Old/New Testament
యెరూషలేమునుండి న్యాయం రావటం
4 చివరి రోజులలో ఇలా జరుగుతుంది.
పర్వతాలన్నిటిలో దేవుడైన యెహోవా ఆలయమున్న పర్వతం మిక్కిలి ప్రాముఖ్యంగలది అవుతుంది.
అది కొండలన్నిటిలో ఉన్నతంగా చేయబడుతుంది.
అన్యదేశాల ప్రజలు దానివద్దకు ప్రవాహంలా వస్తారు.
2 అనేక దేశాలవారు వచ్చి ఇలా అంటారు:
“రండి, మనం యెహోవా పర్వతంమీదికి వెళదాం!
యాకోబు దేవుని ఆలయానికి వెళదాం!
యెహోవా తన ధర్మాన్ని మనకు నేర్పుతాడు.
ఆయన మార్గంలో మనం నడుద్దాం.”
ఎందువల్లనంటే దేవుని బోధలు సీయోనునుండి వస్తాయి.
యెహోవా వాక్కు యెరూషలేమునుండి వస్తుంది!
3 యెహోవా అనేక జనుల మధ్య తీర్పు తీర్చుతాడు.
బహు దూరానగల బలమైన దేశాల ప్రజలకు ఆయన తీర్పు ఇస్తాడు.
అప్పుడు వారు తమ కత్తులను సాగగొట్టి వాటిని నాగలికర్రులుగా చేస్తారు.
ఆ జనులు తమ ఈటెలను సాగగొట్టి చెట్లను నరికే పనిముట్లుగా చేస్తారు.
జనులు ఒకరితో ఒకరు కత్తులతో యుద్ధం చేయటం మాని వేస్తారు.
వారిక ఎన్నడూ యుద్ధ వ్యూహాలను అధ్యయనం చేయరు!
4 లేదు, ప్రతి ఒక్కడూ తన ద్రాక్షాచెట్లక్రింద,
అంజూరపు చెట్లక్రింద కూర్చుంటాడు.
వారిని ఎవ్వరూ భయపడేలా చేయరు!
ఎందువల్లనంటే సర్వశక్తిమంతుడైన యెహోవా ఇది చెప్పాడు!
5 అన్యదేశాల ప్రజలు తమతమ దేవుళ్లను అనుసరిస్తారు.
కానీ మనం మాత్రం మన దేవుడైన యెహోవా నామాన్ని సదా స్మరించుకుంటాం!
రాజ్యం తిరిగి పొందటం
6 యెహోవా చెపుతున్నాడు,
“యెరూషలేము గాయపర్చబడగా కుంటిది అయ్యింది.
యెరూషలేము అవతలకు విసిరివేయబడింది.
యెరూషలేము గాయపర్చబడింది; శిక్షింపబడింది.
అయినా నేను ఆమెను నా వద్దకు తీసుకొనివస్తాను.
7 “ఆ ‘కుంటి’ నగరవాసులే బతుకుతారు.
ఆ నగర ప్రజలు నగరం వదిలివెళ్లేలా బలవంత పెట్టబడ్డారు.
కాని నేను వారిని ఒక బలమైన రాజ్యంగా రూపొందిస్తాను.”
యెహోవా వారికి రాజుగా ఉంటాడు.
ఆయన శాశ్వతంగా సీయోను పర్వతం మీదనుండి పరిపాలిస్తాడు.
8 ఓ మందల కావలిదుర్గమా,
ఓ సీయోను కుమార్తె పర్వతమైన
ఓఫెలూ, గతంలోమాదిరి
నీవొక రాజ్యంగా రూపొందుతావు.
అవును, సీయోను కుమారీ,
ఆ రాజ్యం నీకు వస్తుంది.
ఇశ్రాయేలీయులు బబులోనుకు ఎందుకు వెళ్లాలి?
9 నీవిప్పుడు అంత బిగ్గరగా ఎందుకు ఏడుస్తున్నావు?
నీ రాజు వెళ్లిపోయాడా?
నీ నాయకుని నీవు కోల్పోయావా?
ప్రసవవేదనపడే స్త్రీలా నీవు బాధ పడుతున్నావు.
10 సీయోను కుమారీ, నీవు బాధపడు.
ప్రసవించే స్త్రీలా నీవు నొప్పిని అనుభవించి “బిడ్డను” కను.
ఎందుకంటే నీవు (యెరూషలేము) నగరాన్ని ఇప్పుడు వదిలివేస్తావు.
