Old/New Testament
పవిత్ర కార్యాలకు భూమి విభజన
45 “మీరు చీట్లువేసి భూమిని ఇశ్రాయేలు వంశపు వారి మధ్య విభజించాలి. ఆ సమయంలో ఒక భూమి భాగాన్ని మీరు విడిగా ఉంచాలి. అది యెహోవా యొక్క పవిత్ర భాగం. ఆ భూమి పొడవు ఇరవైఐదువేల మూరలు వెడల్పు ఇరవై వేల మూరలు. ఈ భూమి అంతా పవిత్రమైనది. 2 రెండువేల ఐదు వందల మూరల చదరపు అడుగుల పొడవున్న చతురస్రాకార స్థలాన్ని గుడికి కేటాయించ బడాలి. గుడి చుట్టూ ఐదువందల మూరలు గల ఖాళీస్థలం ఉండాలి. 3 పవిత్ర స్థలంలో ఇరవై ఐదువేల మూరలు పొడవు; పదివేల మూరల వెడల్పు గల స్థలాన్ని కొలవాలి. ఈ ప్రదేశంలోనే గుడి ఉండాలి. గుడి ప్రదేశం అతి పవిత్ర స్థలంగా ఉండాలి.
4 “ఆ భూమిలో పవిత్ర భాగం యాజకుల వినియోగార్థమై, ఆలయ సేవకుల నిమిత్తం వాళ్ళు ఎక్కడ యెహోవా దగ్గరకు సేవ చేయటానికి వస్తారో వాళ్ళ కోసం ఉంటుంది. యాజకుల ఇండ్ల నిమిత్తం, ఆలయానికి స్థానంగా అది వినియోగ పడుతుంది. 5 ఐదు లక్షల ఇరవై ఐదువేల మూరల పొడవు, పదివేల మూరల వెడల్పుతో మరొక భూభాగం ఆలయంలో సేవ చేసే లేవీయులకు ప్రత్యేకించబడుతుంది. ఈ భూభాగం లేవీయుల నివాస ప్రాంతంగా కూడా ఉపయోగపడుతుంది.
6 “మీరు నగరానికి ఐదువేల మూరల వెడల్పు, రెండులక్షల ఏభైవేల మూరల పొడవుగల భూభాగాన్నిస్తారు. ఇది పవిత్ర స్థలం పొడవునా ఉంటుంది. ఇది ఇశ్రాయేలు వంశానికంతటికీ చెంది ఉంటుంది. 7 పాలనాధికారికి పవిత్ర స్థలానికి రెండు ప్రక్కల ఉన్న భూమి, నగరానికి చెందిన భూమిగా ఉంటుంది. ఒక తెగకు (గోత్రం) చెందిన స్థలం ఎంత వెడల్పు ఉంటుందో దీని వెడల్పు కూడ అంతే ఉంటుంది. ఇది పడమటి సరిహద్దు నుండి తూర్పు సరిహద్దు వరకు వ్యాపించి ఉంటుంది. 8 ఈ స్ధలం ఇశ్రాయేలులో పాలనాధికారి యొక్క ఆస్తి. అందువల్ల ఈ అధిపతి నా ప్రజల జీవితాలను ఏ మాత్రం కష్టాలపాలు చేయనవసరం లేదు. కానివారు ఈ స్థలాన్ని ఇశ్రాయేలీయులకు వంశాలవారీగా ఇస్తారు.”
9 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు, “ఇశ్రాయేలు పాలకులారా, ఇక చాలు! ప్రజల పట్ల క్రూరంగా ప్రవర్తించటం, వారి సొమ్ము కొల్ల గొట్టటం మానండి! న్యాయవర్తనులై మంచి పనులు చేయండి! నా ప్రజలను వారి ఇండ్ల నుండి వెడల గొట్టటం మానండి!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
10 “మీరు ప్రజలను మోసగించటం మానండి. మీరు ఖచ్చితమైన తూనికలు, కొలతలు వినియోగించండి! 11 ‘ఏఫా’[a] (పందుములో పదవ పాలు) మరియు ‘బత్’ (తూము) ఒకే పరిమాణంలో ఉండాలి. రెండూ ‘ఓమెరు’ లో పదవ వంతుకు సరిసమానంగా ఉండాలి. ఆ కొలతలు ‘ఓమెరు’ (పందుము) ను పరిమాణంగా చేసుకొని ఉండాలి. 12 ‘షెకెలు’ (తులం) ఇరవై ‘గెరా’లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక ‘మీనా’ అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.
