Old/New Testament
యెహోవా ఫిర్యాదు
6 యెహోవా ఏమి చేపుతున్నాడో ఇప్పుడు విను.
నీవు లేచి, పర్వతాలముందు నిలబడు.
వాటికి నీ కథ విన్నవించుకో. కొండలను నీ కథ విననియ్యి.
2 తన ప్రజలకు వ్యతిరేకంగా యెహోవాకు ఒక ఫిర్యాదు వుంది.
పర్వతాల్లారా, యెహోవా చేసే ఫిర్యాదు వినండి.
భూమి పునాదుల్లారా, యెహోవా చేప్పేది వినండి.
ఇశ్రాయేలుది తప్పు అని ఆయన నిరూపిస్తాడు!
3 యెహోవా చెపుతున్నాడు, “నా ప్రజలారా, మీ పట్ల నేనేమి తప్పు చేశాను?
మీరు నాపట్ల విరక్తి చెందేలా నేను ఏమి చేశాను?
మీకు నేను చేసిన పనులు నాకు చెప్పండి!
4 నేను చేసిన పనులు మీకు నేను చెపుతాను!
ఐగుప్తు (ఈజిప్టు) దేశం నుండి మిమ్మల్ని నేను తీసుకువచ్చాను.
మీకు నేను దాస్యంనుండి విముక్తి కలిగించాను.
నేను మీవద్దకు మోషే, అహరోను, మిర్యాములను పంపాను.
5 నా ప్రజలారా, మోయాబు రాజైన బాలాకు చేసిన దుష్టవ్యూహాలను మీరు గుర్తుపెట్టుకోండి.
బెయోరు కుమారుడైన బిలాము అనేవాడు బాలాకుకు చెప్పిన విషయాలు గుర్తుకు తెచ్చుకోండి.
అకాసియ (షిత్తీము) నుండి గిల్గాలువరకు జరిగిన విషయాలను గుర్తుకు తెచ్చుకోండి.
అప్పుడు యెహోవా న్యాయ వర్తనుడని మీరు తెలుసుకుంటారు!”
దేవుడు మననుండి ఏమి కోరుతున్నాడు?
6 దేవుడైన యెహోవా సన్నిధికి నేను వచ్చినప్పుడు,
నేను దేవుని ముందు సాష్టాంగ పడినప్పుడు నాతో నేనేమి తీసుకొనిరావాలి?
ఒక సంవత్సరం వయస్సుగల కోడెదూడను
దహనబలి నిమిత్తం తీసుకొని నేను యెహోవా వద్దకు రావాలా?
7 యెహోవా వెయ్యి పొట్టేళ్లతో లేక పదివేల నదులకు సమానమైన నూనెతో సంతృప్తి చెందుతాడా?
నా పాప పరిహారానికి నా ప్రథమ సంతానాన్ని బలి ఇవ్వనా?
నా పాపాలకు పరిహారంగా నా శరీరంలో
భాగంగా పుట్టిన శిశువును అర్పించనా?
8 మానవుడా, మంచి విషయాలను గురించి యెహోవా నీకు చెప్పియున్నాడు.
యెహోవా నీనుండి కోరేవి ఇవి:
ఇతరులపట్ల నీవు న్యాయంగా ప్రవర్తించు.
ప్రజలపట్ల ప్రేమ, దయ కలిగిఉండటానికి ఇష్టపడు.
అణకువ కలిగి నీ దేవునితో జీవించు.
ఇశ్రాయేలీయులు ఏమి చేస్తున్నారు?
9 దేవుడైన యెహోవా కంఠం నగరాన్ని (యెరూషలేమును) పిలుస్తూవుంది.
తెలివిగల మనుష్యుడు యెహోవా నామాన్ని గౌరవిస్తాడు.
కావున శిక్షించే దండంపట్ల, ఆ దండాన్నిచేత ధరించేవానిపట్ల ధ్యానముంచు!
10 దుష్టులు తాము దొంగిలించిన
ధనరాశులను ఇంకా దాస్తున్నారా?
