎనోషు అనే ఒక కుమారుడు పుట్టాడు. ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో షేతుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. కనుక మొత్తం 912 సంవత్సరాలు షేతు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

తొంబై సంవత్సరాల వయస్సు దాటిన తరువాత ఎనోషుకు కేయినాను అనే కుమారుడు పుట్టాడు. 10 కేయినాను పుట్టిన తర్వాత, ఎనోషు 815 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి యింకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 11 కనుక మొత్తం 905 సంవత్సరాలు ఎనోషు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

12 కేయినానుకు 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత, మహలలేలు అనే కుమారుడు అతినికి పుట్టాడు. 13 మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో కేయినానుకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 14 కనుక కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

15 మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు యెరెదు అనే కుమారుడు అతనికి పుట్టాడు. 16 యెరెదు పుట్టిన తర్వాత, మహలలేలు 830 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 17 కనుక మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

18 యెరెదుకు 162 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత హనోకు అనే కుమారుడు పుట్టాడు. 19 హనోకు పుట్టిన తర్వాత, యెరెదు 800 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 20 కనుక యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

21 హనోకుకు 65 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత మెతూషెల అనే కుమారుడు అతనికి పుట్టాడు. 22 మెతూషెల పుట్టిన తర్వాత, హనోకు యింకా 300 సంవత్సరాలు దేవునితో సహవాసం చేశాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 23 కనుక హనోకు మొత్తం 365 సంవత్సరాలు జీవించాడు. 24 హనోకు దేవునికి సన్నిహితంగా ఉన్నాడు. ఒకనాడు దేవుడు హనోకును తనతో తీసుకుపోయాడు గనుక అతడు కనబడకుండా పోయాడు.

25 మెతూషెలకు 187 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత లెమెకు అనే కుమారుడు పుట్టాడు. 26 లెమెకు పుట్టిన తర్వాత, మెతూషెల 782 సంవత్సరాలు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 27 కనుక మెతూషెల మొత్తం 969 సంవత్సరాలు జీవించాడు. అతడు అప్పుడు మరణించాడు.

28 లెమెకు వయస్సు 182 సంవత్సరాలు ఉన్నప్పుడు అతనికి ఒక కుమారుడు పుట్టాడు. 29 లెమెకు తన కుమారునికి నోవహు[d] అని పేరు పెట్టాడు. “దేవుడు భూమిని శపించాడు గనుక వ్యయసాయదారులమైన మనం చాలా కష్టపడి పని చేస్తున్నాం. అయితే నోవహు మనకు నెమ్మది కలుగజేస్తాడు” అన్నాడు లెమెకు.

30 నోవహు పుట్టిన తర్వాత లెమెకు 595 సంవత్సరములు జీవించాడు. ఆ కాలంలో అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. 31 కనుక లెమెకు మొత్తం 777 సంవత్సరాలు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

32 నోవహుకు 500 సంవత్సరములు దాటిన తర్వాత షేము, హాము, యాఫెతు అనే కుమారులు పుట్టారు.

ప్రజలు చెడ్డవాళ్లగుట

భూమిమీద మనుష్యుల సంఖ్య పెరుగుతూ పోయింది. వీరికి ఆడపిల్లలు పుట్టారు. 2-4 ఈ ఆడపిల్లలు చాలా అందంగా ఉన్నట్లు దేవుని కుమారులు చూశారు. కనుక దేవుని కుమారులు వారికి నచ్చిన ఆడపిల్లల్ని వాళ్లు పెళ్లి చేసుకొన్నారు.

ఆ స్త్రీలు పిల్లల్ని కన్నారు, ఆ కాలంలోను, ఆ తర్వాత కాలంలోను నెఫీలులనువారు[e] ఆ దేశంలో నివసించారు. వారు చాలా ప్రఖ్యాతి చెందిన ప్రజలు, ప్రాచీన కాలంనుండి వారు మహా వీరులు.

అప్పుడు యెహోవా అన్నాడు, “మనుష్యులు మానవ మాత్రులు, వారి మూలంగా నా ఆత్మను ఎల్లప్పుడు కలవరపడనియ్యను. 120 సంవత్సరాలు వారిని బ్రతకనిస్తాను.”

