Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 5-8

ఇశ్రాయేలును, యూదాను వారి నాయకులే పాపం చేయించారు

“యాజకులారా, ఇశ్రాయేలు రాజ్యమా, రాజవంశ ప్రజలారా, తీర్పు మీకోసమే ఉంది. నా మాట వినండి.

“మిస్పాలో మీరు ఒక ఉచ్చువలే ఉన్నారు. తాబోరులో నేలమీద పరచిన ఒక వలవలె మీరు ఉన్నారు. మీరు ఎన్నెన్నో చెడ్డ పనులు చేశారు. కనుక మిమ్మల్నందర్నీ నేను శిక్షిస్తాను! ఎఫ్రాయిము నాకు తెలుసు. ఇశ్రాయేలు చేసినవి నాకు తెలుసు. ఎఫ్రాయిమూ, ఇప్పటికిప్పుడు ఒక వేశ్యలాగ నీవు ప్రవర్తిస్తావు. ఇశ్రాయేలు తన పాపాలతో అశుద్ధమయింది. ఇశ్రాయేలు ప్రజలు చెడ్డపనులు అనేకం చేశారు. వారు తిరిగి వారి దేవుని దగ్గరకు రాకుండా ఆ చెడ్డ పనులే వారిని అడ్డగిస్తాయి. ఇతర దేవతలను వెంటాడే మార్గాలను గూర్చి వారు ఎల్లప్పుడూ తలుస్తున్నారు. వారు యెహోవాను ఎరుగరు. ఇశ్రాయేలీయుల గర్వమే వారికి విరోధంగా ఒక సాక్ష్యం అవుతుంది. కనుక ఇశ్రాయేలు, ఎఫ్రాయిము వారి పాపంలో కాలు జారిపడతారు. కాని యూదా కూడ వారితోపాటే కాలు తప్పి పడిపోతుంది.

“ప్రజా నాయకులు యెహోవా కోసం వెదకుటకు వెళ్లారు. వారు, వారి ‘గొర్రెలను’ మరియు ‘ఆవులను’ వారితో కూడ తీసుకొని వెళ్లారు. కాని యెహోవాను వారు కనుగొనలేదు. ఎందుచేతనంటే ఆయన వారిని విడిచిపెట్టాడు. వారు యెహోవాకు విశ్వాస పాత్రులుగా ఉండలేదు. వారి పిల్లలు పరాయి వాని పిల్లలుగా పుట్టారు. కాని ఇప్పుడు వారు, వారి పొలాలతో పాటు అమావాస్యనాటికి నాశన మవుతారు.”

ఇశ్రాయేలీయుల నాశనంగూర్చి ఒక ప్రవచనం

“గిబియాలో కొమ్ము ఊదండి.
    రామాలో బాకా ఊదండి.
బేతావెను వద్ద హెచ్చరిక చేయండి.
    బెన్యామీనూ, శత్రువు నీ వెనుక ఉన్నాడు.
శిక్షా సమయంలో
    ఎఫ్రాయిము పాడై పోతాడు.
ఆ విషయాలు తప్పక జరుగుతాయి అని నేను (దేవుడు)
    ఇశ్రాయేలు గోత్రాల వారిని హెచ్చరిస్తున్నాను.
10 యూదా నాయకులు మరొక మనిషి ఆస్తిని దొంగిలించుటకు ప్రయత్నించే దొంగల్లాగ తయారయ్యారు.
    కనుక నేను (దేవుడు) వారి మీద నా కోపాన్ని నీళ్లలాగ పోస్తాను.
11 ఎఫ్రాయిము శిక్షించబడతాడు.
    అతడు ద్రాక్షాపళ్లలాగ చితుకగొట్టబడి అణగదొక్కబడతాడు.
    ఎందుచేతనంటే, అతడు దుష్టత్వాన్ని చెయ్యాలని కోరుకున్నాడు.
12 చిమ్మెట బట్టను పాడుచేసినట్టు ఎఫ్రాయిమును నేను నాశనం చేస్తాను.
    చెక్కముక్కను చెదలపురుగు పాడుచేసినట్టు నేను యూదాను పాడుచేస్తాను.
13 ఎఫ్రాయిము తన రోగాన్ని చూశాడు, యూదా తన గాయాన్ని చూశాడు.
    కనుక వారు సహాయంకోసం అష్షూరు వెళ్లారు.
తమ సమస్యలనుగూర్చి తాము ఆ మహారాజుతో చెప్పారు.
    కాని ఆ రాజు మిమ్మల్ని స్వస్థపరచలేడు. అతడు మీ గాయాన్ని బాగుచేయలేడు.
14 ఎఫ్రాయిముకు నేను ఒక సింహంవలె ఉంటాను.
    యూదా రాజ్యానికి నేను ఒక కొదమ సింహంలాగ ఉంటాను.
గనుక నేను, అవును, యెహోవానైన నేనే వారిని ముక్కలుగా చీల్చివేస్తాను.
నేను వారిని తీసుకొని వెళ్ళిపోతాను.
    నానుండి వారిని ఎవ్వరూ రక్షించలేరు.
15 ప్రజలు తాము దోషులమని ఒప్పుకొనేంత వరకు
    నాకోసం వారు వెదుకుతూ వచ్చేంత వరకు
    నేను నా స్థలానికి వెళ్లిపోతాను.
అవును, తమ కష్టంలో నన్ను కనుక్కొనేందుకు వారు కష్టపడి ప్రయత్నిస్తారు.”

