Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 13-15

అబ్రాము కనానుకు తిరిగి వచ్చుట

13 కనుక అబ్రాము ఈజిప్టును విడిచిపెట్టాడు. తన భార్యను, స్వంతంగా తనకు ఉన్నదంతా తీసుకొని, నెగెబుగుండా అబ్రాము ప్రయాణం చేశాడు. లోతు కూడా వాళ్లతో ఉన్నాడు. ఈ సమయానికి అబ్రాము చాలా ఐశ్వర్యవంతుడు. అతనికి చాలా విస్తారంగా పశువులు ఉన్నాయి. చాలా వెండి, బంగారం ఉన్నాయి.

అబ్రాము చుట్టుప్రక్కల సంచరిస్తూనే ఉన్నాడు. నెగెబును విడిచిపెట్టి మళ్లీ వెనుకకు బేతేలుకు వెళ్లాడు. బేతేలు పట్టణానికి, హాయి పట్టణానికి మధ్యనున్న చోటుకు అతడు వెళ్లాడు. ఇంతకు ముందు అబ్రాము నివసించిన స్థలమే ఇది. అబ్రాము ఒక బలిపీఠాన్ని నిర్మించిన స్థలమిది. కనుక ఈ స్థలంలో అబ్రాము యెహోవాను ఆరాధించాడు.

అబ్రాము, లోతు వేరుపడటం

ఈ సమయంలో అబ్రాముతో లోతు కూడా ప్రయాణం చేస్తున్నాడు. లోతుకు గొర్రెలు, పశువులు, గుడారాలు చాలా ఉన్నాయి. అబ్రాముకు, లోతుకు పశువులు విస్తారంగా ఉన్నందువల్ల వాళ్లిద్దరికి ఆ భూమి సరిపోలేదు. అబ్రాము గొర్రెల కాపరులు, లోతు గొర్రెల కాపరులు వాదించుకోవడం మొదలు పెట్టారు. అదే సమయంలో కనానీయులు, పెరిజ్జీయులు కూడా ఈ దేశంలో నివసిస్తున్నారు.

కనుక లోతుతో అబ్రాము ఇలా అన్నాడు: “నీకు, నాకు మధ్య వాదం ఏమీ ఉండకూడదు. నీ మనుష్యులు నా మనుష్యులు వాదించుకోగూడదు. మనమంతా సోదరులం. మనం వేరైపోవాలి. నీకు ఇష్టం వచ్చిన స్థలం ఏదైనా నీవు కోరుకో. నీవు ఎడమకు వెళ్తే, నేను కుడికి వెళ్తాను. నీవు కుడికి వెళ్తే, నేను ఎడమకు వెళ్తాను.”

10 లోతు పరిశీలించి యోర్దాను లోయను చూశాడు. అక్కడ నీళ్లు విస్తారంగా ఉన్నట్లు లోతు చూశాడు. (ఇది సొదొమ గొమొఱ్ఱాలను యెహోవా నాశనము చేయకముందు. ఆ కాలంలో సోయరు వరకు యొర్దాను లోయ యెహోవా తోటలా ఉంది, ఈజిప్టు భూమిలా ఇది కూడ మంచి భూమి.) 11 అందుచేత యొర్దాను లోయలో జీవించాలని లోతు నిర్ణయించుకొన్నాడు. ఆ ఇద్దరు మనుష్యులు వేరైపోయారు, లోతు తూర్పు దిక్కుగా ప్రయాణం మొదలు పెట్టాడు. 12 అబ్రాము కనాను దేశంలోనే ఉండిపోయాడు, లోతు లోయలోని పట్టణాల్లో నివసించాడు. బాగా దక్షిణాదిన ఉన్న సొదొమకు తరలిపోయి అక్కడ లోతు నివాసం ఏర్పర్చుకొన్నాడు. 13 సొదొమ ప్రజలు చాలా దుర్మార్గులు. వాళ్లు ఎప్పుడూ యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.

