Print Page Options
Previous Prev Day Next DayNext

Old/New Testament

Each day includes a passage from both the Old Testament and New Testament.
Duration: 365 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
జెఫన్యా 1-3

ఇది జెఫన్యాకు యెహోవా ఇచ్చిన సందేశం. ఆమోను కుమారుడైన యోషీయా యూదాకు రాజుగా ఉన్న కాలంలో జెఫన్యా ఈ సందేశం అందుకొన్నాడు. జెఫన్యా కూషీ కుమారుడు. కూషీ గెదల్యా కుమారుడు. గెదల్యా అమర్యా కుమారుడు. అమర్యా హిజ్కియా కుమారుడు.

ప్రజలకు యెహోవా తీర్పు దినం

“భూమి మీదనున్న సమస్తాన్ని నేను నాశనం చేస్తాను! మనుష్యులందరినీ, జంతువులన్నింటినీ నేను నాశనం చేస్తాను. ఆకాశంలో పక్షుల్ని, సముద్రంలో చేపల్ని నేను నాశనం చేస్తాను. దుర్మార్గులను, వారిచేత పాపం చేయించే వాటన్నింటినీ[a] నేను నాశనం చేస్తాను. భూమి మీద నుండి మనుష్యులందరినీ నేను తొలగించి వేస్తాను” అని యెహోవా చెపుతున్నాడు.

ఈ సంగతులను యెహోవా చెప్పాడు: “యూదాను మరియు యెరూషలేములో నివసిస్తున్న ప్రజలను నేను శిక్షిస్తాను. ఆ స్థలంనుండి నేను వీటిని తీసివేస్తాను. బయలు దేవత పూజ చివరి గుర్తులను నేను తొలగించి వేస్తాను. నేను పూజారులను తొలగించి వేస్తాను. నక్షత్రాలను పూజించుటకు వారి యింటి కప్పుల మీదికి వెళ్ళే వారందరినీ నేను తొలగించి వేస్తాను. ఆ బూటకవు యాజకులను ప్రజలు మరచి పోతారు. కొంతమంది నన్ను పూజిస్తున్నామని అంటారు. ఆ ప్రజలు నన్ను ఆరాధిస్తామని వాగ్దానం చేసారు. కాని ఇప్పుడు వారు బూటకపు దేవత మిల్కోమును పూజిస్తున్నారు. కనుక ఆ ప్రజలను ఆ స్థలంనుండి నేను తొలగించి వేస్తాను. కొందరు మనుష్యులు యెహోవానుండి తిరిగిపోయారు. వారు నన్ను వెంబడించుట విడిచిపెట్టారు. ఆ ప్రజలు సహాయంకోసం యెహోవాను అడగటం మానివేసారు. కనుక నేను ఆ ప్రజలను ఆ స్థలంనుండి తొలగించివేస్తాను.”

నా ప్రభువైన యెహోవాముందు నిశ్శబ్దంగా ఉండు! ఎందుచేతనంటే, ప్రజలకు యెహోవా తీర్పు చెప్పే దినం త్వరలో వస్తుంది గనుక! యెహోవా తన బలిని సిద్ధం చేశాడు. తాను ఆహ్వానించిన అతిథులతో సిద్ధంగా ఉండమని చెప్పాడు.

“బలి అర్పించే యెహోవా దినాన రాజకుమారులను, ఇతర నాయకులను నేను శిక్షిస్తాను. విదేశీ వస్త్రాలు ధరించిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. ఆ సమయంలో గుమ్మం దాటిన ప్రజలందరినీ నేను శిక్షిస్తాను. అబద్ధాలతో, హింసతో యజమాని ఇంటిని నింపిన వారిని నేను శిక్షిస్తాను” అని యెహోవా చెప్పాడు.

10 యెహోవా ఇంకా ఇలా చెప్పాడు, “ఆ సమయంలో యెరుషలేములోని చేప ద్వారం దగ్గర ప్రజలు సహాయంకోసం కేకలు వేస్తారు. పట్టణంలోని ఇతర చోట్ల ప్రజలు ఏడుస్తుంటారు. పట్టణం చుట్టూరా కొండల్లో నాశనం చేయబడుతున్నవాటి పెద్ద శబ్దాలను ప్రజలు వింటారు. 11 పట్టణం దిగువ ప్రాంతంలో నివసించే ప్రజలారా, మీరు ఏడుస్తారు. ఎందుకు? ఎందుకంటే వ్యాపారస్తులు, ధనిక వర్తకులు అందరూ నాశనం చేయబడతారు గనుక.

