Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
హోషేయ 1-4

హోషేయద్వారా యెహోవా దేవుని సందేశం

బెయేరి కుమారుడైన హోషేయకు వచ్చిన యెహోవా సందేశం ఇది. ఉజ్జియా, యోతాము, ఆహాజు, హిజ్కియా అనువారు యూదా దేశపు రాజులుగా ఉన్న కాలంలో ఈ సందేశం వచ్చింది. యెహోవాయాషు కుమారుడైన యరొబాము ఇశ్రాయేలురాజుగా ఉన్న కాలం అది.

ఇది హోషేయకు యెహోవా ఇచ్చిన మొదటి సందేశం. “వెళ్లి, ఒక వేశ్యను పెండ్లి చేసుకొని, ఆ వేశ్య ద్వారా పిల్లల్ని కను.[a] ఎందుకంటే ఈ దేశంలో ప్రజలు వేశ్యల్లా ప్రవర్తించారు-వారు యెహోవాకు అపనమ్మకంగా జీవించారు” అని యెహోవా చెప్పాడు.

యెజ్రెయేలు పుట్టుక

కనుక దిబ్లయీము కుమార్తెయైన గోమెరును హోషేయ పెండ్లి చేసుకొన్నాడు. గోమెరు గర్భవతియై, హోషేయకు ఒక కుమారుని కన్నది. యెహోవా హోషేయతో, “అతనికి యెజ్రెయేలు అని పేరు పెట్టు. ఎందుచేతనంటే యెహూ యెజ్రెయేలు లోయలో రక్తం చిందించిన కారణంగా నేను యెహూ కుటుంబాన్ని నాశనం చేస్తాను. ఆ తర్వాత ఇశ్రాయేలు రాజ్యాన్ని నేను నాశనం చేస్తాను. ఆ సమయంలో యెజ్రెయేలు లోయలో ఇశ్రాయేలు విల్లును నేను విరుగగొడ్తాను” అని చెప్పాడు.

లో-రూహామా పుట్టుక

మరల గోమెరు గర్భవతియై ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. యెహోవా హోషేయతో ఇలా చెప్పాడు: “ఆమెకు లో-రూహామా అని పేరు పెట్టు. ఎందుకంటే ఇశ్రాయేలు రాజ్యానికి నేను ఇక ఎంతమాత్రం కరుణ చూపించను. నేను వారిని క్షమించను. కాని యూదా రాజ్యానికి నేను కరుణ చూపిస్తాను. యూదా రాజ్యాన్ని నేను రక్షిస్తాను. వారిని రక్షించేందుకు విల్లుగాని, ఖడ్గంగాని నేను ఉపయోగించను. వారిని రక్షించేందుకు యుద్ధ గుర్రాలనుగాని, సైనికులనుగాని నేను ఉపయోగించను. నేను నా స్వంత శక్తిచేతనే వారిని రక్షిస్తాను.”

లో-అమ్మీ పుట్టుక

గోమెరు లో-రూహామాకు చనుబాలు ఇవ్వటం చాలించగానే ఆమె మరల గర్భవతి అయ్యింది. ఆమె మరొక కుమారుని కన్నది. అప్పుడు, “అతనికి లో-అమ్మీ అని పేరు పెట్టు. ఎందుచేతనంటే మీరు నా ప్రజలు కారు, నేను మీ దేవుణ్ణి కాను” అని యెహోవా చెప్పాడు.

ఇశ్రాయేలు జనాంగంతో దేవుడు మాట్లాడుట

10 “రాబోయే కాలంలో ఇశ్రాయేలు ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువుల్లా ఉంటుంది. ఇసుకను నీవు కొలవలేవు. లెక్కించ లేవు. ఏ స్థలంలోనైతే ‘మీరు నా ప్రజలు కారు’ అని వారితో చెప్పబడిందో అక్కడే ‘మీరు జీవంగల దేవుని పిల్లలు’ అని వారితో చెప్పడం జరుగుతుంది.

11 “అప్పుడు యూదా ప్రజలు మరియు ఇశ్రాయేలు ప్రజలు సమావేశపరచబడతారు. వారు ఒక పాలకుని తమకోసం ఏర్పాటు చేసుకొంటారు. మరియు వారి రాజ్యం ఆ దేశం పట్టజాలనంత పెద్దదిగా ఉంటుంది! యెజ్రెయేలు దినం నిజంగా గొప్పగా ఉంటుంది.