14 లోతు వెళ్లిపోయిన తర్వాత అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు: “నీ చుట్టు చూడు. ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర చూడు. 15 నీవు చూస్తోన్న ఈ దేశం అంతా నీకు, నీ వారసులకు నేను ఇస్తాను. ఇది శాశ్వతంగా నీ దేశం అవుతుంది. 16 భూమిమీద ధూళి కణాలు ఎంత విస్తారమో, నీ వారసులను గూడ అంత విస్తరింప జేస్తాను. నేలమీద ధూళి కణాలను ఎవరైనా లెక్కించగలిగితే అది నీ ప్రజల సంఖ్య అవుతుంది. 17 కనుక వెళ్లు, నీ దేశంలో సంచరించు. దానిని ఇప్పుడు నేను నీకు ఇస్తున్నాను.”

18 కనుక అబ్రాము తన గుడారాలను తరలించాడు, మమ్రే సమీపంలోని మహా వృక్షాల దగ్గర నివసించాలని అతడు వెళ్లాడు. ఇది హెబ్రోను పట్టణానికి దగ్గరగా ఉంది. యెహోవాను ఆరాధించటానికి ఈ స్థలంలో ఒక బలిపీఠాన్ని అబ్రాము కట్టించాడు.

లోతు బంధించబడ్డాడు

14 షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు, ఏలాం రాజు కదొర్లాయోమెరు, మరియు గోయీయుల రాజు తిదాలు. ఈ రాజులంతా కలసి సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిర్షా, అద్మా రాజైన షినాబు, సెబోయీయుల రాజైన షెమేబెరు, బెల (సోయరు అని కూడ బెల పిలవబడింది) రాజుతోను యుద్ధము చేశారు.

ఈ రాజులంతా సిద్దీము లోయలో వారి సైన్యాలతో కలుసుకున్నారు. (సిద్దీము లోయ యిప్పుడు ఉప్పు సముద్రం). ఈ రాజులు పన్నెండు సంవత్సరాల పాటు కదొర్లాయోమెరుకు సేవ చేశారు. అయితే 13వ సంవత్సరంలో వారంతా అతని మీద తిరుగుబాటు చేశారు. కనుక 14వ సంవత్సరంలో కదొర్లాయోమెరు రాజు, అతనితో ఉన్న రాజులు వీరిమీద యుద్ధం చేయటానికి వచ్చారు. కదొర్లొయోమెరు, అతనితో ఉన్న రాజులు అష్తారోతు కర్నాయిములో రఫాయి ప్రజలను ఓడించారు. హాములో జూజీయులను కూడా వారు ఓడించారు. షావే కిర్యతాయిములో ఏమీయులను వారు ఓడించారు. శేయీరు[a] కొండ ప్రదేశం నుండి ఏల్పారాను వరకు హోరీయులను వారు ఓడించారు. (ఏల్పారాను ఎడారి దగ్గరగా ఉంది.) తర్వాత కదొర్లాయోమెరు రాజు ఉత్తర దిశగా తిరిగి ఏన్మిష్పతు (అంటే కాదేషు)కు వెళ్లి, అమాలేకీ ప్రజలందర్నీ ఓడించాడు. అమోరీ ప్రజలను కూడా అతడు ఓడించాడు. హససోన్ తామారులో ఈ ప్రజలు నివసిస్తారు.

ఆ సమయంలో సొదొమ రాజు, గొమొర్రా రాజు, అద్మా రాజు, సెబోయీము రాజు, బెల రాజు (బెల అంటె సోయరు) కలసి వారి శత్రువుల మీద సిద్దీము లోయలో యుద్ధం చేయటానికి వెళ్లారు. ఏలాము రాజు కదొర్లాయోమెరు, గోయీయుల రాజు తిదాలు, షీనారు రాజు అమ్రాపేలు, ఎల్లాసరు రాజు అర్యోకు మీద వారు యుద్ధము చేశారు. అందుచేత ఈ నలుగురు రాజులు ఆ ఐదుగురితో యుద్ధం చేశారు.