దుష్టులు ఇంకా మరీ చిన్న బుట్టలతో
జనాన్ని మోసగిస్తున్నారా?
అలా ప్రజలను మోసగించే విధానాలను యెహోవా అసహ్యించుకుంటాడు!
11 దుష్టులు ఇంకా తప్పుడు కొలతలు,
తప్పుడు తూనికలతో ప్రజలను మోసగిస్తున్నారా?
తప్పుడు కొలతలు కొలవటానికి వారింకా దొంగ తూకపురాళ్లు,
దొంగ కొలతలుగల సంచులు కలిగియున్నారా?
అవును! అవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి!
12 ఆ నగరంలో ధనవంతులు ఇంకా క్రూరమైన పనులు చేస్తున్నారు!
ఆ నగరవాసులు ఇంకా అబద్ధాలు చెపుతున్నారు!
అవును, ఆ ప్రజలు అబద్ధాలు చెపుతూనే ఉన్నారు!
13 కావున నేను నిన్ను శిక్షించటం మొదలుపెట్టాను.
నీ పాపాల కారణంగా నేను నిన్ను నాశనంచేస్తాను.
14 నీవు తింటావు; కానీ నీ కడుపు నిండదు.
నీ కడుపు ఖాళీగా ఉండి, నీవు ఇంకా ఆకలితో ఉంటావు.
నీవు ప్రజలను సురక్షితంగా ఉంచటానికి ప్రయత్నిస్తావు.
కాని కత్తులు పట్టిన జనులు నీవు కాపాడిన జనులను చంపుతారు, నిన్ను పట్టుకుంటారు.
15 నీవు విత్తనాలు చల్లుతావు;
కానీ నీవు పంట కోయలేవు.
ఒలీవ గింజలను గానుగ పడతావు;
కానీ నీకు నూనె రాదు.
నీ తియ్యటి ద్రాక్షారసం తాగటానికి
నీవు అనుమతింపబడవు.
16 ఎందుకంటే నీవు ఒమ్రీ[a] నిర్దేశించిన కట్టుబాట్లను అనుసరిస్తూ,
అహాబు వంశంవారు చేసిన చెడు పనులన్నీ చేస్తున్నావు.
నీవు వారి బోధలను పాటిస్తున్నావు.
అందువల్ల నీవు నాశనమయ్యేలా చేస్తాను.
నీ నగరవాసులు నవ్వుల పాలవుతారు.
చీదర పుట్టించే నా జనులు బందీలుగా కొనిపోబడతారు.
ప్రజల దుష్కార్యాలపట్ల మీకా కలత చెందటం
7 నేను కలత చెందాను! ఎందుకంటే, నేను సేకరించబడిన వేసవి కాలపు పండులా ఉన్నాను.
పండిపోయిన ద్రాక్షాపండ్లవలె ఉన్నాను.
తినటానికి ద్రాక్షాపండ్లు మిగలలేదు.
నేను కాంక్షించే తొలి అంజూరపు పండ్లు లేనేలేవు.
2 అనగా విశ్వాసంగల జనులంతా పోయారు.
ఈ దేశంలో మంచివాళ్లంటూ ఎవ్వరూ మిగలలేదు.
ప్రతి ఒక్కడూ మరొకడిని చంపటానికి వేచివున్నాడు.
ప్రతి ఒక్కడూ తన సోదరుని కపటోపాయంతో పట్టటానికి యత్నిస్తున్నాడు.
3 ప్రజలు తమ రెండు చేతులతో చెడ్డపనులు చేయటానికి సమర్థులైవున్నారు.
అధిపతులు లంచం అడుగుతారు.
ఒక న్యాయాధిపతి న్యాయస్థానంలో తన తీర్పును తారుమారు చేయటానికి డబ్బు తీసుకుంటాడు.
“ముఖ్యులగు పెద్దలు” మంచివైన, న్యాయమైన నిర్ణయాలు చేయరు. వారేది చేయదలచారో అదే చేస్తారు.