“అప్పుడు మీరు మీ సోదరులతో ‘మీరు నా ప్రజలు’ అనియు, మీ స్వంతవారితో ‘ఆయన మీ యెడల కరుణ చూపించాడు’ అని చెబుతారు.

“మీ తల్లితో గట్టిగా వాదించండి, ఎందుకంటే ఆమె నా భార్య కాదు! నేను ఆమె భర్తను కాను! వేశ్యలాగ ఉండటం మానుకోమని ఆమెతో చెప్పండి. ఆమె స్తనాల మధ్య నుండి ఆమె విటులను తొలగించి వేయమని ఆమెతో చెప్పండి. ఆమె తన వ్యభిచారం మానుకోవటానికి నిరాకరిస్తే నేను ఆమె వస్త్రాలు తీసివేసి దిగంబరిగా చేస్తాను. ఆమెను, ఆమె పుట్టిన రోజున ఉన్నట్టుగానే చేస్తాను. నేను ఆమె ప్రజలను తొలగించివేస్తాను. ఆమె ఎండిపోయిన ఖాళీ ఎడారిలాగ ఉంటుంది. దాహంతో నేను ఆమెను చంపివేస్తాను. ఆమె పిల్లల మీద నేను జాలిపడను. ఎందుకంటే వారు వ్యభిచార సంతానం కనుక. వారి తల్లి ఒక వేశ్యలాగ ప్రవర్తించింది. వారి తల్లి, ఆమె చేసిన పనుల విషయంలో సిగ్గుపడాలి. ఆమె, ‘నేను నా విటుల దగ్గరకు వెళ్తాను, నా విటులు నాకు భోజనపానాలు ఇస్తారు. వారు ఉన్ని మరియు మేలు రకపు సన్నని వస్త్రాలు ఇస్తారు. ద్రాక్షామద్యం, ఒలీవనూనె వారు నాకు ఇస్తారు’ అని చెప్పింది.

“అందుచేత, యెహోవానైన నేను మీ (ఇశ్రాయేలు) మార్గాన్ని ముళ్లతో అడ్డువేస్తాను. నేను ఒక గోడ కట్టిస్తాను. అప్పుడు తన దారులను ఆమె తెలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల వెనుక పరుగులెత్తుతుంది కానీ ఆమె వారిని కలుసుకోలేక పోతుంది. ఆమె తన విటుల కోసం వెదుకుతుంది. కాని ఆమె వారిని కనుగొనలేక పోతుంది. అప్పుడు ఆమె, ‘నేను నా మొదటి భర్త (దేవుడు) దగ్గరకు వెళ్తాను. నేను ఆయనతో ఉన్నప్పుడు నా జీవితం బాగా ఉండింది. ఇప్పటికంటే నా జీవితం అప్పుడే మేలు’ అని అంటుంది. “ధాన్యం, ద్రాక్షారసం, నూనె ఇచ్చేవాడను నేనే అని ఆమె (ఇశ్రాయేలు)కు తెలియదు. నేను ఆమెకు వెండి బంగారాలు ఇంకా ఇంకా ఎక్కువగా ఇస్తూ పోయాను. కాని బయలు విగ్రహాలు చేయుటకు ఇశ్రాయేలీయులు ఈ వెండి బంగారాలు ఉపయోగించారు. కనుక నేను (యెహోవాను) తిరిగి వస్తాను. నా ధాన్యం కోతకు సిద్ధంగా ఉన్నప్పుడు నేను దానిని తీసివేసుకొంటాను. ద్రాక్షలు సిద్ధంగా ఉన్న సమయంలో నా ద్రాక్షారసం నేను తీసివేసుకొంటాను. నా ఉన్ని, మేలురకపు వస్త్రాలు నేను తీసివేసుకొంటాను. ఆమె తన నగ్న శరీరాన్ని కప్పుకునేందుకు వీటిని నేను ఆమెకు ఇచ్చాను. 10 కాని ఇప్పుడు నేను ఆమెను నగ్నంగా చేస్తాను. ఆమె ప్రేమికులు ఆమె నగ్నత్వాన్ని చూస్తారు. నా శక్తినుండి ఆమెను ఎవ్వరూ తప్పించలేరు. 11 నేను (దేవుడు) ఆమె సరదానంతా తీసివేస్తాను. ఆమె పండుగ రోజులను, ఆమె అమావాస్య విందులను, ఆమె విశ్రాంతి దినాలను, ప్రత్యేక విందులను నేను నిలిపి వేస్తాను. 12 ఆమె ద్రాక్షావల్లులను, అంజూరపు చెట్లను నేను నాశనం చేస్తాను. ‘నా విటులు వీటిని నాకు ఇచ్చారు’ అని ఆమె చెప్పింది. కాని ఆమె తోటలను నేను మార్చివేస్తాను. అవి భయంకరమైన అడవులుగా మారిపోతాయి. అడవి మృగాలు వచ్చి ఆ మొక్కలను తింటాయి.

