Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 12-13

పస్కా పండుగ

12 మోషే, అహారోనులు ఇంకా ఈజిప్టులో ఉండగానే, యెహోవా వాళ్లతో మాట్లాడాడు. యెహోవా ఇలా చెప్పాడు: “ఈనెల[a] మీకు సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది. ఈ ఆజ్ఞ ఇశ్రాయేలు సమాజం అంతటికీ చెందుతుంది. ఈ నెల పదో రోజున ఒక్కొక్కరు తన ఇంటివారి కోసం ఒక గొర్రె పిల్లను తీసుకోవాలి. ఒక గొర్రెపిల్లను పూర్తిగా తినగలిగినంత మంది తన ఇంట్లో లేకపోతే, అలాంటి వారు తమ భోజనం తినేందుకు ఇంటి పక్కవాళ్లను ఆహ్వానించాలి. ప్రతి ఒక్కరూ తినడానికి సరిపడినంతగా గొర్రెపిల్ల ఉండాలి. గొర్రెపిల్ల ఒక సంవత్సరం వయసు గల మగది కావాలి, అది మంచి ఆరోగ్యంగా ఉండాలి. ఈ జంతువు చిన్న గొర్రె లేక చిన్న మేక కావచ్చును. నెలలో 14వ రోజువరకు మీరు ఆ జంతువును గమనించాలి. ఆ రోజు ఇశ్రాయేలు సమాజంలోని ప్రజలంతా సాయంకాల సమయంలో ఈ జంతువులను చంపాలి. ఈ జంతువుల రక్తం అంతా భద్రం చేయాలి. ఏ ఇండ్లలోనైతే ప్రజలు ఈ ఆహారం భోజనం చేస్తారో ఆ ఇళ్ల ద్వార బంధాల నిలువు కమ్ములమీద, పైకమ్మి మీద ఆ రక్తం చల్లాలి.

“ఆ రాత్రే మీరు ఆ గొర్రెపిల్ల మాంసం కాల్చి దాన్ని మొత్తం తినెయ్యాలి. చేదుగా ఉండే ఆకు కూరలు, పొంగని రొట్టె కూడా మీరు తినాలి. గొర్రె పిల్ల మాంసాన్ని మీరు నీళ్లతో వండకూడదు. మొత్తం గొర్రెపిల్లను నిప్పుమీద కాల్చాలి. అప్పటికి ఇంకా ఈ గొర్రెపిల్ల తల, కాళ్లు, ఆంత్రాలతోనే ఉండాలి. 10 ఆ మాంసం అంతా ఆ రాత్రికి రాత్రే మీరు భోంచేయాలి. మాంసంలో ఏమైనా మర్నాటి ఉదయం వరకు మిగిలి పోతే దాన్ని నిప్పులో వేసి కాల్చివేయాలి.

11 “మీరు ఆ భోజనం చేసేటప్పుడు ప్రయాణం చేస్తున్న వారిలా బట్టలు వేసుకోవాలి. మీ అంగీని మీ నడుంకు బిగించాలి. మీరు మీ చెప్పులు తొడుక్కోవాలి. మీ చేతి కర్రను చేతితో పట్టుకోవాలి. ఆతురంగా మీరు భోజనం చేయాలి. ఎందుచేతనంటే, ఇది యెహోవాయొక్క పస్కాబలి[b] (యెహోవా తన ప్రజలను కాపాడి, వారిని ఈజిప్టునుండి త్వరగా బయటకు నడిపించిన సమయం.)

12 “ఈ రాత్రి నేను ఈజిప్టు అంతటా సంచారం చేసి ఈజిప్టులోని ప్రతి పెద్ద కుమారుణ్ణీ చంపేస్తాను. మనుష్యుల్లోను, జంతువుల్లోను, మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను. ఈజిప్టు దేవతలందరికీ శిక్ష విధిస్తాను. నేనే యెహోవానని వారికి తెలిసేటట్టు చేస్తాను. 13 అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను ఆ రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను.[c] ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, ఆ కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.