4 వారిలో అతి మంచివాడు సహితం ముండ్లపొదవలె ఉంటాడు.
వారిలో మిక్కిలి మంచివాడు సహితం ముండ్లపొద కంటే చాలా కంటకుడై ఉంటాడు.
శిక్షపడే రోజు వస్తూవుంది.
నీ ప్రవక్తలు ఈ రోజు వస్తుందని చెప్పారు.
నీ కావలివాండ్ర దినం రానేవచ్చింది.
ఇప్పుడు నీవు శిక్షింపబడతావు!
ఇప్పుడు నీవు కలవరపడతావు!
5 నీ పొరుగువానిని నమ్మవద్దు!
స్నేహితుని నమ్మవద్దు!
నీ భార్యతో సహితం
నీవు స్వేచ్చగా మాట్లాడవద్దు!
6 తన ఇంటివారే తనకు శత్రువులవుతారు.
ఒక కుమారుడు తన తండ్రిని గౌరవించడు.
ఒక కుమార్తె తన తల్లికి ఎదురు తిరుగుతుంది.
ఒక కోడలు తన అత్తపై తిరుగబడుతుంది.
యెహోవా రక్షకుడు
7 కావున సహాయంకొరకు నేను యెహోవాతట్టు చూస్తాను.
నాకు సహాయం చేయటానికి నేను యెహోవాకొరకు నిరీక్షిస్తాను.
నా దేవుడు నా మొర ఆలకిస్తాడు.
8 నేను పతనమయ్యాను. కానీ, ఓ శత్రువా, నన్ను చూచి నవ్వకు!
నేను తిరిగి లేస్తాను.
నేనిప్పుడు అంధకారంలో కూర్చున్నాను.
కానీ యెహోవాయే నాకు వెలుగు.
యెహోవా క్షమిస్తాడు
9 నేను యెహోవాపట్ల పాపం చేశాను.
అందువల్ల ఆయన నేనంటే కోపంగా ఉన్నాడు.
కానీ న్యాయస్థానంలో ఆయన నా తరఫున వాదిస్తాడు.
నాకు మంచి జరిగే పనులు ఆయన చేస్తాడు.
పిమ్మట ఆయన నన్ను వెలుగులోకి తీసుకువస్తాడు.
ఆయన చేసింది న్యాయమైనదని నేను గ్రహిస్తాను.
10 నా శత్రువు ఇది చూసి సిగ్గుపడతాడు.
“నీ దేవుడైన యెహోవా ఎక్కడున్నాడు?” అని నా శత్రువు నన్నడిగాడు.
ఆ సమయంలో ఆమెను చూసి నేను నవ్వుతాను.
వీధిలో మట్టిమీద నడిచినట్లు జనులు ఆమెమీద నడుస్తారు.
యూదులు తిరిగిరావటం
11 నీ గోడలు తిరిగి కట్టబడే సమయం వస్తుంది.
ఆ సమయంలో వారి దేశం విస్తరిస్తుంది.
12 నీ ప్రజలు నీ దేశానికి తిరిగివస్తారు.
అష్షూరునుండి, ఈజిప్టు దేశపు నగరాలనుండి వారు వస్తారు.
నీ దేశం ఈజిప్టు నది మొదలుకొని యూఫ్రటీసు నదివరకు,
పడమట సముద్రంనుండి తూర్పున పర్వతాలవరకు వ్యాపించి ఉంటుంది.
13 దేశం పాడైపోయింది. దానిలో నివసించే జనులవల్ల,
వారు చేసిన పనులవల్ల అది పాడైపోయింది.
14 కావున దండం చేపట్టి నీ ప్రజలను పాలించు.
నీకు చెందిన ప్రజాసమూహాన్ని పాలించు.
ఆ మంద (జనులు) అడవుల్లోనూ, కర్మెలు పర్వతం మీదనూ ఒంటరిగా ఉంటుంది.
గతంలో మాదిరి ఆ మంద బాషానులోనూ, గిలాదులోనూ నివసిస్తుంది.