10 సిద్దీం లోయలో తారుతో నింపబడ్డ గుంటలు చాలా ఉన్నాయి. సొదొమ, గొమొర్రాల రాజులు వారి సైన్యాలు పారిపోయారు. చాలా మంది సైనికులు ఆ గుంటల్లో పడిపోయారు. అయితే మిగిలినవాళ్లు కొండల్లోకి పారిపోయారు.

11 కనుక సొదొమ, గొమొర్రా ప్రజల ఆస్తినంతా వారి శత్రువులు తీసుకుపోయారు. వారి బట్టలు, భోజనం అంతా తీసుకొని వారు వెళ్లిపోయారు. 12 అబ్రాము సోదరుని కుమారుడు లోతు సొదొమలో నివసిస్తుండగా శత్రువు అతణ్ణి బంధించాడు. అతని ఆస్తి మొత్తం తీసుకొని శత్రువు వెళ్లిపోయాడు. 13 పట్టుబడని లోతుయొక్క మనుష్యులలో ఒకడు అబ్రాము దగ్గరకు వెళ్లి జరిగినదాన్ని చెప్పాడు. అమ్మోరీవాడగు మమ్రే చెట్లదగ్గర అబ్రాము నివాసం చేస్తున్నాడు. మమ్రే, ఎష్కోలు, అనేరు ఒకరికి ఒకరు సహాయ ఒడంబడిక చేసుకొన్నారు. అబ్రాముకు సహాయం చేసేందుకు కూడ వారు ఒక ఒడంబడిక చేసుకొన్నారు.

అబ్రాము లోతును రక్షించుట

14 లోతు బంధించబడ్డాడని అబ్రాముకు తెలిసింది. కనుక అబ్రాము తన కుటుంబం అంతటిని సమావేశ పర్చాడు. వారిలో 318 మంది శిక్షణ పొందిన సైనికులు ఉన్నారు. అబ్రాము తన మనుష్యులకు నాయకత్వం వహించి, దాను పట్టణం వరకు శత్రువును పూర్తిగా తరిమివేశాడు. 15 ఆ రాత్రి అతడు, అతని మనుష్యులు శత్రువు మీద అకస్మాత్తుగా దాడి జరిపారు. వారు శత్రువును ఓడించి దమస్కుకు ఉత్తరాన హోబ వరకు వారిని తరిమివేశారు. 16 అప్పుడు అబ్రాము శత్రువు దొంగిలించిన వస్తువులన్నింటిని మరల వెనుకకు తీసుకొని వచ్చాడు. స్త్రీలను, సేవకులను, లోతును, అతని ఆస్తి అంతటిని అబ్రాము వెనుకకు తీసుకొని వచ్చాడు.

17 కదొర్లాయోమెరును, అతనితో ఉన్న రాజులను ఓడించిన తర్వాత అబ్రాము తన యింటికి తిరిగి వెళ్లాడు. అతడు యింటికి వచ్చుచున్నప్పుడు షావే లోయలో అతణ్ణి కలుసుకొనేందుకు సొదొమ రాజు వెళ్లాడు. (ఇప్పుడు దీనిని రాజు లోయ అంటారు.)

మెల్కీసెదెకు

18 షాలేము రాజు మెల్కీసెదెకు కూడా అబ్రామును కలుసుకొనేందుకు వెళ్లాడు. మెల్కీసెదెకు సర్వోన్నతుడైన దేవునికి యాజకుడు. రొట్టెను, ద్రాక్షారసాన్ని మెల్కీసెదెకు తెచ్చాడు. 19 మెల్కీసెదెకు అబ్రామును ఆశీర్వదించి ఇలా అన్నాడు:

“అబ్రామా, మహోన్నతుడైన దేవుడు నీకు దీవెనలు ప్రసాదించుగాక,
    దేవుడు భూమ్యాకాశాలను చేసినవాడు.
20 సర్వోన్నతుడైన దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం
    నీ శత్రువుల్ని ఓడించటానికి ఆయనే నీకు సహాయం చేశాడు.”