14 “కనుక ఈ రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా ఈ పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి. 15 ఈ పండుగనాడు ఏడు రోజుల పాటు పొంగని రొట్టెలు మీరు తినాలి. ఈ పండుగ మొదటి రోజున పులిసే పదార్థాన్ని మీ ఇండ్లలోనుంచి తీసివేయాలి. ఈ పండుగ జరిగే మొత్తం ఏడు రోజుల్లోనూ పులిసిన పదార్థాన్ని ఏ ఒక్కరూ తినకూడదు. ఎవరైనా సరే పులిసే పదార్థం తింటే, ఆ వ్యక్తిని ఇశ్రాయేలు వాళ్లనుండి మీరు వేరుచేయాలి. 16 పండుగలో మొదటి రోజున, చివరి రోజున పరిశుద్ధ సమావేశాలు ఉంటాయి. ఈ రోజుల్లో మీరు ఏ పనీ చేయకూడదు. ఇలాంటి రోజుల్లో మీరు భోంచేయటానికి అవసరమైన భోజనాన్ని సిద్ధం చేసుకోవడం ఒక్కటే మీరు చెయ్యొచ్చు. 17 పులియని పిండితో చేసే రొట్టెల పండుగను మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుచేతనంటే, సరిగ్గా ఈ రోజే మీ వంశాలన్నింటినీ ఈజిప్టు నుండి నేను బయటకు నడిపిన రోజు. అందుచేత మీ తర్వాత మీ సంతానమంతా ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ఇది శాశ్వతంగా ఉండిపోయే చట్టం. 18 కనుక మొదటి నెల (నిసాను) 14వ రోజు సాయంత్రం నుండి మీరు పులియని రొట్టెలు తినడం మొదలు పెట్టాలి. అదే నెల 21 రోజు సాయంత్రం వరకు అలాంటి రొట్టెలే మీరు తినాలి. 19 ఏడు రోజుల పాటు మీ ఇళ్లలో ఎక్కడా పులిసిన పదార్థం ఉండకూడదు. ఇశ్రాయేలు పౌరుడేకాని, విదేశీయుడేగాని ఏ వ్యక్తిగాని ఈ సందర్భంలో పులిసిన పదార్థం తింటే, మిగిలిన ఇశ్రాయేలీయులందరినుండి ఆ వ్యక్తి వేరు చేయబడాలి. 20 ఈ పండుగ సమయంలో మీరు పులిసిన పదార్థం తినకూడదు. మీరు ఎక్కడ ఉన్నాసరే, పులియని రొట్టెలు మాత్రమే మీరు తినాలి.”

21 కనుక పెద్దలందర్నీ మోషే పిలిచి, “మీ కుటుంబాల కోసం గొర్రెపిల్లల్ని తెచ్చుకొని, పస్కా పండుగకు ఆ గొర్రెపిల్లల్ని తీసుకోండి. 22 హిస్సోపు కొమ్మలు తీసుకొని రక్తంతో నింపిన పాత్రల్లో వాటిని ముంచండి. ద్వారబంధాల నిలువు కమ్ముల మీద, పై కమ్మి మీద ఆ రక్తాన్ని పూయండి. తెల్లారేవరకు ఎవరూ తమ ఇండ్లు విడిచి వెళ్ల కూడదు. 23 ఈజిప్టులో జ్యేష్ఠ సంతానాన్ని చంపడానికి యెహోవా సంచరించే సమయంలో, ద్వారబంధాల నిలువు కమ్ముల మీద పైకమ్మి మీద రక్తాన్ని ఆయన చూస్తాడు. అప్పుడు యెహోవా ఆ ఇంటిని కాపాడుతాడు[d] నాశనకారుడ్ని యెహోవా మీ ఇంట్లోకి రానివ్వడు. మిమ్మల్ని బాధింపనియ్యడు. 24 ఈ ఆజ్ఞ మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ చట్టం మీకు, మీ సంతానానికి శాశ్వతంగా ఉంటుంది. 25 యెహోవా మీకు ఇచ్చే దేశానికి వెళ్లిన తర్వాత కూడ మీరు దీన్ని చేయటం జ్ఞాపకం ఉంచుకోవాలి. 26 ‘ఈ ఆచారం మనం ఎందుకు పాటిస్తున్నాము?’ అని మీ పిల్లలు మిమ్మల్ని అడిగినప్పుడు 27 ‘యెహోవాను ఘనపర్చడం కోసమే ఈ పస్కా పండుగ. ఎందుచేతనంటే, మనం ఈజిప్టులో ఉన్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు గృహాలను దాటిపోయాడు[e] యెహోవా ఈజిప్టు వాళ్లను చంపేసాడు. కానీ మన ఇళ్లల్లో వారిని ఆయన రక్షించాడు. అందుచేత ఇప్పుడు ప్రజలు సాష్టాంగపడి యెహోవాను ఆరాధిస్తున్నారు’ అని మీరు చెప్పాలి.” అని అన్నాడు.

