Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
ఆదికాండము 29:15-28

లాబాను యాకోబును మోసగించుట

15 ఒకనాడు లాబాను, “జీతం లేకుండా నా దగ్గర నీవు ఇలా పనిచేస్తూ ఉండటం సరిగా లేదు. నీవు బంధువుడివి. అంతేగాని బానిసవు కావు. నేను నీకు ఏమి చెల్లించాలి?” అని యాకోబును అడిగాడు.

16 లాబానుకు యిద్దరు కుమార్తెలుండిరి. పెద్దామె లేయా, చిన్నామె రాహేలు.

17 రాహేలు అందగత్తె. లేయా కళ్ల సమస్యగలది.[a] 18 యాకోబు రాహేలును ప్రేమించాడు. యాకోబు “నన్ను నీ చిన్న కుమార్తె రాహేలును పెళ్లాడనిస్తే, నేను నీకు ఏడు సంవత్సరాల పాటు పనిచేస్తాను” అని లాబానుతో చెప్పాడు.

19 “మరొకర్ని చేసుకోవడం కంటే ఆమె నిన్ను పెళ్లి చేసుకోవడం మంచిది. కనుక నా దగ్గరే ఉండు” అన్నాడు లాబాను.

20 కనుక యాకోబు అక్కడే ఉండి, రాహేలు కోసం ఏడు సంవత్సరాలు పని చేశాడు. అయితే అతడు రాహేలును అధికంగా ప్రేమించాడు గనుక అది అతనికి చాలా కొద్ది కాలంలాగే కనబడింది.

21 ఏడు సంవత్సరాలు అయ్యాక, “రాహేలును నాకు యివ్వండి, పెళ్లి చేసుకొంటాను. నీ దగ్గర నేను పని చేయాల్సిన కాలం తీరిపోయింది” అని యాకోబు లాబానుతో చెప్పాడు.

22 కనుక ఆ ప్రదేశంలోని ప్రజలందరికి లాబాను విందు ఇచ్చాడు. 23 ఆ రాత్రి లాబాను తన కుమార్తె అయిన లేయాను యాకోబు దగ్గరకు తీసుకు వచ్చాడు. యాకోబు లేయాలు లైంగికంగా కలుసుకొన్నారు. 24 తన దాసి జిల్ఫాను తన కుమార్తెకు దాసీగా లాబాను ఇచ్చాడు. 25 తాను సంభోగించినది లేయా అని తెల్లవారినప్పుడు యాకోబు తెలుసుకొన్నాడు. లాబానుతో యాకోబు, “నీవు నన్ను మోసం చేశావు. నేను రాహేలును పెళ్లి చేసుకోవాలని నీ దగ్గర కష్టపడి పని చేశాను. ఎందుకు నన్ను నీవు మోసం చేశావు?” అన్నాడు.

26 లాబాను చెప్పాడు: “పెద్ద కూతురికి పెళ్లికాక ముందు చిన్న కూతురికి పెళ్లి చేయటానికి మా దేశంలో ఒప్పుకోరు. 27 అయితే పెళ్లి ఆచారంగా వారం రోజులు ముగించు, రాహేలునుకూడ పెళ్లి చేసుకొనేందుకు ఇస్తాను. కానీ నీవు మాత్రం మరో ఏడు సంవత్సరాలు నా దగ్గర పని చేయాలి.”

28 కనుక యాకోబు అలాగే వారం ముగించాడు. అప్పుడు లాబాను తన కుమార్తె రాహేలును అతనికి భార్యగా ఇచ్చాడు.

కీర్తనలు. 105:1-11

105 యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుము. ఆయన నామాన్ని ఆరాధించుము.
    ఆయన చేసే అద్భుత కార్యాలను గూర్చి జనాలతో చెప్పు.
యెహోవాను గూర్చి పాడుము. ఆయనకు స్తుతులు పాడుము.
    ఆయన చేసే అద్భుతకార్యాలు అన్నింటిని గూర్చి చెప్పు.
యెహోవా పవిత్ర నామాన్ని గూర్చి అతిశయించు.
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, మీరంతా సంతోషించండి.
బలంకోసం యెహోవా దగ్గరకు వెళ్లండి.
    సహాయంకోసం ఎల్లప్పుడూ ఆయన దగ్గరకు వెళ్లండి.
యెహోవా చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
    ఆయన అద్భుతాలను, జ్ఞానంగల నిర్ణయాలను జ్ఞాపకం చేసుకోండి.
దేవుని సేవకుడైన అబ్రాహాము సంతతివారు మీరు.
    దేవుడు ఏర్పరచుకొన్న యాకోబు సంతతివారు మీరు.
యెహోవా మన దేవుడు.
    యెహోవా సర్వలోకాన్ని పాలిస్తాడు.[a]
దేవుని ఒడంబడికను శాశ్వతంగా జ్ఞాపకం చేసికోండి.
    వెయ్యి తరాలవరకు ఆయన ఆదేశాలను జ్ఞాపకం ఉంచుకోండి.
దేవుడు అబ్రాహాముతో ఒక ఒడంబడిక చేసాడు.
    ఇస్సాకుకు దేవుడు వాగ్దానం చేశాడు.
10 యాకోబుకు (ఇశ్రాయేలు) దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు.
    ఇశ్రాయేలుతో దేవుడు తన శాశ్వత ఒడంబడిక చేసాడు.
11 “నేను నీకు కనాను దేశాన్ని ఇస్తాను, ఆ దేశం నీకు చెందుతుంది.”
    అని దేవుడు చెప్పాడు.

