Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
నిర్గమకాండము 21-22

వేరే నియమాలు, ఆజ్ఞలు

21 (అప్పుడు మోషేతో యెహోవా అన్నాడు), “ఇవి నీవు ప్రజలకు ఇవ్వాల్సిన మిగతా ఆజ్ఞలు:

“హీబ్రూ బానిసను కనుక నీవు కొంటే, ఆ బానిస ఆరు సంవత్సరాలు మాత్రమే నీ సేవ చేయాలి. ఆరు సంవత్సరాల తర్వాత వాడు స్వతంత్రుడవుతాడు. వాడు చెల్లించాల్సింది ఏమీ ఉండదు. ఆ వ్యక్తి నీకు బానిస అయినప్పుడు పెళ్లిగాకుండా ఉంటే అతడు స్వతంత్రుడయినప్పుడు భార్యలేని వానిగానే నీ దగ్గర్నుండి వెళ్తాడు. అయితే అతడు నీకు బానిస అయినప్పుడు పెళ్లయిన వాడైతే, అతడు విడదల చేయబడినప్పుడు తన భార్యను తనతో ఉంచుకొంటాడు. బానిస బ్రహ్మచారి అయితే యజమాని అతనికి ఒక భార్యను ఇవ్వవచ్చు. ఆ భార్యకు కొడుకులు, కూతుళ్లు పుడితే, ఆ స్త్రీ, ఆమె పిల్లలు యజమానికి చెందుతారు. ఆ బానిస సేవాకాలం తీరిపోతే, అప్పుడు అతడు విడుదల చేయబడతాడు.”

“అయితే ఒక వేళ ఆ యజమాని దగ్గరే ఉండిపోవాలని బానిస తీర్మానించుకొంటే, ‘నా యజమాని అంటే నాకు ప్రేమ. నా భార్య పిల్లల మీద నాకు ప్రేమ కనుక నాకు స్వతంత్రం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండిపోతాను’ అని అతడు తప్పక చెప్పాలి. ఇలా కనుక జరిగితే యజమాని ఆ బానిసను దేవుని దగ్గరకు తీసుకరావాలి. తలుపు దగ్గరకు గాని, ద్వార బంధం దగ్గరకు గాని యజమాని ఆ బానిసను తీసుకు రావాలి. యజమాని ఏదైనా పదునుగల పరికరాన్ని ప్రయోగించి, ఆ బానిస చెవికి రంధ్రం చేయాలి. అప్పుడు బానిస జీవితాంతం ఆ యజమానినే సేవిస్తాడు.”

“ఒకడు తన కూతుర్ని బానిసగా అమ్మి వేయాలని నిర్ణయించవచ్చు. ఇలా కనుక జరిగితే, ఆమెను విడుదల చేసేందుకు సంబంధించిన నియమాలు మగ బానిసలను విడుదల చేసే నియమాల్లాంటివి కావు. ఆ స్త్రీ విషయం యజమానికి ఇష్టం లేకపోతే అతడు ఆ స్త్రీని తిరిగి తన తండ్రికి అమ్మివేయవచ్చును. ఒకవేళ ఆ స్త్రీని పెళ్లి చేసుకొంటానని ఆ యజమాని వాగ్దానం చేసి ఉంటే, ఇతరులకు ఆ స్త్రీని అమ్మివేసే అధికారం అతను కోల్పోతాడు. ఆ యజమాని తన కుమారుణ్ణి పెళ్లి చేసుకోవచ్చని వాగ్దానం చేసి ఉంటే, అప్పుడు ఆమె బానిసగా ఎంచబడదు. ఒక కూతురిగా ఆమె చూడబడుతుంది.”

10 “ఒకవేళ యజమాని మరో స్త్రీని పెండ్లాడితే, మొదటి స్త్రీకి భోజనం, బట్ట, అతడు తక్కువ చేయకూడదు. ఆమెకు ఏవేవి అనుభవించటానికి పెళ్లిద్వారా హక్కు లభించిందో వాటన్నిటినీ అతడు ఆమెకు ఇస్తూనే ఉండాలి. 11 ఈ మూడింటినీ మగవాడు ఆమె కోసం చేయాలి. అతడు చేయకపోతే, ఆమెకు ఏ ఖర్చూ లేకుండానే ఆమె విడుదల చేయబడుతుంది. ఆమె అతడకి డబ్బు ఏమీ రుణపడి ఉండదు.”