యుద్ధ సమయంలో అబ్రాము తెచ్చుకొన్న దానంతటిలో నుండి పదోవంతు మెల్కీసెదెకునకు అతడు ఇచ్చాడు. 21 అప్పుడు సొదొమ రాజు, “వీటన్నింటిని నీ కోసమే ఉంచుకో. శత్రువుచేత బాధించబడి, తీసుకొనిపోబడ్డ నా మనుష్యులను మాత్రం నాకు ఇచ్చేయి” అని అబ్రాముతో చెప్పాడు.

22 అయితే సొదొమ రాజుతో అబ్రాము ఇలా చెప్పాడు: “భూమిని, ఆకాశాన్ని చేసిన మహోన్నతుడైన యెహోవాదేవుని పేర నేను వాగ్దానం చేస్తున్నాను. 23 నీకు చెందినది ఏదీ నేను ఉంచుకోను. ఒక నూలుపోగైనా లేక జోళ్ల దారాలయినా, ఏదీ ఉంచుకోనని నేను వాగ్దానం చేస్తున్నాను. ‘అబ్రామును నేనే ధనికునిగా చేశానని నీవు చెప్పడం నాకిష్టం లేదు.’ 24 నా యువకులు భుజించిన ఆహారం ఒక్కటి మాత్రము నేను స్వీకరిస్తాను. అయితే మిగిలినవారికి వారి వంతు నీవు ఇవ్వాలి. యుద్ధములో మేము గెలుచుకొన్న వాటిని తీసుకొని, ఆనేరు, ఎష్కోలు, మమ్రేలకు రావలసిన భాగాలు వారికి ఇవ్వు. వీళ్లు నాకు యుద్ధంలో సహాయపడ్డారు.”

అబ్రాముతో దేవుని ఒడంబడిక

15 ఈ సంగతులన్నీ జరిగాక, ఒక దర్శనంలో అబ్రాముకు యెహోవా వాక్కు వచ్చి, “అబ్రామా, భయపడకు, నేను నిన్ను కాపాడుతాను. నేను నీకు గొప్ప ప్రతిఫలం ఇస్తాను” అని దేవుడు అన్నాడు.

అయితే అబ్రాము అన్నాడు: “యెహోవా దేవా, నన్ను సంతోష పెట్టగలిగేందుకు నీవు ఇవ్వగలిగింది ఏదీ లేదు. ఎందుచేతనంటే నాకు కుమారుడు లేడు. కనుక నేను చనిపోయిన తర్వాత, నా సేవకుడును దమస్కువాడైన ఎలీయెజెరు నా ఆస్తి అంతటికి వారసుడు అవుతాడు. చూడు దేవా, నాకు నీవు కుమారుణ్ణి ఇవ్వలేదు. కనుక నా ఇంటిలో పుట్టిన సేవకుడు నాకు ఉన్న ఆస్తి అంతా దక్కించుకొంటాడు,”

అప్పుడు అబ్రాముతో యెహోవా మాట్లాడాడు: “నీకు ఉన్నవాటన్నింటిని పొందేవాడు నీ సేవకుడు కాదు. నీకు ఒక కుమారుడు కలుగుతాడు. నీకు ఉన్నవాటన్నింటిని నీ కుమారుడు పొందుతాడు.”

అంతట దేవుడు అబ్రామును గుడారము బయటకు తీసుకొని వెళ్లి, ఇలా చెప్పాడు: “ఆకాశం చూడు, అక్కడ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూడు. అవి చాలా ఉన్నాయి. నీవు లెక్కపెట్టలేవు. భవిష్యత్తులో నీ కుటుంబం అలాగే ఉంటుంది.”

అబ్రాము దేవుణ్ణి నమ్మాడు, అబ్రాముయొక్క విశ్వాసాన్ని దేవుడు నీతిగా అంగీకరించాడు. అబ్రాముతో దేవుడు ఇలా అన్నాడు, “కల్దీయుల ఊరు అను పట్టణము నుండి నిన్ను బయటకు నడిపించిన యెహోవాను నేనే. ఈ దేశాన్ని నీకు ఇచ్చేందుకు నేను అలా చేశాను. ఈ దేశం నీ స్వంతం అవుతుంది.”