కీర్తనలు. 105:45

45 దేవుడు తన ప్రజలు తన న్యాయ చట్టాలకు విధేయులవుతారని ఇలా చేసాడు.
    వారు ఆయన ఉపదేశములకు జాగ్రత్తగా విధేయులు కావాలని దేవుడు ఇలా చేసాడు.

యెహోవాను స్తుతించండి.

కీర్తనలు. 128

యాత్ర కీర్తన.

128 యెహోవా అనుచరులందరూ సంతోషంగా ఉంటారు.
    ఆ ప్రజలు యెహోవా కోరిన విధంగా జీవిస్తారు.

నీవు వేటికోసం పని చేస్తావో వాటిలో ఆనందిస్తావు.
    ఎవ్వరూ వాటిని నీ వద్దనుండి తీసుకోలేరు. నీవు సంతోషంగా ఉంటావు. మంచి విషయాలు నీకు సంభవిస్తాయి.
ఇంట్లో నీ భార్య ఫలించే ద్రాక్షావల్లిలా ఉంటుంది.
    బల్లచుట్టూరా నీ పిల్లలు, నీవు నాటిన ఒలీవ మొక్కల్లా ఉంటారు.
యెహోవా తన అనుచరులను నిజంగా ఈ విధంగా ఆశీర్వదిస్తాడు.
యెహోవా సీయోనులోనుండి నిన్ను ఆశీర్వదిస్తాడని నేను ఆశిస్తున్నాను.
    నీవు నీ జీవిత కాలమంతా యెరూషలేములో ఆశీర్వాదాలు అనుభవిస్తావని నేను ఆశిస్తున్నాను.
నీవు నీ మనుమలను, మనుమరాండ్రను చూచేంతవరకు జీవిస్తావని నేను ఆశిస్తాను.

ఇశ్రాయేలులో శాంతి ఉండునుగాక.

రోమీయులకు 8:26-39

26 అదే విధంగా మనం బలహీనులం కనుక, ఏ విధంగా ప్రార్థించాలో మనకు తెలియదు. కనుక, దేవుని ఆత్మ స్వయంగా మన పక్షాన మాటలు వ్యక్తపరచలేని మూలుగులతో దేవునికి తెలిపి మనకు సహాయపడుతున్నాడు. 27 ఆయన దేవునితో తన ప్రజలకోసం ఆయన ఇచ్ఛానుసారం విన్నపం చేస్తున్నాడు. మన హృదయాలను పరిశోధించే దేవునికి ఆయన యొక్క ఆలోచనలు తెలుసు.

28 దేవుడు తనను ప్రేమించే ప్రజల కోసం, తన ఉద్దేశానుసారం పిలువబడినవాళ్ళ కోసం ఆయన సమస్తము చేయుచున్నాడని మనకు తెలుసు. ఈ ప్రజల్ని దేవుడు తన ఉద్దేశానుసారంగా పిలిచాడు. 29 దేవుడు తనకు ఇదివరకే తెలిసిన వాళ్ళను తన కుమారునిలా రూపొందించాలని ప్రత్యేకంగా ఉంచాడు. తనకు చాలామంది పుత్రులుండాలని, వాళ్ళలో యేసు మొట్ట మొదటి వానిగా ఉండాలని ఆయన ఉద్దేశ్యం. 30 దేవుడు ఎవర్ని ప్రత్యేకంగా ఉంచాడో వాళ్ళను పిలిచాడు. ఎవర్ని పిలిచాడో వాళ్ళను నీతిమంతులుగా చేసాడు. ఎవర్ని నీతిమంతులుగా చేసాడో వాళ్ళతో తన మహిమను పంచుకొన్నాడు.

