Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెకర్యా 9-12

ఇతర దేశాలకు వ్యతిరేకంగా తీర్పు

ఒక విషాద వర్తమానం. ఇది హద్రాకుయొక్క దేశాన్ని గురించి, అతని రాజధాని నగరమైన దమస్కును గురించిన యెహోవా వర్తమానం. దేవుడిని తెలుసుకున్న వారు కేవలం ఇశ్రాయేలు వంశాల వారు మాత్రమే కాదు. ప్రతి ఒక్కడూ సహాయంకొరకు ఆయనను ఆశ్రయించవచ్చు. హద్రాకుయొక్క దేశ సరిహద్దుల్లో హమాతు ఉంది. అలాగే తూరు, సీదోనులు కూడా ఉన్నాయి. (ఆ ప్రజలు చాలా తెలివిగల వారు). తూరు ఒక కోటలా కట్టబడింది. ఆ ప్రజలు వెండిని దుమ్మువలె విస్తారంగా సేకరించారు. బంగారం వారికి బంకమట్టివలె సామాన్యమై పోయింది. కాని మా ప్రభువైన యెహోవా దానినంతా తీసుకుంటాడు. ఆ నగరపు శక్తివంతమైన నౌకాబలాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నగరం అగ్నివల్ల నాశనం కాబడుతుంది!

“అష్కెలోను ప్రజలు వాటిని చూసి భయపడతారు. గాజా ప్రజలు భయంతో వణకుతారు. ఇవన్నీ జరగటం చూచినప్పుడు ఎక్రోను ప్రజలకు ఆశలుడుగుతాయి. గాజాలో రాజంటూ ఎవ్వడూ మిగలడు. అష్కెలోనులో ఇక ఎంతమాత్రం ఎవ్వరూ నివసించరు. అష్డోదులో ప్రజలు వారి నిజమైన తండ్రులు ఎవరో కూడ తెలుసుకోలేరు. గర్విష్ఠులైన ఫిలిష్తీయులను సర్వనాశనం చేస్తాను. రక్తం కలిసివున్న మాంసాన్నిగాని, నిషేధించబడిన ఏ ఇతర ఆహార పదార్థాన్నిగాని వారిక తినరు. జీవించివున్న ఫిలిష్తీయుడెవడైనా వుంటే, అతడు నా ప్రజల్లో భాగంగా ఉంటాడు. యూదాలో వారు మరొక వంశంగా ఉంటారు. యెబూసీయులవలె ఎక్రోను ప్రజలు నా ప్రజల్లో ఒక భాగమవుతారు. నేను నా దేశాన్ని రక్షిస్తాను. శత్తుసైన్యాలను దానిగుండా వెళ్లనీయను. ఇక ఎంత మాత్రం వారిని నా ప్రజలను బాధించనీయను. గతంలో నా ప్రజలు ఎంత బాధపడ్డారో నేను స్వయంగా చూశాను.”

రాబోయే రాజు

సీయోనూ, నీవు సంతోషంగా వుండు!
    యెరూషలేము ప్రజలారా, ఆనందంతో కేకలు పెట్టండి!
చూడండి, మీరాజు మీ వద్దకు వస్తున్నాడు!
    ఆయన విజయం సాధించిన మంచి రాజు.
    కాని ఆయన వినయం గలవాడు. ఆయన ఒక గాడిదపై స్వారీ చేస్తున్నాడు. ఒక గాడిద పిల్లపై వస్తున్నాడు.
10 రాజు చెపుతున్నాడు, “నేను ఎఫ్రాయిములో రథాలనూ,
    యెరూషలేములో గుర్రవు రౌతులను నాశనం చేశాను.
    యుద్ధంలో వాడిన విల్లంబులను నాశనం చేశాను.”

శాంతిని గూర్చిన వార్తను అన్య దేశాలు విన్నాయి.
    ఆ రాజు సముద్రంనుండి సముద్రంవరకు పరిపాలిస్తాడు.
    ఆయన నదినుండి భూమిపై సుదూర ప్రాంతాలవరకు పాలిస్తాడు.