12 “ఒకడు ఎవరినైనా కొట్టి చంపితే, వాడిని కూడ చంపెయ్యాలి. 13 అయితే ఏదైనా ప్రమాదం జరిగి, ఏ పధకం వెయ్యకుండానే ఒకడు మరొకడ్ని చంపితే, అది దేవుడు జరుగనిచ్చినదే అవుతుంది. భద్రతకోసం ప్రజలు పారిపోయేందుకు ప్రత్యేక స్థలాలు కొన్నింటిని నేను ఏర్పాటు చేస్తాను. కనుక ఆ వ్యక్తి వీటిలో ఒక చోటికి పారిపోవచ్చు. 14 ఒకడు మరొకని మీద కోపంతో, లేక ద్వేషంతో చంపడానికి పధకం వేస్తే, అలాంటి హంతకుడు శిక్షించబడాలి. వానిని నా బలిపీఠం నుండి దూరంగా తీసుక పోయి చంపేయాలి.”

15 “ఎవడైనా తన తండ్రిని గాని, తల్లినిగాని కొడితే వానిని చంపెయ్యాలి.”

16 “బానిసగా అమ్మేందుకు, లేక తనకు బానిసగా ఉండేందుకు ఎవరైనా మరొకడ్ని ఎత్తుకుపోతే, ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”

17 “ఎవరైనా తన తండ్రిని లేక తల్లిని శపిస్తే ఆ వ్యక్తిని చంపెయ్యాలి.”

18 “ఇద్దరు వ్యక్తులు జగడమాడుకొని, వారిలో ఒకడు రాతితో గాని, పిడికిలితో గాని మరొకనిని కొడితే, (అలాంటివాడిని ఎలా శిక్షిస్తావు?) దెబ్బ తగిలిన వాడు చావకపోతే, అతడ్ని దెబ్బకొట్టి వాణ్ణి చంపకూడదు. 19 అయితే దెబ్బ తిన్నవాడు కొన్నాళ్లపాటు పడక మీద ఉండాల్సివస్తే, అతణ్ణి కొట్టినవాడే అతణ్ణి పోషించాలి. అతణ్ణి కొట్టినవాడే అతనికి కలిగిన సమయం నష్టానికి పరిహారం చెల్లించాలి. అతడు పూర్తిగా బాగయ్యేవరకు ఆ వ్యక్తి అతణ్ణి పోషించాలి.

20 “కొన్నిసార్లు ప్రజలు తమ ఆడ లేక మగ బానిసలను కొడతారు. అలా కొట్టినతర్వాత బానిస చస్తే, హంతకుడు శిక్షించబడాలి. 21 అయితే బానిస చావకుండా, కొన్ని రొజుల తర్వాత బాగైతే, అప్పుడు ఆ వ్యక్తి శిక్షించబడడు. ఎందుకంటే, బానిసకోసం యజమాని డబ్బు చెల్లించాడు గనుక బానిస అతనికే చెందుతాడు.”

22 “ఇద్దరు మగవాళ్లు పోట్లాడుకొంటునప్పుడు ఒక గర్భవతికి దెబ్బ తగలవచ్చు. ఒకవేళ ఆమె ప్రసవించినా ఆమెకు తీవ్రంగా దెబ్బ తగలకపోతే, ఆమెకు దెబ్బ తగిలించినవాడు డబ్బు చెల్లించాలి. అతడు ఎంత డబ్బు చెల్లించాలి అనే విషయం ఆమె భర్త నిర్ణయిస్తాడు. ఆ నష్టం మొత్తం ఎంత అనేది నిర్ణయించడంలో న్యాయాధిపతులు అతనికి సహాయం చేస్తారు. 23 అయితే, ఆ స్త్రీకి తీవ్రంగా దెబ్బ తగిలితే ఆమెను కొట్టినవాడు శిక్షించబడాలి. ఒక వ్యక్తి చంపబడితే, ఆ వ్యక్తిని చంపిన వాణ్ణి చంపెయ్యాలి. ఒకడి ప్రాణానికి బదులుగా మరొకడి ప్రాణం తియ్యాలి. 24 కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చేయి, పాదానికి పాదం, 25 వాతకు వాత, గాయానికి గాయం, కోతకు కోత ఉండాలి.”