నీవు వెళ్లి పొలంలో నివసిస్తావు.
నీవు బబులోను (బాబిలోనియా)కు వెళతావు.
కానీ నీవక్కడనుండి రక్షింపబడతావు.
యెహోవా అక్కడికి వెళ్లి, నిన్ను
నీ శత్రువులనుండి తిరిగి తీసుకొని వస్తాడు.
యెహోవా ఇతర దేశాలను నాశనం చేయుట
11 అనేక దేశాలు నీమీద యుద్ధానికి వచ్చాయి.
“సీయోనువైపు చూడు!
దానిపై దాడి చేయండి!” అని ఆ జనులు అంటారు.
12 ఆ జనులు వారి వ్యూహాలు పన్నారు.
కాని యెహోవా చేసే యోచన మాత్రం వారు ఎరుగరు.
యెహోవా ఆ ప్రజలను ఇక్కడికి ఒక ప్రత్యేక ఉద్దేశ్యంతో తీసుకొని వచ్చాడు.
కళ్లంలో ధాన్యం నూర్చబడినట్లు ఆ జనులు నలగదొక్కబడతారు.
ఇశ్రాయేలు శత్రువులను ఓడించుట
13 “సీయోను కుమారీ, లెమ్ము; ఆ జనాలను అణగదొక్కు.
నేను నిన్ను బాగా బలపర్చుతాను.
నీకు ఇనుప కొమ్ములు, కంచు గిట్టలు ఉన్నట్లవుతుంది.
అనేకమంది జనులను నీవు ముక్కలుగా చితకగొడతావు.
వారి సంపదను నేను యెహోవాకు ఇస్తాను.
వారి భాగ్యాన్ని సర్వజగత్తుకూ అధిపతియైన యెహోవాకు సమర్పిస్తాను.”
5 కావున, బలమైన నగరమా, నీ సైన్యాలను సమీకరించు.
నీ శత్రువులు ముట్టడించటానికి కూడుకుంటున్నారు.
వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని చెంపమీద కొడతారు.
బెత్లెహేములో మెస్సీయ పుట్టుక
2 కాని, బేత్లెహేము ఎఫ్రాతా,
నీవు యూదాలో అతి చిన్న గ్రామానివి.
నీ వంశం లెక్కపెట్టటానికి కూడా అతి చిన్నది.
అయినప్పటికీ, నీ నుండే నా “ఇశ్రాయేలు పాలకుడు” వస్తాడు.
ఆయన ఆరంభం (ఉనికి) పురాతన కాలంనుండి,
అనాది కాలంనుండి ఉంటూవుంది.
3 యెహోవా తన ప్రజలను బబులోను (బాబిలోనియా)లో ఉండనిస్తాడు.
స్త్రీ[a] ప్రసవించేదాకా వారక్కడ ఉంటారు.
అప్పుడు ఇంకా బతికివున్న అతని సోదరులు తిరిగివస్తారు.
వారు ఇశ్రాయేలు ప్రజలవద్దకు తిరిగివస్తారు.
4 అప్పుడు ఇశ్రాయేలును పాలించేవాడు నిలబడి తన మందను మేపుతాడు.
యెహోవా తన శక్తితోను; దేవుడైన యెహోవా తన అద్భుత నామ మహత్తుతోను వారిని నడిపించుతాడు.
వారు నిర్భయంగా జీవిస్తారు.
ఎందువల్లనంటే, ఆ సమయంలో ఆయన గొప్పతనం భూమి అంచులదాకా వ్యాపిస్తుంది.
5 శాంతి నెలకొంటుంది.
అష్షూరు సైన్యం మన దేశంలోకి వస్తుంది.
ఆ సైన్యం మన పెద్ద ఇండ్లను నాశనంచేస్తుంది.
కాని ఇశ్రాయేలు పాలకుడు ఏడుగురు గొర్రెల కాపరులను ఎంపికచేస్తాడు.
కాదు, ఆయన ఎనమండుగురు నాయకులనుఎంపిక చేస్తాడు.
6 వారు తమ కత్తులను ఉపయోగించి, అష్షూరువారిని పాలిస్తారు.
వారు తమ స్వంత నగరాలనుండి నిమ్రోదుదేశాన్ని పాలిస్తారు.
ఆ ప్రజలను పాలించటానికి వారు తమ కత్తులను ఉపయోగిస్తారు.