ఇశ్రయేలు తన శత్రువులను ఓడించటం
15 నేను నిన్ను ఈజిప్టునుండి బయటకు తీసుకొని వచ్చినప్పుడు ఎన్నో అద్భుతకార్యాలు జరిపించాను.
ఆ రకంగా మీరింకా ఎన్నో అద్భుత కార్యాలు చూసేలా చేస్తాను.
16 అన్యజనులు ఆ అద్భుతకార్యాలు
చూసి, సిగ్గుపడతారు.
వారి “శక్తి” నాశక్తితో పోల్చినప్పుడు
వ్యర్థమైనదని వారు గ్రహిస్తారు.
వారు విస్మయం చెంది, వారి నోళ్లపై చేతులు వేసుకుంటారు!
వారు చెవులు మూసుకొని, వినటానికి నిరాకరిస్తారు.
17 వారు పాములా మట్టిలో పాకుతారు.
వారు భయంతో వణుకుతారు.
తమ బొరియల్లోనుంచి బయటకు వచ్చే కీటకాలవలె,
వారు నేలమీద పాకుతారు.
వారు భయపడి, దేవుడైన యెహోవా వద్దకు వస్తారు.
నీముందు వారు భయపడతారు!
యెహోవాకు స్తుతి
18 నీవంటి దేవుడు మరొకడు లేడు.
పాపం చేసిన దోషులను నీవు క్షమిస్తావు.
నీ ప్రజలలో మిగిలినవారి పాపాలవైపు నీవు చూడవు.
దేవుడైన యెహోవా కోపం శాశ్వతంగా ఉండదు.
ఎందుకంటే ఆయన కనికరం చూపటానికి ఇష్టపడతాడు.
19 యెహోవా, మమ్మల్ని ఓదార్చు. మా పాపాలను పరిహరించు.
మా పాపాలన్నిటినీ లోతైన సముద్రంలోకి విసిరివేయి.
20 దేవా, నీవు యాకోబు యెడల నమ్మకస్తుడవుగా ఉంటావు.
అబ్రహాము యెడల దయకలిగి యుంటావు. ఎందుకంటే మా పూర్వీకులకు పురాతన కాలమందు నీవు వాగ్దానం చేశావు.
సముద్రం నుండి మృగం పైకి రావటం
13 సముద్రం నుండి ఒక మృగం రావటం నేను చూసాను. దానికి పది కొమ్ములు, ఏడు తలలు ఉన్నాయి. ఆ పది కొమ్ములమీద పది కిరీటాలు ఉన్నాయి. ప్రతి తలపై ఒక దేవదూషణ పేరు వ్రాయబడి ఉంది. 2 నేను చూసిన ఆ మృగం ఒక చిరుతపులిలా ఉంది. కాని దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలా ఉన్నాయి. దాని నోరు సింహం నోరులా ఉంది. ఆ ఘటసర్పం ఆ మృగానికి తన శక్తిని, తన సింహాసనాన్ని, గొప్ప అధికారాన్ని యిచ్చింది.
3 ఆ మృగానికి ఉన్న తలల్లో ఒక తలకు ప్రమాదకరమైన గాయం ఉన్నట్లు కనిపించింది. కాని ఆ ప్రమాదకరమైన గాయం మానిపోయింది. ప్రపంచమంతా ఆశ్చర్యపడి ఆ మృగాన్ని అనుసరించింది. 4 ఘటసర్పం ఆ మృగానికి అధికారమిచ్చినందువల్ల మానవులు ఆ ఘటసర్పాన్ని పూజించారు. వాళ్ళు మృగాన్ని కూడా పూజిస్తూ, “ఈ మృగం వలె ఎవరున్నారు? ఈ మృగంతో ఎవరు యుద్ధం చేయగలరు?” అని అన్నారు.