13 “ఆమె బయలు[b] దేవతలను సేవించింది. కనుక ఆమెను నేను శిక్షిస్తాను. బయలు దేవతలకు ఆమె ధూపం వేసింది. ఆమె వస్త్రాలు ధరించి, నగలు, ముక్కుకమ్మి పెట్టుకొంది. అప్పుడు ఆమె తన విటుల దగ్గరకు వెళ్లి, నన్ను మరచిపోయింది. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.

18 “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు. 21 ఆ సమయంలో నేను నీకు జవాబు ఇస్తాను. యెహోవా ఇలాగున చెపుతున్నాడు.

“నేను ఆకాశాలతో మాట్లాడుతాను.
    అవి భూమికి వర్షాన్ని ఇస్తాయి.
22 ధాన్యం, ద్రాక్షా మద్యం, నూనెలను భూమి ఇస్తుంది.
    అవి యెజ్రెయేలు అవసరాలను తీరుస్తాయి.
23 భూమిమీద ఆమెను నేను నాటుతాను.
    లో-రూహామాకు నేను దయచూపిస్తాను.
లో-అమ్మీకీ ‘నీవు నా ప్రజ’ అని నేను చెపుతాను.
    ‘నీవు మా దేవుడవు’అని వారు నాతో చెపుతారు.”

గోమెరును బానిసత్వంనుండి హోషేయ తిరిగి కొనుట

అప్పుడు యెహోవా నాతో, “గోమెరుకు చాలా మంది విటులు ఉన్నారు. కాని నీవు ఆమెను ప్రేమిస్తూనే ఉండాలి. ఎందుచేతనంటే అది యెహోవా చేసినట్టుగా ఉంటుంది. యెహోవా ఇశ్రాయేలు ప్రజలను ప్రేమిస్తూనే ఉన్నాడు. కాని వారు ఇతర దేవతలను పూజిస్తూనే ఉన్నారు. మరియు ఎండుద్రాక్షల అడలు తినటం వారికి ఇష్టం” అని మరల చెప్పాడు.

కనుక, గోమెరును పదునయిదు తులాల వెండి, తొమ్మిది తూముల యవలు ఇచ్చి నేను కొన్నాను. కాబట్టి నేను ఆమెతో, “చాలా రోజులు నీవు నాతో కలసి ఇంటి వద్దనే ఉండాలి. నీవు వేశ్యలా ఉండకూడదు. నీవు మరో పురుషునితో పడుకో కూడదు. నేను నీకు భర్తగా ఉంటాను” అని చెప్పాను.

అదే విధంగా ఇశ్రాయేలు ప్రజలు ఒక రాజుగాని, లేక ఒక నాయకుడు గాని లేకుండా అనేక రోజులు కొనసాగుతారు. ఒక బలి అర్పణగాని, లేక ఒక స్మారకశిలగాని లేకుండా ఉంటారు. వారికి ఏఫోదుగాని, లేక, గృహ దేవతలు గాని ఉండవు. దీని తర్వాత ఇశ్రాయేలు ప్రజలు తిరిగి వెనుకకు వస్తారు. వారు వారి దేవుడైన యెహోవా కోసం, వారి రాజైన దావీదు కోసం వెతుకుతారు. చివరి దినాల్లో వారు యెహోవాను, ఆయన మంచితనాన్నీ గౌరవిస్తారు.