28 మోషే అహరోనులకు యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చాడు. అందుచేత యెహోవా ఆజ్ఞ ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు చేసారు.

29 అర్ధరాత్రి వేళ ఫరో (ఈజిప్టు రాజ్యపాలకుడు) ఇంట పెద్ద కుమారుడు మొదలుకొని చెరసాలలో కూర్చొన్న ఖైదీ పెద్ద కుమారుని వరకు ఈజిప్టులో పెద్ద కుమారులందర్నీ యెహోవా చంపేసాడు. అలాగే జంతువుల్లో మొదటి సంతానం అన్నీ చచ్చాయి. 30 ఆ రాత్రి ఈజిప్టులో ప్రతీ ఇంటా ఎవరో ఒకరు చనిపోయారు. ఫరో, అతని అధికారులు, ఈజిప్టులోని ప్రజలంతా ఘోల్లున ఏడ్వడం మొదలు పెట్టారు.

ఇశ్రాయేలీయులు ఈజిప్టు విడిచి వెళ్లడం

31 కనుక ఆ రాత్రి మోషే, అహరోనులను ఫరో పిలిపించాడు. “మీరు వెంటనే నా ప్రజల్ని విడిచి వెళ్లండి. మీరు చెప్పినట్టే మీరూ, మీ ప్రజలూ చెయ్యండి. వెళ్లి యెహోవాను ఆరాధించండి. 32 మీరు చెప్పినట్టే మీ గొర్రెలను, పశువులను, అన్నింటినీ మీతోబాటు తీసుకొనిపోవచ్చు. వెళ్లండి. నన్నుకూడ ఆశీర్వదించండి.” అని వారితో ఫరో అన్నాడు. 33 వాళ్లను త్వరగా విడిచిపొమ్మని ఈజిప్టు ప్రజలు కూడ వారిని అడిగారు ఎందుకంటే, “మీరు వెళ్లకపోతే మేమందరం చస్తాము” అని వాళ్లు చెప్పారు.

34 తమ రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనేంత సమయం ఇశ్రాయేలు ప్రజలకు లేదు. పిండి ముద్దలున్న పాత్రలను బట్టలో కట్టుకొని వారు వారి భుజాన వేసుకొని మోసుకుపోయారు. 35 అప్పుడు మోషే వారిని ఏమి చేయమని చెప్పాడో అలాగే ఇశ్రాయేలు ప్రజలు చేసారు. వారు వారి పక్క ఇండ్ల వారి దగ్గరకు వెళ్లి బట్టలు, వెండి, బంగారు వస్తువులు ఇమ్మని అడిగారు. 36 ఈజిప్టువారు ఇశ్రాయేలు ప్రజల మీద దయ చూపించేటట్టు యెహోవా చేసాడు. అందుచేత ఈజిప్టు వాళ్లు వారి ఐశ్వర్యాలను ఇశ్రాయేలు ప్రజలకు యిచ్చారు.