భూమిమీద మనుష్యులు చాలా చెడ్డవాళ్లుగా ఉన్నట్లు యెహోవా చూశాడు. ప్రజలు ఎల్లప్పుడునూ చెడ్డ వాటిని గూర్చి మాత్రమే తలుస్తున్నట్లు యెహోవా చూశాడు. ఈ భూమిమీద మనుష్యులను చేసినందుకు యెహోవా విచార పడ్డాడు. దేవుని హృదయంలో అది ఎంతో దుఃఖం కలిగించింది. కనుక యెహోవా ఇలా అన్నాడు: “భూమిమీద నేను చేసిన మనుష్యులందరినీ నేను నాశనం చేసేస్తాను. ప్రతి మనుష్యుని, ప్రతి జంతువును, భూమిమీద ప్రాకు ప్రతి జీవిని నేను నాశనం చేస్తాను. ఆకాశ పక్షుల్ని కూడా నేను నాశనం చేస్తాను. ఎందుచేతనంటే, వీటన్నింటినీ నేను చేసినందుకు విచారిస్తున్నాను గనుక.”

అయితే భూమిమీద యెహోవాను సంతోషపెట్టిన మనిషి ఒక్కడు ఉన్నాడు. అతడు నోవహు.

నోవహు—జలప్రళయం

ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. 10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.

11-12 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.

13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.

15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.

17 “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. 20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. 21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”

22 వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.

మత్తయి 2

తూర్పు నుండి జ్ఞానులు రావటం

హేరోదు రాజ్యపాలన చేస్తున్న కాలంలో యూదయ దేశంలోని బేత్లెహేములో యేసు జన్మించాడు. తూర్పు దిశనుండి జ్ఞానులు యెరూషలేముకు వచ్చి “యూదుల రాజుగా జన్మించినవాడు ఎక్కడున్నాడు? తూర్పున మేమాయన నక్షత్రాన్ని చూసి ఆయన్ని ఆరాధించటానికి వచ్చాము” అని అన్నారు.

ఈ విషయం విని హేరోదు చాలా కలవరం చెందాడు. అతనితో పాటు యెరూషలేము ప్రజలు కూడ కలవరపడ్డారు. అతడు ప్రధానయాజకుల్ని, పండితుల్ని[a] సమావేశపరచి, “క్రీస్తు ఎక్కడ జన్మించబోతున్నాడు?” అని అడిగాడు. వాళ్ళు, “యూదయ దేశంలోని బేత్లెహేములో” అని సమాధానం చెప్పారు. దీన్ని గురించి ప్రవక్త ఈ విధంగా వ్రాసాడు:

“‘యూదయ దేశంలోని బేత్లెహేమా!
    నీవు యూదయ పాలకులకన్నా తక్కువేమీ కాదు!
ఎందుకంటే, నీ నుండి ఒక పాలకుడు వస్తాడు.
    ఆయన నా ప్రజల, అంటే ఇశ్రాయేలు ప్రజల, కాపరిగా ఉంటాడు.’”(A)

ఆ తర్వాత హేరోదు జ్ఞానుల్ని రహస్యంగా పిలిచి ఆ నక్షత్రం కనిపించిన సరియైన సమయం వాళ్ళనడిగి తెలుసుకొన్నాడు. వాళ్ళను బేత్లెహేముకు పంపుతూ, “వెళ్ళి, ఆ శిశువును గురించి సమాచారం పూర్తిగా కనుక్కోండి. ఆ శిశువును కనుక్కొన్నాక నాకు వచ్చి చెప్పండి. అప్పుడు నేను కూడా వచ్చి ఆరాధిస్తాను” అని అన్నాడు.

వాళ్ళు రాజు మాటలు విని తమ దారిన తాము వెళ్ళిపొయ్యారు. వాళ్ళు తూర్పు దిశన చూసిన నక్షత్రం వాళ్ళకన్నా ముందు వెళ్ళుతూ ఆ శిశువు ఉన్న ఇంటి మీద ఆగింది. 10 వాళ్ళా నక్షత్రం ఆగిపోవటం చూసి చాలా ఆనందించారు.