13 “మీరు ఇచ్చే ప్రత్యేక (ప్రతిష్ఠిత) అర్పణ ఈలాగున ఉండాలి.
గోధుమలలో తూములో ఆరో భాగం,
యవలగింజలలో తూములో ఆరో భాగం వంతున అర్పించాలి.
14 తైల పదార్థాలు చెల్లించేటప్పుడు ప్రతి నూట ఎనభై పడుల[b] ఒలీవ నూనెలో ఒక
ముప్పాతిక పడుల వంతు నూనెను చెల్లించాలి. ఇది ఒక నిబంధన.
15 ఇశ్రాయేలులో నీటి వనరుగల ప్రాంతాలలో ఉన్న మందలలో
ప్రతి రెండు వందల గొర్రెలకు ఒక మంచి గొర్రె చొప్పున అర్పించాలి.
“ఆ ప్రత్యేక అర్పణలు ధాన్యార్పణల కొరకు, దహన బలులకు, సమాధాన (శాంతి) బలులకు ఇవ్వ బడతాయి. ఈ అర్పణలన్నీ ప్రజలను పరిశుద్ధులను చేయటానికి ఉద్దేశించబడ్డాయి.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.
16 “ఈ అర్పణ ప్రతి పౌరుడు ఇశ్రాయేలు పాలకునికి చెల్లిస్తాడు. 17 కావున పాలకుడు ప్రత్యేక పవిత్ర దినాలకు కావలసిన వస్తువులను తప్పక ఇవ్వాలి. విందు రోజులకు, అమావాస్యలకు, సబ్బాతు రోజులకు ఇశ్రాయేలు వంశం జరిపే ప్రత్యేక విందుల సమయాలకు దహన బలులు. ధాన్యార్పణలు, సానార్పణలు పాలకుడైన వాడు సమకూర్చాలి. ఇశ్రాయేలు వంశాన్ని పవిత్రపర్చే కార్యక్రమంలో ఇచ్చే పాపపరిహార బలులు, ధాన్యపు నైవేద్యాలు, దహన బలులు, సమాధాన బలులు పాలకుడు ఇవ్వాలి.”
18 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “మొదటి నెల మొదటి రోజున ఏ దోషమూ లేని ఒక కోడెదూడను తీసుకోవాలి. ఆలయాన్ని పరిశుద్ధం చేయటానికి మీరు ఆ కోడెదూడను ఉపయోగించాలి. 19 పాప పరిహారార్థమైన బలిరక్తాన్ని కొంత యాజకుడు తీసుకొని ఆలయ గుమ్మాల మీద, బలిపీఠం అంచు నాలుగు మూలల మీద మరియు లోపలి ఆవరణ గుమ్మం కమ్మెలమీద చల్లుతాడు. 20 ఇదే పని ఆ నెలలో ఏడవ రోజున ఎవరైనా పొరపాటునగాని, తెలియక గాని చేసిన పాప పరిహారం నిమిత్తం మీరు చేస్తారు. అలా మీరు ఆలయాన్ని పరిశుద్ధ పర్చాలి.
పస్కా పండుగ అర్పణలు
21 “మొదటి నెల పద్నాలుగవ రోజున మీరు పస్కా పండుగ జరుపుకోవాలి. పులియని రొట్టెల పండుగ ఇదే సమయంలో మొదలవుతుంది. ఆ పండుగ ఏడు రోజులపాటు జరుగుతుంది. 22 ఆ సమయంలో పాలకుడు తన కొరకునూ, ఇశ్రాయేలు ప్రజల కొరకునూ ఒక కోడెదూడను బలి ఇస్తాడు. అది పాపపరిహారార్థ బలి. 23 పండుగ జరిగే ఏడు రోజులు పాలకుడు ఏ దోషములేని ఏడు కోడెదూడలను, ఏడు పొట్టేళ్లను బలి ఇస్తాడు. అవి యెహోవాకు దహన బలులుగా సమర్పింపబడతాయి. పండుగ ఏడు రోజులూ రోజుకు ఒక కోడెదూడ చొప్పున పాలకుడు బలి ఇస్తాడు. ప్రతి రోజూ పాప పరిహారార్థమై అతడు ఒక మేకపోతును అర్పిస్తాడు. 24 ప్రతి కోడెదూడతో పాటు ఒక ఏఫా (సుమారు తొమ్మిది మానికెలు) యవలను ధాన్యపు నైవేద్యంగాను, ఒక ఏఫా యవలను ప్రతి పొట్టేలుతోను అధిపతి చెల్లిస్తాడు. ఇంకా పాలకుడు ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి. 25 పాలకుడు పర్ణశాలల పండుగ జరిపే ఏడు రోజులలోనూ ఇదే విధంగా తప్పక చేయాలి. ఈ పండుగ ఏడవ నెలలో పదిహేనవ రోజున మొదలవుతుంది. ఇవన్నీ పాపపరిహారార్థ అర్పణలు, దహన బలులు, ధాన్యార్పణలు, నూనె అర్పణలుగా పరిగణింపబడుతాయి.”