ఇశ్రాయేలీయుల మీద యెహోవా కోపంగా ఉండుట

ఇశ్రాయేలు ప్రజలారా, యెహోవా సందేశం వినండి! ఈ దేశంలో నివసించే ప్రజల మీద ఆయనకు గల వ్యాజ్యెం ఏమిటో యెహోవా చెపుతాడు వినండి. “ఈ దేశంలోని ప్రజలు నిజంగా దేవుణ్ణి ఎరుగరు. ప్రజలు దేవునికి సత్యవంతులుగాను, నమ్మకస్తులుగాను లేరు. ప్రజలు (అబద్ధపు) ఒట్టు పెట్టుకుంటారు, అబద్ధాలు చెపుతారు, చంపుతారు, దొంగిలిస్తారు. వారు వ్యభిచార పాపం చేసి పిల్లల్ని కంటారు. ప్రజలు మరల మరల హత్య చేస్తారు. అందుచేత దేశం చచ్చినవాడి కోసం ఏడుస్తున్న ఒక మనిషిలాగ ఉంది. దాని ప్రజలంతా బలహీనంగా ఉన్నారు. చివరికి పొలాల్లోని పశువులు, ఆకాశంలోని పక్షులు, సముద్రంలోని చేపలు కూడ చనిపోతున్నాయి. ఏ వ్యక్తీ మరో వ్యక్తితో వివాదం పెట్టుకోకూడదు, నిందించకూడదు. యాజకునితో! వాదం పెట్టుకోవద్దు. మీరు (యాజకులు) పగటివేళ పడిపోతారు. మరియు రాత్రివేళ ప్రవక్త కూడ మీతోపాటు పడిపోతాడు. మరియు మీ తల్లిని నేను నాశనం చేస్తాను.

“నా ప్రజలకు తెలివి లేదు గనుక నాశనం చేయబడ్డారు. నేర్చుకొనేందుకు మీరు నిరాకరించారు. కనుక నా కోసం మిమ్మల్ని యాజకులుగా ఉండనిచ్చుటకు నేను నిరాకరిస్తాను. మీరు మీ దేవుని న్యాయచట్టం మరచిపోయారు గనుక నేను మీ పిల్లల్ని మరచిపోతాను. వారు గర్విష్ఠులయ్యారు! వారు నాకు విరోధంగా ఇంకా ఇంకా ఎక్కువ పాపం చేశారు. కనుక వారి ఘనతను అవమానంగా నేను మార్చివేస్తాను.

“యాజకులు ప్రజల పాపాలలో చేరిపోయారు. వారు ఆ పాపాలను ఇంకా ఇంకా ఎక్కువగా కోరుకొన్నారు. కనుక ప్రజలకంటే యాజకులు వేరుగా ఏమీలేరు. వారు చేసిన వాటి విషయమై నేను వారిని శిక్షిస్తాను. వారు చేసిన వాటికోసం నేను వారికి తగిన శిక్ష విధిస్తాను. 10 వారు భోజనం చేస్తారు కాని వారికి తృప్తి ఉండదు. వారు లైంగిక పాపాలు చేస్తారు. కాని వారికి పిల్లలు ఉండరు. ఎందుచేతనంటే వారు యెహోవాను విడిచిపెట్టి వేశ్యలవలె తయారయ్యారు.

11 “లైంగిక పాపాలు, ద్రాక్షామద్యం, కొత్త ద్రాక్షారసం మనిషిలో సరిగ్గా ఆలోచించగలిగే శక్తిని నాశనం చేస్తాయి. 12 నా ప్రజలు కట్టెముక్కలను సలహా అడుగుతున్నారు. ఆ కట్టెలు వారికి జవాబిస్తాయని వారు తలుస్తున్నారు. ఎందుచేతనంటే వారు వేశ్యలాగ ఆ బూటకపు దేవతలను వెంటాడారు. 13 వారు కొండ శిఖరాల మీద బలులు అర్పిస్తారు. కొండలమీద, సిందూర వృక్షాల కింద, చినారు వృక్షాల కింద, మస్తకి వృక్షాల కింద ధూపం వేస్తారు. ఆ చెట్ల కింద నీడ బాగున్నట్టు కనిపిస్తుంది. కనుక మీ కుమార్తెలు ఆ చెట్ల కింద వ్యభిచరిస్తారు. మరియు మీ కోడళ్లుకూడా పాపాలు చేస్తారు.

