Old/New Testament
సమరయ, ఇశ్రాయేలులకు దండన
1 యెహోవా వాక్కు మీకాకు అందింది. ఇది యోతాము, ఆహాజు, మరియు హిజ్కియా అనే రాజుల కాలంలో జరిగింది. వీరు ముగ్గురూ యూదా రాజులు. మీకా, మోరషతు నగరం వాడు. సమరయ, యెరూషలేములను గురించిన ఈ దర్శనాలను మీకా చూశాడు.
2 ప్రజలారా, మీరంతా వినండి!
భూమీ, దాని మీదగల ప్రతి ఒక్కడూ, అంతా వినండి!
నా ప్రభువైన యెహోవా తన పవిత్ర ఆలయంనుండి వస్తాడు.
నా ప్రభువు మీకు వ్యతిరేకంగా ఒక సాక్షిగా వస్తాడు.
3 చూడండి, దేవుడైన యెహోవా తన స్థానంనుండి బయటకు వస్తున్నాడు.
ఆయన భూమియొక్క ఉన్నత స్థలాలపై నడవటానికి కిందికి వస్తున్నాడు.
4 దేవుడైన యెహోవా అగ్ని ముందు
మైనంలా పర్వతాలు కరిగిపోతాయి.
గొప్ప జలపాతంలా,
లోయలు వికలమై కరిగిపోతాయి.
5 యాకోబు పాపం కారణంగా,
ఇశ్రాయేలు ఇంటివారు చేసిన పాపాల కారణంగా ఇది జరుగుతుంది.
సమరయ పాప హేతువు
యాకోబు పాపానికి కారణం ఏమిటి?
దానికి కారణం సమరయ!
యూదాలో ఉన్నత స్థలమేది?[a]
అది యెరూషలేము!
6 మైదానంలో రాళ్లగుట్టలా నేను సమరయను మార్చుతాను.
అది ద్రాక్షాతోట వేయటానికి అనువైన భూమివలె మారిపోతుంది.
సమరయయొక్క నిర్మాణపు రాళ్లను పెరికి లోయలో పారవేస్తాను.
నేను దాని పునాదులను నాశనం చేస్తాను.
7 దాని విగ్రహాలన్నీ ముక్కలుగా విరుగగొట్టబడతాయి.
అది సంపాదించిన ధనం అగ్నికి ఆహుతి అవుతుంది.
దానియొక్క బూటకపు దేవుళ్ల విగ్రహాలన్నిటినీ నేను నాశనం చేస్తాను.
ఎందుకంటే, సమరయ నా పట్ల అవిశ్వాసంగా ఉండి అవన్నీ కూడబెట్టింది.
కావున ఈ వస్తువులన్నీ నాపట్ల
అవిశ్వాసంగా ఉన్న ఇతర ప్రజలకు వెళ్లిపోతాయి.
మీకాయొక్క తీరని విచారం
8 ఈ చెడు విషయంలో నేను కలవరపాటుచెంది, విచారిస్తున్నాను.
నేను పాదరక్షలుకూడ లేకుండా, నగ్నంగా బయటకు వెళతాను.
నక్కలు ఊళ పెట్టినట్లు నేను అరుస్తాను.
నిప్పుకోళ్లలా మూల్గుతాను.
9 ఎందుకనగా సమరయ గాయం మాన్పరానిది.
ఆమె గాయం (పాపం) యూదాకు వ్యాపించింది.
అది నా ప్రజల నగర ద్వారం వద్దకు చేరింది.
అది చివరకు యెరూషలేము వరకు వచ్చింది.
10 ఇది గాతులో చెప్పవద్దు.
అక్కడ ఏడ్వవద్దు.
బేత్‌లెయఫ్రలో విలపించి,
దుమ్ములో పొర్లాడు.
11 షాఫీరులో నివసించేవాడా,
దిగంబరివై, సిగ్గుతో నీ దారిన నీవు పో!
జయనానులో నివసించేవాడు
బయటకు వెళ్లడు.
బేతేజెలులో ఉన్నవారు విలపిస్తారు.
దానికి కావలసిన ఆసరా మీనుండి తీసుకొంటుంది.
12 మారోతులో నివసించేవాడు మంచివార్త కోసం
ఎదురుచూస్తూ నీరసించిపోయాడు.
ఎందుకంటే యెహోవానుండి
ఆపద యెరూషలేము నగర ద్వారంవరకు వచ్చింది.
13 లాకీషులో నివసిస్తున్న ఓ స్త్రీ,
రథాన్ని వేగముగల గుర్రానికి తగిలించు.