అయితే అబ్రాము, “యెహోవా, నా ప్రభువా, ఈ దేశం నాదే అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది?” అన్నాడు.

అబ్రాముతో దేవుడు అన్నాడు: “మనం ఒక ఒడంబడిక చేసుకొందాం. మూడు సంవత్సరాల ఆవు ఒకటి, మూడు సంవత్సరాల మేక ఒకటి, మూడు సంవత్సరాల పొట్టేలు ఒకటి తీసుకురా. ఇంకా నా కోసం ఒక పావురాన్ని, ఒక చిన్న పావురాన్ని తీసుకురా.”

10 దేవుని కోసం వీటన్నిటిని అబ్రాము తెచ్చాడు. ఆ జంతువులన్నింటిని చంపి ఒక్కోదాన్ని రెండేసి ముక్కలు చేశాడు, తర్వాత అబ్రాము ఈ భాగాలను ఒకదానికొకటి ఎదురెదురుగా వేశాడు. పక్షులను రెండు భాగాలుగా అబ్రాము ఖండించలేదు. 11 తర్వాత ఈ జంతువులను తినటానికి పెద్ద పక్షులు వచ్చి వాలాయి. కాని అబ్రాము వాటిని వెళ్లగొట్టేశాడు.

12 తర్వాత ఆ రోజు సూర్యుడు అస్తమిస్తున్నాడు. అబ్రాముకు బాగా నిద్ర వచ్చి నిద్రపోయాడు. అతడు నిద్రపోతూ ఉండగా భయంకర గాఢ చీకటి కమ్మింది. 13 అప్పుడు అబ్రాముతో యెహోవా ఇలా చెప్పాడు: “ఈ సంగతులు నీవు తెలుసుకోవాలి, నీ సంతానము విదేశీయులై, వారి స్వంతం కాని దేశంలో అపరిచితులుగా ఉంటారు. వారు అక్కడ బానిసలుగా ఉంటారు. ఇంకా, 400 సంవత్సరాలు కఠినంగా వాళ్లు శ్రమ పెట్టబడతారు. 14 అయితే వాళ్లకు యజమానిగా ఉన్న దేశాన్ని, 400 సంవత్సారాల తరువాత నేను శిక్షిస్తాను. మరి నీ ప్రజలేమో ఆ దేశాన్ని విడిచిపెట్టేస్తారు. నీ ప్రజలు వెళ్లిపోయేటప్పుడు విస్తారమైన ఆస్తులను వారితో తీసుకొనిపోతారు.

15 “నీవు మట్టుకు చాలా వృద్ధాప్యం వరకు జీవిస్తావు, మనశ్శాంతితో నీవు మరణిస్తావు. నీ వంశం వారితో నీవు పాతిపెట్టబడతావు. 16 నాలుగు తరాల తర్వాత నీ ప్రజలు మరల ఈ దేశం వస్తారు. ఆ సమయంలో అమోరీ ప్రజలను నీ ప్రజలు ఓడిస్తారు. అక్కడ నివసిస్తోన్న అమోరీ ప్రజలను శిక్షించటానికి నీ ప్రజలను నేను వాడుకొంటాను. ఇది భవిష్యత్తులో జరుగుతుంది. ఎందుచేతనంటే, శిక్షకు తగినంత చెడుతనం ఇప్పుడు అమోరీ ప్రజల్లో లేదు.”

17 సూర్యుడు అస్తమించాక, చాలా చీకటి పడింది, చచ్చిన జంతువులు రెండేసి ముక్కలుగా ఖండించబడి, ఇంకా అక్కడే నేలమీద పడి ఉన్నాయి. ఆ సమయంలో పొగమంటల వరుస[b] చచ్చిన జంతువుల రెండేసి ముక్కల మధ్యగా సాగిపోయింది. దేవుడు అబ్రాముతో చేసుకొన్న ఒప్పందానికి ఇది ఒక “ముద్ర” లేక “సంతకం.” ఆ రోజుల్లో, కోయబడ్డ జంతువుల ముక్కల మధ్య నడవడం అనే ఒడంబడిక ఆ మనిషి యొక్క నిజాయితీని తెలుపుతుంది. “నేను ఈ ఒడంబడికను అనుసరించకపోతే ఇదే నాకు జరుగనీ” అన్నది దీని అర్థం.