యెహోవా తన ప్రజలను రక్షించటం

11 యెరూషలేమూ, మన ఒడంబడిక రక్తంతో స్థిరపర్చబడింది.
    కావున నీ బందీలను నేను విడుదల చేశాను. నీ ప్రజలు ఇక ఎంతమాత్రం ఆ ఖాళీ చెరసాలలో ఉండరు.
12 చెరపట్టబడిన ప్రజలారా, ఇంటికి వెళ్ళండి.
    మీకు ఇంకా ఆశపడదగింది ఉంది.
నేను మీవద్దకు తిరిగి వస్తున్నానని
    నేను మీకు చెపుతున్నాను!
13 యూదా, నిన్ను నేను ఒక విల్లులా వినియోగిస్తాను.
    ఎఫ్రాయిమూ, నిన్ను నేను బాణాల్లా వినియోగిస్తాను.
ఇశ్రాయేలూ, గ్రీసుతో యుద్ధం చేయటానికి
    నిన్ను ఒక బలమైన కత్తిలా ఉపయోగిస్తాను.
14 యెహోవా వారికి కన్పిస్తాడు.
    ఆయన తన బాణాలను మెరుపుల్లా వదులుతాడు.
నా ప్రభువైన యెహోవా బాకా ఊదుతాడు.
    అప్పుడు సైన్యం ఎడారిలో ఇసుక తుఫానులా ముందుకు చొచ్చుకు పోతుంది.
15 సర్వశక్తిమంతుడైన యెహోవా వారిని రక్షిస్తాడు.
    శత్రువును ఓడించటానికి సైనికులు బండరాళ్లను, వడిసెలలను ఉపయోగిస్తారు.
వారి శత్రువుల రక్తాన్ని వారు చిందిస్తారు.
    అది ద్రాక్షా మద్యంలా పారుతుంది.
    అది బలిపీఠం మూలలపై పోసిన రక్తంలా వుంటుంది!
16 ఒక కాపరి తన గొర్రెలను కాపాడినట్టు,
    దేవుడైన యెహోవా తన ప్రజలను ఆ సమయంలో కాపాడతాడు.
వారాయనకు చాలా విలువైనవారు.
    తన భూమిపై వారు మెరిసే రత్నాల వంటివారు.
17 ప్రతీదీ మెచ్చదగినదై, అందంగా ఉంటుంది!
    విచిత్రమైన పంట పండుతుంది.
కాని అది కేవలం ధాన్యం, ద్రాక్షారసం కాదు.
    ఆ పంట యువతీ యువకులే!

యెహోవా వాగ్దానాలు

10 వసంత ఋతువులో వర్షం కొరకు యెహోవాను ప్రార్థించండి. యెహోవా మెరుపులను కలుగజేస్తాడు. వర్షం కురుస్తుంది. ప్రతివాని పొలంలోనూ దేవుడు పైరులు పెరిగేలా చేస్తాడు.

భవిష్యత్తులో ఏమి జరుగుతుందో తెలుసుకోవటానికి ప్రజలు తమ చిన్న విగ్రహాలను, మంత్రతంత్రాలను ఉపయోగిస్తారు. కాని అది నిరుపయోగం. ఆ జనులు దర్శనాలు చూసి, తమ కలలను వివరిస్తారు. కాని అవన్నీ పనికిరాని అబద్ధాలు. అందువల్ల ప్రజలు సహాయంకొరకు గొర్రెల్లా అరుస్తూ ఇక్కడా, అక్కడా తిరుగుతారు. కాని వారిని నడిపించటానికి కాపరిలేడు.

యెహోవా చెపుతున్నాడు: “కాపరుల (నాయకుల) పట్ల నేను చాలా కోపంగా వున్నాను. నా గొర్రెలకు (ప్రజలకు) జరిగిన దానికి నేను ఆ నాయకులను బాధ్యులనుగా చేశాను.” (యూదా ప్రజలు దేవుని యొక్క గొర్రెల మంద. సర్వశక్తిమంతుడైన యెహోవా తన మంద విషయంలో జాగ్రత్త తీసుకుంటాడు. ఒక సైనికుడు తన అందమైన యుద్ధగుర్రం విషయంలో శ్రద్ధ చూపినట్టు, ఆయన వారి పట్ల జాగ్రత్త తీసుకుంటాడు.)