సీయోను పాపాలు లాకీషులో మొదలైనాయి.
ఎందుకంటే నీవు ఇశ్రాయేలు పాపాలనే అనుసరించావు.
14 కావున గాతులోని మోరెషెతుకు
మీరు వీడ్కోలు బహుమతులు ఇవ్వాలి.
అక్జీబులోని ఇండ్లు
ఇశ్రాయేలు రాజులను మోసపుచ్చుతాయి.
15 మారేషా నివాసులారా,
మీ మీదికి నేనొక వ్యక్తిని తీసుకొని వస్తాను, మీకున్న వస్తువులన్నీ ఆ వ్యక్తి తీసుకుంటాడు.
ఇశ్రాయేలు మహిమ (దేవుడు)
అదుల్లాములో ప్రవేశిస్తుంది.
16 కావున మీ తలలు గొరిగించి, బోడిగా చేసుకోండి.
ఎందుకంటే మీరు ప్రేమించే పిల్లలకొరకు మీరు దుఃఖిస్తారు.
రాబందుల్లాగా మీ తలలు బోడి చేసుకోండి.
ఎందుకంటే మీ పిల్లలు మీకు దూరమవుతారు. వారు బలవంతంగా ఇండ్లు వదిలి పోయేలా చేయబడతారు.
ప్రజల దుష్ట పథకాలు
2 పాపం చేయటానికి ఉపాయం పన్నేవారికి ఆపదలు వస్తాయి.
ఆ ప్రజలు తమ పాన్పులపై పడుకొని పాపం చేయటానికి పథకాలు వేస్తారు.
తెల్లవారగానే, ఈ ప్రజలు తమ పథకం ప్రకారం చెడు పనులు చేస్తారు.
ఎందుకంటే వాటిని చేయటానికి వారికి శక్తి ఉంది.
2 వారు భూములను ఆశించి, వాటిని తీసుకుంటారు.
వారు ఇండ్లను కోరి వాటిని ఆక్రమిస్తారు.
వారొక వ్యక్తిని మోసపుచ్చి వాని ఇంటిని తీసుకుంటారు.
వారొక వ్యక్తిని మోసగించి అతని వస్తువులను కాజేస్తారు.
ప్రజలను శిక్షించటానికి యెహోవా పథకం
3 అందువల్ల యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు:
“చూడండి, ఈ వంశం మీదికి ఆపద తీసుకురావటానికి నేను పథకం వేస్తున్నాను.
మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు.
మీరు గర్వంగా నడవలేరు.
ఎందుకంటే అది కీడుమూడే సమయం.
4 ఆ సమయంలో ప్రజలు మిమ్మల్ని గురించి పాటలు పాడుకుంటారు.
ప్రజలు మిమ్మల్ని గురించి దుఃఖ సూచకపాటలు ఆలపిస్తారు. మీరు ఇలా అంటారు:
‘మేము నాశనమయ్యాము!
యెహోవా నా ప్రజల భూమిని తీసుకున్నాడు. ఆయన దానిని అన్యజనులకు ఇచ్చాడు.
అవును, నా భూమిని ఆయన నానుండి తీసుకున్నాడు.
యెహోవా మా పొలాలను మా శత్రువులమధ్య విభజించాడు.
5 ప్రజలు మీ భూమిని కొలవలేరు.
భూమిని యెహోవా ప్రజల మధ్య విభజించటానికి ప్రజలు చీట్లు వేయలేరు.
ఎందుకంటే, ఆ భూమి మీకు చెందియుండదు!’”
మీకాను ఇక బోధించవద్దనటం
6 ప్రజలు ఇలా అంటారు: “మాకు బోధించవద్దు.
మా గురించి ఆ చెడు విషయాలు చెప్పవద్దు.
మాకు ఏ కీడూ జరుగబోదు.”
7 కాని, యాకోబు వంశీయులారా!
నేనీ విషయాలు చెప్పాలి.
మీరు చేసిన పనుల పట్ల
యెహోవా కోపగిస్తున్నాడు.
మీరు ధర్మంగా ప్రవర్తిస్తే
నేను మిమ్మల్ని గురించి మంచి మాటలు చెప్పేవాడిని.
8 కాని, ఇటీవల నా ప్రజలే నా శత్రువులయ్యారు.
దారిన పోయే వారివద్దనుండి మీరు బట్టలు దొంగిలిస్తారు.
ఆ జనులు మాత్రం సురక్షితంగా ఉన్నామనుకున్నారు.
కాని వారు యుద్ధ ఖైదీలు అన్నట్లు, వారి వస్తువులు మీరు తీసుకుంటారు.