37 ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం కట్టి రామసేసునుండి సుక్కోతుకి వెళ్లారు. వారు పురుషులే సుమారు 6,00,000 మంది. ఇందులో పిల్లల సంఖ్యలేదు. 38 గొర్రెలు, పశువులు, ఇతర సామగ్రి చాల విస్తారంగా ఉన్నాయి. వారితో బాటు చాల మంది రకరకాల ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వీళ్లు ఇశ్రాయేలీయులు కారు, గాని వారితో కలిసి వెళ్లారు. 39 అయితే ప్రజలకు మాత్రం వారి రొట్టెల్లో పులిసిన పదార్థం వేసుకొనే సమయం లేదు. వారు తమ ప్రయాణం కోసం ప్రత్యేకమైన భోజనం ఏదీ సిద్ధం చేసుకోలేదు. కనుక పులవని పిండితోనే వారు రొట్టెలు చేసుకోవాల్సి వచ్చింది.

40 ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టులో[f] 430 సంవత్సరాలు జీవించారు. 41 నాలుగువందల ముప్పై సంవత్సరాల తర్వాత ఆరోజే మొత్తం యెహోవా సైన్యాలన్నీ[g] ఈజిప్టు దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. 42 కనుక యెహోవా చేసిన దానిని ప్రజలు జ్ఞాపకం చేసుకొంటారు. అది చాల ప్రత్యేకమైన రాత్రి కనుక తరతరాలవరకు జ్ఞాపకం చేసుకొంటారు. ఇశ్రాయేలు ప్రజలంతా ఆ రాత్రిని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకొంటారు.

43 మోషే అహరోనులతో యెహోవా యిలా చెప్పాడు: “పస్కా పండుగకు నియమాలు ఇవి. పస్కా భోజనం విదేశీయుడెవరూ తినకూడదు. 44 ఒకడు బానిసను కొంటే, ఆ బానిసకు అతడు సున్నతి చేస్తే అప్పుడు ఆ బానిస పస్కా పండుగ భోజనం చెయ్యవచ్చు. 45 అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”

46 “ప్రతి కుటుంబము ఒకే ఇంటిలో భోజనం చేయాలి. భోజనాన్ని ఎవ్వరూ ఇంటి బయట తినకూడదు. మీరు గొర్రెమాంసము తిని దాని ఎముకను విరువకూడదు. 47 ఇశ్రాయేలు ప్రజలందరు ఈ పండుగను ఆచరించాలి. 48 ఇశ్రాయేలు సమాజంలో సభ్యుడు కాని ఏ వ్యక్తి అయినా మీతోబాటు నివసిస్తూ ఉండి యెహోవా పస్కా పండుగలో అతడు పాల్గొనాలనుకొంటే, అతనికి సున్నతి చేయాలి. అప్పుడు అతను కూడ ఇశ్రాయేలు పౌరుడుగా ఆ భోజనంలో పాల్గొనవచ్చు. కాని ఒకడు సున్నతి చేసుకోకపోతే అతను పస్కా పండుగ భోజనంలో పాల్గొన కూడదు. 49 అందరికీ ఇవే నియమాలు వర్తిస్తాయి. మీ దేశంలో నివసిస్తున్న వ్యక్తి పౌరుడైనా సరే, విదేశీయుడైనా సరే యివే నియమాలు వర్తిస్తాయి.”

50 మోషే అహరోనులకు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలకు ప్రజలంతా విధేయులయ్యారు. 51 కనుక అదే రోజు ఇశ్రాయేలు ప్రజలందరినీ ఈజిప్టు దేశం నుండి యెహోవా బయటకు నడిపించాడు. ప్రజలు గుంపులుగా బయల్దేరారు.

13 అప్పుడు యెహోవా మోషేతో యిలా అన్నాడు. “ఇశ్రాయేలులో పెద్దకుమారుడు ప్రతి ఒక్కడూ నాకు చెందుతాడు. ప్రతి స్త్రీకి పుట్టిన పెద్దకుమారుడూ నావాడు. మీ జంతువుల్లో మొదట పుట్టే ప్రతి మగదాన్నీ మీరు నాకు అర్పించాలి.”

మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ రోజును జ్ఞాపకం ఉంచుకోండి. మీరు ఈజిప్టులో బానిసలుగా ఉండేవారు. అయితే ఈనాడు యెహోవా తన మహా శక్తిని ప్రయోగించి మిమ్మల్ని విడుదల చేసాడు. మీరు మాత్రం పులిసిన పదార్థంతో రొట్టెలు తినకూడదు. అబీబు[h] మాసంలో ఈనాడు మీరు ఈజిప్టును విడిచి వెళ్తున్నారు. మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. కనానీ ప్రజలు, హిత్తీ ప్రజలు, అమోరీ ప్రజలు, హివ్వీ ప్రజలు, యెబూసీ ప్రజలు నివసిస్తున్న దేశాన్ని మీకు ఇస్తానని యెహోవా వాగ్దానం చేసాడు. యెహోవా మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహిస్తున్న ఆ సుందర దేశానికి నడిపించిన తర్వాత అప్పుడు కూడా మీరు ఈ రోజును జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మొదటి నెలలో ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆరాధన రోజుగా మీకు ఉండాలి.

“ఏడు రోజులపాటు పులియని రొట్టెలే మీరు తినాలి. ఏడోనాడు ఒక గొప్ప విందు ఉంటుంది. ఈ విందు యెహోవా ఘనతను సూచిస్తుంది. కనుక ఏడు రోజులు పులిసిన పదార్థంతో చేయబడ్డ రొట్టెలు ఏవీ మీరు తినకూడదు. మీ దేశం మొత్తంలో ఎక్కడా పులిసిన పదార్థంతో తయారైన రొట్టెలు ఉండకూడదు. ‘యెహోవా ఈజిప్టునుండి మమ్మల్ని బయటకు రప్పించాడు. కనుక మనం ఈ పండుగ చేసుకొంటున్నాము’ అని ఈ రోజు నాడు మీరు మీ పిల్లలతో చెప్పాలి.”

“మీరు జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు తోడ్పడుతుంది. అది మీ ముంజేతి మీద కట్టుకొన్న దారం పోగులా ఉంటుంది. అది మీ కళ్లముందు కనబడే ఒక జ్ఞాపికలా ఉంటుంది. యెహోవా ప్రబోధాలను జ్ఞాపకం చేసుకొనేందుకు ఈ పండుగ మీకు సహాయ పడుతుంది. మిమ్మల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయ పడుతుంది. 10 కనుక ప్రతి సంవత్సరం సరైన సమయంలో ఈ పండుగను జ్ఞాపకం చేసుకోండి.

11 “మీకు ఇస్తానని వాగ్దానం చేసిన దేశానికి యెహోవా మిమ్మల్ని నడిపిస్తాడు. కనానీయులు ఇప్పుడు అక్కడ నివసిస్తున్నారు. అయితే ఈ దేశాన్ని మీకు ఇస్తానని మీ పూర్వీకులకు యెహోవా వాగ్దానం చేసాడు. దేవుడు ఈ దేశాన్ని మీకు ఇచ్చిన తర్వాత 12 ప్రతి పెద్ద కుమారుణ్ణి ఆయనకు ఇవ్వాలని మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే జంతువుల్లో ప్రథమంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ యెహోవాకు అర్పించాలి. 13 తొలి పిల్లగా పుట్టిన ప్రతి గాడిదనూ యెహోవా దగ్గర్నుండి మళ్లీ కొనుక్కోవచ్చు. మీరు ఆ గాడిదకు బదులుగా ఒక గొర్రెపిల్లను ఇచ్చి, గాడిదను విడిపించుకోవచ్చును. యెహోవా దగ్గర్నుండి ఆ గాడిదను కొని విడిపించుకోనట్లయితే, దాన్ని చంపేయాలి. మీరు దాని మెడ విరుగగొట్టాలి. అది బలి అర్పణ అవుతుంది. ప్రతి పెద్ద సంతానాన్నీ యెహోవా దగ్గరనుండి మళ్లీ కొనుక్కోవాలి.