యెహోవా దగ్గరకు తిరిగి వచ్చినందుకు బహుమతులు

“రండి, మనం తిరిగి యెహోవా దగ్గరకు వెళ్దాం.
    ఆయన మనల్ని గాయపరిచాడు. కాని ఆయనే మనలను బాగుచేస్తాడు.
    ఆయన మనలను గాయపర్చాడు. కాని ఆయనే మనకు కట్టుకడతాడు.
తర్వాత ఆయన మనలను మరల బతికిస్తాడు.
    మూడోనాడు ఆయన మనలను తిరిగి లేపుతాడు.
    అప్పుడు మూడవ రోజున మనం ఆయన ఎదుట జీవించగలం.
మనం యెహోవాను గూర్చి నేర్చుకొందాము.
    ప్రభువును తెలుసుకొనేందుకు మనం గట్టిగా ప్రయత్నం చేద్దాం.
సూర్యోదయం వస్తుందని మనకు తెలిసినట్లే
    ఆయన వస్తున్నాడని మనకు తెలుసు.
యెహోవా వర్షంలాగ మన దగ్గరకు వస్తాడు.
    నేలను తడిపే వసంతకాలపు వర్షంలాగ ఆయన వస్తాడు.”

ప్రజలు నమ్మకస్తులు కారు

“ఎఫ్రాయిమూ, నిన్ను నేను (యెహోవా) ఏమి చేయాలి?
    యూదా, నిన్ను నేను ఏమి చేయాలి?
నీ నమ్మకత్వం ఉదయపు మంచులాగ ఉంది.
    వేకువనే ఉండకుండా పోయే హిమంలాగ నీ నమ్మకత్వం ఉంది.
నేను ప్రవక్తలను ఉపయోగించి
    ప్రజల కోసం న్యాయచట్టం చేశాను.
నా ఆజ్ఞచేతనే ప్రజలు చంపబడ్డారు.
    కాని, ఆ నిర్ణయాల మూలంగానే మంచి విషయాలు వస్తాయి.
ఎందుచేతనంటే, నాకు కావల్సింది నమ్మకమైన ప్రేమయే.
    అంతేగాని బలిఅర్పణ కాదు.
ప్రజలు నన్ను తెలుసుకోవాలని నా కోరిక
    దహనబలులు తీసుకొని వచ్చేందుకు కాదు.
అయితే ఆదాము చేసినట్టు ప్రజలు నా ఒడంబడికను ఉల్లంఘించారు.
    వారి దేశంలో వారు నాకు అపనమ్మకంగా ఉన్నారు.
గిలాదు పాపాలు చేసే ప్రజల పట్టణం.
    ఆ ప్రజలు ఇతరులను ఉపాయం చేసి చంపేశారు.
బందిపోటు దొంగలు దాగుకొని,
    ఎవరిమీదనైనా పడేందుకు వేచిఉంటారు.
అదే విధంగా యాజకులు షెకెము వెళ్లే మార్గంలో పొంచి ఉండి, ఆ మార్గంలో వేళ్లేవారిని వారు చంపుతారు.
    వారు దుర్మార్గపు పనులు చేశారు.
10 ఇశ్రాయేలు రాజ్యంలో ఒక దారుణ విషయం నేను చూశాను.
ఎఫ్రాయిము దేవునికి అపనమ్మకస్తుడు.
    ఇశ్రాయేలు తన పాపంతో అశుద్ధమయింది.
11 యూదా, నీకు కూడా ఒక కోతకాలం ఉంది.
    బానిసత్వంనుండి నా ప్రజలను నేను వెనుకకు తీసుకొని వచ్చునప్పుడు అది సంభవిస్తుంది.”