“పునాదిరాయి, గుడారపు గుంజ, యుద్ధ విల్లు, ముందుకు చొచ్చుకువచ్చే సైన్యం అన్నీ యూదానుండి కలిసి వస్తాయి. వారు తమ శత్రువును ఓడిస్తారు. అది సైనికులు బురద వీధులగుండా నడిచినట్లు ఉంటుంది. వారు పోరాడతారు. యెహోవా వారితోవున్న కారణంగా వారు శత్రువుకు చెందిన గుర్రపు దళాలను కూడ ఓడిస్తారు. యూదా వంశాన్ని నేను బలపర్చుతాను. యోసేపు వంశాన్ని యుద్ధంలో గెలిచేలా చేస్తాను. వారిని సురక్షితంగా, ఆరోగ్యంగా తిరిగి తీసుకు వస్తాను. వారిని ఓదార్చుతాను. అది నేను వారిని ఎప్పుడూ విడిచి పెట్టనట్లుగా ఉంటుంది. నేను వారి దేవుడనైన యెహోవాను. నేను వారికి సహాయం చేస్తాను. ఎఫ్రాయిము ప్రజలు తాగటానికి పుష్కలంగా దొరికిన సైనికులవలె సంతోషంగా ఉంటారు. వారి పిల్లలు ఉల్లాసంగా ఉంటారు. వారు కూడ హాయిగా ఉంటారు. వారంతా యెహోవాతో కలిసి ఉండే ఆనందమయ సమయాన్ని కలిగి ఉంటారు.

“నేను వారికొరకు ఈల వేసి, వారందరినీ ఒక్కచోటికి పిలుస్తాను. నేను వారిని నిజంగా రక్షిస్తాను. వారి సంఖ్య విస్తారంగా ఉంటుంది. అవును, నా ప్రజలను అనేక దేశాలకు చెదరగొడుతూ వచ్చాను. కాని ఆ దూర దేశాలలో వారు నన్ను జ్ఞాపకం చేసుకుంటారు. వారు, వారి పిల్లలు బతుకుతారు. పైగా వారు తిరిగి వస్తారు. 10 నేను వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుంచి, అష్షూరు నుంచి వెనుకకు తీసుకు వస్తాను. వారిని గిలాదు ప్రాంతానికి తిరిగి తీసుకువస్తాను. అక్కడ వారికి సరిపోయే స్థలం వుండదు గనుక, వారిని దగ్గరలోనేవున్న లెబానోనులో నివసించనిస్తాను.” 11 దేవుడు వారిని ఈజిప్టు (ఐగుప్తు) నుండి బయటకు తీసికొని వచ్చినప్పుడు ఉన్నట్లుగా ఇప్పుడు పరిస్థితి ఉంటుంది. ఆయన సముద్రపు అలలను కొట్టగా, సముద్రం రెండు పాయలు అయ్యింది. ప్రజలు ఆ కష్టాల సముద్రం మధ్యనుండి నడిచి వచ్చారు. యెహోవా నదీ ప్రవాహాలను ఇంకిపోయేలా చేస్తాడు. అష్షూరు గర్వాన్ని, ఈజిప్టు (ఐగుప్తు) అధికారాన్ని ఆయన నాశనం చేస్తాడు. 12 యెహోవా తన ప్రజలు బలపడేలా చేస్తాడు. వారు ఆయన ధ్యానంలో, ఆయన నామస్మరణ చేస్తూ జీవిస్తారు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

ఇతర రాజ్యాల్ని దేవుడు శిక్షించటం

11 లెబానోనూ, అగ్ని ప్రవేశించి నీ దేవదారు వృక్షాలను[a]
    కాల్చివేసేలాగు నీ ద్వారాలను తెరువు.
దేవదారు వృక్షాలు పడిపోయినందుకు సరళ వృక్షాలు విచారిస్తాయి.
    బలమైన ఆ చెట్లు దూరంగా తీసుకుపోబడ్డాయి.
బాషానులోని సింధూర వృక్షాలు
    నరికి వేయబడిన అడవికొరకు దుఃఖిస్తాయి.
విలపించే కాపరుల రోదనను వినండి.
    శక్తివంతులైన వారి నాయకులు పట్టుబడ్డారు.
యువకిశోరాల గర్జన వినండి.
    యొర్దాను నదివద్దగల వాటి చిక్కటి పొదలన్నీ తీసుకుపోబడ్డాయి.