14 “వేశ్యలుగా ఉన్నందుకు మీ కుమార్తెలను గానీ, లైంగిక పాపాలు చేసినందుకు మీ కోడళ్లనుగాని నేను నిందించలేను. పురుషులు వెళ్లి, వేశ్యలతో పడుకొంటారు. వారు వెళ్లి, ఆలయ వేశ్యలతో కలిసి బలులు అర్పిస్తారు. కనుక ఆ తెలివి తక్కువ ప్రజలు వారిని వారే పాడు చేసుకుంటున్నారు.

ఇశ్రాయేలీయుల సిగ్గుకరమైన పాపాలు

15 “ఇశ్రాయేలూ, నీవు ఒక వేశ్యలాగ ప్రవర్తిస్తున్నావు. కానీ, యూదాను అపరాధిగా ఉండనియ్యకు. గిల్గాలుకు గాని లేక బేతావెనుకు గాని వెళ్లకుము. ప్రమాణాలు చేయటానికి యెహోవా నామం ఉపయోగించకుము. మరియు ‘యెహోవా జీవంతోడు …!’ అని అనవద్దు. 16 ఇశ్రాయేలుకు యెహోవా ఎన్నో ఇచ్చాడు. గడ్డి విస్తారంగా ఉన్న విశాలమైన పొలంలోకి తన గొర్రెలను తీసికొనివెళ్లే కాపరిగా ఆయన ఉన్నాడు. కానీ, ఇశ్రాయేలు మొండిది. ఇశ్రాయేలు మరల మరల పారిపోయే పెయ్యలాగ ఉంది. 17 ఎఫ్రాయిము అతని విగ్రహాలతో కలిశాడు కనుక అతన్ని ఒంటరిగా విడిచివేయండి. 18 వారి త్రాగుడు వారిని ప్రక్కకు త్రిప్పివేసింది. వారు విడువక ఇష్టానుసారంగా జారత్వము చేస్తూ ఆమెను సిగ్గుతో కప్పుతున్నారు. 19 కాని ఆమెను, ఆమె రెక్కలతో బంధించును. వారి బలి అర్పణల వలన వారు సిగ్గునొందుదురు.”

ప్రకటన 1

తొలి పలుకు

దేవుడు త్వరలోనే జరగనున్న వాటిని తన సేవకులకు తెలియచేయుమని యేసు క్రీస్తుకు చెప్పాడు. యేసు తన దూతను, తన భక్తుడైన యోహాను దగ్గరకు పంపి ఈ విషయాలు తెలియచేసాడు. ఈ గ్రంథంలో ఆ విషయాలు ఉన్నాయి. యోహాను దేవుని సందేశాన్ని, యేసు క్రీస్తు చెప్పినదాన్ని దివ్య దర్శనంలో చూసాడు. అందులో చూసినవన్నీ చెప్పాడు. ఈ దైవసందేశంలో ఉన్నవాటిని చదివేవాడు, వాటిని విని, వాటిలో వ్రాయబడినవాటిని ఆచరించేవాళ్ళు ధన్యులు. సమయం దగ్గరగానున్నది.

శుభాకాంక్షలు

యోహాను నుండి,

ఆసియ ప్రాంతంలో ఉన్న ఏడు సంఘాలకు,

భూత భవిష్యత్ వర్తమానకాలాల్లో ఉన్నవాడు, ఆయన సింహాసనం ముందున్న ఏడు ఆత్మలు మీకు తమ అనుగ్రహాన్ని, శాంతిని ప్రసాదించుగాక! మరియు, చనిపోయి బ్రతికింపబడిన వాళ్ళలో మొదటివాడు, నిజమైన విషయాలు చెప్పేవాడు రాజులకు రాజైన యేసు క్రీస్తు మీకు అనుగ్రహం, శాంతి ప్రసాదించుగాక!

ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. ఆయనే తన రక్తంతో మనల్ని మన పాపాలనుండి రక్షించాడు. మనల్ని ఒక రాజ్యంగా స్థాపించాడు. మనము ఆయన తండ్రియైన దేవుని సేవ చేయాలని మనల్ని యాజకులుగా చేసాడు. ఆయనకు చిరకాలం మహిమ శక్తి కలుగుగాక! ఆమేన్.