14 “మీరెందుకు ఇలా చేస్తున్నారని భవిష్యత్తులో మీ పిల్లలు మిమ్మల్ని అడుగుతారు. ‘దీనంతటికీ భావం ఏమిటి?’ అని వారు అంటారు. దానికి మీరు యిలా జవాబిస్తారు. ‘ఈజిప్టు నుండి మనల్ని రక్షించేందుకు యెహోవా తన మహత్తర శక్తిని ప్రయోగించాడు. అక్కడ మనం బానిసలంగా ఉంటిమి. అయితే యెహోవా మనల్ని అక్కడ నుండి బయటకు నడిపించి ఇక్కడకు తీసుకొచ్చాడు. 15 ఈజిప్టులో ఫరో మొండికెత్తాడు. మనల్ని వెళ్లనిచ్చేందుకు అతడు నిరాకరించాడు. కనుక ఆ దేశంలో ప్రతి జ్యేష్ఠ సంతానాన్నీ యెహోవా చంపేసాడు. (పెద్ద కుమారుల్ని, తొలి చూలు జంతువుల్ని యెహోవా చంపేసాడు) ఆ కారణంచేత జంతువుల్లో మొదటి సంతానంగా పుట్టిన ప్రతి మగపిల్లనూ[i] నేను యెహోవాకు అర్పిస్తున్నాను. ఆ కారణంచేతనే నా పెద్ద కుమారుల్లో ప్రతి ఒక్కరినీ నేను యెహోవా దగ్గర్నుండి కొంటున్నాను.’ 16 ఇది మీ ముంజేతికి కట్టబడ్డ దారం పోగులాంటిది. అది నీ కంటికి ఒక బాసికంలాంటిది.[j] యెహోవా తన మహత్తర శక్తిచేత మనల్ని ఈజిప్టు నుండి బయటకు రప్పించాడని జ్ఞాపకం చేసుకొనేందుకు ఇది మీకు సహాయకరంగా ఉంటుంది.”

ఈజిప్టు నుండి బయటకు ప్రయాణం

17 ఫరో ఈజిప్టును విడిచి వెళ్లనిచ్చాడు. సముద్రం వెంబడి పోయే మార్గంలో ఆ ప్రజలను యెహోవా వెళ్లనీయలేదు. ఈ మార్గం పాలస్తీనాకు దగ్గర దారి. కాని “ప్రజలు ఆ దారిన వెళ్తే యుద్ధం చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు వాళ్లు మనసు మార్చుకొని మళ్లీ ఈజిప్టుకు వెళ్లిపోవచ్చు.” 18 కనుక వారిని ఇంకో మార్గాన యెహోవా నడిపించాడు. ఎర్ర సముద్రం పక్కగా ఉండే అరణ్యంలోనుంచి ఆయన వారిని నడిపించాడు. అయితే, ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు విడిచి పెట్టినప్పుడు యుద్ధ వస్త్రాలు ధరించి బయల్దేరారు.

యోసేపు ఎముకలు స్వదేశానికి తీసుకొని వెళ్లడం

19 మోషే తనతో బాటు యోసేపు ఎముకలను తీసుకొని వెళ్లాడు. ఇలా చేయాలనిచెప్పి యోసేపు తాను చనిపోక ముందే ఇశ్రాయేలి కుమారులతో ప్రమాణం చేయించుకొన్నాడు. “దేవుడు మిమ్మల్ని రక్షించినప్పుడు ఈజిప్టులోనుంచి నా ఎముకల్ని మీతో తీసుకు వెళ్లాలని జ్ఞాపకం ఉంచుకోండి” అని తాను చనిపోక ముందు యోసేపు చెప్పాడు.

యెహోవా తన ప్రజలను నడిపించాడు

20 ఇశ్రాయేలు ప్రజలు సుక్కోతు విడిచి ఏతాములో బసచేసారు. ఏతాము ఎడారికి సమీపంగా ఉంది. 21 యెహోవా ముందు దారితీశాడు. పగటి వేళ ప్రజలను నడిపించేందుకు ఒక ఎత్తయిన మేఘ స్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు, మరియు రాత్రివేళ మార్గం చూపించడానికి ఒక ఎత్తయిన అగ్నిస్తంభాన్ని యెహోవా ఉపయోగించాడు. వాళ్లు రాత్రి సమయంలో కూడ ప్రయాణం చేయగలిగేటట్టు ఆ అగ్ని వారికి వెలుతురు నిచ్చింది. 22 పగటి వేళంతా ఆ ఎత్తయిన మేఘమూ, రాత్రి వేళంతా అగ్ని స్తంభమూ వాళ్లతోటే ఉన్నాయి.

