Revised Common Lectionary (Semicontinuous)
ఆమె మళ్లీ అంటుంది
8 నా ప్రియుని గొంతు వింటున్నాను.
అదిగో అతడు వస్తున్నాడు.
పర్వతాల మీది నుంచి దూకుతూ
కొండల మీది నుంచి వస్తున్నాడు.
9 నా ప్రియుడు దుప్పిలా ఉన్నాడు
లేదా లేడి పిల్లలా ఉన్నాడు.
మన గోడ వెనుక నిలబడివున్న అతన్ని చూడు,
కిటికీలోనుంచి తేరి పార చూస్తూ,
అల్లిక కిటికీలోనుంచి[a] చూస్తూ
10 నా ప్రియుడు నాతో అంటున్నాడు,
“నా ప్రియురాలా, లెమ్ము,
నా సుందరవతీ, రా, వెళ్లిపోదాం!
11 చూడు, శీతాకాలం వెళ్లిపోయింది,
వర్షాలు వచ్చి వెళ్లిపోయాయి.
12 పొలాల్లో పూలు వికసిస్తున్నాయి
ఇది పాడే సమయం![b]
విను, పావురాలు తిరిగి వచ్చాయి.
13 అంజూర చెట్లమీద చిన్న పండ్లు ఎదుగుతున్నాయి.
పూస్తున్న ద్రాక్షా పూల సువాసన చూడు.
నా ప్రియురాలా, సుందరవతీ, లేచిరా,
మనం వెళ్లిపోదాం!”
ఏశావుకు ఆశీర్వాదం లేకుండుట
30 యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు. 31 తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేశాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”.
32 అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అని అతన్ని అడిగాడు.
“నేను నీ మొదటి కుమారుణ్ణి, ఏశావును” అన్నాడతను.
33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి, నా దగ్గరకు తీసుకువచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు.
34 తన తండ్రి మాటలు విన్నప్పుడు ఏశావులో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు.
35 “నీ సోదరుడు నన్ను మోసం చేశాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు.
36 “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసివేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసివేసుకొన్నాడు” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు.
37 “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.
38 ఏశావు తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు.
39 అప్పుడు అతనితో ఇస్సాకు ఇలా చెప్పాడు:
“నీవు సారం లేని దేశంలో నివసిస్తావు.
నీకు వర్షపాతం ఎక్కువగా ఉండదు.
40 నీ మనుగడ కోసం నీవు పోరాడాలి,
నీవు నీ సోదరునికి బానిసవు అవుతావు.
అయితే స్వతంత్రం కోసం
నీవు పోరాడతావు. అతని స్వాధీనం నుండి నీవు విడిపోతావు.”
యాకోబు దేశాన్ని వదలి వెళ్ళుట
41 ఆ తరువాత తన తండ్రి అతణ్ణి ఆశీర్వదించడంవల్ల యాకోబును ఏశావు అసహ్యించుకొన్నాడు. ఏశావు, “త్వరలోనే నా తండ్రి చనిపోతాడు, నేను అతని కోసం దుఃఖిస్తాను. కాని ఆ తర్వాత యాకోబును నేను చంపేస్తాను” అని తనలో తాను అనుకొన్నాడు.
42 ఏశావు యాకోబును చంపాలని చేస్తున్న ఆలోచనను గూర్చి రిబ్కా విన్నది. యాకోబును పిలిపించి, అతనితో ఆమె ఇలా చెప్పింది: “ఇది విను, నీ అన్న ఏశావు నిన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడు. 43 అందుచేత, కుమారుడా, నేను చెప్పినట్లు చేయి. హారానులో నా సోదరుడు లాబాను ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్లి దాగుకో. 44 కొన్నాళ్లపాటు అతని దగ్గరే ఉండు. నీ అన్న కోపం చల్లారే వరకు అతని దగ్గరే ఉండు. 45 కొన్ని రోజులు కాగానే నీవు నీ అన్నకు చేసినది అతడు మరచిపోతాడు. అప్పుడు నిన్ను వెనుకకు తీసుకొని రావటానికి నేను ఒక సేవకుని పంపిస్తాను. నా ఇద్దరు కుమారులను ఒకేనాడు పోగొట్టుకోవటం నాకు ఇష్టం లేదు.”
46 అప్పుడు రిబ్కా ఇస్సాకుతో, “నీ కుమారుడైన ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకొన్నాడు. వాళ్లు మన ప్రజలు కారు గనుక వారితో నేను చాలా విసిగిపోయాను. యాకోబు కూడా వాళ్లలో ఒక స్త్రీని పెళ్లి చేసుకొంటే, నేను చావటం మంచిది” అని చెప్పింది.
యూదులుకానివాళ్ళు చేసిన పాపాలు
18 భక్తిహీనులై దుర్బుద్ధితో సత్యాన్ని అణిచిపెట్టే ప్రజలపై, దేవుడు స్వర్గంనుండి తన ఆగ్రహాన్ని చూపుతాడు. 19 తనను గురించి తెలియవలసిన విషయాలు దేవుడు వాళ్ళకు తెలియచేసాడు కనుక అవి వాళ్ళకు స్పష్టంగా తెలుసు.
20 కంటికి కనిపించని దేవుని గుణాలు, అంటే, శాశ్వతమైన ఆయన శక్తి, దైవికమైన ఆయన ప్రకృతి ప్రపంచం స్పష్టింపబడిన నాటినుండి సృష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన సృష్టి ద్వారా, ఆయన గుణాన్ని మానవులు చూడగలిగారు. కనుక వాళ్ళు ఏ సాకూ చెప్పలేని స్థితిలో ఉన్నారు.
21 ఎందుకంటే, వాళ్ళకు దేవుడెవరో తెలిసినా, వాళ్ళాయనను దేవునిగా స్తుతింపలేదు. ఆయనకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు. దానికి మారుగా వాళ్ళలో పనికిమాలిన ఆలోచనలు కలిగాయి. తెలివిలేని వాళ్ళ మనసులు అంధకారమైపోయాయి. 22 వాళ్ళు తాము తెలివిగలవాళ్ళమని చెప్పుకొన్నారు కాని మూర్ఖులవలె ప్రవర్తించారు. 23 ఏలాగనగా చిరకాలం ఉండే దేవుని తేజస్సును నశించిపోయే మనిషిని పోలిన విగ్రహాలకు, పక్షి విగ్రహాలకు, జంతువుల విగ్రహాలకు, ప్రాకే ప్రాణుల విగ్రహాలకు మార్చి వాటిని పూజించారు.
24 అందువల్ల దేవుడు వాళ్ళను, వాళ్ళ హృదయాలలోని మలినమైన లైంగిక కోరికలు తీర్చుకోవటానికి వదిలివేసాడు. తద్వారా వాళ్ళు పరస్పరం తమ దేహాలను మలినం చేసుకొన్నారు. 25 దేవుడు చెప్పిన సత్యాన్ని అసత్యానికి మార్చారు. సృష్టికర్తను పూజించి ఆయన సేవ చెయ్యటానికి మారుగా ఆ సృష్టికర్త సృష్టించిన వాటిని పూజించి వాటి సేవ చేసారు. సృష్టికర్త సర్వదా స్తుతింపదగినవాడు. ఆమేన్!
© 1997 Bible League International