“ఇశ్రాయేలును నేను స్వస్థపరుస్తాను!
    ఎఫ్రాయిము యొక్క పాపంగూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
సమరయ అబద్ధాలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
    ఆ పట్టణంలో వచ్చి పోయే దొంగలను గూర్చి ప్రజలు తెలుసుకొంటారు.
ఆ ప్రజల నేరాలను నేను జ్ఞాపకం ఉంచుకొంటానని వారు నమ్మరు.
    వారు చేసిన చెడ్డపనులు చుట్టూరా ఉన్నాయి.
    వారి పాపాలను నేను తేటగా చూడగలను.
ఇశ్రాయేలు చేసే చెడ్డపనులు వాళ్ల రాజులను సంతోషపెడ్తాయి.
    వాళ్లు చెప్పే అబద్ధాలు వాళ్ల నాయకులను సంతోషపెడ్తాయి.
రొట్టెలు చేసేవాడు రొట్టె చేసేందుకు పిండి పిసుకుతాడు.
    అతడు రొట్టెను పెనంమీద వేస్తాడు.
రొట్టె పొంగుతున్నప్పుడు
    అతడు మంట ఎక్కువ చేయడు.
కానీ ఇశ్రాయేలు ప్రజలు ఆ రొట్టెలు చేసేవానిలాగ లేరు.
    ఇశ్రాయేలు ప్రజలు వారి మంటను ఎల్లప్పుడూ ఎక్కువ చేస్తున్నారు.
మా రాజు దినాన, వారు మంటను పెంచుతారు. వారు తాగుడు విందులు చేస్తారు.
    ద్రాక్షామద్యపు వేడి మూలంగా పెద్దలు రోగులవుతారు.
    కనుక దేవుణ్ణి ఎగతాళి చేసే ప్రజలతో రాజులు చేతులు కలుపుతారు.
ప్రజలు రహస్య పథకాలు వేస్తారు.
    వారి హృదయాలు పొయ్యివలె ఉద్రేకంతో మండుతాయి.
వారి కోపం రాత్రి అంతా మండుతుంది.
    మర్నాడు ఉదయం అది బహు వేడిగల నిప్పువలె ఉంటుంది.
వాళ్లంతా మండుచున్న పొయ్యిలాంటి వాళ్లు.
    వారు వారి పాలకులను నాశనం చేశారు.
వారి రాజులంతా పతనం అయ్యారు.
    వారిలో ఒక్కడు కూడా సహాయం కోసం నన్ను అడుగలేదు.”