మత్తయి 16

కొందరు యేసు అధికారాన్ని సందేహించటం

(మార్కు 8:11-13; లూకా 12:54-56)

16 పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసును పరీక్షించాలని వచ్చి, “ఆకాశం నుండి ఒక అద్భుతాన్ని మాక్కూడా చూపండి” అని అడిగారు.

ఆయన, “సాయంత్రం వేళ ఆకాశం ఎర్రగా ఉంటే ఆ రోజు వాతావరణం బాగుంటుందని మీరంటారు. ఉదయం ఆకాశం ఎఱ్ఱగావుండి, ఆకాశంలో మబ్బులు ఉంటే ఆ రోజు తుఫాను వస్తుందని అంటారు. ఆకాశం వైపు చూసి మీరు వాతావరణాన్ని సూచించగలరు కాని ఈ కాలంలో కనబడుతున్న అద్భుతాన్ని అర్థం చేసుకోలేరేం? దుష్టులు, వ్యభిచారులు అయినటువంటి ఈ తరం వాళ్ళు అద్భుతకార్యాల్ని చూపమని కోరతారు. దేవుడు యోనా ద్వారా చూపిన అద్భుతం తప్ప మరే అద్భుతం చూపబడదు” అని చెప్పి వాళ్ళను వదిలి వెళ్ళిపోయాడు.

శిష్యులు యేసుని అపార్థము చేసికొనటం

(మార్కు 8:14-21)

శిష్యులు సరస్సు దాటి వెళ్ళే ముందు, తమ వెంటరొట్టెల్ని తీసుకు వెళ్ళటం మరచిపొయ్యారు. యేసు వాళ్ళతో, “జాగ్రత్త! పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే పులిసిన పిండి విషయంలో దూరంగా ఉండండి” అని అన్నాడు.

ఈ విషయాన్ని గురించి వారు తమలో తాము చర్చించుకొని, “మనం రొట్టెలు తేలేదని అలా అంటున్నాడు” అని అన్నారు.

వాళ్ళ చర్చ యేసుకు తెలిసింది. వాళ్ళతో, “మీలో దృఢవిశ్వాసం లేదు. రొట్టెలు లేవని మీలో మీరెందుకు చర్చించుకొంటున్నారు. మీకింకా అర్థం కాలేదా? అయిదు వేల మందికి అయిదు రొట్టెల్ని పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో మీకు జ్ఞాపకం లేదా? 10 మరి ఏడు రొట్టెల్ని నాలుగు వేల మందికి పంచినప్పుడు మిగిలిన ముక్కల్ని మీరెన్ని గంపల నిండా నింపారో జ్ఞాపకం లేదా? 11 నేను రొట్టెల్ని గురించి మాట్లాడలేదని మీకెందుకు అర్ధం కావటం లేదు? పరిసయ్యుల కారణంగా, సద్దూకయ్యుల కారణంగా కలిగే దుష్ప్రభావానికి దూరంగా ఉండండి” అని అన్నాడు.

12 ఆయన రొట్టెలకు ఉపయోగించే పులుపు విషయంలో జాగ్రత్త పడమనటం లేదని, పరిసయ్యుల బోధన విషయంలో, సద్దూకయ్యుల బోధన విషయంలో జాగ్రత్త పడమంటున్నాడని అప్పుడు వాళ్ళకు అర్థమయింది.

యేసే క్రీస్తు

(మార్కు 8:27-30; లూకా 9:18-21)

13 యేసు ఫిలిప్పు స్థాపించిన కైసరయ పట్టణ ప్రాంతానికి వచ్చాక తన శిష్యులతో, “మనుష్య కుమారుణ్ణి గురించి ప్రజలేమనుకుంటున్నారు?” అని అడిగాడు.