12 “ఆ సమయంలో నేను దీపం పట్టుకొని యెరూషలేము అంతటా వెదకుతాను. వారి ఇష్టానుసారంగా జీవిస్తూ తృప్తిపడుతోన్న మనుష్యులందరినీ నేను కనుగొంటాను. ఆ ప్రజలు, ‘యెహోవా ఏమీ చేయడు. ఆయన సహాయం చేయడు, ఆయన బాధించడు’ అని అంటారు. అలాంటి వారిని నేను కనుగొని, వారిని శిక్షిస్తాను! 13 అప్పుడు మిగిలిన వారు, వారి ఐశ్వర్యాలను తీసికొని వారి ఇండ్లను నాశనం చేస్తారు. ఆ సమయంలో ఇండ్లు కట్టుకొన్నవారు వాటిలో నివసించరు. మరియు ద్రాక్షాతోటలు నాటుకొన్నవారు ఆ ద్రాక్షాపండ్ల రసం తాగరు. ఇతరులకు అవి లభిస్తాయి.”

14 యెహోవా తీర్పు తీర్చే ప్రత్యేక దినం త్వరగా వచ్చేస్తుంది! ఆ రోజు దగ్గర్లో ఉంది; మరియు వేగంగా వచ్చేస్తుంది. యెహోవా ప్రత్యేక తీర్పు దినాన ప్రజలు విచారకరమైన శబ్దాలు వింటారు. బలమైన సైనికులు కూడ ఏడుస్తారు! 15 ఆ సమయంలో దేవుడు తన కోపం చూపిస్తాడు. అది భయంకరమైన కష్టకాలంగా ఉంటుంది. అది విధ్వంస సమయంగా ఉంటుంది. అది చీకటి, మబ్బు, తుఫాను రోజుగా, చీకటి సమయంగా ఉంటుంది. 16 అది భద్రతా గోపురాలలో, సంరక్షిత పట్టణాలలో ప్రజలు బూరలూ, బాకాలూ వినే యుద్ధ సమయంలా ఉంటుంది.

17 యెహోవా ఇలా చెప్పాడు: “నేను ప్రజలకు జీవితం చాలా దుర్భరం చేస్తాను. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకుండా నడిచే గుడ్డివారిలా ప్రజలు అటు ఇటు నడుస్తారు. ఎందుకంటే, ఆ ప్రజలు యెహోవాకు విరోధంగా పాపం చేసారు గనుక. అనేకమంది ప్రజలు చంపబడతారు. వారి రక్తం నేలమీద చిందుతుంది. వారి మృతదేహాలు నేలమీద పెంట కుప్పలా ఉంటాయి. 18 వారి బంగారం, వెండి వారికి యెహోవా ఉగ్రత దినంలో సహాయం చేయవు! ఆ సమయంలో యెహోవా చాలా చికాకుపడి కోపంగా ఉంటాడు. యెహోవా మొత్తం ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. భూమిమీద ప్రతి ఒక్కరినీ యెహోవా సర్వనాశనం చేస్తాడు!”

ప్రజలు జీవితాలు మార్చుకోవాలని యెహోవా అడగటం

సిగ్గులేని ప్రజలారా, మీ జీవితాలు మార్చుకోండి. అదీ, మీరు వాడిపోయి చనిపోతున్న పుష్పంలా కాకముందే. పగటి ఎండకు ఒక పుష్పం వాడిపోతుంది, చనిపోతుంది. యెహోవా తన భయంకర కోపం చూపించినప్పుడు మీరు అలానే ఉంటారు. కనుక మీ మీద యెహోవా కోపపు రోజు వస్తుంది. మీ బతుకులు మార్చుకోండి! దీనులైన సర్వజనులారా, యెహోవా దగ్గరకు రండి! ఆయన చట్టాలకు విధేయులుగా ఉండండి. మంచి పనులు చేయటం నేర్చుకోండి. వినయంగా ఉండటం నేర్చుకోండి. ఒకవేళ అప్పుడు, యెహోవా తన కోపం చూపించేవేళ, మీరు క్షేమంగా ఉంటారేమో.