ఇశ్రాయేలు, ఇతర జనాంగాలు

“ఎఫ్రాయిము రాజ్యాలతో కలిసిమెలిసి ఉంటుంది.
    ఎఫ్రాయిము రెండు వైపులా కాలని రొట్టెలా ఉంది.
పరాయివాళ్లు ఎఫ్రాయిము బలాన్ని నాశనం చేస్తారు.
    కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
ఎఫ్రాయిము తలమీద తెల్లవెంట్రుకలు ఉన్నాయి,
    కానీ అది ఎఫ్రాయిముకు తెలియదు.
10 ఎఫ్రాయిము గర్వం అతనికి విరోధంగా మాట్లాడుతుంది.
    ప్రజలకు ఎన్నెన్నో కష్టాలు కలిగాయి.
అయినప్పటికీ వారు తమ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వెళ్లలేదు.
    ప్రజలు సహాయంకోసం ఆయనవైపు చూడలేదు.
11 కనుక ఎఫ్రాయిము తెలివిలేని పావురంలా తయారయ్యాడు.
    ప్రజలు సహాయంకోసం ఈజిప్టును పిలిచారు.
    సహాయంకోసం ప్రజలు అష్షూరు వెళ్లారు.
12 సహాయంకోసం వారు ఆయా దేశాలకు వెళ్తారు.
    కానీ నేను వారిని వలలో పడవేస్తాను.
వారి మీద నేను నా వల విసిరి,
    ఆకాశపక్షుల్లాగ నేను వారిని కిందికి దించుతాను.
    వారి ఒడంబడిక[a] విషయంలో నేను వారిని శిక్షిస్తాను.
13 అది వారికి చెడుగా ఉంటుంది. వారు నన్ను విడిచిపెట్టేశారు.
    నాకు విధేయులగుటకు వారు నిరాకరించారు. కనుక వారు నాశనం చేయబడతారు.
ఆ ప్రజలను నేను రక్షించాను.
    కానీ వారు నాకు విరోధంగా అబద్ధాలు చెబుతారు.
14 అవును, వారు హృదయపూర్వకంగా ఎన్నడూ నాకు మొరపెట్టరు.
    వారు ఇతరుల భూములలో ధాన్యం,
కొత్త ద్రాక్షారసం కోసం తిరిగేటప్పుడు వారి పడకల మీద పడి ఏడుస్తారు. వారి ఆరాధనలో భాగంగా వారిని వారు కోసుకొంటారు.
    కాని వారి హృదయాల్లో వారు నా నుండి తిరిగి పోయారు.
15 నేను వారికి బుద్ధి వచ్చేటట్లు చేసి, వారి చేతులను బలపర్చాను.
    కానీ వారు నాకు విరోధంగా దుష్ట పన్నాగాలు పన్నారు.
16 దేవుళ్లు కానివారివైపు (బయలు దేవత) వారు తిరిగారు.
    వారు అక్కరకు రాని (వంగని) విల్లులా ఉన్నారు.
వారి నాయకులు తమ బలాన్ని గూర్చి అతిశయించారు.
    కానీ వారు కత్తులతో చంపబడతారు.
అప్పుడు ఈజిప్టు ప్రజలు వారిని చూచి నవ్వుతారు.
    విగ్రహారాధన నాశనానికి దారి తీస్తుంది.”

విగ్రహారాధన నాశనానికి నడుపుతుంది

“బూర నీ నోట పెట్టుకొని, హెచ్చరిక చేయి. పక్షిరాజు వ్రాలినట్చు శత్రువు యెహోవా మందిరానికి వస్తాడని ప్రకటించు. ఇశ్రాయేలీయులు నా ఒడంబడికను ఉల్లంఘించారు. వారు నా న్యాయ చట్టానికి విధేయులు కాలేదు. ‘నా దేవా, ఇశ్రాయేలులో ఉన్న మాకు నీవు తెలుసు’ అని వారు అరచి నాకు చెపుతారు. కానీ ఇశ్రాయేలు మంచివాటిని తిరస్కరించింది. అందుచేత శత్రువు అతన్ని తరుముతున్నాడు. ఇశ్రాయేలీయులు తమ రాజులను ఏర్పరచుకొన్నారు. కాని, సలహా కోసం వారు నా దగ్గరకు రాలేదు. ఇశ్రాయేలీయులు నాయకులను ఏర్పరచుకున్నారు. కానీ నేను ఎరిగిన మనుష్యులను వారు ఎన్నుకోలేదు. ఇశ్రాయేలీయులు తమ వెండి, బంగారం ఉపయోగించి వారికోసం విగ్రహాలు చేసుకొన్నారు. కనుక వారు నాశనం చేయబడతారు. షోమ్రోనూ, నీ దూడను (విగ్రహాన్ని) యెహోవా నిరాకరించాడు. ఇశ్రాయేలీయుల మీద నేను చాలా కోపంగా ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలు వారి పాపం విషయంలో శిక్షించబడతారు. ఆ విగ్రహాలను ఒక పనివాడు చేశాడు. అవి దేవుళ్లు కావు. సమరయ దూడ ముక్కలుగా విరుగగొట్టబడుతుంది. ఇశ్రాయేలీయులు ఒక మూర్ఖమైన పని చేశారు అది గాలిని నాటుటకు ప్రయత్నించినట్టు ఉంది. కాని వారికి కష్టాలు మాత్రమే కలుగుతాయి. వారు సుడిగాలిని పంటగా కోస్తారు. పొలంలో ధాన్యం పండుతుంది. కానీ అది ఆహారాన్ని ఇవ్వదు. ఒకవేళ దానిలో ఏమైనా పండినా పరాయివాళ్లు దాన్ని తినేస్తారు.