పాలకుడు-పండుగలు
46 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు, “లోపలి ఆవరణ తూర్పు ద్వారం ఆరు పని రోజులలోను మూసి ఉంచబడుతుంది. కాని అది సబ్బాతు రోజున, అమావాస్య రోజున తెరువబడుతుంది. 2 పాలకుడు ద్వారం మండపం గుండా లోనికి ప్రవేశించి, ద్వారం ప్రక్కన నిలబడతాడు. తరువాత యాజకులు పాలకుని తరుపున దహనబలి, సమాధాన బలులు సమర్పిస్తారు. ద్వారం గడపవద్దనే పాలకుడు ఆరాధించాలి, మరియు నమస్కరించాలి. అతడు బయటికి వెళతాడు. కాని సాయంత్రం వరకు ద్వారం మూయబడదు. 3 సబ్బాతు రోజులలోను, అమావాస్యలందు సాధారణ ప్రజలు కూడ యెహోవా ముందు ద్వారం తెరవబడిన దగ్గర పూజలు చేస్తారు.
4 “సబ్బాతు దినాన పాలకుడు యెహోవాకు దహన బలులు అర్పిస్తాడు. ఏ దోషమూలేని ఆరు గొర్రెపిల్లలను, ఏ దొషమూలేని ఒక పొట్టేలును అతడు సమకూర్చాలి. 5 పొట్టేలుతో పాటు ఒక ఏఫా (తొమ్మిది మానికెలు) ధాన్యాన్ని కూడ అతడు తప్పక ఇవ్వా్లి. పాలకుడు ధాన్యార్పణకు గొర్రె పిల్లలతో పాటు తను ఇవ్వగలిగినంత ఇస్తాడు. ప్రతి తొమ్మిది మానికెల (ఏఫా) ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) ఒలీవ నూనెను అతడు తప్పక ఇవ్వాలి.
6 “అమావాస్యనాడు ఏ దోషమూలేని ఒక కోడెదూడను అతడు తప్పక అర్పించాలి. ఏ దోషమూలేని ఆరు గొర్రె పిల్లలను, ఒక పొట్టేలును అతడు అర్పిస్తాడు. 7 కోడెదూడతో పాటు ఒక తూమెడు ధాన్యార్పణను, పొట్టేలుతో పాటు పాలకుడు తప్పక అందించాలి. గొర్రె పిల్లతోపాటు పాలకుడు తన శక్తికొలది సమర్పణలు ఇవ్వవచ్చు. ప్రతి తూమెడు ధాన్యానికి మూడు పడుల (ఒక గాలను) నూనె చొప్పున సమర్పించాలి.
8 “పాలకుడు వచ్చి తూర్పు ద్వారంలో గల మండపం ద్వారా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాలి. బయటకు కూడా వెళ్లిపోవాలి.
9 “ప్రత్యేక పండుగల సందర్భంలో దేశ ప్రజలు యెహోవా దర్శనార్థం వచ్చినప్పుడు, వారు ఉత్తర ద్వారం గుండా ఆరాధనకు వచ్చి దక్షిణ ద్వారం గుండా నేరుగా బయటకు వెళ్లాలి. దక్షిణ ద్వారం గుండా ప్రవేశించిన వ్యక్తి ఉత్తర ద్వారం గుండా బయటకు వెళ్లాలి. ఏ వ్యక్తీ ప్రవేశించిన ద్వారం గుండా బయటకు వెళ్లరాదు. ప్రతి ఒక్కడూ తిన్నగా బయటకు సాగి పోవాలి. 10 ప్రజలు లోపల ప్రవేశించినప్పుడు, వారితో పాటు పాలకుడు లోనికి వెళతాడు. వారితో పాటు పాలకుడు బయటకు వెళ్లాలి.
11 “విందులప్పుడు, ప్రత్యేక సమావేశాల సమయాలలోను ప్రతి కోడెదూడతోను తొమ్మిది మానికెల (ఒక ఏఫా) ధాన్యార్పణ తప్పక చేయాలి. ప్రతి పొట్టేలుతోను, తొమ్మిది మానికెల ధాన్యార్పణ చేయాలి. ప్రతి గొర్రె పిల్లతోను అతడు తన శక్తి కొలదీ ధాన్యాన్ని అర్పించాలి. ప్రతి తొమ్మిది మానికెల ధాన్యంతో పాటు మూడు పడుల (ఒక గాలను) నూనెను సమర్పించాలి.