ఇశ్రాయేలీయుల పొరుగువారిని యెహోవా శిక్షిస్తాడు

గాజాలో ఏ ఒక్కడూ విడువబడడు. అష్కెలోను నాశనం చేయబడుతుంది. మధ్యాహ్నానికల్లా అష్డోదునుండి ప్రజలు బలవంతంగా వెళ్లగొట్టబడతారు. ఎక్రోను శూన్యం అవుతుంది! ఫిలిష్తీ ప్రజలారా, సముద్ర తీరంలో నివసించే ప్రజలారా, యెహోవా దగ్గరనుండి వచ్చిన ఈ సందేశం మిమ్మల్ని గూర్చిందే. కనాను దేశమా, పాలస్తీనా దేశమా, నీవు నాశనం చేయబడతావు. అక్కడ ఎవ్వరూ నివసించరు! సముద్రం పక్కన ఉన్న మీ దేశం గొర్రెల కాపరులకు, వారి గొర్రెలకు బంజరు పొలాలుగా అవుతుంది. అప్పుడు యూదా వారిలో శేషించిన వారికి ఆ దేశం చెందుతుంది. ఆ యూదా ప్రజలను యెహోవా జ్ఞాపకం చేసుకొంటాడు. ఆ ప్రజలు ఒక విదేశంలో బందీలుగా ఉన్నారు. కాని యెహోవా వారిని వెనుకకు తీసుకొని వస్తాడు. అప్పుడు యూదా ప్రజలు ఆ పొలాల్లో తమ గొర్రెలను గడ్డి మేయనిస్తారు. రాత్రిళ్ళు అవి అష్కెలోను ఖాళీ ఇండ్లలో పండుకొంటాయి.

యెహోవా ఇలా అంటున్నాడు: “మోయాబు మరియు అమ్మోను ప్రజలు ఏమి చేసారో నాకు తెలుసు! ఆ ప్రజలు నా ప్రజలను ఇబ్బంది పెట్టారు. ఆ ప్రజలు వారి స్వంత దేశాలను విశాల పరచు కొనేందుకు వారి భూమిని తీసుకొన్నారు. కనుక నేను బ్రతికి ఉన్నంత నిశ్చయంగా, మోయాబు మరియు అమ్మోను ప్రజలు సొదొమ, గొమొర్రాల్లా నాశనం చేయబడతారు. నేను ఇశ్రాయేలీయుల దేవుడను, సర్వశక్తిగల యెహోవాను. ఆ దేశాలు శాశ్వతంగా సర్వనాశనం చేయబడతాయని నేను వాగ్దానం చేస్తున్నాను. వారి దేశంనిండా కలుపు మొక్కలు పెరిగి పొతాయి. వారి దేశం మృత సముద్రపు ఉప్పుచేత కప్పబడిన దేశంలా ఉంటుంది. నా ప్రజలలో శేషించినవారు ఆ దేశాన్ని, అందులో మిగిలిన వాటన్నింటినీ తీసుకొంటారు.”