అప్పుడు ఇశ్రాయేలు పాలకుడు మనలను అష్షూరీయులనుండి రక్షిస్తాడు.
ఆ ప్రజలు మన రాజ్యంలోకి వస్తారు.
వారు మన ప్రాంతాన్ని తమ కాళ్ళకింద త్రొక్కుతారు.
7 యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు యెహోవా కురిపించే మంచులా ఉంటారు.
వారు పచ్చిగడ్డిపై పడే వర్షంలా ఉంటారు.
వారు ఏ మనిషి కోసమూ వేచి ఉండరు.
వారు ఎవరికీ భయపడరు.
8 అడవి జంతువుల మధ్య సింహం ఎలా ఉంటుందో,
యాకోబు సంతతిలో మిగిలినవారు, చాలామంది ప్రజలకు అలా ఉంటారు.
గొర్రెలమందల్లో చొరబడిన కొదమసింహంలా వారుంటారు.
సింహం నడుచుకుంటూ వెళ్లినప్పుడు అది ఎటు వెళ్లదలిస్తే అటు వెళుతుంది.
అది ఒక జంతువును ఎదుర్కొన్నప్పుడు ఎవ్వడూ దానిని అదుపు చేయలేడు.
మిగిలి ఉన్న జనులు అటువంటి సింహంలా ఉంటారు.
9 మీరు మీ చేతిని మీ శత్రువులపైకి ఎత్తి,
వారిని నాశనం చేస్తారు.
ప్రజలు దేవునిపై ఆధారపడుట
10 దేవుడైన యెహోవా చెపుతున్నాడు,
“ఆ సమయంలో మీ గుర్రాలను మీవద్దనుండి తీసుకుంటాను.
మీ రథాలను నాశనంచేస్తాను.
11 మీ దేశంలోగల నగరాలను నేను నాశనం చేస్తాను.
మీ కోటలన్నిటినీ కూలగొడతాను.
12 మీరిక ఎంతమాత్రం మంత్రతంత్రాలు చేయ ప్రయత్నించరు.
భవిష్యత్తును చెప్ప యత్నించే జనులు మీకిక ఉండబోరు.
13 మీ బూటకపు దేవుళ్ల విగ్రహాలను నేను నాశనం చేస్తాను.
ఆ బూటకపు దేవుళ్ల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రాళ్లను నేను పడగొడతాను.
నీ చేతులు చేసిన వస్తువులను నీవు ఆరాధించవు.
14 అషేరా దేవతను ఆరాధించటానికి ఏర్పాటు చేయబడిన స్తంభాలను లాగివేస్తాను.
మీ బూటకపు దేవుళ్లను నేను నాశనం చేస్తాను.
15 కొంతమంది మనుష్యులు నా మాట వినరు.
నేను నా కోపాన్ని చూపిస్తాను. ఆ జనులకు నేను ప్రతీకారం చేస్తాను.”
స్త్రీ, ఘటసర్పం
12 పరలోకంలో ఒక గొప్ప అద్భుతమైన దృశ్యం కనిపించింది. సూర్యుణ్ణి తన వస్త్రంగా, చంద్రుణ్ణి తన పాదాల క్రింద, పన్నెండు నక్షత్రాల కిరీటాన్ని తలపై పెట్టుకొన్న ఒక స్త్రీ కనిపించింది. 2 ఆమె గర్భంతో ఉంది. ప్రసవించే సమయం రావటంవల్ల ఆమె నొప్పులతో బిగ్గరగా కేక వేసింది.
3 అప్పుడు పరలోకంలో ఇంకొక దృశ్యం కనిపించింది. ఒక పెద్ద ఘటసర్పం, ఏడు తలలతో, పది కొమ్ములతో కనిపించింది. అది ఎర్రగా ఉంది. ఆ ఏడు తలలమీద ఏడు కిరీటాలు ఉన్నాయి. 4 ఆ ఘటసర్పం తన తోకతో ఆకాశం నుండి నక్షత్రాలలో మూడవభాగాన్ని ఊడ్చి, వాటిని భూమ్మీదికి పారవేసింది. ఆ స్త్రీ ప్రసవించిన వెంటనే ఆ శిశువును మ్రింగి వేద్దామని, ఆ ఘటసర్పం ప్రసవించబోయే ఆ స్త్రీ ముందు నిలబడివుంది.