26 “ఒకడు ఒక బానిస కంటిమీద గుద్దితే, ఆ బానిసకు ఆ కన్ను గుడ్డిదైతే అప్పుడు ఆ బానిస స్వతంత్రుడిగా వెళ్లిపోవచ్చు. అతని కన్ను అతని విడుదలకు వెలఅవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే. 27 ఒకవేళ యజమాని తన బానిస మూతి మీద కొడితే, ఆ బానిసకు ఒక పన్ను ఊడితే ఆ బానిస స్వతంత్రుడుగా వెళ్లిపోవచ్చు. ఆ బానిస విడుదలకు ఆ బానిస పన్ను వెల అవుతుంది. ఆడ బానిసకైనా మగ బానిసకైనా ఇంతే,

28 “ఒక వేళ ఒకడి ఎద్దు ఏ పురుషుణ్ణి గాని, స్త్రీనిగాని చంపితే, అప్పుడు ఆ ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. ఎద్దును మీరు తినకూడదు. కాని ఎద్దు యజమాని మాత్రం నేరస్తుడు కాడు. 29 అయితే అంతకు ముందు ఆ ఎద్దు ఎవర్నయినా పొడిచి ఉంటే, దాని యజమానికి హెచ్చరిక ఇవ్వబడి ఉంటే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, ఎందుకంటే, ఆ ఎద్దును అతడు కట్టి వెయ్యలేదు. లేక దాని స్థానంలో దాన్ని బంధించలేదు. కనుక ఎద్దును విచ్చలవిడిగా తిరుగనిస్తే, అది ఎవర్నయినా చంపేస్తే, అప్పుడు ఆ యజమాని నేరస్తుడే, మీరు ఎద్దును రాళ్లతో కొట్టి చంపాలి. తర్వాత యజమానిని కూడ చంపెయ్యాలి. 30 అయితే చనిపోయిన వాని కుటుంబం డబ్బు తీసుకోవచ్చు. ఒకవేళ వారు అలా డబ్బు తీసుకొంటే, ఎద్దు స్వంతదారుడ్ని చంపకూడదు. కాని న్యాయాధిపతి నిర్ణయించిన డబ్బు అతడు చెల్లించాలి.

31 “ఒకరి కొడుకును లేక కూతుర్ని ఎద్దు చంపేస్తే యిదే చట్టాన్ని పాటించాలి. 32 ఒక ఎద్దు ఒక బానిసను గనుక చంపేస్తే, మరొక కొత్త బానిస కోసం యజమానికి ముప్పయి వెండి నాణాలను ఎద్దు స్వంతదారుడు చెల్లించాలి. ఎద్దును మాత్రం రాళ్లతో కొట్టి చంపాలి. మగ బానిసలకు, ఆడ బానిసలకు ఈ చట్టం సమానంగా వర్తిస్తుంది.”

33 “ఒకడు గొయ్యిగాని, బావిగాని తవ్వి మూత పెట్టక పోవచ్చును. మరొకడి జంతువు వచ్చి ఆ గుంటలో పడితే ఆ గుంట స్వంతదారుడు నేరస్తుడు. 34 ఆ గుంట స్వంతదారుడు ఆ జంతువు కోసం డబ్బు చెల్లించాలి. అయితే ఆ జంతువు కోసం అతడు డబ్బు చెల్లించాక అతడు ఆ జంతువు శవాన్ని ఉంచు కొనేందుకు అనుమతి ఇవ్వాలి.