దేవుడైన యెహోవా చెపుతున్నాడు, “చంపటానికి పెంచబడ్డ గొర్రెల విషయం జాగ్రత్త తీసుకో. వాటి నాయకులు యజమానులవలెను, వ్యాపారులవలెను ఉన్నారు. యజమానులు వారి గొర్రెలను చంపుతారు. అయినా వారు శిక్షింపబడరు. వ్యాపారులు గొర్రెలను అమ్మి, ‘దేవునికి జయం, నేను భాగ్యవంతుడనయ్యాను’ అని అంటారు. కాపరులు తమ గొర్రెల కొరకు విచారించరు. ఈ దేశంలో నివసించే ప్రజల కొరకు నేను విచారించను.” యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను ప్రతివాడినీ తన పొరుగువానిచేత, రాజుచేత దూషింపబడేటట్లు చేస్తాను. వారి దేశాన్ని నాశనం చేసేలాగు నేను వారిని వదులుతాను. నేను వారిని ఆపను!”

కావున చంపబడటానికి పెంచబడిన ఆ అభాగ్యపు గొర్రెలపట్ల నేను శ్రద్ధ తీసుకున్నాను. నాకు రెండు కర్రలు దొరికాయి. ఒక కర్రను “అభిమానం” అని, మరొక కర్రను “సమైక్యత” అని పిలిచాను. తరువాత నేను గొర్రెలపట్ల శ్రద్ధ తీసుకోవటం మొదలు పెట్టాను. ముగ్గురు కాపరులను ఒక్క నెలలో సంహరించాను. నేను గొర్రెలపట్ల కోపించగా, వారు నన్ను ద్వేషించటం మొదలు పెట్టారు. అప్పుడు నేను ఇలా అన్నాను: “నేను వదిలి వేస్తాను! నేను మిమ్మల్ని గురించి శ్రద్ధ తీసుకోను! చావు కోరేవారిని నేను చనిపోనిస్తాను. నాశనమైపోవాలని కోరుకొనేవారిని నేను నాశనం కానిస్తాను. ఇంకా మిగిలినవారు ఒకరినొకరు నాశనం చేసుకుంటారు.” 10 తరువాత “అభిమానం” అనే కర్రను నేను తీసుకొని విరుగగొట్టాను. తన ప్రజలతోగల దేవుని ఒడంబడిక రద్దయినట్లు చూపటానికే నేనిది చేశాను. 11 కావున ఆ రోజున నిబంధన రద్దయింది. నన్ను గమనిస్తున్న ఆ నిర్భాగ్యపు గొర్రెలకు ఈ వర్తమానం యెహోవానుండి వచ్చినదని తెలుసు.

12 అప్పుడు నేనిలా అన్నాను: “మీరు నాకు వేతనం ఇవ్వదలిస్తే ఇవ్వండి. వద్దనుకుంటే మానండి!” వారప్పుడు ముప్పై వెండి నాణెములిచ్చారు. 13 తరువాత యెహోవా నాతో ఇలా అన్నాడు: “అంటే నా విలువ అంత మాత్రమేనని వారనుకుంటున్నారన్నమాట. ఆ మహాధనాన్ని[b] ఆలయ ఖజానాలో పడవేయి.” కావున ఆ ముప్పై వెండి నాణాలను తీసుకొని యెహోవా ఆలయంలోని ఖజానాలో పడవేశాను. 14 పిమ్మట “సమైక్యత” అనే కర్రను తీసుకొని రెండుగా నరికాను. యూదా, ఇశ్రాయేలుల మధ్యగల ఐక్యతకు భంగం వాటిల్లిందని చూపటానికి నేనిది చేశాను.