18 కనుక ఆనాడు ఒక వాగ్దానాన్ని, ఒక ఒడంబడికను అబ్రాముతో యెహోవా చేశాడు. యెహోవా అన్నాడు: “ఈ దేశాన్ని నీ సంతానమునకు నేను ఇస్తాను. ఈజిప్టు నదికి, యూఫ్రటీసు నదికి మధ్య ఉన్న దేశాన్ని నేను వారికి ఇస్తాను. 19 కేనీయులు, కెనిజ్జీయులు, కద్మానీయులు, 20 హిత్తీయులు, పెరిజ్జీయులు, రెఫాయీమీయులు, 21 అమోరీయులు, కనానీయులు, గిర్గాషీయులు, యెబూసీయుల దేశమిది.”

మత్తయి 5:1-26

కొండ మీద ఉపదేశం

(లూకా 6:20-23)

యేసు ప్రజా సమూహాల్ని చూసి ఒక కొండ మీదికి వెళ్ళి కూర్చొన్నాడు. ఆ తర్వాత ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వెళ్ళారు. యేసు ఈ విధంగా ఉపదేశించటం మొదలు పెట్టాడు:

“ఆధ్యాత్మికంగా దీనులుగా ఉన్న వాళ్ళదే దేవుని రాజ్యం.
    కనుక వాళ్ళు ధన్యులు.
దుఃఖించే వాళ్ళను దేవుడు ఓదారుస్తాడు.
    కనుక వాళ్ళు ధన్యులు.
నెమ్మది స్వభావం కలవాళ్ళు భూలోకానికి వారసులౌతారు.
    కనుక వాళ్ళు ధన్యులు.
అన్నిటికన్నా నీతి విషయమై ప్రయాసపడే వాళ్ళకు ప్రతిఫలం దొరకుతుంది.
    కనుక వాళ్ళు ధన్యులు.
దయగల వాళ్ళకు దేవుని దయ దొరుకుతుంది.
    కనుక వాళ్ళు ధన్యులు.
శుద్ధ హృదయం కలవాళ్ళు దేవుణ్ణి చూస్తారు.
    కనుక వాళ్ళు ధన్యులు.
శాంతి స్థాపకుల్ని దేవుడు తన కుమారులుగా పరిగణిస్తాడు.
    కనుక శాంతి స్థాపకులు ధన్యులు.
10 నీతి కోసం హింసల్ని అనుభవించిన వాళ్ళదే దేవుని రాజ్యం.
    కనుక వాళ్ళు ధన్యులు.

11-12 “నా కారణంగా ప్రజలు మిమ్మల్ని అవమానిస్తే లేక హింసిస్తే లేక అన్యాయంగా చెడు మాటలు పలికితే, మీకు పరలోకంలో గొప్ప బహుమతి లభిస్తుంది. కనుక మీరు ధన్యులు. ఆనందించండి. వాళ్ళు మిమ్మల్ని హింసించినట్లే మీకన్నా ముందున్న ప్రవక్తల్ని కూడ హింసించారు.

ఉప్పు—వెలుగు

(మార్కు 9:50; 4:21; లూకా 14:34-35; 8:16)

13 “మీరు ఈ ప్రపంచానికి ఉప్పులాంటి వాళ్ళు, కాని ఉప్పులోవున్న ఉప్పు గుణం పోతే మళ్ళీ దాన్ని ఉప్పుగా ఎలా చెయ్యగలం? అది దేనికీ పనికి రాకుండా పోతుంది. అంతేకాక, దాన్ని పార వేయవలసి వస్తుంది. ప్రజలు దాన్ని త్రొక్కుతూ నడుస్తారు.