“ఇశ్రాయేలు మింగివేయబడింది (నాశనం చేయబడింది).
    ఇశ్రాయేలు ఎవరికీ పనికిరాని ఒక పనిముట్టులాగ తయారయ్యింది.
    ఇశ్రాయేలు విసిరి వేయబడింది. వారు యితర రాజ్యాలలో చెదరగొట్టబడ్డారు.
ఎఫ్రాయిము తన విటుల దగ్గరకు వెళ్లాడు.
    అడవి గాడిదలా అతడు తిరుగుతూ అష్షూరు వెళ్లాడు.
10 ఆయా రాజ్యాలలోని తన విటుల దగ్గరకు ఇశ్రాయేలు వెళ్లింది.
    కానీ ఇప్పుడు నేను ఇశ్రాయేలీయులను సమకూరుస్తాను.
ఆ మహాశక్తిగల రాజు వారి మీద భారాన్ని వేస్తాడు.
    మరియు వాళ్లు ఆ భారంవల్ల కొద్దిగా బాధపడాలి.

ఇశ్రాయేలు దేవున్ని మరచి విగ్రహాలను పూజించుట

11 “ఎఫ్రాయిము ఎన్నెన్నో బలిపీఠాలు కట్టింది.
    అవి అతను పాపాలు చేయడానికి ఆధారమయ్యాయి
12 ఎఫ్రాయిము కోసం నేను నా న్యాయచట్టాలు సంపూర్ణంగా వ్రాసినా
    అవి ఎవరో పరాయి వాడికోసం అన్నట్టు అతడు వాటిని గూర్చి అనుకొంటాడు.
13 బలులు అంటే ఇశ్రాయేలీయులకు ఇష్టం.
    వారు మాంసం అర్పించి, దాన్ని తినేస్తారు.
యెహోవా వారి బలులు స్వీకరించడు.
    ఆయనకు వారి పాపాలు జ్ఞాపకమే.
ఆయన వారిని శిక్షిస్తాడు.
    వారు ఈజిప్టుకు బందీలుగా కొనిపోబడతారు.
14 ఇశ్రాయేలీయులు నివాసాలు నిర్మించారు.
    కానీ వారు తమను చేసిన సృష్టికర్తను మరచిపోయారు. ఇప్పుడు యూదా కోటలు కట్టింది.
కానీ యూదా పట్టణాల మీదికి నేను అగ్నిని పంపిస్తాను.
    ఆ అగ్ని దాని రాజభవనాలను నాశనం చేస్తుంది.”

ప్రకటన 2

ఎఫెసులోని సంఘానికి

“ఎఫెసులోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“ఏడు నక్షత్రాలను తన కుడి చేతిలో పట్టుకొని, ఏడు బంగారు దీపస్తంభాల మధ్య నడిచేవాడు ఈ విధంగా అంటున్నాడు.