12 “పాలకుడు తను స్వంతంగా దహనబలులు గాని, సమాధాన బలులుగాని తన ఇష్టపూర్వక అర్పణ (స్వేచ్చార్పణ) గాని యెహోవాకు ఇవ్వదలచినప్పుడు అతనికోసం తూర్పు ద్వారం తెరువబడుతుంది. అప్పుడు తను విశ్రాంతి రోజున అర్పించినట్లు తన దహనబలిని, సమాధానబలిని అర్పిస్తాడు. అతడు వెళ్లినాక తిరిగి ద్వారం మూయబడుతుంది.
అనుదిన అర్పణ
13 “మరియు మీరు ఏ దోషమూలేని ఒక ఏడాది వయస్సుగల గొర్రె పిల్లను ఇవ్వాలి. అది యెహోవాకు ప్రతి రోజూ దహనబలిగా ఇవ్వబడుతుంది. దానిని అనుదినం ఉదయం సమర్పించాలి. 14 ప్రతిరోజూ ఉదయం గొర్రె పిల్లతో పాటు ధాన్యార్పణ కూడ ఇవ్వాలి. ఇందు నిమిత్తం తూమెడు గోధుమ పిండిలో (ఏఫా) ఆరవ వంతు, ఆ సన్నపు పిండిని కలపటానికి ఒక పడి (గాలనులో మూడివ వంతు) నూనెను ఇవ్వాలి. ఇది యెహోవాకు అనుదిన ధాన్యార్పణ. ఇది శాశ్వతంగా పాటింపబడుతుంది. 15 ఆ విధంగా వారు గొర్రె పిల్లను, ధాన్యార్పణను, నూనెను ప్రతి ఉదయం ఎప్పటికీ దహన బలిగా ఇవ్వాలి.”
పాలకుడు భూమిని స్వతంత్రించుకొను నియమాలు
16 నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు: “రాజ్యాధిపతి తన కుమారులలో ఎవరికైనా తన భూమిలో కొంత భాగం కానుకగా ఇస్తే అది అతని కుమారులకు చెందుతుంది. అది వారి ఆస్తి. 17 ఒకవేళ పాలకుడు తన భూమిలో కొంత భాగాన్ని ఒక బానిసకు బహుమానం ఇస్తే, అది వాడు స్వేచ్చపొందే సంవత్సరం[c] వరకే వానికి చెందుతుంది. పిమ్మట ఆ బహుమానం రాజుకు తిరిగి వస్తుంది. కేవలం రాజు కుమారులు మాత్రమే అతను బహుమానం చేసిన భూమిని ఉంచుకుంటారు. 18 మరియు పాలకుడు ప్రజల భూమిని తన వశం చేసుకోడు. వారు భూమిని వదిలిపొమ్మని ఒత్తడి కూడ చేయడు. అతడు తన స్వంత భూమిలో కొంత భాగాన్ని మాత్రమే తన కుమారులకు ఇవ్వాలి. ఆ విధంగా నా ప్రజలు తమ భూమిని పోగొట్టుకునేలాగ రాజుచేత బలవంత పెట్టబడరు.”
ప్రత్యేక వంటగదులు
19 ఆ మనుష్యుడు నన్ను ద్వారం ప్రక్కనున్న మార్గం గుండా నడిపించాడు. ఉత్తర దిశన ఉన్న యాజకుల పవిత్ర గదుల వద్దకు నన్ను నడిపించాడు. అక్కడ బాగా పడమటికి ఉన్న ఒక స్థలాన్ని చూశాను. 20 ఆ మనుష్యుడు నాతో ఇలా అన్నాడు: “ఇక్కడే యాజకులు దోష బలి సమర్పణను, పాపపరిహారార్థ బలి సమర్పణను పెడతారు. ఇక్కడే యాజకులు ధాన్యార్పణలను (రొట్టె) కాల్చుతారు. ఈ విధంగా చేయటం వలన వారీ అర్పణ పదార్థాలను బయటి ఆవరణలోనికి తెచ్చే అవసరముండదు. కావున వారీ పవిత్ర పదార్థాలను సామాన్య ప్రజలు ఉండే చోటుకి తీసుకొనిరారు.”