9 నా ప్రజల స్త్రీలను వారి అందమైన,
సౌకర్యాలు గల ఇండ్లనుండి మీరు వెళ్లగొట్టారు.
వారి చిన్నపిల్లల మధ్యనుండి
నా మహిమను మీరు తీసివేశారు.
10 లేచి వెళ్లిపొండి!
ఎందుకంటే, ఇది విశ్రాంతి తీసుకొనే స్థలం కాదు. మీరు ఈ స్థలాన్ని పాడు చేశారు!
మీరు దీన్ని అపవిత్రం చేశారు. కనుక అది నాశనం చేయబడుతుంది!
11 ఒక బూటకపు ప్రవక్త వచ్చి, అబద్ధాలు చెప్పవచ్చు. అతడు,
“నాకు ద్రాక్షారసం, మద్యం ఇవ్వండి. నేను మీకు మంచి విషయాలు చెపుతాను” అని అనవచ్చు.
అతడు వారికి ఆ విధంగా బోధకుడవుతాడు!
యెహోవా తన ప్రజలను ఒక్క చోటికి చేర్చటం
12 అవును, యాకోబు వంశీయులారా, నేను మీ అందరినీ ఒక్కచోటికి తీసుకువస్తాను.
ఇశ్రాయేలు ప్రజలలో మిగిలిన వారందరినీ సమకూర్చుతాను.
దొడ్డిలోని గొర్రెల్లా, పచ్చిక బీడులోని మందల్లా, వారిని నేను సమకూర్చుతాను.
అప్పుడు ఆ స్థలమంతా అనేకమందిచేసే ధ్వనులతో నిండిపోతుంది.
13 “ఒక వ్యక్తి” ముందుకు తోసుకు వచ్చి, తన ప్రజల ముందుకు వస్తాడు.
ఆయన ద్వారాలను పడదోసుకుపోతాడు. ప్రజలు ఆ నగరాన్ని వదలివేస్తారు.
వారి రాజు వారిముందు నడుస్తాడు.
యెహోవా తన ప్రజల ముందు ఉంటాడు.
ఇశ్రాయేలు నాయకుల పాప దోషం
3 అప్పుడు నేనిలా అన్నాను: “యాకోబు పెద్దలారా, ఇశ్రాయేలు దేశాధిపతులారా, ఇప్పుడు వినండి.
న్యాయమంటే ఏమిటో మీరు తెలుసుకోవాలి!
2 కాని మీరు మంచిని ద్వేషించి, చెడును ప్రేమిస్తారు!
మీరు వారి ప్రజల చర్మాన్ని ఒలుస్తారు.
మీరు వారి ఎముకలపై గల మాంసాన్ని లాగివేస్తారు!
3 మీరు నా ప్రజలను నాశనం చేస్తున్నారు!
మీరు వారి చర్మాన్ని ఒలుచుకుంటున్నారు; వారి ఎముకలను విరుగ గొడుతున్నారు.
మాంసంలా వారి ఎముకలను కుండలో పెట్టటానికి మీరు నరుకుతారు!
4 అప్పుడు మీరు దేవుడైన యెహోవాను ప్రార్థిస్తారు.
కాని ఆయన మీ ప్రార్థన వినడు;
దేవుడైన యెహోవా మిమ్మల్ని చూచి ముఖం తిప్పుకుంటాడు.
ఎందుకంటే మీరు చెడుపనులు చేశారు!”
బూటకపు ప్రవక్తలు
5 అబద్ధ ప్రవక్తలు యెహోవా ప్రజలకు తప్పుడు జీవిత విధానాన్ని బోధిస్తారు. యెహోవా ఆ ప్రవక్తల విషయంలో ఈ విధంగా చెపుతున్నాడు:
“ప్రజలు గనుక ఈ ప్రవక్తలకు తినటానికి ఆహారం ఇస్తే వారు శాంతి అని అరుస్తారు!
ఒకవేళ ప్రజలు వారికి ఆహారం ఇవ్వకపోతే,
అప్పుడు ప్రవక్తలు ‘యుద్ధానికి సిద్ధంకండి’ అని అరుస్తారు.
6 “అందువల్ల మీకు చీకటి కమ్మినట్లు ఉంటుంది.
మీకు దర్శనాలు కలుగవు.
భవిష్యత్తులో ఏమి జరుగుతుందో మీరు చెప్పలేరు గనుక.
మీకు అంధకారం వ్యాపించినట్లు ఉంటుంది.
ఈ ప్రవక్తలకు సూర్యుడు అస్తమిస్తాడు.