35 “ఒకవేళ ఒకరి ఎద్దు మరొకరి ఎద్దును చంపేస్తే అప్పుడు బతికి ఉన్న ఎద్దును అమ్మివేయాలి. ఆ ఎద్దును అమ్మిన డబ్బు వాళ్లిద్దరూ సగం సగం తీసుకోవాలి, చంపబడ్డ ఎద్దులో కూడ వాళ్లిద్దరికి సగం సగం వస్తుంది. 36 అయితే ఒకని ఎద్దు అంతకు ముందు ఇతరుల జంతువులను పొడిచి ఉంటే, అతని ఎద్దు విషయం ఆ యజమాని బాధ్యుడు. ఒకవేళ అతని ఎద్దు మరొక ఎద్దును చంపేస్తే, ఆ ఎద్దును స్వేచ్ఛగా తిరుగనిచ్చినందుకు అతడు నేరస్థుడు, అతడు ఎద్దుకు బదులు ఎద్దును ఇవ్వాలి. చంపబడిన ఎద్దుకు బదులుగా అతడు తన ఎద్దును ఇవ్వాలి.”

22 “ఒక ఎద్దును లేక గొర్రెను దొంగతనం చేసిన వాడిని నీవు ఎలా శిక్షిస్తావు? వాడు ఆ జంతువును చంపేసినా లేక అమ్మేసినా అతడు దాన్ని తిరిగి ఇవ్వలేడు. కనుక వాడు దొంగిలించిన ఒక్క ఎద్దుకు బదులు అయిదు ఎడ్ల నివ్వాలి. లేక వాడు దొంగతనం చేసిన ఒక్క గొర్రెకు బదులు నాలుగు గొర్రెలు ఇవ్వాలి. దొంగతనానికి అతడు శిక్ష చెల్లించాలి. 2-3 వాడికి స్వంతది అంటూ ఏమీ లేకపోతే, వాడ్ని బానిసగా అమ్మాలి. అయితే ఆ జంతువు ఇంకా వాని దగ్గరే ఉంటే, దాన్ని, నీవు చూస్తే అప్పుడు వాడు ఆ దొంగిలించిన ప్రతి జంతువుకు బదులుగా రెండు జంతువుల్ని యజమానికి ఇవ్వాలి. ఆ జంతువు ఎద్దు, గాడిద, గొర్రె, ఏదైనా ఫర్వాలేదు. దొంగ రాత్రివేళ ఒక ఇంటికి కన్నము వేయటానికి ప్రయత్నిస్తూండగా చంపబడితే, వాణ్ణి చంపిన నేరం ఎవ్వరి మీదా ఉండదు. అయితే ఇది పగలు జరిగితే వాణ్ణి చంపిన వాడు నేరస్థుడే (దోషి).

“ఒకడు తన పొలంలో లేక ద్రాక్షాతోటలో మంట రాజబెడితే, ఆ మంట పాకిపోయి, పక్కవాడి పొలాన్ని లేక ద్రాక్షా తోటను కాల్చివేస్తే అతడు తన శ్రేష్ఠమైన పంటను తన పొరుగువాడికి నష్టపరిహారంగా ఇవ్వాలి.

“ఒకడు తన పొలంలో ముళ్ల పొదలను తగుల బెట్టడానికి మంట పెట్టవచ్చును. కానీ ఆ మంట పెద్దదై పొరుగువాడి పొలాన్ని లేక పొరుగువాడి పొలంలో పండుతున్న ధాన్యాన్ని కాల్చివేస్తే, అప్పుడు ఆ మంటను రాజబెట్టిన వ్యక్తి తాను కాల్చివేసిన వాటికి బదులుగా డబ్బు చెల్లించాలి.