21 తరువాత ఆ మనుష్యుడు నన్ను బయటి ఆవరణలోనికి తీసుకొని వచ్చాడు. అతడు నన్ను ఆవరణ నాలుగు మూలలకు నడిపించాడు. ఆవరణలో ప్రతి మూలా మరో చిన్న ఆవరణ ఉంది. 22 ఆవరణ యొక్క నాలుగు మూలలలోనూ చిన్న ఆవరణలు ఉన్నాయి. ప్రతి చిన్న ఆవరణ నలభై మూరలు పొడుగు ముప్పై మూరలు వెడల్పు కలిగి వుండెను. నాలుగు మూలలూ ఒకే కొలతలో ఉన్నాయి. 23 లోపల నాలుగు చిన్న ఆవరణాల్లోనూ ప్రతి ఒక్కదాని చుట్టూ ఒక ఇటుక గోడ ఉంది. నాలుగు చిన్న ఆవరణల్లోను గోడలకు అటకలు నిర్మింపబడ్డాయి. ఇటుక గోడల్లో వంటకు పొయ్యిలు కట్టబడ్డాయి. 24 “ఆలయంలో సేవ చేసే వారు ఈ పాకశాలల్లోనే ప్రజల కొరకు బలి మాంసాన్ని ఉడక బెడతారు” అని ఆ మనుష్యుడు నాకు చెప్పాడు.
యేసు మన సహాయకుడు
2 బిడ్డలారా! మీరు పాపం చెయ్యకూడదని మీకు లేఖను వ్రాస్తున్నాను. ఒకవేళ ఎవరైనా పాపం చేస్తే, మన పక్షాన తండ్రితో మాట్లాడేందుకు న్యాయవాది అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. 2 ఆయన మన పాప పరిహారార్థం బలి అయ్యాడు. మన పాపాల కోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పాపాలకోసం బలి అయ్యాడు.
3 ఆయన ఆజ్ఞల్ని మనం ఆచరిస్తే, ఆయన మనకు తెలుసుననే విశ్వాసం మనలో కలుగుతుంది. 4 ఆయన నాకు తెలుసని అంటూ ఆయన ఆజ్ఞల్ని పాటించనివాడు అబద్ధాలాడుతున్నాడన్నమాట. అలాంటి వ్యక్తిలో సత్యం ఉండదు. 5 యేసు ఆజ్ఞల్ని పాటించినవానిలో దేవుని ప్రేమ సంపూర్ణంగా ఉంటుంది. తద్వారా మనం ఆయనలో ఉన్నామని తెలుసుకొంటాము. 6 యేసులో జీవిస్తున్నానని చెప్పుకొనేవాడు, ఆయనలా నడుచుకోవాలి.
మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు
7 ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. 8 అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.
9 తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.
12 బిడ్డలారా! ఆయన పేరిట మీ పాపాలు క్షమించబడ్డాయి.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
13 వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాడెవరో మీకు తెలుసు!
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీరు సాతాన్ను గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
14 బిడ్డలారా! తండ్రిని మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
వృద్ధులారా! మొదటినుండి ఉన్నవాణ్ణి మీరెరుగుదురు.
అందుకే మీకు వ్రాస్తున్నాను!
యువకులారా! మీలో బలం ఉంది.
దేవుని సందేశం మీలో జీవిస్తోంది.
మీరు సాతానును గెలిచారు.
అందుకే మీకు వ్రాస్తున్నాను.
15 ప్రపంచాన్ని కాని, ప్రపంచంలో ఉన్నవాటిని కాని ప్రేమించకండి. అంటే, ప్రపంచాన్ని ప్రేమించే వ్యక్తిలో తండ్రి ప్రేమ ఉండదన్నమాట. 16 శారీరక వాంఛలు, కళ్ళలోని దురాశలు, ఒకడు చేసేదాన్ని బట్టి, కలిగియున్న దాన్ని బట్టి కలిగే గర్వం తండ్రికి సంబంధించినవి కావు. ఇవి ప్రపంచానికి సంబంధించినవి. 17 ఈ ప్రపంచము, దానిలో ఉన్న ఆశలు నశించిపోతాయి. కాని దైవేచ్ఛానుసారం జీవించే వ్యక్తి శాశ్వతంగా జీవిస్తాడు.
క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త
18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.
22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.
24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.
26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను. 27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.
28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి. 29 ఆయన నీతిమంతుడని మీకు తెలిసి ఉంటే నీతిని అనుసరించే ప్రతి ఒక్కడూ ఆయననుండి జన్మించాడని మీరు గ్రహిస్తారు.
© 1997 Bible League International