10 మోయాబు మరియు అమ్మోను ప్రజలు గర్వపడి, దేవుని ప్రజలను గేళిచేసి, సర్వశక్తిగల యెహోవా ప్రజలపట్ల క్రూరంగా పవర్తించారు. వారిని అవమాన పర్చారు. కనుక వాళ్లకు అవి జరిగే తీరుతాయి. 11 ఆ ప్రజలు యెహోవాకు భయపడతారు. ఎందుకంటే యెహోవా వారి దేవతలను నాశనం చేస్తాడు గనుక. అప్పుడు దూర దేశాలన్నింటిలోని మనుష్యులందరూ యెహోవాను ఆరాధిస్తారు. 12 కూషీయులారా, దీని అర్థం మిమ్ములను, యెహోవా ఖడ్గం మీ ప్రజలను కూడా చంపుతుంది. 13 మరియు యెహోవా ఉత్తరంగా తిరిగి అష్షూరును శిక్షిస్తాడు. నీనెవెను ఆయన నాశనం చేస్తాడు-ఆ పట్టణం ఎండిన ఎడారిలా శూన్యంగా ఉంటుంది. 14 అప్పుడు గొర్రెలు, అడవి జంతువులు మాత్రమే శిథిలమైన ఆ పట్టణంలో నివసిస్తాయి. అక్కడ మిగిలిపోయిన స్తంభాలమీద గుడ్లగూబలు, కాకులు కూర్చుంటాయి. వాటి అరుపులు కిటికీలగుండా వినిపిస్తాయి. గుమ్మాలమీద కాకులు కూర్చుంటాయి. ఆ ఖాళీ ఇండ్లలో నల్ల పక్షులు కూర్చుంటాయి. 15 నీనెవె ఇప్పుడు ఎంతో గర్వంగా ఉంది. అది చాలా సంతోషంతో నిండిన పట్టణంగా ఉంది. ఆ ప్రజలు క్షేమంగా ఉన్నామని తలుస్తున్నారు. ప్రపంచమంతటిలో నీనెవె పట్టణమే మహా గొప్ప పట్టణమని వారు తలుస్తున్నారు. కాని ఆ పట్టణం నాశనం చేయబడుతుంది! అది అడవి జంతువులు పండుకొనేందుకు వెళ్లే శూన్య ప్రదేశం అవుతుంది. ఆ స్థలం ప్రక్కగా వెళ్ళే మనుష్యులు ఆ పట్టణం అంత విపరీతంగా నాశనం చేయబడటం చూసినప్పుడు వారు తలలు ఊవుతూ ఈలలు వేస్తారు.

యెరూషలేం భవిష్యత్తు

యెరూషలేమూ, నీ ప్రజలు దేవునికి విరోధంగా యుద్ధం చేశారు! నీ ప్రజలు ఇతరులను బాధించారు, నీవు పాపంతో అపవిత్రమయ్యావు. నీ ప్రజలు నా మాట వినలేదు! వారు నా ప్రబోధాలు అంగీకరించలేదు. యెరూషలేము యెహోవాను నమ్మలేదు. యెరూషలేము తన దేవుని దగ్గరకు వెళ్ళలేదు. యెరూషలేము నాయకులు గర్జించే సింహాల్లా ఉన్నారు. దాని న్యాయమూర్తులు గొర్రెలమీద దాడి చేసేందుకు రాత్రివేళ వచ్చి ఉదయానికి ఏమీ మిగల్చని ఆకలిగొన్న తోడేళ్లలా ఉన్నారు. దాని ప్రవక్తలు ఇంకా, ఇంకా ఎక్కువ సంపాదించటం కోసం ఎల్లప్పుడూ వారి రహస్య పథకాలు వేస్తూనే ఉన్నారు. దాని యాజకులు పవిత్రమైన విషయాలను పవిత్రం కానట్టే చూశారు. దేవుని ప్రబోధాలను వారు అతిక్రమించారు. కాని దేవుడు ఇంకా ఆ పట్టణంలో ఉన్నాడు. మరియు ఆయన మంచివాడుగానే కొనసాగుతున్నాడు. దేవుడు తప్పు ఏమీ చేయడు. ఆయన తన ప్రజలకు సహాయం చేస్తూనే ఉంటాడు. ఆయన ప్రజలు మంచి నిర్ణయాలు చేసేందుకు ఆయన వారికి ప్రతి ఉదయం సహాయం చేస్తాడు. కాని ఆ దుర్మార్గులు తాము చేసే చెడ్డ పనుల విషయంలో సిగ్గుపడరు.

