Revised Common Lectionary (Semicontinuous)
10 కుమారీ, నా మాట వినుము.
నీ ప్రజలను, నీ తండ్రి కుటుంబాన్ని మరచిపొమ్ము.
11 రాజు నీ సౌందర్యాన్ని ప్రేమిస్తున్నాడు.
ఆయనే నీకు క్రొత్త భర్తగా ఉంటాడు.
నీవు ఆయన్ని ఘనపరుస్తావు.
12 తూరు పట్టణ ప్రజలు నీ కోసం కానుకలు తెస్తారు.
వారి ధనవంతులు నిన్ను కలుసుకోవాలని కోరుతారు.
13 రాజకుమారి రాజ గృహంలో బహు అందమైనది.
ఆమె వస్త్రం బంగారపు అల్లికగలది.
14 ఆమె అందమైన తన వస్త్రాలు ధరిస్తుంది. మరియు రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
ఆమె వెనుక కన్యకల గుంపు కూడా రాజు దగ్గరకు తీసుకొని రాబడుతుంది.
15 సంతోషంతో నిండిపోయి వారు వస్తారు.
సంతోషంతో నిండిపోయి రాజభవనంలో వారు ప్రవేశిస్తారు.
16 రాజా, నీ తరువాత నీ కుమారులు పరిపాలిస్తారు.
దేశవ్యాప్తంగా నీవు వారిని రాజులుగా చేస్తావు.
17 నీ పేరును శాశ్వతంగా నేను ప్రసిద్ధి చేస్తాను.
శాశ్వతంగా, ఎల్లకాలం ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
18 యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, “తండ్రీ!” అని పిల్చాడు.
“ఏమి కుమారుడా, ఎవరు నీవు?” అన్నాడు తండ్రి.
19 “నేను ఏశావును, నీ పెద్ద కుమారుడను. నీవు నాకు చెప్పిన పనులు చేశాను. నీ కోసం నేను వేటాడి తెచ్చిన జంతువులను సమకూర్చి వాటితో నీకొరకైన భోజనమును సిద్ధపరచాను. దానిని తిని, తృప్తిపొంది నన్ను ఆశీర్వదించవచ్చు” అని యాకోబు తన తండ్రితో చెప్పాడు.
20 అయితే ఇస్సాకు, “నీవు ఇంత త్వరగా ఎలా వేటాడి జంతువుల్ని చంపగలిగావు?” అని తన కుమారుణ్ణి అడిగాడు.
“త్వరగా నేను జంతువుల్ని సంపాదించటానికి నీ దేవుడైన యెహోవా నాకు సహాయంచేశాడు గనుక” అని యాకోబు జవాబిచ్చాడు.
21 అప్పుడు ఇస్సాకు, “నా కుమారుడా నేను నిన్ను తడిమి చూడాలి. కనుక నీవిలా నా దగ్గరగా రా. నిన్ను నేను తడిమి చూస్తే, నిజంగా నీవు నా కుమారుడు ఏశావువో కాదో తెలుస్తుంది” అన్నాడు యాకోబుతో.
22 కనుక తన తండ్రియైన ఇస్సాకు దగ్గరకు యాకోబు వెళ్లాడు. ఇస్సాకు అతణ్ణి తడిమి చూసి, “నీ స్వరం యాకోబు స్వరంలా ఉంది. కానీ, నీ చేతులు మాత్రం ఏశావు చేతుల్లా వెంట్రుకలతో ఉన్నాయి” అన్నాడు. 23 యాకోబు చేతులు ఏశావు చేతులవలె వెంట్రుకలతో ఉన్నందువల్ల అతడు యాకోబు అని ఇస్సాకుకు తెలియలేదు. కనుక ఇస్సాకు యాకోబును ఆశీర్వదించాడు.
24 “నిజంగా నీవు నా కుమారుడు ఏశావువేనా?” అని ఇస్సాకు అడిగాడు.
“అవును, నేనే” అని యాకోబు జవాబిచ్చాడు.
యాకోబుకు ఆశీర్వాదం
25 అప్పుడు ఇస్సాకు, “ఆ భోజనం నా దగ్గరకు తీసుకురా. నేను దానిని తిని, నిన్ను ఆశీర్వదిస్తాను” అన్నాడు. కనుక యాకోబు అతనికి భోజనం ఇచ్చాడు, అతడు భోంచేశాడు. యాకోబు అతనికి ద్రాక్షారసం ఇచ్చాడు, అతడు త్రాగాడు.
26 అప్పుడు ఇస్సాకు, “కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకో” అని అతనితో చెప్పాడు. 27 కనుక యాకోబు తన తండ్రి దగ్గరకు వెళ్లి, అతణ్ణి ముద్దు పెట్టుకొన్నాడు. అతని వస్త్రాలను ఇస్సాకు వాసన చూచి, అతణ్ణి ఆశీర్వదించాడు. ఇస్సాకు ఇలా అన్నాడు:
“నా కుమారుని వాసన యెహోవా ఆశీర్వదించిన చేని సువాసనలా ఉంది.
28 విస్తారమైన పంటలు, ద్రాక్షారసం నీకు ఉండేటట్లు వర్షాలు యెహోవా నీకు సమృద్ధిగా ఇచ్చుగాక.
29 మనుష్యులంతా నిన్నే సేవిస్తారు గాక,
జనములు నీకు సాగిలపడుదురు గాక,
నీ సోదరుల మీద నీవు పరిపాలన చేస్తావు
నీ తల్లియొక్క కుమారులు నీకు సాగిలపడి నీకు లోబడుతారు,
“నిన్ను శపించే ప్రతీ వ్యక్తి శపించబడతాడు,
నిన్ను ఆశీర్వదించే ప్రతీ వ్యక్తి ఆశీర్వదించబడతాడు.”
యేసు తండ్రిని ప్రార్థించటం
(మత్తయి 11:25-27; 13:16-17)
21 ఆయన పవిత్రాత్మలో సంతోషిస్తూ, “ఆకాశానికి, భూమికి ప్రభువైనటువంటి ఓ తండ్రి! నీకు స్తుతులు! నీవీ విషయాలు చదువుకున్న వాళ్ళనుండి, విజ్ఞానుల నుండి దాచి, అమాయకులకు తెలియ చేసావు. ఔను, తండ్రీ! ఇదే నీచిత్తము.
22 “నా తండ్రి నాకు అన్నీ యిచ్చాడు. తండ్రికి తప్ప కుమారుడెవరో ఇతర్లకు తెలియదు. కుమారుడు చెప్పదలచిన వాళ్లకు తప్ప తండ్రి ఎవరో యితర్లకు తెలియదు” అని అన్నాడు.
23 ఆ తర్వాత తన శిష్యుల వైపు తిరిగి, “మీరు చూస్తున్నవి చూసే కన్నులు ధన్యమైనవి. 24 నేను చెప్పేదేమిటంటే మీరు చూస్తున్నవి చూడాలని చాలా మంది ప్రవక్తలు, రాజులు ఆశించారు. కాని చూడలేక పోయారు. మీరు వింటున్నవి వినాలని వాళ్ళాశించారు. కాని వినలేక పోయారు” అని రహస్యంగా వారితో అన్నాడు.
© 1997 Bible League International