5 గర్వంగా మాట్లాడటానికి, దైవదూషణ చేయటానికి, తన అధికారాన్ని నలుబది రెండు నెలలు చెలాయించడానికి ఆ మృగానికి నోరు యివ్వబడింది. 6 ఆ మృగం తన నోరు తెరచి దేవుణ్ణి దూషించింది. ఆయన నామాన్ని, ఆయన నివసించే స్థానాన్ని, పరలోకంలో నివసించే వాళ్ళను దూషణ చేసింది. 7 భక్తులతో యుద్ధం చేసి జయించటానికి దానికి శక్తి యివ్వబడింది. అంతేకాక, అన్ని జాతుల మీద, అన్ని గుంపుల మీద, అన్ని భాషల మీద, అన్ని దేశాల మీద ఆ మృగానికి అధికారమివ్వబడింది. 8 ఈ భూమ్మీద నివసించే వాళ్ళంతా, అంటే ప్రపంచం సృష్టింపబడిన నాటినుండి ఎవరి పేర్లు వధింపబడిన గొఱ్ఱెపిల్ల జీవగ్రంథంలో వ్రాయబడలేదో, వాళ్ళు ఈ మృగాన్ని పూజిస్తారు.
9 చెవులున్న వాళ్ళు వినండి:
10 బంధింపబడవలసినవాడు
బంధింపబడతాడు.
కత్తితో వధింపబడవలసినవాడు
వధింపబడతాడు.
కనుక భక్తుల్లో శాంతము, విశ్వాసము ఉండాల్సి వస్తుంది.
భూమిలోనుండి మృగం రావటం
11 తదుపరి మరొక మృగం భూమిలోపలి నుండి రావటం చూసాను. ఆ మృగానికి గొఱ్ఱెకు ఉన్నట్లు రెండు కొమ్ములు ఉన్నాయి. కాని అది ఘటసర్పం మాట్లాడినట్లు మాట్లాడింది. 12 అది ప్రమాదకరమైన గాయం నయమైన మొదటి మృగం పక్షాన, దాని అధికారమంతా ఉపయోగించి భూమిని, దానిపై నివసించే వాళ్ళను, మొదటి మృగాన్ని పూజించేటట్లు చేసింది. 13 అది అద్భుతమైన సూచనలు చూపింది. ప్రజలు చూస్తుండగా ఆకాశం నుండి మంటల్ని కూడా భూమ్మీదికి రప్పించింది.
14 మొదటి మృగం పక్షాన సూచనలు చూపటానికి దానికి అధికారమివ్వబడింది. ఈ అధికారంతో అది భూమ్మీద నివసించే వాళ్ళను మోసం చేస్తోంది. కత్తితో గాయపడి కూడా జీవించిన మృగానికి గౌరవార్థంగా ఒక విగ్రహాన్ని స్థాపించమని ప్రజల్ని ఆజ్ఞాపించింది. 15 మొదటి మృగం యొక్క విగ్రహానికి ప్రాణం పోసే శక్తి యివ్వబడింది. ఆ విగ్రహం మాట్లాడి, తనను పూజించటానికి నిరాకరించిన వాళ్ళను చంపేటట్లు చేసింది. 16 అంతేకాక చిన్నా, పెద్దా, ధనికుడూ, పేదవాడు, బానిస, స్వతంత్రుడు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కడూ తన కుడి చేతి మీదగాని, నుదుటిమీదగాని, ఒక ముద్ర వేసుకోవాలని నిర్బంధం చేసింది. 17 ఈ ముద్ర లేకుండా ఎవ్వరూ అమ్మటం కాని, కొనటం కాని, చేయరాదని యిలా చేసింది. ఈ ముద్రలలో ఆ మృగం పేరు, లేక దాని పేరుతో సంఖ్య వ్రాయబడి ఉంది.
18 ఇక్కడే తెలివి కావాలి. ఆ పరిజ్ఞానం ఉన్నవాడు ఆ మృగం యొక్క సంఖ్య ఏదో చెప్పనీ! ఎందుకంటే అది ఒక మనుష్యుని సంఖ్య. వాని సంఖ్య ఆరువందల అరువదియారు.
© 1997 Bible League International