క్రీస్తు యేసులో దేవుని ప్రేమ

31 మరి, మనము దీనికి ఏమి ప్రత్యుత్తరం ఇవ్వగలము? దేవుడే మనవైపు ఉన్నప్పుడు మనకు విరుద్ధంగా ఎవరుంటారు? 32 మనందరికోసం, ఆయన తన స్వంత కుమారుణ్ణి ఇవ్వటానికి కూడా వెనుకాడలేదు. అలాంటప్పుడు తన కుమారునితో సహా అన్నీ మనకివ్వడా? 33 దేవుడు ఎన్నుకొన్న వాళ్ళపై ఎవరు నేరం మోపుతారు? మనల్ని నీతిమంతులుగా చేసేవాడు దేవుడే. 34 ఇక మనకు ఎవ్వరూ శిక్ష విధించలేరు. చనిపోయి బ్రతికి వచ్చిన యేసుక్రీస్తు దేవుని కుడిచేతి వైపు కూర్చొని మన పక్షాన వేడుకుంటున్నాడు. 35 క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు దూరం చెయ్యగలరు? కష్టం, దుఃఖం, హింస, కరువు, దిగంబరత్వం, అపాయం, ఖడ్గం మనల్ని దూరం చెయ్యగలవా? 36 దీన్ని గురించి ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“నీ కోసం దినమంతా మరణాన్ని ఎదుర్కొంటూ ఉన్నాము,
    మేము చంపబడనున్న గొఱ్ఱెల వలె ఉన్నాం.”(A)

37 ఈ విషయాలన్నిటిలో, మనల్ని ప్రేమించిన ఆయన ద్వారా సంపూర్ణ విజయాన్ని సాధించాము. 38 చావుగాని, బ్రతుకుగాని, దేవదూతలుగాని, దయ్యాలుగాని, ప్రస్తుతంగాని, భవిష్యత్తుగాని, మరే శక్తులుగాని 39 ఎత్తుగాని, అగాధంగాని, సృష్టిలో ఉన్న మరేదైనాగాని మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు లభిస్తున్న దేవుని ప్రేమనుండి మనల్ని విడదీయలేవని నేను ఖండితంగా చెప్పగలను.

మత్తయి 13:31-33

దేవుని రాజ్యం దేనీతో పోల్చపడింది?

(మార్కు 4:30-34; లూకా 13:18-21)

31 ఆయన వాళ్ళకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యాన్ని ఒక ఆవగింజతో పోల్చవచ్చు. ఒక వ్యక్తి ఒక ఆవగింజను తన తోటలో నాటాడు. 32 అది విత్తనాలన్నిటికన్నా చిన్నదైనా, పెరిగినప్పుడది మొక్కలన్నిటి కన్నా పెద్దగా పెరిగి ఒక చెట్టవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు దాని కొమ్మలపై గూళ్ళు కట్టుకొంటాయి.”

33 యేసు వాళ్లకింకొక ఉపమానం చెప్పాడు: “దేవుని రాజ్యం పులుపు పిండి లాంటిది. ఒక స్త్రీ పులిసినపిండిని తీసికొని మూడు సేర్ల పిండిలో కలిపింది. అలా చెయ్యటం వల్ల ఆ పిండంతా పులుపుగా మారింది.”

మత్తయి 13:44-52

దాచిన నిధి

44 “దేవుని రాజ్యం పొలంలో దాచబడిన నిధి లాంటిది. ఒక వ్యక్తి ఆ నిధిని కనుగొన్నాడు. కాని వెంటనే దాన్ని దాచేసాడు. ఆ తర్వాత ఆనందంగా వెళ్ళి తన దగ్గరున్నవన్నీ అమ్మివేసి ఆ పొలాన్ని కొన్నాడు.

45 “దేవుని రాజ్యం మంచి ముత్యాల కోసం వెతికే వర్తకుని లాంటిది. 46 ఒక వర్తకుడు మంచి విలువైన ఒక ముత్యాన్ని కనుగొన్నాడు. ఆ తర్వాత వెళ్ళి తనకున్నదంతా అమ్మేసి దాన్ని కొన్నాడు.

చేపలనుపట్టు వల యొక్క ఉపమానం

47 “దేవుని రాజ్యం సరస్సులోకి వేసి అన్ని రకాల చేపల్ని పట్టుకొనే ఒక వలలాంటిది. 48 వల చేపల్తో నిండిపొయ్యాక బెస్తవాళ్ళు దాన్ని ఒడ్డుకు లాగి మంచి చేపల్ని బుట్టలో వేసికొని పనికిరాని చేపల్ని పారవేస్తారు. 49 అదేవిధంగా యుగాంతంలో కూడా దేవ దూతలు వచ్చి నీతిమంతులనుండి దుర్మార్గుల్ని వేరు చేసి, భయానకమైన మంటల్లో పారవేస్తారు. 50 వాళ్ళు దుఃఖిస్తారు, బాధననుభవిస్తారు, పళ్ళు కొరుకుతారు.”

51 “మీకివన్నీ అర్థమయ్యాయా?” అని యేసు అడిగాడు.

అవునని వాళ్ళు సమాధానం చెప్పారు.

52 యేసు వాళ్ళతో, “దేవుని రాజ్యాన్ని గురించి బోధన పొందిన శాస్త్రుల్ని తన ధనాగారం నుండి క్రొత్త నిధుల్ని, పాతనిధుల్ని తీసుకొని వచ్చే ఆసామితో పోల్చవచ్చు” అని అన్నాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International