“నీవు చేసిన పనులు నాకు తెలుసు. నీవు పట్టుదలతో శ్రమించి పని చేసావు. నీవు దుష్టుల్ని సహించలేవని నాకు తెలుసు. అపొస్తలులమని చెప్పుకొంటున్నవాళ్ళను నీవు పరీక్షించి వాళ్ళు మోసగాళ్ళని తెలుసుకొన్నావు. నీవు పట్టుదలతో అలసిపోకుండా నా పేరిట కష్టాలు ఓర్చుకొన్నావు.

“కాని నీ తొలి ప్రేమను నీవు పూర్తిగా మరిచిపోయావు. ఇది నాకు యిష్టము లేదు. నీవు ఎంత దిగజారిపోయావో జ్ఞాపకం తెచ్చుకో. మారుమనస్సు పొందు. మొదట చేసిన విధంగా చేయి. నీవు మారుమనస్సు పొందకపోతే, నేను వచ్చి నీ దీపాన్ని దాని స్థలం నుండి తీసివేస్తాను. నీకొలాయితులు[a] చేసే పనులు నీకు యిష్టం లేదు. నాకు కూడా యిష్టం లేదు. ఆ విషయంలో మనం ఏకీభవిస్తున్నాము.

“ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. గెలుపు సాధించినవానికి పరదైసులో ఉన్న జీవవృక్షం యొక్క ఫలం తినే అధికారం యిస్తాను.

స్ముర్నలోని సంఘానికి

“స్ముర్నలోని క్రీస్తు సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“ఆదియు, అంతము అయిన వాడు, చనిపోయి తిరిగి బ్రతికి వచ్చినవాడు ఈ విధంగా చెబుతున్నాడు:

“మీ దుఃఖాలను గురించి, మీ దారిద్ర్యాన్ని గురించి నాకు తెలుసు. అయినా మీరు భాగ్యవంతులు. మిమ్మల్ని గురించి కొందరు చెడుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు తాము యూదులమని చెప్పుకొంటారు గాని నిజానికి వాళ్ళు యూదులు కారు. వాళ్ళు సాతాను సమాజానికి చెందినవాళ్ళు. 10 మీరు అనుభవించబోయే శ్రమలను గురించి భయపడకండి. సాతాను మీలో కొందరిని చెరసాలలో వేస్తాడు. మీరు పది రోజులు హింసను అనుభవిస్తారు. ఇది మీకొక పరీక్ష. మరణానికి కూడా భయపడకుండా విశ్వాసంతో ఉండండి. నేను మీకు జీవ కిరీటాన్ని యిస్తాను.

11 “ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి. వీటిని జయించిన వాడు రెండవ మరణాన్నుండి తప్పించుకొంటాడు.

పెర్గములోని సంఘానికి

12 “పెర్గములోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“రెండు వైపులా పదునైన కత్తిగలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.

13 “సాతాను సింహాసనం ఎక్కడ ఉందో అక్కడే నీవు నివసిస్తున్నావని నాకు తెలుసు. అయినా నీకు నా పేరంటే విశ్వాసం ఉంది. విశ్వాసంతో నా విషయంలో అంతిప తన భక్తిని వ్యక్తపరిచిన కాలంలో కూడా నా పట్ల నీకున్న విశ్వాసాన్ని నీవు వదులుకోలేదు. సాతాను నివసించే పట్టణంలో అంతిప చంపబడ్డాడు.

14 “కాని కొన్ని విషయాల్లో నాకు నీవు నచ్చలేదు. బిలాము బోధలు[b] పఠించేవాళ్ళు కొందరు నీ సంఘంలో ఉన్నారు. ఈ బిలాము, ఇశ్రాయేలీయులను రేకెత్తించి వాళ్ళతో పాపపు పనులు చేయించమని బాలాకుకు బోధించాడు. బాలాకు వాళ్ళు విగ్రహాలకు[c] ఆరగింపు పెట్టిన ఆహారం తినేటట్లు అవినీతిగా బ్రతికేటట్లు చేసాడు. 15 నీకొలాయితులను అనుసరించేవాళ్ళు కూడా నీ దగ్గరున్నారు. 16 మారుమనస్సు పొందండి. అలా చేయకపోతే నేను త్వరలోనే మీ దగ్గరకు వచ్చి, నా నోటి నుండి బయలు వెడలు కత్తితో యుద్ధం చేస్తాను.