వారికి పట్టపగలే అంధకారం ఆవరిస్తుంది.
7 దీర్ఘదర్శులు (ప్రవక్తలు) సిగ్గుపడతారు.
భవిష్యత్తును చూసేవారు కలవరపాటు చెందుతారు.
అవును, వారంతా వారి నోళ్లు మూసుకుంటారు.
ఎందుకంటే దేవునివద్దనుండి సమాధానం రాదు!”
మీకా దేవుని యదార్థ ప్రవక్త
8 కానీ యెహోవా ఆత్మ నన్ను శక్తితోను,
మంచితనంతోను, బలంతోను నింపివేశాడు.
కావున నేను యాకోబుకు అతని పాపాలనుగూర్చి చెప్పగలను.
అవును. ఇశ్రాయేలుకు అతను చేసిన పాపాలను గురించి నేను చెపుతాను!
ఇశ్రాయేలు నాయకులు నింద పాలవటం
9 యాకోబు ప్రజల నాయకులారా, ఇశ్రాయేలు అధిపతులారా, నేను చెప్పేది వినండి!
మీరు న్యాయాన్ని ద్వేషిస్తారు.
మీరు తిన్నగా ఉన్నదానిని వంకర చేస్తారు!
10 మీరు ప్రజలను హత్యచేసి సీయోనును నిర్మించారు!
మీరు యెరూషలేమును పాపంతో నిర్మించారు!
11 యెరూషలేములో న్యాయాధిపతులు రహస్యంగా లంచాలు తీసుకుంటారు.
వారలా చేసి న్యాయస్థానంలో తమ తీర్పు ఇస్తారు.
ప్రజలకు బోధించేముందు
యెరూషలేము యాజకులకు వేతనం చెల్లించాలి.
ప్రవక్తలు భవిష్యత్తులోకి చూసేముందు
ప్రజలు వారికి డబ్బు చెల్లించాలి.
అప్పుడా నాయకులు, “మనకు ఏరకమైన కీడూ రాదు!
యెహోవా మనపట్ల ఉన్నాడు!” అని అంటారు.
12 మీ మూలంగానే సీయోను నాశనమవుతుంది.
అది దున్నిన పొలంలా తయారవుతుంది.
యెరూషలేము రాళ్ల గుట్టలా మారుతుంది.
ఆలయపు పర్వతం పొదలతో నిండిన వట్టి కొండలా తయారవుతుంది.
ఇద్దరు సాక్షులు
11 ఒక దేవదూత ఒక కొలత బద్ద లాంటిది నాకిచ్చి ఈ విధంగా అన్నాడు: “వెళ్ళు, దేవుని మందిరాన్ని, బలిపీఠాన్ని కొలత వేయి. ఎంతమంది ప్రజలు ఆరాధిస్తున్నారో కూడ లెక్కపెట్టు. 2 కాని వెలుపలి ఆవరణం, యూదులు కానివాళ్ళకివ్వబడింది. కనుక దాన్ని కొలత వేయకుండా వదిలేయి. వాళ్ళు నలభై రెండు నెలల దాకా ఈ పవిత్ర నగరాన్ని త్రొక్కుతూ నడుస్తారు. 3 నేను నా యిరువురి సాక్షులకు శక్తినిస్తాను. వాళ్ళు గోనెపట్ట కట్టుకొని పన్నెండువందల అరువది దినాల దాకా దైవసందేశం చెబుతారు.”
4 రెండు ఒలీవ వృక్షాలు, రెండు దీపస్తంభాలు ఆ సాక్షులు. ఇవి ఈ భూమిని పాలించే దేవుని సమక్షంలో ఉన్నాయి. 5 వారికి హాని కలిగించాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ నోళ్ళనుండి మంటలు వచ్చి, తమ శత్రువుల్ని మ్రింగివేస్తాయి. వారికి హాని తలపెట్టినవాళ్ళు ఈ విధంగా మరణిస్తారు. 6 తాము దేవుని సందేశం బోధించే కాలంలో వర్షం కురియకుండా చేయటానికి వాళ్ళు ఆకాశాన్ని మూసి వేస్తారు. వాళ్ళకా శక్తి ఉంది. అంతేకాక, నీళ్ళను రక్తంగా మార్చగల శక్తి కూడా వాళ్ళకు ఉంది. రకరకాల తెగుళ్ళను తమకు యిష్టం వచ్చినప్పుడు ప్రపంచంలో వ్యాపింప చేయగల శక్తి కూడా వాళ్ళకు ఉంది.