దేవుడు చెపుతున్నాడు: “నేను మొత్తం జన సమూహాలను నాశనం చేశాను. నేను వారి సంరక్షణా దుర్గాలను నాశనం చేశాను. నేను వారి వీధులను నాశనం చేశాను, అక్కడకు ఇప్పుడు ఎవ్వరూ వెళ్ళరు. వారి పట్టణాలు ఖాళీ, అక్కడ ఇంకెంత మాత్రమూ ఎవ్వరూ నివసించరు. నీవు ఒక పాఠం నేర్చుకోవాలని ఈ సంగతులు నీతో నేను చెబుతున్నాను. నీవు నాకు భయపడి, నన్ను గౌరవించాలని నేను కోరుతున్నాను. ఒకవేళ నీవు ఇలా చేస్తే, నీ ఇల్లు నాశనం చేయబడదు. నీవు ఇలా చేస్తే, నా పథకం ప్రకారం నిన్ను నేను శిక్షించాల్సి ఉండదు.” కాని ఆ చెడ్డ ప్రజలు ఇదివరకే చేసిన ఆ చెడుకార్యాలనే ఇంకా ఎక్కువగా చేయాలనుకొన్నారు!

యెహోవా చెప్పాడు: “కనుక కొంచెం వేచి ఉండండి! నేను నిలిచి మీకు తీర్పు చెప్పేంతవరకు వేచి ఉండండి. అనేక దేశాలనుండి మనుష్యులను రప్పించి, మిమ్మల్ని శిక్షించేందుకు వారిని వాడుకొనే హక్కు నాకు ఉంది. మీ మీద నా కోపం చూపించేందుకు నేను ఆ ప్రజలను వాడుకొంటాను. నాకు ఎంత చికాకు కలిగిందో చూపించేందుకు నేను వారిని వాడుకొంటాను. మరియు మొత్తం దేశం నాశనం చేయబడుతుంది! అప్పుడు నేను ఇతర జనాంగములనుండి ప్రజలను మార్పు చేస్తాను. కాబట్టి వారు స్పష్టంగా మాట్లాడుతూ ప్రభువు నామాన్ని పేరుపెట్టి పిలువగలరు. వారందరూ ఒకే ప్రజగా కూడి నన్ను ఆరాధిస్తారు. 10 కూషు దేశంలోని నది ఆవలివైపున, అంత దూరంనుండి ప్రజలు వస్తారు. చెదరిపోయిన నా ప్రజలు నా దగ్గరకు వస్తారు. నా భక్తులు వస్తారు. మరియు నాకు వారు కానుకలు తెస్తారు.

11 “యెరూషలేమూ, అప్పుడు నీవు, నీ ప్రజలు నాకు విరోధంగా చేసే చెడు విషయాలనుగూర్చి ఇంకెంత మాత్రం సిగ్గుపడవు. ఎందుకంటే, ఆ దుర్మార్గులందరినీ యెరూషలేమునుండి నేను తొలగించి వేస్తాను. ఆ గర్విష్ఠులందరినీ నేను తొలగించివేస్తాను. నా పరిశుద్ధ పర్వతంమీద ఆ గర్విష్ఠులు ఎవ్వరూ ఉండరు. 12 దీనులను, సాత్వికులను మాత్రమే నేను నా పట్టణంలో (యెరూషలేము) ఉండనిస్తాను. మరియు వారు యెహోవా నామాన్ని నమ్ముకొంటారు. 13 ఇశ్రాయేలులో మిగిలినవారు చెడు పనులు చేయరు. వారు అబద్ధాలు చెప్పరు. వారు అబద్ధాలు చెప్పి, ప్రజలను మోసగించేందుకు ప్రయత్నించరు. వారు తిని, ప్రశాంతంగా పడుకొనే గొర్రెల్లా ఉంటారు-వారిని ఎవరూ ఇబ్బంది పెట్టరు.”