“ఒకడు తన డబ్బును లేక ఇంకేవైనా వస్తువుల్ని పొరుగువాని ఇంట్లో దాచి పెట్టమని తన పొరుగువాణ్ణి అడగవచ్చు. ఆ పొరుగువాడి ఇంట్లోనుంచి ఆ డబ్బు లేక వస్తువులు దొంగిలించబడితే, నీవేం చేయాలి? దొంగను పట్టుకొనేందుకు నీవు ప్రయత్నం చేయాలి. నీవు ఆ దొంగను పట్టుకొంటే, అప్పుడు వాడు ఆ వస్తువుల విలువకు రెండంతలు చెల్లించాలి. కానీ ఆ దొంగను నీవు పట్టుకోలేక పోతే, ఆ ఇంటి యజమాని నేరస్థుడైతే, అప్పుడు దేవుడే న్యాయం తీరుస్తాడు. ఆ ఇంటి యజమాని దేవుని ఎదుటికి వెళ్లాలి. అతడే దొంగిలించి ఉంటే దేవుడు న్యాయం తీరుస్తాడు.”

“పోయిన ఒక ఎద్దు లేక గాడిద, గొర్రె లేక వస్త్రం లేక ఇంక దేన్నిగూర్చిగానీ ఇద్దరు వ్యక్తులకు ఒడంబడిక కుదరకపోతే, అప్పుడు నీవేం చేయాలి? ‘ఇది నాది’ అని ఒకడంటే, లేదు, ‘ఇది నాది’ అని ఇంకొకడు అంటాడు. ఆ ఇద్దరు మనుష్యులు దేవుని ఎదుటికి వెళ్లాలి. నేరస్థుడు ఎవరో దేవుడే నిర్ణయిస్తాడు. తప్పుచేసిన వాడు ఆ వస్తువు విలువకు రెండంతలు అవతలి వానికి చెల్లించాలి.

10 “తన జంతువు విషయమై శ్రద్ధ పుచ్చుకోవడం ద్వారా తనకు సహాయం చేయమని ఒకడు తన పొరుగు వాణ్ణి అడగవచ్చు. ఈ జంతువు గాడిద కావచ్చు, ఎద్దు కావచ్చు, గొర్రె కావచ్చు. అయితే ఆ జంతువు చనిపోయినా, ఆ జంతువుకు దెబ్బ తగిలినా లేక ఎవరూ చూడకుండా ఆ జంతువును ఇంకెవరైనా తీసుకొనిపోయినా నీవేం చేయాలి? 11 ఆ జంతువును తాను దొంగిలించలేదని ఆ పొరుగువాడు వివరించి చెప్పాలి. ఇదే కనుక సత్యం అయితే, తాను దొంగతనం చేయలేదని ఆ పొరుగువాడు యెహవాకు ప్రమాణం చేయాలి. జంతువు యజమాని ఈ ప్రమాణాన్ని అంగీకరించాలి. ఆ పొరుగువాడు జంతువుకోసం దాని యజమానికి ఏమీ చెల్లించనక్కర్లేదు. 12 అయితే, ఆ పొరుగు వాడు జంతువును దొంగిలిస్తే, అప్పుడు ఆ జంతువు కోసం దాని యజమానికి అతడు విలువ చెల్లించాలి. 13 ఒకవేళ అడవి మృగాలు ఆ జంతువును చంపేస్తే, ఆ పొరుగువాడు దాని శవాన్ని రుజువుగా తీసుకురావాలి. చంపబడ్డ జంతువు కోసం దాని యజమానికి ఆ పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు.

14 “ఒకడు తన పొరుగు వాని దగ్గర దేన్నయినా బదులు తీసుకొంటే దానికి అతడే బాధ్యుడు. ఒకవేళ ఒక జంతువుకు దెబ్బ తగిలినా లేక ఆ జంతువు చచ్చినా, అప్పుడు ఆ పొరుగువాడు దాని యజమానికి వెల చెల్లించాలి. యజమాని స్వయంగా అక్కడ లేడు గనుక ఆ పొరుగువాడే దానికి బాధ్యుడు. 15 అయితే దాని యజమాని ఆ జంతువుతో కూడా ఉంటే, పొరుగువాడు ఏమీ చెల్లించనక్కరలేదు. లేక, ఆ పొరుగువాడు ఆ జంతువుతో పని చేయించుకొనేందుకుగాను డబ్బు చెల్లిస్తుంటే, ఆ జంతువుకు దెబ్బ తగిలినా, అది చచ్చినా, అతడు ఏమీ చెల్లించనక్కర్లేదు. ఆ జంతువును వాడుకొనేందుకు అతడు చెల్లించిన డబ్బే సరిపోతుంది.