14 వాళ్ళు, “కొందరు బాప్తిస్మమిచ్చు యోహాను అంటున్నారు. కొందరు ఏలీయా అంటున్నారు. కొందరు యిర్మీయా అంటున్నారు. మరి కొందరు ప్రవక్తల్లో ఒకడై ఉండవచ్చని అంటున్నారు” అని అన్నారు.

15 యేసు, “కాని మీ విషయమేమిటి? నేనెవరని మీరనుకొంటున్నారు?” అని వాళ్ళనడిగాడు.

16 సీమోను పేతురు, “నీవు క్రీస్తువు! సజీవుడైన దేవుని కుమారుడవు!” అని అన్నాడు.

17 యేసు సమాధానం చెబుతూ, “యోనా కుమారుడా! ఓ! సీమోనూ, నీవు ధన్యుడవు! ఈ విషయాన్ని నీకు మానవుడు చెప్పలేదు. పరలోకంలో వున్న నా తండ్రి చెప్పాడు. 18 నీవు పేతురువని నేను చెబుతున్నా. ఈ బండ మీద నేను నా సంఘాన్ని నిర్మిస్తాను. మృత్యులోకపు శక్తులు సంఘాన్ని ఓడించలేవు. 19 దేవుని రాజ్యం యొక్క తాళం చెవులు నేను నీకిస్తాను. ఈ ప్రపంచంలో నీవు నిరాకరించిన వాళ్ళను పరలోకంలో కూడా నిరాకరిస్తాను. ఈ ప్రవంచంలో నీవు అంగీకరించిన వాళ్ళను పరలోకంలో కూడా అంగీకరిస్తాను” అని అన్నాడు.

20 ఆ తర్వాత, తాను క్రీస్తు అన్న విషయం ఎవ్వరికీ చెప్పవద్దని శిష్యులతో చెప్పాడు.

యేసు పొందనున్న మరణం

(మార్కు 8:31–9:1; లూకా 9:22-27)

21 అప్పటి నుండి యేసు తన శిష్యులతో తాను యెరూషలేముకు వెళ్ళవలసిన విషయాన్ని గురించి, అక్కడున్న పెద్దలు, మహాయాజకులు, శాస్త్రులు తనను హింసించే విషయాన్ని గురించి, తాను పొందవలసిన మరణాన్ని గురించి, మూడవ రోజు బ్రతికి రావటాన్ని గురించి చెప్పటం మొదలు పెట్టాడు.

22 పేతురు ఆయనను ప్రక్కకు పిలిచి అలా మాట్లాడవద్దంటూ, “దేవుడు మీపై దయ చూపాలి ప్రభూ! అలా ఎన్నటికి జరగ కూడదు!” అని అన్నాడు.

23 యేసు పేతురు వైపు తిరిగి, “నా ముందు నుండి వెళ్ళిపో సాతాను! నీవు నాకు ఆటంకం కలిగిస్తున్నావు! నీవు మనుష్యుల సంగతుల గురించి ఆలోచిస్తున్నావు కాని, దేవుని సంగతులు గురించి కాదు” అని అన్నాడు.

24 యేసు తన శిష్యులతో, “నా వెంట రాదలచిన వాడు అన్నీ విడచి పెట్టి, తన సిలువను మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 25 తన ప్రాణాన్ని కాపాడాలనుకొన్నవాడు దాన్ని పొగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని ఒదులు కొన్నవాడు దాన్ని కాపాడుకుంటాడు. 26 ప్రపంచాన్నంతా జయించి తన ప్రాణాన్ని[a] పొగొట్టుకొన్న వ్యక్తికి ఏం లాభం కలుగుతుంది? ఆ ప్రాణాన్ని తిరిగి పొందటానికి అతడేమివ్వగలుగుతాడు? 27 మనుష్య కుమారుడు తన దేవదూతలతో కలిసి, తండ్రి మహిమతో రానున్నాడు. అప్పుడాయన ప్రతి ఒక్కనికి, చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. 28 ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు మనుష్యకుమారుడు రావటం చూసేవరకు జీవించే వుంటారు” అని గట్టిగా చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International