ఒక ఆనంద గానం

14 యెరూషలేమా! పాడుతూ సంతోషంగా ఉండు!
    ఇశ్రాయేలూ, ఆనందంగా కేకలు వేయి!
    యెరూషలేమా, సంతోషించి సరదాగా ఉండు!
15 ఎందుకంటే, నీ శిక్షను యెహోవా నిలిపివేశాడు గనుక!
    నీ శత్రువుల బలమైన దుర్గాలను ఆయన నాశనం చేశాడు!
ఇశ్రాయేలు రాజా, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
    ఏ చెడు విషయం జరుగుతున్నా దాన్నిగూర్చి నీవు దిగులు పడాల్సిన అవసరం లేదు.
16 ఆ సమయంలో యెరూషలేముతో ఇలా చెప్పబడుతుంది:
    “బలంగా ఉండు, భయపడవద్దు!
17 నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు.
    ఆయన శక్తిమంతుడైన సైనికునిలా ఉన్నాడు.
    ఆయన నిన్ను రక్షిస్తాడు.
ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో అది ఆయన నీకు చూపిస్తాడు.
    ఆయన నీగురించి సంతోషపడతాడు, నీవంటే ఆనందిస్తాడు.
విందులో పాల్గొన్నవారివలె ఆయన నీ విషయంలో నవ్వుతూ సంతోషిస్తాడు.
18     అది విందులో పాల్గొన్న ప్రజల్లా ఉంటుంది.”
యెహోవా చెప్పాడు: “నీ అవమానాన్ని నేను తొలగించివేస్తాను.
    ఆ ప్రజలు నిన్ను బాధించకుండునట్లు నేను చేస్తాను.
19 ఆ సమయంలో, నిన్ను బాధించేవారిని నేను శిక్షిస్తాను.
    బాధించబడిన నా ప్రజలను నేను రక్షిస్తాను.
    పారిపోయేలా బలవంతం చేయబడిన ప్రజలను నేను తిరిగి వెనుకకు తీసుకొనివస్తాను.
మరియు నేను వారిని ప్రసిద్ధి చేస్తాను.
    అన్ని చోట్లా ప్రజలు వారిని పొగడుతారు.
20 ఆ సమయంలో, నిన్ను నేను వెనుకకు తీసుకొని వస్తాను.
    నేను నిన్ను సమకూర్చి తీసుకొని వస్తాను.
నిన్నునేను ప్రసిద్ధి చేస్తాను. అన్ని చోట్లా ప్రజలు నిన్ను పొగడుతారు.
    నీ సొంత కళ్ళయెదుట బందీలను తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది జరుగుతుంది!”
ఆ సంగతులు యెహోవా చెప్పాడు.

ప్రకటన 16

కోపంతో నిండుకొన్న ఏడు పాత్రలు

16 మందిరం నుండి ఒక స్వరం బిగ్గరగా ఆ ఏడుగురు దూతలతో, “వెళ్ళండి, దేవుని కోపంతో నిండిపోయిన ఆ ఏడు పాత్రల్ని భూమ్మీద కుమ్మరించండి” అని అనటం నాకు వినిపించింది.

మొదటి దూత వెళ్ళి తన పాత్రను భూమ్మీద కుమ్మరించాడు. మృగం ముద్రవున్నవాళ్ళ దేహాల మీద, మృగం విగ్రహాన్ని పూజించినవాళ్ళ దేహాలమీద బాధ కలిగించే వికారమైన కురుపులు లేచాయి.

రెండవ దూత వెళ్ళి, తన పాత్రను సముద్రం మీద కుమ్మరించాడు. ఆ సముద్రం శవంలోని రక్తంలా మారిపోయింది. సముద్రంలో ఉన్న సమస్త జీవరాసులు మరణించాయి.

మూడవ దూత తన పాత్రను నదులమీద, నీటి ఊటలమీద కుమ్మరించాడు. వాటి నీళ్ళు రక్తంగా మారాయి. నీటి మీద అధికారమున్న దూత ఈ విధంగా అనటం విన్నాను:

“నీవు న్యాయంగా తీర్పు చెప్పావు. నీవు ప్రస్తుతం ఉన్నావు.
గతంలో ఉండిన వాడవు.
నీవు పవిత్రమైన వాడవు, ఎందుకంటే నీవు ఆ విధంగా తీర్పు తీర్చావు.
వాళ్ళు నీ భక్తుల రక్తాన్ని, నీ ప్రవక్తల రక్తాన్ని కార్చారు.
దానికి తగిన విధంగా
    నీవు వాళ్ళకు త్రాగటానికి రక్తాన్నిచ్చావు.”

బలిపీఠం ఈ విధంగా సమాధానం చెప్పటం నేను విన్నాను:

“ఔను ప్రభూ! సర్వశక్తి సంపన్నుడవైన ఓ దైవమా!
    నీ తీర్పులు సత్యసమ్మతమైనవి. న్యాయసమ్మతమైనవి.”