7 వాళ్ళు తమ సందేశం చెప్పటం ముగించాక, ఒక మృగం పాతాళంనుండి మీదికి వచ్చి, వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళను ఓడించి చంపి వేస్తుంది. 8 వాళ్ళ మృతదేహాలు మహానగరపు వీధుల్లో పడి ఉన్నాయి. ఈ మహానగరం సొదొమతో, ఈజిప్టుతో పోల్చబడింది. ఇక్కడ వాళ్ళ ప్రభువు సిలువకు వేయబడ్డాడు. 9 మూడున్నర రోజులు ప్రతి దేశానికి, ప్రతి జాతికి, ప్రతి భాషకు, ప్రతి గుంపుకు చెందిన ప్రజలు ఆ శవాలను చూస్తారు. వాళ్ళు వాటిని సమాధి చేయటానికి నిరాకరిస్తారు. 10 ఈ యిరువురు ప్రవక్తలు భూమ్మీద నివసిస్తున్న వాళ్ళకు కష్టాలు కలిగించారు. కనుక ప్రజలు ఆ ప్రవక్తలు మరణించటం చూసి ఆనందించారు. పరస్పరం కానుకలు పంపుకున్నారు. వేడుకలు చేసుకొన్నారు.
11 కాని మూడున్నర రోజుల తర్వాత దేవుడు ప్రవక్తల్లో మళ్ళీ ప్రాణం పోశాడు. వాళ్ళు లేచి నిలుచున్నారు. వీళ్ళను చూసిన ప్రజలు చాలా భయపడిపోయారు. 12 అప్పుడు పరలోకంనుండి ఒక స్వరం బిగ్గరగా, “మీదికి రండి” అని అనటం వాళ్ళు విన్నారు. శత్రువులు చూస్తుండగా, వాళ్ళు ఒక మేఘం మీద పరలోకానికి వెళ్ళిపోయారు.
13 అదే క్షణంలో ఒక పెద్ద భూకంపం వచ్చింది. పట్టణంలో పదవ భాగం నాశనమైపోయింది. భూకంపంవల్ల సుమారు ఏడువేల మంది మరణించారు. బ్రతికున్నవాళ్ళు చాలా భయపడిపోయి పరలోకంలో ఉన్న దేవుణ్ణి స్తుతించారు.
14 రెండవ శ్రమ ముగిసింది. మూడవ శ్రమ త్వరలో జరుగనుంది.
ఏడవ బూర
15 ఏడవ దేవదూత తన బూర ఊదాడు. పరలోకం నుండి అనేక స్వరాలు యిలా బిగ్గరగా అనటం వినిపించింది:
“ప్రపంచం మన ప్రభువు రాజ్యంగా మారింది. ఆయన క్రీస్తు రాజ్యంగా మారింది.
ఆయన చిరకాలం రాజ్యం చేస్తాడు.”
16 దేవుని సమక్షంలో సింహాసనాలపై కూర్చొన్న యిరువది నాలుగు మంది పెద్దలు సాష్టాంగపడ్డారు. 17 వాళ్ళు దేవుణ్ణి పూజిస్తూ ఈ విధంగా అన్నారు:
“ప్రభూ! సర్వశక్తివంతుడవైన దైవమా!
నీవు ప్రస్తుతం ఉన్నావు, గతంలో ఉన్నావు.
నీ గొప్ప శక్తిని ఉపయోగించి మళ్ళీ పాలించటం మొదలుపెట్టావు.
కనుక నీకు మా కృతజ్ఞతలు!
18 దేశాలు ఆగ్రహం చెందాయి.
ఇప్పుడు నీకు ఆగ్రహం వచ్చింది.
చనిపోయినవాళ్ళపై తీర్పు చెప్పే సమయం వచ్చింది.
నీ సేవకులైన ప్రవక్తలకు ప్రతిఫలం యిచ్చే సమయం వచ్చింది.
నీ పవిత్రులకు, నీ నామాన్ని గౌరవించేవాళ్ళకు,
సామాన్యులకు, పెద్దలకు,
అందరికి ప్రతిఫలం యిచ్చే కాలం వచ్చింది.
భూమిని నాశనం చేసేవాళ్ళను నాశనం చేసే కాలం వచ్చింది.”
19 అప్పుడు పరలోకంలో ఉన్న దేవుని మందిరం తెరువబడింది. ఆ మందిరంలో ఉన్న ఆయన పరిశుద్ధమైన ఒడంబడిక మందసం కనిపించింది. అప్పుడు మెరుపులు, గర్జనలు, ఉరుములు, భూకంపము, పెద్ద వడగండ్ల వాన వచ్చాయి.
© 1997 Bible League International