15 పిమ్మట యెహోవా నాతో ఇలా చెప్పాడు: “ఇప్పుడు గొర్రెలను కాయటానికి అసలు పనికిరాని ఒక కర్రను చూడు. 16 ఈ దేశానికి ఒక కొత్త కాపరిని నేను తెస్తానని ఇది చూపుతుంది. కాని ఈ యువకుడు నాశనం కాబడుతున్న గొర్రెలపట్ల జాగ్రత్త తీసుకోలేడు. గాయపడిన గొర్రెలను అతడు బాగు చేయలేడు. బతికివున్న వాటికి అతడు గ్రాసం[c] ఇవ్వలేడు. ఆరోగ్యంగా ఉన్నవి పూర్తిగా తినబడతాయి. కేవలం వాటి గిట్టలు మాత్రం వదిలివేయబడతాయి.”

17 పనికిమాలిన ఓ నా కాపరీ,
    నీవు నా గొర్రెలను వదిలివేశావు.
అతనిని శిక్షించు!
    అతని కుడి చేతిని, కుడి కంటిని కత్తితో కొట్టు.
    అతని కుడిచేయి నిరుపయోగమవుతుంది.
    అతని కుడి కన్ను గ్రుడ్డిదవుతుంది.

యూదా చుట్టునున్న దేశాల గూర్చిన దర్శనాలు

12 ఇశ్రాయేలును గురించి యెహోవానుండి వచ్చిన విషాద వార్త. యెహోవా ఆకాశాన్ని, భూమిని సృష్టించాడు. ఆయన మానవుని ఆత్మను అతనిలో పొందుపర్చాడు. యెహోవా ఈ విషయాలు చెప్పాడు: “చూడండి, నేను యెరూషలేమును దాని చుట్టూ ఉన్న దేశాలకు ఒక విషపు గిన్నెలా చేస్తాను. దేశాలు వచ్చి, ఆ నగరంపై దాడి చేస్తాయి. యూదా అంతా బోనులో చిక్కుతుంది. కాని నేను యెరూషలేమును ఒక బరువైన బండలా చేస్తాను. దానిని తీసుకోడానికి ఎవరైనా ప్రయత్నిస్తే అది అతనినే గాయపర్చుతుంది. ఆ ప్రజలు నిజంగా నరకబడతారు, గీకబడతారు. కాని భూమిపైగల దేశాలన్నీ కలిసి యెరూషలేము మీద యుద్ధానికి వస్తాయి. కాని ఆ సమయంలో నేను గుర్రాన్ని బెదర గొడతాను. దాని మీద స్వారీ చేసే సైనికునికి భయం పుట్టిస్తాను. శత్రు గుర్రాలన్నీ గుడ్డివై పోయేలా చేస్తాను. కాని నా కండ్లు తెరవబడి ఉంటాయి. నేను యూదా వంశాన్ని కనిపెడుతూ ఉంటాను. యూదా వంశ నాయకులు ప్రజలను ప్రోత్సహిస్తారు. వారు, ‘సర్వశక్తిమంతుడైన యెహోవా మీ దేవుడు, ఆయన మనల్ని బలవంతులుగా చేస్తాడు’ అని అంటారు. ఆ సమయంలో యూదా నాయకులను అరణ్యంలో చెలరేగిన అగ్నిలా నేను చేస్తాను. అగ్ని ఎండు గడ్డిని దగ్ధం చేసినట్లు, వారు తమ శత్రువులను నాశనం చేస్తారు. చుట్టూవున్న వారి శత్రువులను వారు నాశనం చేస్తారు. యెరూషలేము ప్రజలు మళ్లీ తీరికగా కూర్చుని విశ్రాంతి తీసుకుంటారు.”