నాల్గవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించాడు. ప్రజల్ని వేడితో మాడ్చివేయటానికి సూర్యునికి అధికారమివ్వబడింది. తీవ్రమైన వేడివల్ల ప్రజలు మాడిపోయారు. వాళ్ళు ఈ తెగుళ్ళ మీద అధికారమున్న దేవుని నామాన్ని దూషించారు. వాళ్ళు పశ్చాత్తాపం చెందటానికి నిరాకరించారు. ఆయన్ని స్తుతించటానికి నిరాకరించారు.

10 ఐదవ దూత తన పాత్రను మృగం యొక్క సింహాసనం మీద క్రుమ్మరించాడు. వెంటనే వాని రాజ్యం చీకటిలో మునిగి పోయింది. ప్రజలు నొప్పితో తమ నాలుకలు కొరుక్కున్నారు. 11 తమ బాధలకు, తమ కురుపులకు పరలోకంలోవున్న దేవుణ్ణి దూషించారు. కాని తాము చేసిన చెడ్డ పనులను మాని మారుమనస్సు పొందటానికి నిరాకరించారు.

12 ఆరవ దూత, తన పాత్రను యూఫ్రటీసు అను మహానది మీద క్రుమ్మరించాడు. తూర్పున ఉన్న రాజులకు మార్గం సిద్ధం కావాలని ఆ నది ఎండిపోయింది. 13 ఆ తర్వాత కప్పల్లా కనిపించే అసహ్యకరమైన మూడు దయ్యాలు కనిపించాయి. అవి ఘటసర్పం నోటినుండి, మృగం నోటినుండి, దొంగ ప్రవక్త నోటినుండి బయటికి వచ్చాయి. 14 అవి భూతాత్మలు. వాటికి మహత్కార్యాలు చేసే శక్తి ఉంది. అవి సర్వశక్తి సంపన్నుడైన దేవుని “మహాదినం” నాడు జరిగే యుద్ధాని కోసం రాజుల్ని సిద్ధం చేయటానికి ప్రపంచంలోని రాజులందరి దగ్గరకి వెళ్తాయి.

15 “జాగ్రత్త! నేను దొంగలా వస్తాను. తన దుస్తులు తన దగ్గర ఉంచుకొని, మేలుకొని ఉన్నవాడు ధన్యుడు. అలా చేయకపోతే అతడు నగ్నంగా వెళ్ళి తన నగ్నతకు అవమానపడవలసి వస్తుంది.”

16 ఆ భూతాత్మలు హీబ్రూ భాషలో “హార్‌మెగిద్దోను” అనే ప్రదేశంలో రాజుల్ని సమావేశ పరిచాయి.

17 ఏడవ దూత తన పాత్రను గాలిలో క్రుమ్మరించాడు. మందిరంలో ఉన్న సింహాసనం మీదినుండి ఒక స్వరం బిగ్గరగా “సమాప్తం” అని అన్నది. 18 వెంటనే మెరుపులు మెరిసాయి. ఉరుములు, గర్జనలు వినిపించాయి. తీవ్రమైన భూకంపం వచ్చింది. మానవుడు భూమ్మీద పుట్టిననాటి నుండి అటువంటి భూకంపం ఎన్నడూ జరుగలేదు. ఆ భూకంపం అంత తీవ్రంగా ఉంది. 19 మహానగరం మూడు భాగాలుగా చీలిపోయింది. దేశాల్లో ఉన్న పట్టణాలు కూలిపోయాయి. దేవుడు బాబిలోను మహానగరాన్ని శిక్షించటం మరచిపోలేదు. దాని పాత్రలో “తీవ్రమైన ఉగ్రత” అనబడే మద్యాన్ని పోసాడు. 20 ద్వీపాలు, పర్వతాలు మాయమైపోయాయి. 21 ఆకాశం నుండి పెద్ద వడగండ్లు వచ్చి ప్రజలమీద పడ్డాయి. అవి ఒక్కొక్కటి అయిదేసి మణుగుల బరువు ఉన్నాయి. ఈ వడగండ్ల వాన కలిగించినందుకు ప్రజలు దేవుణ్ణి దూషించారు. ఈ వడగండ్ల వల్ల ప్రజలకు చాలా బాధ కలిగింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International