16 “పెళ్లికాని పవిత్రమైన ఒక పడుచుదానితో ఒకవేళ ఒకడికి లైంగిక సంబంధం ఉంటే, అతడు ఆమెను పెళ్లి చేసుకోవాలి. ఆమె తండ్రికి అతడు నిండుగా కట్నం యివ్వాలి. 17 అతణ్ణి పెళ్లి చేసుకొనేందుకు ఆమె తండ్రి అంగీకరించకపోయినా, అతడు ఆ డబ్బు చెల్లించాల్సిందే. ఆమె కోసం పూర్తి మొత్తాన్ని అతడు చెల్లించాలి.

18 “నీవు ఏ స్త్రీనీ కూడా శకునం చెప్పనివ్వకూడదు. ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్తే, అలాంటి దాన్ని నీవు బతకనివ్వకూడదు.

19 “నీవు ఎవ్వర్నీ జంతు సంయోగం చెయ్యనియ్యకూడదు. ఇలా కనుక జరిగితే, ఆ వ్యక్తిని చంపేయాలి.

20 “ఎవడైనా సరే దేవుడు కాని వాడికి బలి అర్పిస్తే, అలాంటివాడ్ని నాశనం చేయాలి. యెహోవా దేవుడు ఒక్కడికే నీవు బలులు అర్పించాలి.” 21 “జ్ఞాపకం ఉంచుకో ఇదివరకు మీరు ఈజిప్టు దేశంలో పరాయివాళ్లు. కనుక మీ దేశంలో ఉండే విదేశీయులలో ఎవర్నీ మీరు మోసం చేయకూడదు. కొట్టగూడదు.

22 “విధవరాండ్రకు, అనాధలకు మీరు ఎన్నడూ ఎట్లాంటి కీడు చేయకూడదు. 23 ఆ విధవరాండ్రకు లేక అనాధలకు మీరు ఏదైనా కీడు చేస్తే అది నాకు తెలుస్తుంది. వారి శ్రమను గూర్చి నేను వింటాను. 24 అంతేకాదు, నాకు చాల కోపం వస్తుంది. కత్తితో నేను మిమ్మల్ని చంపేస్తాను. అప్పుడు మీ భార్యలు విధవరాండ్రయి పోతారు. మీ పిల్లలు అనాధలు అయిపోతారు.

25 “నా ప్రజల్లో ఒకరు పేదవారైతే, నీవు వానికి డబ్బు అప్పిస్తే, ఆ డబ్బుకు నీవు అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. ఆ డబ్బు త్వరగా తిరిగి ఇచ్చి వేయమని నీవు అతణ్ణి తొందర చేయకూడదు: 26 అతడు నీకు బాకీ ఉన్న డబ్బు నీకు చెల్లిస్తాడని ప్రమాణంగా ఎవరైనా ఒకరు తన అంగీని నీకు ఇవ్వవచ్చును. కాని సూర్యాస్తమయం కాకముందే నీవు ఆ అంగీని తిరిగి ఇచ్చివేయాలి. 27 ఒకవేళ ఆ వ్యక్తికి ఆ అంగీ లేకపోతే, తన శరీరాన్ని కప్పుకొనేందుకు అతనికి ఇంకేమీ లేకపోవచ్చును. అతను నిద్రపోయినప్పుడు చల్లబడిపోతాడు. మరి అతడు నాకు మొరబెడితే, అప్పుడు నేను అతని మొర వింటాను. నేను దయగలవాణ్ణి కనుక నేను వింటాను.

28 “నీ దేవుణ్ణిగాని, నీ ప్రజల నాయకులనుగాని నీవు దూషించగూడదు.