యెరూషలేము ప్రజలు మిక్కిలి గొప్పలు చెప్పుకోకుండా చేయటానికి, యెహోవా యూదా ప్రజలను ముందుగా రక్షిస్తాడు. యూదాలో వున్న ప్రజలకంటె తాము గొప్పవారమని దావీదు వంశంవారు, యెరూషలేములో వుంటున్న ఇతర ప్రజలు గొప్పలు చెప్పుకోలేరు. కాని యెరూషలేము ప్రజలను యెహోవా రక్షిస్తాడు. ఏమీ చేతగానివాడు సహితం దావీదులా గొప్ప సైనికుడవుతాడు. దావీదు వంశంలోని మనుష్యులు దేవుళ్లవలె వుంటారు. ప్రజలను నడిపించే యెహోవా దూతలా వుంటారు.

యెహోవా చెపుతున్నాడు: “ఆ సమయంలో యెరూషలేముపై యుద్ధానికి వచ్చిన దేశాలను నేను నాశనం చేస్తాను. 10 దావీదు వంశాన్ని, యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను దయాదాక్షిణ్య స్వభావంతో నింపివేస్తాను. వారు నన్ను పొడిచారు. అలాంటి నా సహాయం కొరకే వారు ఎదురు చూస్తారు. వారు చాలా విచారిస్తారు. తన ఏకైక కుమారుడు చనిపోయినవాడు విలపించేలా, తన మొదటి కుమారుడు చని పోయినవాడు విలపించేలా వారు దుఃఖిస్తారు. 11 యెరూషలేములో గొప్ప దుఃఖ సమయం ఉంటుంది. అది మెగిద్దోను లోయలో హదద్రిమ్మోను మరణంపట్ల ప్రజల దుఃఖంలా వుంటుంది. 12 ప్రతి ఒక్క కుటుంబం విడిగా దుఃఖిస్తుంది. దావీదు కుటుంబంలోని పురుషులు విడిగా దుఃఖిస్తారు. వారి భార్యలు విడిగా వారికి వారే దుఃఖిస్తారు. నాతాను కుటుంబంలోని పురుషులు ప్రత్యేకంగా విలపిస్తారు. వారి భార్యలు విడిగా దుఃఖిస్తారు. 13 లేవి కుటుంబంలోని పురుషులు విడిగా విచారిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. షిమ్యోను (షిమీ) కుటుంబంలోని పురుషులు విడిగా విలపిస్తారు. వారి భార్యలు ప్రత్యేకంగా విలపిస్తారు. 14 ఇదే మాదిరి అన్ని వంశాలలోనూ జరుగుతుంది. పురుషులు, స్త్రీలు విడి విడిగా దుఃఖిస్తారు.”

ప్రకటన 20

వెయ్యి సంవత్సరాలు

20 పరలోకంలో నుండి ఒక దూత దిగి రావటం చూసాను. అతని దగ్గర పాతాళలోకపు తాళం చెవి ఉంది. అతని చేతిలో ఒక పెద్ద గొలుసు ఉంది. అతడు ఘటసర్పాన్ని పట్టుకొని వెయ్యి ఏండ్లదాకా బంధించి వేసాడు. దీన్ని ఆది సర్పమని, దయ్యమని, సాతానని అంటారు. అతడు దాన్ని పాతాళలోకంలో పడవేసి, తాళం వేసి, దాని మీద ముద్ర వేసాడు. వెయ్యి ఏండ్లు ముగిసేదాకా, అది దేశాలను మళ్ళీ మోసం చెయ్యకుండా ఉండాలని ఈ విధంగా చేసాడు. ఆ తర్వాత కొద్ది సమయం దానికి విడుదల ఇవ్వబడుతుంది.

నేను సింహాసనాలు చూసాను. తీర్పు చెప్పటానికి అధికారం పొందినవారు ఆ సింహాసనాలపై కూర్చొని ఉన్నారు. యేసు చెప్పిన సందేశాన్ని నమ్మకంగా బోధించినందుకు దేవుని సందేశాన్ని ప్రకటించినందుకు తలలు కొట్టివేయబడినవాళ్ళ ఆత్మల్ని చూసాను. వీళ్ళు మృగాన్నిగాని, దాని విగ్రహాన్ని గాని ఆరాధించ లేదు. వాళ్ళు దాని ముద్రను వాళ్ళ నొసళ్ళ మీదగాని, చేతుల మీదగాని వేయించుకోలేదు. వాళ్ళు మళ్ళీ బ్రతికి క్రీస్తుతో పాటు వెయ్యి ఏండ్లు పాలించారు. మిగతా చనిపోయినవాళ్ళు వెయ్యి ఏండ్లు పూర్తి అయ్యేదాకా బ్రతికి రాలేదు.

