Add parallel Print Page Options

రైతు విత్తనాలు చల్లుటను గురించిన ఉపమానం

(మత్తయి 13:1-9; లూకా 8:4-8)

ఒక రోజు యేసు సముద్రం దగ్గర బోధించటం మొదలు పెట్టాడు. ఆయన చుట్టూ చాలమంది ప్రజలు చేరటం వల్ల ఆయన పడవనెక్కి కూర్చొని నీళ్ళలోకి వెళ్ళాడు. ప్రజలు ఒడ్డున ఉన్నారు. ఆయన ఉపమానాలు ఉపయోగిస్తూ వాళ్ళకు చాలా విషయాలు బోధించాడు. ఆ విధంగా బోధిస్తూ,

“వినండి! ఒక రైతు విత్తనాలు చల్లటానికి వెళ్ళాడు. అతడు విత్తనములు చల్లుతుండగా కొన్ని దారి ప్రక్కన పడ్డాయి. వాటిని పక్షులు తినివేసాయి. మరికొన్ని మట్టి ఎక్కువగా లేని రాతి నేలపై పడ్డాయి. మట్టి ఎక్కువగా లేనందువల్ల అవి త్వరగా మొలకెత్తాయి. కాని సూర్యుడు రాగానే అవి ఆ వేడికి వాడిపోయాయి. వాటికి వేర్లు పెరగనందువల్ల అవి ఎండిపొయ్యాయి. మరికొన్ని విత్తనాలు ముళ్ళ మొక్కల మధ్య పడ్డాయి. ఆ ముళ్ళ మొక్కలు పెరిగి ధాన్యపు మొక్కలను అణచి వేయటంవల్ల వాటికి ధాన్యం పండలేదు. మరికొన్ని విత్తనాలు సారవంతమైన భూమ్మీద పడ్డాయి. అవి మొలకెత్తి పెరిగి, ముప్పై వంతుల, అరవైవంతుల, నూరువంతుల పంటను కూడా యిచ్చాయి.”

ఈ విధంగా చెప్పి యేసు, “చెవులున్న వాడు విననీ!” అని అన్నాడు.

Read full chapter