14 “మీరు ఈ ప్రపంచానికి వెలుగులాంటి వాళ్ళు. కొండ మీద ఉన్న పట్టణాన్ని మరుగు పరచటం అసంభవం. 15 దీపాన్ని వెలిగించి దాన్ని ఎవ్వరూ గంప క్రింద దాచి ఉంచరు. దానికి మారుగా దాన్ని వెలిగించి ముక్కాలి పీటపై ఉంచుతారు. అప్పుడది యింట్లోని వాళ్ళందరికి వెలుగునిస్తుంది. 16 అదే విధంగా మీ జీవితం వెలుగులా ప్రకాశించాలి. అప్పుడు యితర్లు మీరు చేస్తున్న మంచి పనులు చూసి పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతిస్తారు.

ధర్మశాస్త్రాన్ని గురించి ఉపదేశం

17 “నేను ధర్మశాస్త్రాన్ని కాని, ప్రవక్తల వచనాలను కాని రద్దు చేయటానికి వచ్చానని అనుకోవద్దు. నేను వాటిని రద్దుచేయటానికి రాలేదు. వాటిని పూర్తి చేయటానికి వచ్చాను. 18 ఇది సత్యం. భూమి, ఆకాశం గడచి పోయేలోపుల అన్ని సంగతులు, ధర్మశాస్త్రంలోని చిన్న అక్షరం, పొల్లుతో సహా నెరవేరుతాయి.

19 “ఒక చిన్న ఆజ్ఞనైనా సరే రద్దుచేసిన వాడును, తనలాగే చెయ్యమని బోధించిన వాడును దేవుని రాజ్యంలో తక్కువ వాడుగా ఎంచబడుతాడు. కాని ఈ ఆజ్ఞల్ని అనుసరిస్తూ వాటిని బోధించినవాడు దేవుని రాజ్యంలో గొప్పవానిగా ఎంచబడతాడు. 20 ఎందుకంటే, మీరు శాస్త్రులకన్నా, పరిసయ్యుల[a] కన్నా గొప్ప నీతిమంతులని గుర్తింపబడక పోతే దేవుని రాజ్యంలోకి ప్రవేశింపలేరని నేను చెబుతున్నాను.

హత్య చెయ్యరాదు

21 “పూర్వంలో ‘హత్య చేయరాదు, హత్య చేసిన వానికి శిక్ష పడుతుంది’ అని ప్రజలకు చెప్పటం మీరు విన్నారు. 22 కాని నేను చెప్పేదేమిటంటే తన సోదరునిపై కోపగించిన ప్రతి వ్యక్తి శిక్షింపబడతాడు. తన సోదరుణ్ణి “పనికిమాలినవాడా” అన్న ప్రతి వ్యక్తి మహాసభకు సమాధానం చెప్పవలసి ఉంటుంది. తన సోదరుణ్ణి “మూర్ఖుడా!” అన్న ప్రతి వ్యక్తి నరకంలో అగ్నిపాలు కావలసి వస్తుంది.

23-24 “మీరు, మీ కానుకను బలిపీఠం దగ్గరవుంచటానికి ముందు, మీ సోదరునికి మీపై ఏ కారణం చేతనైనా కోపం ఉందని జ్ఞాపకం వస్తే మీ కానుకను అక్కడే వదిలి వెళ్ళండి. వెళ్ళి, మీ సోదరునితో ముందు రాజీ పడండి. ఆ తర్వాత వచ్చి మీ కానుకను అర్పించండి.

25 “మీరు, మీ ప్రతివాదితో దారిలో ఉన్నప్పుడే అతనితో మీకున్న సమస్యల్ని త్వరగా పరిష్కరించుకోండి. అలా చేయకపోతే అతడు మిమ్మల్ని న్యాయాధిపతికి అప్పగించవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటునికి అప్పగించవచ్చు. ఆ భటుడు మిమ్మల్ని కారాగారంలో పడవేయవచ్చు. 26 ఇది సత్యం. మీరు చెల్లించవలసిన చివరికాసు చెల్లించే వరకు మీరా కారగారం నుండి బయటపడరు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International