29 “కోత కాలంలో నీ మొదటి గింజల్ని, నీ ఫలాల్లో మొదటి రసాన్ని నీవు నాకు ఇవ్వాలి. సంవత్సరాంతం వరకు వేచి ఉండొద్దు.

“నీ పెద్దకుమారుల్ని నాకు ఇవ్వు. 30 అలాగే నీ ఆవుల్లో, గొర్రెల్లో, మొదట పుట్టిన వాటిని నాకు ఇవ్వు. అవి ఏడు రోజులు వాటి తల్లితో ఉండవచ్చు. ఎనిమిదవ రోజున వాటిని నాకు ఇవ్వాలి. 31 మీరు నా ప్రత్యేక ప్రజలు. కనుక అడవి మృగాలు చంపిన ఏదో ఒకదాని మాంసం మీరు తినవద్దు. చచ్చిన ఆ జంతువులను కుక్కల్ని తిననివ్వండి.

మత్తయి 19

విడాకులను గురించి బోధించటం

(మార్కు 10:1-12)

19 యేసు మాట్లాడటం ముగించాక గలిలయ వదలి యొర్దాను నది అవతలి వైపున ఉన్న యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రజలు గుంపులు గుంపులుగా ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళకు నయం చేసాడు.

కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని వచ్చి, “పురుషుడు తన భార్యకు ఏదో ఒక కారణం చూపి విడాకులివ్వవచ్చా?” అని అడిగారు.

4-5 యేసు, “మొదట్లో సృష్టికర్త పురుషుణ్ణి, స్త్రీని సృష్టించి ఇలా అన్నాడు: ‘పురుషుడు తన తల్లి తండ్రులను వదలి తన భార్యతో ఏకమౌతాడు. వాళ్ళిద్దరూ కలసి ఒకే శరీరంగా జీవిస్తారు!’(A) ఇది మీరు చదువలేదా? ఆ కారణంగా వాళ్ళనికమీదట యిరువురిగా కాకుండా ఒకరిగా పరిగణించాలి! దేవుడు ఏకం చేసిన వాళ్ళను మానవుడు వేరు చేయరాదు!” అని సమాధానం చెప్పాడు.

“మరి పురుషుడు విడాకుల పత్రం తన భార్యకిచ్చి ఆమెను పంపివేయవచ్చని మోషే ఎందుకు ఆజ్ఞాపించాడు?” అని వాళ్ళు అడిగారు.

యేసు, “మీరు దేవుని ఆజ్ఞలను అనుసరించే వాళ్ళు కాదు కాబట్టి మీ భార్యలకు విడాకులివ్వటానికి మోషే మీకు అనుమతి యిచ్చాడు. అంతేకాని మొదటి నుండి ఈ విధంగా లేదు. కాని నేను చెప్పేదేమిటంటే అవినీతిపరురాలు కాని తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహమాడిన వాడు వ్యభిచారిగా పరిగణింపబడతాడు. విడువబడ్డ దానిని పెండ్లి చేసికొంటే వాడును వ్యభిచారిగా అవుతాడు” అని అన్నాడు.

10 శిష్యులు ఆయనతో, “విడాకులివ్వటానికి ఇలాంటి కారణం కావలసి వస్తే వివాహం చేసుకోకుండా ఉండటమే ఉత్తమం” అని అన్నారు.

11-12 యేసు, “మీరన్నట్లు చెయ్యటం అందరికి సాధ్యంకాదు. కొందరు నపుంసకులుగా పుడ్తారు. కనుక వివాహం చేసుకోరు. మరి కొందర్ని యితర్లు నపుంసకులుగా చేస్తారు. కనుక వివాహం చేసుకోరు. కాని కొందరు దేవుని రాజ్యం కొరకు వివాహం చేసుకోరు. ఈ బోధను అనుసరించ గలవాడే అనుసరించనీ” అని సమాధానం చెప్పాడు.