17 “ఆత్మ క్రీస్తు సంఘాలకు చెప్పిన వాటిని ప్రతివాడు వినాలి.

“విజయం సాధించిన వానికి నేను దాచి ఉంచిన ‘మన్నా’ను[d] తినుటకు యిస్తాను. ఒక తెల్ల రాయి మీద ఒక క్రొత్త పేరు వ్రాసి దాన్ని కూడా అతనికి యిస్తాను. నేను ఆ రాయి ఎవరికి యిస్తానో అతనికి మాత్రమే ఆ పేరు తెలుస్తుంది.

తుయతైరలోని సంఘానికి

18 “తుయతైరలోని సంఘానికి చెందిన దూతకు ఈ విధంగా వ్రాయి:

“అగ్ని జ్వాలల్లా మండుతున్న కళ్ళు కలవాడు, కొలిమిలో కాల్చి మెరుగు పెట్టబడిన యిత్తడిలా పాదాలు కలవాడు ఈ విధంగా చెబుతున్నాడు.

19 “నీవు చేస్తున్న పనులు, నీ ప్రేమ, విశ్వాసము, సేవ, పట్టుదల నాకు తెలుసు. నీవు మొదట చేసినదానికన్నా, యిప్పుడు ఎక్కువ చేస్తున్నావని నాకు తెలుసు. 20 తానొక ప్రవక్తనని చెప్పుకొంటున్న యెజెబెలు చేస్తున్న పనుల్ని నీవు సహిస్తున్నావు. ఇది నాకు యిష్టం లేదు. ఆ స్త్రీ తన బోధలతో నా సేవకులను తప్పు దారి పట్టిస్తోంది. దాని కారణంగా వాళ్ళు నీతి లేని కామ కృత్యాలు చేస్తున్నారు. విగ్రహాలకు ఆరగింపు పెట్టిన ఆహారం తింటున్నారు.[e] 21 అది చేసిన అవినీతికి మారుమనస్సు పొందమని నేను దానికి కొంత గడువునిచ్చాను. కాని అది దానికి అంగీకరించలేదు.

22 “అందువల్ల దానికి కష్టాలు కలిగిస్తాను. అవినీతిగా దానితో కామకృత్యాలు చేసినవాళ్ళు తమ పాపానికి మారుమనస్సు పొందకపోతే, వాళ్ళను తీవ్రంగా శిక్షిస్తాను. 23 దాని బిడ్డల్ని చంపివేస్తాను. అప్పుడు హృదయాల్ని, బుద్ధుల్ని శోధించేవాణ్ణి నేనేనని అన్ని సంఘాలు తెలుసుకొంటాయి. చేసిన కార్యాలను బట్టి ప్రతి ఒక్కరికి ప్రతిఫలం యిస్తాను.

24 “తుయతైరలో ఉన్న మిగతా ప్రజలకు, అంటే, దాని బోధల్ని ఆచరించని వాళ్ళకు, మరియు సాతాను రహస్యాలను అభ్యసించని వాళ్ళకు నేను చెప్పేదేమిటంటే, నేను మీ మీద మరే భారము వెయ్యను. 25 నేను వచ్చేదాకా మీరు అనుసరిస్తున్న వాటినే అనుసరిస్తూ ఉండండి.

26 “విజయాన్ని సాధించి నా ఇచ్ఛానుసారం చివరిదాకా ఉన్నవానికి నేను జనములపై అధికారం యిస్తాను. 27 అతడు వాళ్ళను కఠిన శాసనాలతో పాలిస్తాడు. వాళ్ళను కుండల్ని పగులకొట్టినట్లు పగులగొడ్తాడు.[f]

28 “ఈ అధికారం నేను నా తండ్రినుండి పొందాను. అదే విధంగా వాళ్ళు నా నుండి అధికారం పొందుతారు. నేను అతనికి వేకువచుక్కను కూడా యిస్తాను. 29 ఆత్మ సంఘాలకు చెబుతున్న వాటిని ప్రతివాడు వినాలి.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International