చూడు! ఆయన మేఘాలతో వస్తున్నాడు. ప్రతి నేత్రము ఆయన్ని చూస్తుంది. ఆయన్ని పొడిచినవాళ్ళు[a] కూడా ఆయన్ని చూస్తారు. ప్రపంచంలోని ప్రజలందరూ ఆయన్ని చూచి భయాందోళనలతో దుఃఖిస్తారు. అలాగే జరుగుగాక! ఆమేన్.

భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉండేవాడు, సర్వశక్తి సంపన్నుడైనవాడు, మన ప్రభువైన దేవుడు “ఆదియు, అంతమును[b] నేనే” అని అన్నాడు.

నేను యోహానును, మీ సోదరుణ్ణి. యేసుతో పొందిన ఐక్యత వల్ల మనము ఆయన రాజ్యంలో ఒకటిగా ఉన్నాము. సహనంతో కష్టాలు అనుభవిస్తున్నాము. యేసు చెప్పిన సత్యాన్ని దేవుని సందేశాన్ని ప్రకటించటం వల్ల నన్ను వాళ్ళు పత్మాసు ద్వీపంలో ఒంటరిగా ఉంచారు. 10 ఆదివారమునాడు నేను దేవుని ఆత్మపూర్ణుడనైయుండగా బూర ఊదినట్లు నా వెనుకనుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. 11 అది నాతో, “నీవు చూసినదాన్ని ఒక గ్రంథంగా వ్రాసి ఈ ఏడు సంఘాలకు అనగా, ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దీసు, ఫిలదెల్ఫియ, లవొదికయకు పంపుము” అని అన్నది.

12 నాతో మాట్లాడుతున్న స్వరం ఎవరిదో చూడాలని వెనక్కు తిరిగి చూసాను. వెనక్కు తిరిగి చూడగా ఏడు బంగారు దీపస్తంభాలు కన్పించాయి. 13 వాటి మధ్య ఒక వ్యక్తి కనిపించాడు. ఆయన మనుష్యకుమారునిలా[c] ఉన్నాడు. ఆయన వేసుకొన్న అంగీ ఆయన పాదాల వరకు ఉంది. ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టబడివుంది. 14 ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్నిలా ఉన్నాయి. ఆయన వెంట్రుకల్ని మంచుతో కూడా పోల్చవచ్చు. ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. 15 ఆయన పాదాలు కొలిమిలో కాలే యిత్తడిలా ఉన్నాయి. ఆయన కంఠధ్వని జల ప్రవాహం చేసే శబ్దంలా ఉంది. 16 ఆయన తన కుడి చేతిలో ఏడు నక్షత్రాలను పట్టుకొని ఉన్నాడు. ఇరువైపులా పదునుగానున్న ఒక కత్తి ఆయన నోటి నుండి బయటకు వచ్చింది. ఆయన ముఖం దివ్యంగా ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉంది.

17 నేనాయన్ని చూసి, ప్రాణం పోయిన వానిలా ఆయన పాదాల ముందు పడ్డాను. అప్పుడు ఆయన తన కుడి చేతిని నా తలపై ఉంచి, “భయపడకు. ఆదిని, అంతాన్ని నేనే!” అని అన్నాడు. 18 నేను చిరకాలం జీవించేవాణ్ణి. ఒకప్పుడు నేను మరణించి ఉంటిని. కాని యిక శాశ్వతంగా జీవించి ఉంటాను. మరణంపై నాకు అధికారం ఉంది. మృత్యులోకపు తాళంచెవులు నా దగ్గర ఉన్నాయి. 19 అందువల్ల యిప్పుడున్నవాటిని, ముందు జరుగబోయేవాటిని, నీవు చూసినవాటిని గురించి వ్రాయి. 20 నీవు నా కుడి చేతిలో చూసిన ఏడు నక్షత్రాల రహస్యము, ఏడు దీపస్తంభాల రహస్యము యిది. ఆ ఏడు నక్షత్రాలు ఏడు సంఘాలకు చెందిన దూతలు, ఆ ఏడు దీపస్తంభాలు ఏడు సంఘాలు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International