5 ఆమె ఒక మగ శిశువును ప్రసవించింది. ఆ బాలుడు దేశాలను గొప్ప అధికారంతో పాలిస్తాడు. ఆ శిశువు ఎత్తబడి దేవుని సింహాసనం దగ్గరకు తీసుకు వెళ్ళబడ్డాడు. 6 ఆ స్త్రీ ఎడారి ప్రాంతానికి పారిపోయింది. ఆమెను పన్నెండువందల అరువది రోజుల దాకా జాగ్రత్తగా చూసుకోవటానికి దేవుడు ఒక స్థలం ఏర్పాటు చేశాడు.
7 పరలోకంలో ఒక యుద్ధం జరిగింది. మిఖాయేలు, అతని దూతలు ఘటసర్పంతో యుద్ధం చేసారు. ఘటసర్పం తన దూతలతో తిరిగి యుద్ధం చేసింది. 8 ఆ ఘటసర్పానికి తగినంత శక్తి ఉండనందువల్ల ఓడిపోయి పరలోకంలో వాటి స్థానాన్ని పోగొట్టుకొన్నాయి. 9 వాళ్ళు ఆ ఘటసర్పాన్ని భూమ్మీదికి త్రోసి వేశారు. ఇది ప్రపంచాన్ని తప్పుదారి పట్టించే ఆది సర్పం. చాలాకాలం నుండి ఉన్న ఈ ఘటసర్పానికి దయ్యమని, సాతాను అని పేరు. ఆ ఘటసర్పాన్ని, దాని దూతల్ని వాళ్ళు క్రిందికి త్రోసివేశారు.
10 పరలోకం నుండి ఒక పెద్ద స్వరం బిగ్గరగా యిలా అనటం విన్నాను: “మనదేవుని ముందు మన సోదరుల్ని రాత్రింబగళ్ళు నిందించే వాడు క్రిందికి త్రోసివేయబడ్డాడు. అందుకే మన దేవుని రాజ్యం వచ్చింది. రక్షణ శక్తి లభించింది. ఆయన క్రీస్తుకు అధికారం వచ్చింది. 11 గొఱ్ఱెపిల్ల రక్తంతో, తాము బోధించిన సత్యంతో మన సోదరులు వాణ్ణి ఓడించారు. వాళ్ళు తమ జీవితాల్ని, చావుకు భయపడేటంతగా ప్రేమించ లేదు. 12 కనుక పరలోకమా! ఆనందించు. పరలోకంలో ఉన్నవారలారా! ఆనందించండి. ప్రపంచమా! నీలో సాతాను ప్రవేశించాడు కనుక నీకు శాపం కలుగుతుంది! సముద్రమా! నీకు శాపం కలుగుతుంది! సాతానుకు తన కాలం తీరిందని తెలుసు. కనుక వాడు చాలా కోపంతో ఉన్నాడు.”
13 ఘటసర్పం తాను భూమ్మీదకు విసిరివేయబడటం గమనించి మగ శిశువును ప్రసవించిన స్త్రీని వెంటాడింది. 14 ఆమెకోసం ఎడారి ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన స్థలానికి ఆమె ఎగిరి పోవటానికి, దేవుడు ఆమెకు రెండు పక్షిరాజు రెక్కల్ని యిచ్చాడు. అక్కడ ఆ ఘటసర్పానికి దూరంగా ఆమె మూడున్నర సంవత్సరాలు జాగ్రత్తగా పోషించబడుతుంది. 15 ఆ సర్పం తన నోటినుండి నీళ్ళను వదిలింది. ఆ నీళ్ళు ఒక నదిలా ప్రవహించాయి. ఆ నీళ్ళు ఆమెను కొట్టుకు పోయేటట్లు చేయాలని ఆ ఘటసర్పం ప్రయత్నించింది. 16 కాని భూమి తన నోరు తెరిచి ఘటసర్పం కక్కిన నీటిని త్రాగి ఆ స్త్రీని రక్షించింది. 17 ఆ స్త్రీని చూసి ఘటసర్పానికి చాలా కోపం వచ్చింది. అది ఆమె యొక్క మిగతా సంతానంతో యుద్ధం చేయాలని వెళ్ళింది. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ యేసును గురించి సాక్ష్యం చెప్పింది ఈమె మిగతా సంతానమే.
18 వారితో యుద్ధం చేయటానికి ఆ ఘట సర్పం సముద్రతీరం దగ్గర నిలబడి ఉంది.
© 1997 Bible League International