11 ఇంట్లోకి వెళ్ళి ఆ పసివాడు తన తల్లి మరియతో ఉండటం చూసారు. వాళ్ళు ఆయన ముందు మోకరిల్లి ఆయన్ని ఆరాధించారు. ఆ తర్వాత తమ కానుకల మూటలు విప్పి ఆయనకు బంగారు కానుకలు, సాంబ్రాణి, బోళం బహూకరించారు. 12 హేరోదు దగ్గరకు వెళ్ళొద్దని దేవుడు ఆ జ్ఞానులతో చెప్పాడు. అందువల్ల వాళ్ళు తమ దేశానికి మరో దారి మీదుగా వెళ్ళిపోయారు.

ఈజిప్టు దేశానికి తరలి వెళ్ళటం

13 వాళ్ళు వెళ్ళిపొయ్యాక దేవదూత యోసేపుకు కలలో కనిపించి, “లెమ్ము! తప్పించుకొని తల్లీబిడ్డలతో ఈజిప్టు దేశానికి వెళ్ళు! హేరోదు శిశువును చంపాలని అతని కోసం వెతుకనున్నాడు. కనుక నేను చెప్పే వరకు అక్కడే ఉండు” అని అన్నాడు.

14 యోసేపు లేచి తల్లీ బిడ్డలతో ఆ రాత్రి ఈజిప్టు దేశానికి బయలుదేరాడు. 15 యోసేపు హేరోదు మరణించేదాకా అక్కడే ఉండి పొయ్యాడు. తద్వారా ప్రభువు ప్రవక్త ద్వారా, “నేను నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి పిలుస్తాను”(B) అని అన్న మాట నిజమైంది.

హెరోదు బెత్లెహేములో మగపిల్లలను చంపటం

16 జ్ఞానులు తనను మోసం చేసారని గ్రహించి హేరోదు కోపంతో మండిపొయ్యాడు. అతడు వాళ్ళు చెప్పిన కాలాన్ననుసరించి బేత్లేహేములో, దాని పరిసర ప్రాంతాల్లో రెండు సంవత్సరాలు, లేక అంతకన్నా తక్కువ వయస్సుగల బాలురనందర్ని చంపివేయమని ఆజ్ఞాపించాడు. 17 తద్వారా యిర్మీయా ప్రవక్త ద్వారా ప్రభువు చెప్పిన ఈ విషయం నిజమైంది:

18 “రామా గ్రామంలో అతి దుఃఖంతో
    ఏడుస్తున్న స్వరం వినిపించింది.
రాహేలు తన సంతానం కొఱకు ఏడ్చింది.
    ఎవరు ఓదార్చిన వినలేదు.
    ఆమె సంతానంలో ఎవ్వరూ మిగల్లేదు.”(C)

నజరేతుకు తిరుగు ప్రయాణం

19 హేరోదు మరణించిన తర్వాత దేవదూత ఈజిప్టులో ఉన్న యోసేపుకు కలలో కనిపించి, 20 “లెమ్ము! శిశువును చంపాలని ప్రయత్నం చేసిన వాళ్ళు చనిపోయారు. కనుక తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళు” అని అన్నాడు.

21 అందువల్ల యోసేపు లేచి తల్లిని, బిడ్డను తీసుకొని ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడు. 22 కాని, యూదయ దేశాన్ని హేరోదుకు మారుగా అతని కుమారుడు అర్కెలాయు పాలిస్తున్నాడని విని అక్కడికి వెళ్ళటానికి భయపడిపొయ్యాడు. అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ప్రభువు హెచ్చరించటంవల్ల అతడు గలిలయ ప్రాంతానికి వెళ్ళిపొయ్యాడు. 23 అక్కడికి వెళ్ళి నజరేతు అనే గ్రామంలో నివసించాడు. తద్వారా, ఆయన నజరేతు నివాసి అని పిలువబడతాడు అని దేవుడు ప్రవక్తల ద్వారా చెప్పిన మాటలు నిజమయ్యాయి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International