ఈ విధంగా చనిపోయి బ్రతికి రావటం యిది మొదటిసారి. మొదటిసారి బ్రతికి వచ్చినవాళ్ళ గుంపుకు చెందినవాళ్ళు ధన్యులు, పరిశుద్ధమైనవాళ్ళు. ఇక రెండవ మరణానికి[a] వాళ్ళపై అధికారము ఉండదు. వాళ్ళు దేవునికి, క్రీస్తుకు యాజకులుగా ఉండి క్రీస్తుతో సహా వెయ్యి ఏండ్లు రాజ్యం చేస్తారు.

సాతాను అపజయం పొందటం

వెయ్యి ఏండ్లు గడిచాక సాతాను కారాగారం నుండి విడుదల చేయబడతాడు. వాడు బయటకు వచ్చి దేశాలను మోసం చేస్తాడు. వాడు ప్రపంచం నలుమూలలకు, అంటే గోగు, మాగోగులకు వెళ్ళి యుద్ధం చేయటానికి ప్రజల్ని సమకూరుస్తాడు. సముద్ర తీరాన ఉన్న ఇసుక రేణువుల సంఖ్యతో సమానంగా వాళ్ళ సంఖ్య ఉంటుంది.

వాళ్ళు భూమి నలుమూలలకు వెళ్ళి భక్తుల శిబిరాలను ఆక్రమించారు. దేవుడు ప్రేమించే పట్టణాన్ని చుట్టుముట్టారు. కాని పరలోకంలో నుండి అగ్ని కురిసి వాళ్ళను నాశనం చేసింది. 10 ఇక వాళ్ళను మోసం చేసిన సాతాను మండుతున్న గంధకపు గుండంలో పారవేయబడ్డాడు. దానిలో క్రూర మృగం, దొంగ ప్రవక్త యింతకు ముందే పడవేయబడ్డారు. గుండంలోనే వాళ్ళు రాత్రింబగళ్ళు నిరంతరం హింసింపబడతారు.

చనిపోయినవాళ్ళపై తీర్పు

11 తర్వాత నాకు ఒక పెద్ద సింహాసనము కనిపించింది. అది తెల్లగా ఉంది. దానిపై కూర్చొన్నవాణ్ణి చూసాను. భూమి, ఆకాశం ఆయన నుండి పారిపొయ్యాయి. వాటికి స్థలం దొరకలేదు. అవి అదృశ్యమయ్యాయి. 12 నేను చనిపోయినవాళ్ళను చూసాను. అందులో గొప్పవాళ్ళు, కొద్దివాళ్ళు ఉన్నారు. వాళ్ళు సింహాసనం ముందు నిలబడి ఉన్నారు. అప్పుడు గ్రంథాలు తెరువబడ్డాయి. మరొక గ్రంథంకూడా తెరువబడింది. అది జీవగ్రంథం. చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పబడింది. వాళ్ళు చేసినవి ఆ గ్రంథాల్లో వ్రాయబడి ఉన్నాయి. వాటి ప్రకారం వాళ్ళ మీద తీర్పు చెప్పబడింది.

13 సముద్రం తనలో చనిపోయినవాళ్ళను విడుదల చేసింది. మృత్యువు తన మృత్యులోకంలో ఉన్నవాళ్ళను విడుదల చేసింది. వాళ్ళు చేసిన వాటిని బట్టి తీర్పు చెప్పబడింది. 14 ఆ తర్వాత మృత్యువు, మృత్యులోకము మంటలు ఉన్న గుండంలో పారవేయబడ్డాయి. మంటల గుండం రెండవ మరణం. 15 జీవగ్రంథంలో పేరులేనివాడు మంటల గుండంలో పారవేయబడ్డాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International