యేసు చిన్నపిల్లల్ని దీవించటం

(మార్కు 10:13-16; లూకా 18:15-17)

13 యేసు తన చేతుల్ని చిన్న పిల్లల తలలపై ఉంచి వాళ్ళకోసం ప్రార్థించాలని కొందరు వ్యక్తులు వాళ్ళను ఆయన దగ్గరకు పిలుచుకొని వచ్చారు. కాని ఆ పిలుచుకు వచ్చిన వాళ్ళను శిష్యులు చివాట్లు పెట్టారు. 14 కాని యేసు, “దేవుని రాజ్యం అలాంటి వాళ్ళదే కనుక వాళ్ళను నా దగ్గరకు రానివ్వండి! వాళ్ళనాపకండి!” అని అన్నాడు. 15 వాళ్ళ తలలపై చేతులుంచాక యేసు అక్కడనుండి ముందుకు సాగిపొయ్యాడు.

ధనవంతుడు యేసును వెంబడించుటకు నిరాకరించటం

(మార్కు 10:17-31; లూకా 18:18-30)

16 ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చి, “భోధకుడా! నిత్యజీవం పొందాలంటే నేను ఏ మంచి పని చెయ్యాలి?” అని అడిగాడు.

17 యేసు, “మంచిని గురించి నన్నెందుకు అడుగుతున్నావు? ఒకే ఒక మంచి వాడున్నాడు. నీవు నిత్యజీవం పొందాలంటే ఆజ్ఞల్ని పాటించు!” అని అన్నాడు.

18 “ఏ ఆజ్ఞలు?” ఆ వ్యక్తి అడిగాడు.

యేసు, “హత్యచేయరాదు, వ్యభిచరించ రాదు. దొంగతనం చెయ్యరాదు. దొంగసాక్ష్యం చెప్పరాదు. 19 తల్లితండ్రుల్ని గౌరవించాలి.(B) మీ పొరుగువాళ్ళను మిమ్మల్మి మీరు ప్రేమించుకొన్నంతగా ప్రేమించాలి” అని సమాధానం చెప్పాడు.(C)

20 ఆ యువకుడు, “నేనవన్నీ చేస్తూనే ఉన్నాను. యింకా ఏం చెయ్యాలి?” అని అడిగాడు.

21 యేసు, “నీవు పరిపూర్ణత పొందాలని అనుకుంటే వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకివ్వు! అలా చేస్తే నీకు పరలోకంలో ధనం లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని సమాధానం చెప్పాడు.

22 ఆ యువకుని దగ్గర చాలా ధనముంది కనుక యేసు చెప్పింది విని విచారంతో వెళ్ళిపోయాడు.

23 ఆ తర్వాత యేసు తన శిష్యులతో, “నేను నిజం చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం. 24 నేను మళ్ళీ చెబుతున్నాను. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్ళటం సులభం!” అన్నాడు.

25 శిష్యులు ఇది విని చాలా ఆశ్చర్యపడి, “మరి రక్షణ ఎవరికి లభిస్తుంది?” అని అడిగారు.

26 యేసు వాళ్ళ వైపు చూసి, “మానవులు దీన్ని స్వతహాగా సాధించలేరు. కాని దేవునికి అన్నీ సాధ్యమే!” అని అన్నాడు.

27 అప్పుడు పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మేము అన్నీ వదులుకున్నాము. మరి, మాకేం లభిస్తుంది?” అని అన్నాడు.

28 యేసు, “ఇది సత్యం. క్రొత్త ప్రపంచంలో మనుష్యకుమారుడు తేజోవంతమైన సింహాసనంపై కూర్చుంటాడు. నన్ను అనుసరిస్తున్న మీరు కూడా పన్నెండు సింహాసనాలపై కూర్చొని ఇశ్రాయేలు జనాంగంలోని పన్నెండు గోత్రాల్ని పాలిస్తారు. 29 నాకోసం ఇండ్లను కాని, సోదరుల్ని కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు దానికి నూరువంతుల ఫలం పొందుతాడు. అంతేకాక నిత్యజీవం కూడా పొందుతాడు. 30 కాని ముందున్న వాళ్ళలో చాలామంది వెనక్కి వెళ్తారు. వెనుకనున్న వాళ్ళలో చాలా మంది ముందుకు వస్తారు!” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International